కరోనా కల్లోలంలో హైదరాబాద్‌ బిర్యానీ! | Hyderabad People Not Interested in Dining in Hotels And Restaurants | Sakshi
Sakshi News home page

'వీక్‌'ఎండ్‌.. ‘టేక్‌ ఎవే’ ఓకే!

Published Sat, Jun 13 2020 9:01 AM | Last Updated on Sat, Jun 13 2020 9:11 AM

Hyderabad People Not Interested in Dining in Hotels And Restaurants - Sakshi

మాస్క్‌లు, గ్లౌజ్‌లు ధరించి సర్వ్‌ చేస్తున్న సిబ్బంది..

సాక్షి, హైదరాబాద్‌: వన్‌బై టూ ఇరానీ చాయ్‌.. ఉస్మానియా బిస్కెట్లు.. వేడివేడి సమోసా.. అంతేనా ఘుమఘుమలాడే బిర్యానీ.. హైదరాబాద్‌ అస్తిత్వానికి ప్రతీకలు. కానీ కరోనా సృష్టించిన కల్లోలంలో ఆ అస్తిత్వం ప్రశ్నార్థకంగా మారింది. లాక్‌డౌన్‌ కాలంలో రెండు నెలలకు పైగా మూసి ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ కరోనా మహమ్మారి భయానికి నగరవాసులు హోటళ్లకు వచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో కేవలం టేక్‌ ఎవేలకు మాత్రమే గిరాకీకనిపిస్తోంది. సాధారణంగా వీకెండ్‌ వచ్చిందంటే హోటళ్లు కిక్కిరిసిపోతాయి. స్నేహితులు, కుటుంబసభ్యులతో వచ్చిన వాళ్లు సీట్ల కోసం గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. హైదరాబాద్‌ బిర్యానీకి ఉండే డిమాండ్‌ గురించిప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు హోటళ్లు సందడిగా కనిపిస్తాయి. కానీ కరోనా కారణంగా ఇప్పుడు నగరంలోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు వెలవెలబోతున్నాయి. టేక్‌ ఎవేసేవలను ప్రారంభించినా 25 శాతం కూడా  డిమాండ్‌ కనిపించడం లేదని చెబుతున్నారు.

అన్ని ఏర్పాట్లు చేసినా..
వీకెండ్‌ ఒక ఆటవిడుపు. క్షణం తీరిక లేని నగరజీవితంలో ఒక నూతనోత్సాహం. సాఫ్ట్‌వేర్‌ నిపుణుల నుంచి సాధారణ వేతన జీవుల వరకు శని, ఆదివారాల కోసం ఎదురుచూస్తారు. ఆ రెండు రోజుల్లోనే స్నేహితులు, బంధువులు,కుటుంబసభ్యులతో కలిసి గడిపేందుకు అవకాశం లభిస్తుంది. ఓ సినిమా చూసి వారితో కలిసి హోటళ్లలో భోజనం చేసి ఇంటికి వెళ్తారు. దీంతో నగరంలోని ప్యారడైజ్, అల్ఫా, బావార్చి, బçహార్‌కేఫ్‌  షాగౌస్, మదీనా, నయాగరావంటి గొప్ప పేరున్న హోటళ్లు, మినర్వా, తాజ్‌మహల్‌ వంటి రెస్టారెంట్లు శని, ఆదివారాల్లో సందడిగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఈ హోటళ్లలోటేక్‌ ఎవేలకు మాత్రమే కొంత మేరకు డిమాండ్‌ కనిపిస్తోంది. కూర్చొనిభోజనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినా పెద్దగా ఆసక్తి చూపడం లేదు.‘టేక్‌ ఎవే సర్వీసులకు జనం బాగానే వస్తున్నారని ప్యారడైజ్‌ హోటల్‌సీనియర్‌ మేనేజర్‌ లక్ష్మణ్‌ అన్నారు.

అప్పుడలా.. ఇప్పు‘డీలా’..
హిమాయత్‌నగర్‌: నగరంలోని అతి ప్రాచీనమైన హోటల్స్‌లో గుర్తొచ్చేది హిమాయత్‌నగర్‌లోని ‘మినర్వా కాఫీ షాప్‌’. ఇక్కడి హోటల్‌లో ఇడ్లీ, దోశ, టీ, కాఫీ చాలా ఫేమస్‌. ఓ ప్లేట్‌ ఇడ్లీ తిని, టీ లేదా కాఫీ తాగితే ఆ రోజు వచ్చే మజానే వేరంటారు ఫుడ్డీస్‌. ఐదు రోజుల క్రితం తిరిగి ప్రారంభం కావడంతో ఇప్పుడిప్పుడే ఫుడ్డీస్‌ కాస్త తినేందుకు ఆశ చూపిస్తున్నారు. అయితే గతంలో ఉన్న విధంగా లేదు. లాక్‌డౌన్‌కు ముందుకు ఉదయం 7గంటల నుంచి రాత్రి 10గంటల మధ్య సుమారు 600 ప్లేట్స్‌ ఇడ్లీలు(ప్లేటుకి రెండు) అంటే 1200ఇడ్లీలు అమ్ముడయ్యేవి. దోశలు 400–500 వరకు తినేవారు. టీ, కాఫీ సుమారు 600–700మంది తాగేవారు. ఐదు రోజులుగా 60–70 ప్లేట్ల ఇడ్లీలు సేల్‌ అవుతున్నాయి. దోశలు 15–30 వరకు టేస్ట్‌ చేస్తున్నారు. ఇక టీ, కాఫీలను 20–30మంది మాత్రమే తాగుతుండటం గమనార్హం.

