
ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
రెండోమాట
ఆయన తాను ‘భారతీయుడిని’ అనే చెప్పారు గానీ, ‘హిందువును’ అని ప్రకటించుకోలేదు. నిజానికి హిందూమతం పేరుతో దళిత, బహుజన వర్గాలు, మైనారిటీలు ఎంతటి వివక్షకు గురైనాయో, సామాజిక ఆర్థిక రాజకీయ వెలివేతలకు నిరంతరం గురౌతూ, బలవుతూ వచ్చాయో గుర్తించి ఉద్యమాల ద్వారా బహిర్గతం చేసిన వారు అంబేడ్కర్. చివరికి మతమార్పిడి హక్కును గుర్తించిన రాజ్యాంగాన్నీ అవహేళన చేస్తూ ఆ హక్కును రద్దు చేస్తూ చట్టం తేవాలని హిందూత్వశక్తులు తాజాగా బరితెగించాయి.
‘నిమ్నజాతుల మేను నిమిరి పైపై చెల్మి నటన/ సాగించిన నైష్టికులు... నడుపుచున్న/ దొంగ నాట్య రహస్యంబు/ స్పష్టమయ్యె గాంధి చావుతోడ!’
- మహాకవి జాషువ
అవును! ‘నటన’ను మనం ఎందులోనూ సహించరాదు. ‘కొత్త దాసరికి పంగనామాలు ఎక్కువ’ అంటారు. వెనకటికొకడు తన ప్రత్యర్థిపైన నింద మోపడానికి ఏ సాకూ దొరక్క ‘ మీ తాత పొగచుట్టలు తాగేవాడ ని విన్నానే!’ అన్నాడట. అలాగే మెట్ట వేదాంతులలో కాషాయ మెట్టవేదాంతులు కూడా పుట్టుకొచ్చారు. ఇప్పుడు వారే అధికారంలోకి వచ్చారు. దేశ చరిత్రను మరో సారి తారుమారు చేసి చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నది- ఆరెస్సెస్, బీజేపీ, శివసేన కంబైన్. రాబోయే అయిదేళ్లు, కాలం కలిసొస్తే మరో అయిదేళ్లు లేదా పదేళ్లపాటు అధికారంలో కొనసాగడానికిగాను సంక్షేమ పథకాలను పక్కకు పెట్టి భారతీయ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడానికి వారు చిట్కాలు వెతు కుతున్నారు. ఎక్కడికక్కడ జాతిని చీలుబాటలోకి నెట్టే తాంత్రిక పద్ధతులను అనుసరిస్తున్నారు. అందుకోసం సరికొత్త ఎరలు వేస్తున్నారు. దేశానికి స్వాతం త్య్రం వచ్చి, కాంగ్రెస్ నాయకత్వంలో తొలి మంత్రిమండలి ఏర్పడినది మొద లు ఈ తంత్రానికి రాజకీయ నాయకులు వివిధ దశలలో తెర లేపారు. సం దర్భం దొరికినప్పుడల్లా తెర లేపడానికి సిద్ధపడుతూనే ఉన్నారు. ఈ బాటలో నే ఓటు రాజకీయాల కోసం కుల, మతాలనాశ్రయించి; విభజన ద్వారా, ఆ రెండింటినీ ఉపయోగించుకోవడం ద్వారా పాలకపక్షాలు సీట్లు దండుకొం టున్నాయి. పాలనాధికారాన్ని నిలబెట్టుకోవడానికి (ఏకపక్షమైనా, తాత్కాలిక సంకీర్ణ లేదా కిచిడీ ప్రభుత్వాలైనా) అవి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.
