హెల్దీ & టేస్టీ
రోజుకోరకం రుచిని ఇష్టపడే ఫుడ్ లవర్స్‌కోసం పూటకో రెసిపీని అందిస్తున్నారు నగరంలోని చెఫ్స్. రుచితోపాటు ఆరోగ్యాన్ని జోడించిన డిషెస్ వండి వడ్డిస్తున్నారు. తెలుగువారు ఇష్టపడే సీఫుడ్, మటన్‌లతో వెరైటీ ప్రయోగాలు చేస్తున్నారు బంజారాహిల్స్‌లోని ‘టేక్‌అవే’ చెఫ్ నర్సింహులు. ఆ హెల్దీ డిషెస్ మీకోసం...
ఆవకాయ చేపలకూర
ఆవకాయ అంటే ఇష్టపడని తెలుగువారుండరు. అయితే పచ్చడికి బదులు కాస్త వెరైటీని కోరుకునేవారి కోసమే ఈ ఆవకాయ చేపకూర. పేస్టు చేసి వారం రోజులు నిల్వ ఉంచిన ఆ మిశ్రమం ఊరి ఇంకా టేస్ట్ అనిపిస్తుంది. ఆ పేస్ట్‌ను చేపలకూరతో కలిపి మారినేట్ చేస్తే... కాస్త పుల్లగా, కొంచెం కారంగా, మరికాస్త తీయగా... మొత్తానికి డిఫరెంట్ టేస్ట్‌తో నోరూరిస్తుంది. నార్త్ ఇండియన్స్ సైతం ఇష్టపడటం దీని స్పెషాలిటీ!
అల్లం-రొయ్యల వేపుడు
పరిగడుపున అల్లం తింటే పైత్యం వదులుతుందంటారు పెద్దలు. కానీ ఈ రోజుల్లో అంత ఇష్టంగా అల్లం తినేవాళ్లెవరు. అందుకే... అల్లం, మిరియాలపొడి, బాదాం పేస్టు వంటి పోషకాలు కలిగిన ప్రోడక్ట్స్‌ను రొయ్యలకు కలిపి, ఎలాంటి ఫుడ్ కలర్స్ ఉపయోగించకుండా చేసే ఒక మంచి స్టార్టర్ అల్లం-రొయ్యల వేపుడు. ఇది నాన్స్‌లో, ఈవెనింగ్ స్నాక్స్‌తోపాటు పప్పు చారు అన్నంలో మంచింగ్‌కి మంచి కాంబినేషన్.
పొనగంటి మాంసపు వేపుడు
సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దొరికే పొనగంటి కూరలో ఎన్నో పోషకాలున్నాయి. ఈ పొనగంటి ఆకులను మాంసంతో కలిసి చేసే ఈ స్టీమ్‌డ్ మటన్‌ఫ్రై టేస్ట్‌లో డిఫరెంట్. ఎలాంటి బటర్, చీజ్, అజినమోటోలు, కెమికల్స్ ఉపయోగించకుండా కేవలం రెండు చెంచాల ఆయిల్‌తో చేసే ఈ డిష్ పిల్లలకూ మంచిది.