
జెంటిల్‌మెన్స్ WIT... లేడీస్ ఫేవRIGHT హైదరాబాద్!
కేవలం కబుర్లు చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసి భార్యను ఆకట్టుకోవడం హైదరాబాద్‌లోనే సాధ్యం. అలా మహిళలను ఆకట్టుకునేందుకు అనువైన నగరం హైదరాబాద్.మీరిప్పటికిప్పుడు మీ భార్యకు మెళ్లో గొలుసు కొనిపెట్టలేరు. కానీ ఉపాయాన్ని కనిపెట్టి, అపాయాన్ని కప్పెట్టగలరు. ఎలా..? అలా ఆమెను అలా షికారుకు తీసుకెళ్తారు. ఎక్కడికీ...? ‘‘వచ్చే ఏడాది ఈ పాటికి నేను చేయించాలనుకుంటున్న చోటికి నిన్ను ఇవాళ్ల కాస్త షికారు తిప్పుతాను. కానీ ప్రస్తుతానికి మాత్రం జస్ట్ తీసుకెళ్లగలనంతే. ఆ ఆభరణం తాలూకు రోడ్డే మన నెక్‌లెస్ రోడ్డు’’ అంటారు గడుసుగా.
ఇలా మహిళల కోసం రోడ్డు పేరు పెట్టిన నగరం ఏదైనా ఉందా? ఒకవేళ అచ్చతెనుగులో ఏ కాసుల పేరు రోడ్డనో, ఏ వడ్డాణాల వీధనో పెడితే కాస్త ఎబ్బెట్టుగానైనా ఉండవచ్చు. కానీ నెక్‌లెస్ రోడ్డు అనే మాటలో ఏ ఎబ్బెట్టు లేదని బెట్ చేయవచ్చు. అప్పుటికీ ఆమె బెట్టు తగ్గించుకోకుండా ఇప్పటికి మరి బంగారం ఏమీ లేదా? అంటే... మీ బడ్జెట్‌కు తగ్గట్టు... ‘‘అలాగైతే ఈ సారికి ఔటర్ ‘రింగ్’రోడ్డులో ఉన్న రింగుతో సరిపెట్టుకోలేవా?’’ అంటూ మరో ల్యాండ్‌మార్కు పేరు చెప్పి సముదాయిస్తే చాలు... సరిపెట్టుకోగల సాధ్వీమణులు ఉండరంటారా?
ఒక్క ‘నెక్‌లెస్’ రోడ్డూ, ఔటర్ ‘రింగు’ రోడ్డూ... అన్న మాటేముంది?... అటు ఇటుగా దాదాపూ అన్ని రోడ్ల పరిస్థితీ అంటే...! ‘మోతీ’నగర్‌కు తీసుకెళ్లి... ‘‘అరెరె పేరును బట్టి ముత్యాలు దొరుకుతాయేమోనని తీసుకొచ్చా. కానీ ఇక్కడ కాదట. పెరల్స్ మార్కెట్ పంజాగుట్ట అట’’ అంటూ నాలుక కరచుకోవచ్చు. లేదా ‘‘బంగారం ఇప్పించాల్సిందే’’ అంటూ పట్టుబట్టిన లలనామణిని... ‘‘ఇక తప్పుతుందా పద.. నిన్ను వెంటనే తీసుకెళ్తా ‘కంచన్’బాగ్’’ అంటూ గబగబా రెక్కపట్టుకుని లాక్కెళ్లాలి. తీరా తీసుకెళ్లాక ‘‘అరె... కంచన్‌బాగ్ అంటే బంగారపు ఉద్యానవనాలు కాదా? మరి ఇక్కడ దొరకదా బంగారం?’’ అంటూ ఆశ్చర్యం అతిగా నటించవచ్చు. అలా అన్నీ అతివలకు అతిఇష్టమైన రోడ్ల పేర్లే ఇక్కడ.
‘‘గాజులు కొనుక్కుంటా... కాస్త రేపు లాడ్ బజార్‌కు వెళ్దామా’’ అంటూ భార్య గోముగా అడిగిందనుకోండి. గడుసు మగమారాజులకు అది ఇష్టం లేదనుకోండి. ‘‘గాజుల కోసం వెళ్లాలంటే గాజుల రామారం వెళ్తే సరి. అనవసరంగా లాడ్‌బజార్‌కు ఎందుకు? లాడ్ బజార్ అంటే... రేపు గారాబం చేయాలనుకున్నప్పుడు నిన్న తీసుకెళ్లాల్సిన మార్కెట్‌కదా’’ అంటూ గాజులు సవరిస్తూ చెప్తే సరి. ఆ చమత్కారానికి మగువ లొంగిపోయిందా... ఆ పూటకు కరుసు వాయిదా. పరుసు కాయిదా.
మగ చమత్కారాలు పసిగట్టి వాళ్లకు బుద్ధి చెప్పడానికి... ‘‘పదండి అలా మల్లేపల్లి వరకు వెళ్లి మల్లెపూలు కొనుక్కొద్దాం’’ అంటూ ఆమె అందనుకోండి. అవ్వాళ అదేంటీ... మన వీధి మలుపు చివర్లో చిన్న బల్ల చెక్క దగ్గరే కదా మల్లెపూలు దొరికేది’’ అంటూ అప్పుడు మీరు పరాకు నటించడానికి వీల్లేదు. మల్లెపూలు కొనకపోయినా మల్లేపల్లి వెళ్లాల్సిందే. లేదంటే రేపు బోరుకొడుతోంది. తగ్గడానికి బోరబండ తీసుకెళ్లమని ఆమె మళ్లీ బలవంతం చేయవచ్చు.
ఇంతటి చమత్కారపూరిత మైన వీధులూ, రోడ్ల పేర్లు హైదరాబాద్‌కు ఎందుకు వచ్చాయి? ఎందుకు వచ్చాయంటే ఏం చెబుతాం. నవాబుగారి కొడుకు యువరాజా వారు ‘భాగ్‌మతి’ అనే అమ్మాయిని ప్రేమించినందుకు... ఆమె పేరిట ఈ ‘భాగ్య’నగరాన్ని నిర్మించాట్ట. ఇక ఆమెకు ‘హైదర్’మహల్ అని పేరు పెట్టి ఈ మహానగరానికంతా ఆమె పేరే ఉండేలా చూశాట్ట. ఇలా తాను వలచిన మగువకు నగరం పేరు పెట్టి ఆనందించి, ఆమెనూ ఆనందింపజేశాట్ట. మహానగర ఆవిర్భావం, నామకరణంలోనే ఈ ‘జీన్స్’ ఉంటే ఇక రోడ్లూ, వీధుల పేర్లకు పెట్టే పేర్లిలా ఉండక వేరేలా ఉండే అవకాశం ఉందా? ఇప్పిస్తామంటూ తప్పించుకు తిరగడానికి మగపురుషులకు తగినంత అవకాశముండుగాక. అందుకే... సరసులైన పాలకులతో పాటు... గడుసువారైన భర్తలూ... సాధ్వీమణులున్న నగరం ఇలా మహిళలకు ఇష్టమైన పేర్లతో వర్ధిల్లుగాక.
- యాసీన్