ప్యారడైజ్‌.. మొదలైన డైన్‌..

లాక్‌డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి దాదాపు 80 రోజుల పాటు మూసివేసిన ప్యారడైజ్‌ హోటల్‌కు మళ్లీ కళ మొదలైంది. అయితే లాక్‌డౌన్‌లో సడలింపులు ఇచ్చిన దగ్గర నుంచి 20 రోజులుగా టేక్‌ఎవే సేవలు కొనసాగిస్తుండగా, శుక్రవారం నుంచి హోటల్‌లోనే కూర్చొని భోజనం చేసేందుకు వీలుకల్పించారు. సాధారణ రోజుల్లో కంటే ప్రస్తుతం 25 శాతం భోజన ప్రియులు మాత్రమే బిర్యానీ తిన్నట్లు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది.  కరోనా నేపథ్యంలో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాం.. టేబుల్‌కు ఇద్దరికి మాత్రమే అవకాశం కల్పిస్తున్నాం.. టేబుల్‌కు మరో టేబుల్‌కు మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకున్నాం.. హోటల్‌లో సర్వ్‌ చేసే సిబ్బందిమాస్క్‌లు, చేతి గ్లౌజ్‌లు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. హోటల్‌కు వచ్చేవారు కూడా మాస్క్‌ ధరించి రావాలి. వారికి శానిటైజేషన్‌ను అందుబాటులో ఉంచాం. థర్మల్‌ స్క్రీనింగ్‌ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నాం అని వివరించారు.

పనిచేస్తున్నట్లే లేదు

25 ఏళ్లుగా ఈ హోటల్‌లో పని చేస్తున్నాను. ఉదయం 5గంటల నుంచి నా డ్యూటీ అయ్యేలోపు(మధ్యాహ్నం) సుమారు 600–700వాయిల ఇడ్లీలు వేస్తాను. తర్వాత వచ్చే అతను కూడా ఇంచుమించు ఇలాగే వేస్తాడు. ఇక దోశలు రోజు మొత్తం 400–500 వేస్తాం. ఇప్పుడు ఇడ్లీలు రోజూ 60–70 వేస్తున్నాం. దోశలు 20–30 వేస్తున్నా. 
– రాజు, ఇడ్లీ, దోశ మాస్టర్, మినర్వా కాఫీ షాప్, హిమాయత్‌నగర్‌.

టేక్‌ అవే సేవలకు ఓకే..  
ఈ నెల 8వ తేదీ నుంచే షాగ్‌హౌస్‌ హోటల్‌ సేవలను అందుబాటులోకి తెచ్చాం. నలుగురు కూర్చునే టేబుల్‌ను ఇద్దరికి పరిమితం చేశాం. హోటల్‌ను ప్రతిరోజు పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నాం. సిబ్బంది కూడా పరిమితంగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అయినా 50 శాతం మంది మాత్రం టేక్‌ ఎవేల ద్వారా పార్సిళ్లను తీసుకెళ్తున్నారు. 25 శాతం మాత్రం కూర్చుని తినేందుకు ముందుకు వస్తున్నారు. ఇక జొమాటో, స్విగ్గీల నుంచి పెద్దగా ఆర్డర్లు రావడం లేదు.  
– రబ్బానీ, షాగౌస్‌ హోటల్‌  యజమాని

టేస్ట్‌ ఒకేలా ఉంది
నేను ఐదారు సంవత్సరాల నుంచి ఇక్కడి మినర్వాకు వారంలో రెండు లేదా మూడు పర్యాయాలు వస్తుంటా. మొదటిసారి వచ్చినప్పుడు టేస్ట్‌ ఎంత రుచిగా ఉందో.. ఇప్పుడు కూడా అలాగే ఉంది. లాక్‌డౌన్‌ తర్వాత వంటకాల్లో మార్పు ఉంటుందేమో అనుకున్నాను. కానీ.. అలా లేదు ఇక్కడ.
– శ్రావణ్, హిమాయత్‌నగర్, డైలీ కస్టమర్‌.

డిమాండ్‌ బాగా తగ్గింది  
కోవిడ్‌ నిబంధనల మేరకు ప్రతి వినియోగదారుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తున్నాం. మాస్కులు ఉన్నవాళ్లనే అనుమతిస్తున్నాం. వినియోగదారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు కూడా నమోదు చేస్తున్నాం. సీట్ల మధ్య పార్టిషన్‌ ఏర్పాటు చేశాం. అన్ని చోట్ల శానిటైజర్లు అందుబాటులో ఉంచాం. అయినా వినియోగదారులు పెద్దగా ముందుకు రావడం లేదు. 160 నుంచి 170 వరకు ఉదయం అల్పాహారం పార్సిళ్లు వెళ్తున్నాయి. ఇంచుమించు మధ్యాహ్నం లంచ్‌ కూడా అదేవిధంగా ఉంది. 
– ప్రవీణ్, తాజ్‌మహల్‌ రెస్టారెంట్‌ యజమాని, సికింద్రాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement