థీమ్ బరాబర్..
సిటీలో భోజనప్రియుల అభి‘రుచు’లకు తగ్గట్లే రెస్టారెంట్లు కూడా శరవేగంగా మారుతున్నాయి.పోటీ పెరగడంతో ఎలాగైనాకస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఐడియాలతో ముందుకొస్తున్నాయి. సాదాసీదాగా కనిపించే రెస్టారెంట్లు త్వరగానే బోరు కొట్టేస్తుండటంతో, ‘సిటీ’జనులు కొత్తవాటి కోసం చూపు సారిస్తున్నారు.
అలాంటి వారిని ఆకర్షించేందుకు నగరంలోని రెస్టారెంట్లు కొత్త కొత్త థీమ్స్‌తో ముస్తాబవుతున్నాయి. కొన్ని రాచరుచులతో అలరిస్తున్నాయి. మరికొన్ని ఖండాంతర రుచులను చేరువ చేస్తున్నాయి. ఇంకొన్ని ఒద్దికగా సంప్రదాయ రుచులనే సరికొత్తగా వండి వడ్డిస్తున్నాయి. ఇలాంటి థీమ్ రెస్టారెంట్లపై ‘సిటీప్లస్’ కథనం..
‘చిరు’తిండి...
భోజనప్రియులు తరచూ కొత్త కొత్త రెస్టారెంట్లకు వెళుతుంటారు. కొత్త కొత్త రుచులను ఆస్వాదిస్తుంటారు. రుచులు సరే, ఆరోగ్యం మాటేమిటి..? అనే ప్రశ్నకు సమాధానంగానే బేగంపేట్‌లో ‘ఆహార్ కుటీర్’ మొదలైంది. నలుగురు మిత్రులు.. రాంబాబు, అర్చన, శ్రీరామ్, దినేష్.. తమ కార్పొరేట్ ఉద్యోగాలను వదిలేసి మరీ ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. సజ్జలు, జొన్నలు, రాగులు వంటి చిరుధాన్యాలతోనే ఇక్కడ అన్ని పదార్థాలనూ తయారు చేస్తారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా పెంచిన కూరగాయలనే వాడతారు. పల్లెవాతావరణాన్ని తలపించే ఈ రెస్టారెంట్ అలంకరణ ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా అరిటాకుల్లో వడ్డిస్తారు. మంచినీళ్లు, మజ్జిగ మట్టిపాత్రల్లో అందిస్తారు.
మహారాజ భోజనం...
చాలా రెస్టారెంట్లకు పేరులోనే ‘రెస్ట్’ ఉంటుంది గానీ, అక్కడకు వెళ్లేవారికి ఎలాంటి విశ్రాంతి ఉండదు. ఆర్డర్ చేసిన పదార్థాలు టేబుల్ మీదకు రాగానే, భోంచేయడం, ఆపై బిల్లు కట్టి, టిప్పు చదివించుకుని బయటపడటం.. ఇదంతా రొటీన్ వ్యవహారం. మణికొండలోని ‘వాక్’ (వీకెండ్స్ ఎట్ కూచిపూడి) రెస్టారెంట్ తీరే వేరు. ఇక్కడకు వెళ్లేవారెవరైనా, అడుగు పెడుతూనే ఆహారం కోసం ఆర్డర్ ఇవ్వక్కర్లేదు. విశ్రాంతిగా గడపొచ్చు. గేమ్స్ వంటి వాటితో కాలక్షేపం చేయవచ్చు. ఆకలేసినప్పుడు నిదానంగా ఆర్డర్ చేసి, తాపీగా భోజనం చేయవచ్చు.
‘కింగ్స్’లంచ్, ‘క్వీన్స్’ డిన్నర్ ఈ రెస్టారెంట్ స్పెషల్స్. ఇవి పేరుకు తగినట్లే రాజసం ఉట్టిపడుతూ ఉంటాయి. వెజ్, నాన్ వెజ్‌లలో అరడజనేసి స్టార్టర్స్, నాలుగు రకాల టిఫిన్లు, ఏడు రకాల బిర్యానీలు, సీఫుడ్ సహా తొమ్మిదిరకాల నాన్ వెజ్ ఐటమ్స్, ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్ ఉంటాయి. ‘కింగ్స్’లంచ్ కాస్త స్పైసీగా ఉంటే, ‘క్వీన్స్’డిన్నర్ కొంచెం డెలికేట్‌గా ఉంటుంది. ఇందులోని వైట్‌రూమ్ ధవళకాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. ఎల్‌ఈడీ లైట్లు వెలిగినప్పుడల్లా రంగులు మారుతుంటుంది. బ్లాక్‌రూమ్‌లోని ఎల్‌ఈడీ దీపాలు నింగిలో చుక్కల్లా తళతళలాడుతూ కొత్త అనుభూతినిస్తాయి.