
గీత కార్మికుని గ్రాండ్ ప్రిక్స్ స్టోరీ
పామర్తి శంకర్.. ఈ పేరు నిన్నమొన్నటి వరకు ఇండియన్ లోకల్ ఫేం.. ఇప్పుడు వరల్డ్ ప్రీషియస్ నేమ్! ఆ ఫ్రేమ్‌ని అమర్చింది ‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ’ అవార్డ్! ఆ కీర్తిని ఈ కార్టూనిస్ట్ అండ్ క్యారికేచరిస్ట్‌కు అందించింది ఓ గీతలబొమ్మ! ఇలాంటి బొమ్మలకు నెగటివ్‌సెన్స్‌ను తప్పించి సెలబ్రిటీ హోదా కల్పించిన ఆ బ్రహ్మ గురించి ఆయన మాటల్లోనే..
‘వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డ్’.. ప్రింట్ మీడియా కార్టూనిస్టులకు ఇంతకు మించిన గొప్ప సత్కారం ఉండదు. ఈ అవార్డ్ కోసం 2009లో మదర్‌థెరిసా క్యారికేచర్‌ను నా ఫస్ట్ ఎంట్రీగా పంపాను. తొలిసారే ‘ఆనరబుల్ మెన్షన్’ వచ్చింది. ఆ ఉత్సాహంతో ఏటా ఎంట్రీలు పంపిస్తూనే ఉన్నాను. అరవై దేశాల కార్టూనిస్ట్‌లు, క్యారికేచరిస్ట్‌లు పాల్గొనే ఇందులో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చినా చాలనుకునేవాడిని. కానీ ఊహించని విధంగా వరల్డ్ కార్టూన్ గ్రాండ్ ప్రీ.. అంటే ఫస్ట్ ప్రైజే వచ్చింది. పోర్చుగల్‌లో దీన్ని బహూకరిస్తారు.ఈ అవార్డుతో నాకు దక్కిన ఇంకో ఆనర్ ఏమిటంటే ఈ జ్యూరీలో నేనూ వన్ ఆఫ్ ది మెంబర్‌గా ఉండడం.
గీతే నా రాత
మాది నల్లగొండ. మా ఇంటావంటా బొమ్మలు గీయడంలేదు. పైగా బొమ్మలు గీస్తున్నానని మా నాన్న నాలుగుసార్లు ఇంట్లోంచి వెళ్లగొట్టాడు. ఏ మెకానిక్ పనో నేర్చుకుంటే పైసలు సంపాదించొచ్చని ఆయన సలహా. బొమ్మలే మనసునిండా ఉన్నాక అయ్య మాటలు చెవినెందుకు ఎక్కుతయ్?. అందుకే గీతే నా రాత అనుకున్న.. ప్రాక్టీస్ మొదలుపెట్టిన. మూడో తరగతి నుంచే బొమ్మలు వేస్తుంటి. హైస్కూల్‌కొచ్చా క సీరియస్‌గా తీసుకున్న. ఆర్టిస్ట్ మోహన్ రాసిన ‘కార్టూన్ కబుర్లు’ పుస్తకాన్ని బాగా చదివాను. ఒకరకంగా ఆయన, శ్రీధర్, సుభానీ, నర్సిం నాకు ఇన్‌స్పిరేషన్. వివిధ మ్యాగజైన్లలో వచ్చే కార్టూన్స్‌నీ అబ్జర్వ్ చేసేవాడిని. ది వీక్ కార్టూనిస్ట్ ప్రకాశ్‌శెట్టి చాలా ప్రేరణ. ఆర్ట్‌లో అఆలు నేర్పి, సలహాలిచ్చిం ది రామానుజాచారి, రామచంద్రం, చిత్ర, సుదర్శన్ సార్లు.
కార్టూన్... క్యారికేచర్..
స్కూల్లో ఉన్నప్పుడు సరదాగా మా దోస్తులందరివీ క్యారికేచర్స్ వేస్తుంటి. ఆ బొమ్మల్ని చూసి నా ఫ్రెండ్స్ భయపడేవాళ్లు..మన మొఖాల్ని ఖరాబ్ చేస్తాడ్రా అని. నా ఆసక్తి చూసి సుంకి నారాయణరెడ్డి అక్కడ లైబ్రరీలో నా క్యారికేచర్స్‌తో ఎగ్జిబిషన్ పెట్టించారు. మా ఫ్రెండ్స్ అంతా వచ్చి వాళ్ల వాళ్ల బొమ్మల కాగితాలను చింపుకొని వెళ్లిపోయారు (నవ్వుతూ).
హైదరాబాద్.. మీడియా
డిగ్రీ అయిపోయాక నల్లగొండలోనే ఓ స్కూల్లో డ్రాయింగ్ టీచర్‌గా చేరా. మూడేళ్లకే ఉద్యోగం బోర్ కొట్టింది. 1995లో హైదరాబాద్ వచ్చేశాను. మోహన్ దగ్గర చేరా. జర్నలిజంలో ప్రవేశం కోసం రచనా జర్నలిజం కాలేజ్‌లో చేరాను. ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గోవిందరాజు చక్రధర్ ‘జర్నలిస్ట్ కోసం’ అని రాస్తున్న పుస్తకం కోసం క్యారికేచర్స్ కావాలంటే వేశాను. అవి రామచంద్రమూర్తికి నచ్చి తన కాలమ్‌కీ వేయాలన్నారు. ఆ పని చేస్తూనే ఇంకొన్ని మ్యాగజైన్స్‌కూ ఫ్రీలాన్స్ ఆర్టిస్ట్‌గా పనిచేసేవాడిని. ఆర్థిక అవసరాలు తీరక తిరిగి వెళ్లిపోదామని నాలుగుసార్లు ఊరెళ్తే తమ్ముడు కరెంట్‌రావు నీకు అక్కడే గుర్తింపు ఉంటుందని ధైర్యమిచ్చి హైదరాబాద్ పంపాడు. ‘వార్త’లో చేరి 2002 వరకు పనిచేశాను. ఆపై ఆంధ్రజ్యోతిలో చేరాను. ఆర్ట్‌లో ఉన్న డిస్టార్షన్ నీ బొమ్మల్లో ఉందని లక్ష్మణ్ ఏలె, బి.నర్సింగరావు వందేళ్ల తెలంగాణ ఆర్ట్‌లో నా బొమ్మలకి స్థానమిచ్చి సత్కరించారు.
ఫ్రంట్ పేజ్‌లో క్యారికేచర్..
కార్టూన్.. పొలిటికల్ సెటైర్. క్యారికేచర్.. వ్యక్తికి వ్యంగ్యాస్త్రం. ప్యాకెట్ కార్టూన్‌తో సమానంగా క్యారికేచర్‌కి పత్రికలో ఫ్రంట్‌పేజ్ హోదా కల్పించింది నేను, సరికొండ చలపతి. ఈ దిశగా మమ్మల్ని ప్రోత్సహించిన సార్లు వర్ధెల్లి మురళి, అల్లం నారాయణ . నిజానికి క్యారికేచర్ నెగటివ్‌సెన్స్‌కి ప్రతీక. అలాంటి క్యారికేచర్‌కి ఓ సెలిబ్రిటీ హోదాను తెచ్చాను. నల్ల సూరీడు నెల్సన్‌మండేలా పోరాటస్ఫూర్తిని ఆయన వ్యక్తిత్వంగా మలచిన క్యారికేచరే ఈ రోజు నాకు వరల్డ్ ప్రెస్ కార్టూన్ గ్రాండ్ ప్రీ అవార్డును తెచ్చిపెట్టింది. సైన్ బోర్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న నన్ను ప్రపంచానికి పరి చయం చేసింది ఆ క్యారికేచర్ నేచరే. అయితే ఇంతటి ఘనతను సాధించిపెట్టిన ఈ క్యారికేచర్ ఆర్ట్ నా దృష్టిని మార్చింది. ఎవరిని చూసినా వాళ్ల మొహం క్యారికేచర్‌గానే కనిపిస్తోంది (నవ్వుతూ).
రాజ్యం.. లక్ష్మి
నా బొమ్మలకు ఫస్ట్ జడ్జి.. బెస్ట్ క్రిటిక్ మా ఆవిడ లక్ష్మి. ఆఫీస్‌లోనైతే నేను గీసిన బొమ్మను ఫస్ట్ ఆఫీస్ బాయ్స్‌కి చూపిస్తా. వాళ్లకు నచ్చితే జనసామాన్యానికీ అర్థమైనట్టే కదా. అట్లాగే మా అమ్మ రాజ్యం.. తను నా బొమ్మల్లో ఎంత ఇన్‌వాల్వ్ అయిందంటే.. మా ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ల ముఖకవళికలు కాస్త భిన్నంగా ఉంటే చాలు మెల్లగా నా వెనక్కి వచ్చి ‘ఒరేయ్.. ఈయన క్యారికేచర్ వేస్తే బాగుంటది కదా’ అని నా చెవిలో చెప్తుంది. నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ. చేస్తున్న పనిలో ఇన్‌వాల్వ్‌మెంట్ ఉంటే చాలు పర్‌ఫెక్షన్ అదే వస్తుంది. అదే పేరూ తీసుకొస్తుంది.
- శరాది