పేరుకే లౌకికం
వర్ణ (కుల), మతాతీత లౌకక వ్యవస్థ మనదని రాజ్యాంగ పరంగా చాటుకోవ డం మినహా ఆచరణలో దానిని మన ప్రభుత్వాలు చూపలేకపోయాయి. అందుకు విరుద్ధంగా కూడా వ్యవహరిస్తూ ప్రజల మధ్య తాము సృష్టించిన వైషమ్యాలను రూపు మాపగల సంస్కరణలను ప్రవేశపెట్టే ప్రయత్నం కూడా చేయలేకపోయాయి. రాజకీయ పక్షాలకు మతసంస్థలతోనూ, మత సంస్థలకు రాజకీయాలతోనూ సంబంధాలు ఉండరాదని శాసిస్తూ తొలి రాజ్యాంగ నిర్ణయ సభలోనే తీర్మానం ఆమోదించారు. కానీ ఆ తీర్మానానికి అందరూ కలసి చెదలు పట్టించిన వాస్తవాన్ని విస్మరించరాదు. ఇప్పటికీ కొనసాగుతు న్నవి అవే ఎత్తుగడలు, అవే తప్పుడు వ్యూహాలు, ప్రజాబాహుళ్యాన్ని మోస గించే అవే పద్ధతులు. మార్పులేదు. వర్ణ, వర్గవ్యవస్థనూ; మత రాజకీయా లనూ అంటకాగిన పాలకులెవరూ ప్రజానీకానికి ఒరగబెట్టిందేమీ లేదని ఇప్ప టికే రుజువైంది. ఈ పాలక పక్షాల మధ్య వైరుధ్యాన్ని చూడడం అంటే ఎడమ చేయిని తీసి పుర చేయిని పెట్టడమే. నిన్నమొన్నటి వరకు సాగిన కాంగ్రెస్ సం కీర్ణ పాలన, అటు మొన్నటి బీజేపీ (వాజపేయి) తొలి ప్రభుత్వం, నేటి బీజేపీ (మోదీ) పదకొండు మాసాల పాలనా సరళి దీనినే రుజువు చేస్తున్నాయి.
నేరగాళ్ల పరమైన చట్టసభలు
భారత అత్యున్నత చట్టసభ పార్లమెంటులో 250 మంది, పలు రాష్టాల శాసన సభలలో, మండళ్లలో సగానికి పైగాను నేరగాళ్లూ బేరగాళ్లేనని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనితో ప్రజలు తలలు బద్దలుకొట్టుకోవలసిన పరిస్థితి తయారైంది. ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణలను అమలు చేసిన 108 దేశాల అనుభవాలను, గుణపాఠాలను గ్రహించడానికి కూడా మన పాల కులు సిద్ధంగా లేకపోవడం మరొకటి. పైగా ఇంతకు ముందు కంటే శరవే గంతో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలు తెగనమ్ముతున్నాయి. లేదా విదేశీ సంస్థలకు తాకట్టు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇలాంటి బలహీన స్థితిలో పాలక వర్గాలు జనాలను నమ్మించేందుకు- ముఖ్యంగా దళిత, బల హీన వర్గాలను నమ్మించేందుకు కొత్త మార్గాలను వెతుకుతున్నాయి. ఈ అవాంఛనీయ పోటీలో కాంగ్రెస్, బీజేపీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం దళిత, బడుగు వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరును బదనాం చేసే ప్రయత్నంలో ఉన్నాయి.
అంబేడ్కర్‌కు కొత్త ముద్ర
అంబేడ్కర్ జన్మదినాన్ని (ఈరోజు, ఏప్రిల్ 14) ఘనంగా నిర్వహించాలన్న పేరుతో బీజేపీ, ఆరెస్సెస్ ఒక చిత్రమైన ఎజెండాతో ముందుకు వచ్చాయి. ఈ దేశంలో వర్ణ వ్యవస్థ అనే చట్రానికీ, కుల వ్యవస్థకీ నారు పోసి నీరు పెట్టి పోషించిన ఆ హిందుత్వ శక్తుల దృష్టిలో నేడు అంబేడ్కర్ హఠాత్తుగా ‘హిందూ జాతీయవాది’ లేదా నేషనలిస్ట్ హిందు అయిపోయాడు. అలా అని ఆరెస్సెస్ ప్రకటన విడుదల చేసింది. హైందవ సంస్కృతి పేరిట (పూర్వ వేదం కాదు, అనంతర వేద సంస్కృతి అవలక్షణంగా), బహుళ జాతుల, బహు భాషల, బహుళ మతధర్మాలకు చెందిన ప్రజాబాహుళ్యాన్ని బంధించి శాసించాలని చూసే వింత హిందుత్వ నినాదానికి పురుడుపోసిన శక్తులే ఇప్పుడు అంబేడ్కర్‌ను నేషనలిస్ట్ హిందు అంటున్నాయి. ఉమ్మడి సంస్కృతికి కర్త, కర్మ, క్రియగా ఉన్న కష్ట జీవులను వెలివాడలకు పరిమితం చేసిన శక్తులు కూడా ఇవే. గాంధీని హత్య చేసిన గాడ్సేని బాహాటంగా సమర్థిస్తూ మోదీ పాలనలో చలనచిత్రాలు నిర్మించడానికి సాహసించిన వాళ్లంతా కలసి విశ్వ మానవ ధర్మంగా బౌద్ధాన్ని స్వీకరించిన అంబేడ్కర్‌ను ఇప్పుడు ఎందుకు ‘హిందూ జాతీయవాది’గా పేర్కొనవలసి వచ్చింది? దళిత, బడుగు, బల హీన వర్గాలను మరోసారి మోసగించడం కోసమే సుమా! తాను హిందు వుగానే పుట్టాను గానీ హిందువుగా నా దళిత హక్కులను, నా సోదరుల హక్కులను మాత్రం ఏనాడు అనుభవించనివ్వలేదంటూ అంబేడ్కర్ శఠించిన సంగతిని హిందుత్వ వాదులు మరచిపోయారా? ఆయన తాను ‘భారతీయు డిని’ అనే చెప్పారు గానీ, ‘హిందువును’ అని ప్రకటించుకోలేదు. నిజానికి హిందూమతం పేరుతో దళిత, బహుజన వర్గాలు, మైనారిటీలు ఎంతటి వివ క్షకు గురైనాయో, సామాజిక ఆర్థిక రాజకీయ వెలివేతలకు నిరంతరం గురౌతూ, బలవుతూ వచ్చాయో గుర్తించి ఉద్యమాల ద్వారా బహిర్గతం చేసిన వారు అంబేడ్కర్. చివరికి మతమార్పిడి హక్కును గుర్తించిన రాజ్యాంగాన్నీ అవహేళన చేస్తూ ఆ హక్కును రద్దు చేస్తూ చట్టం తేవాలని హిందూత్వ శక్తులు తాజాగా బరితెగించాయి.
బౌద్ధం ఒక చారిత్రక అవసరం
దళిత బహుజనులు తమలోని వారే అనుకున్నప్పుడు సమాన ఫాయిదాలో వారికి దక్కవలసిన సర్వహక్కులను కల్పించాలి. అవి అందనప్పుడు కనీసం మత మార్పిడికి అనుమతించాలి. అదీ జరగనందుకూ, ‘హైందవ’ సమా జంలో మానసికమైన మార్పు, పరివర్తన కలగనప్పుడు జరిగే పర్యవసానమే మతమార్పిడి అని చాటినవాడు వివేకానంద! అందుకే అంబేడ్కర్‌కు ముందు దళిత, బలహీనవర్గాల విమోచనకు, విద్యావ్యాప్తికి 19వ శతాబ్దంలో మహో ద్యమం నిర్మించిన జ్యోతిరావుఫూలే స్ఫూర్తితోనే కులవ్యవస్థా చట్రాన్ని కూల్చ డం ద్వారానే నిజమైన దేశాభ్యుదయం సాధ్యమని బౌద్ధధర్మ స్వీకారం దాకా నిరంతరం బోధించినవాడు అంబేడ్కర్. మతంగాని, ధర్మశాస్త్రాలు గానీ ప్రజ లను కలపాలి, సఖ్యతకు వారధులు కట్టాలి గాని విడగొట్టటానికి సాధనాలు కారాదన్నాడు. అందుకే ప్రజలు అశాస్త్రీయం వైపు, మూఢ నమ్మకాల వైపు ఎగ బడకుండా వైజ్ఞానికంగా, అవగాహనా ‘ప్రజ్ఞ’తో యువతలో చైతన్యజ్వాల వెలిగించాలని తపనపడ్డాడు.
భారత జాతీయవాది
కులవ్యవస్థ ప్రస్తావనలేని వృత్తి సమాజమే బౌద్ధయుగమయినందున అంబే ద్కర్ దాన్ని ఆశ్రయించవలసి వచ్చింది. నాగపూర్‌లో అంబేడ్కర్ ధర్మదీక్ష వెనక అసలు రహస్యం అదే! యజ్ఞయాగాదులపైన, జంతుబలులపైన ఆధా రపడిన నాటి పాలనా యంత్రాంగాన్ని ఆసరా చేసుకుని, ఆ క్రతువుల వెనక ఉన్న స్వార్థపూరిత వర్గాలు ‘బౌద్ధాన్ని దేశ సరిహద్దులు దాటించే’యడం ద్వారా ‘భారతదేశం ఆత్మహత్య చేసుకున్నద’ని గురజాడ అప్పరాయ కవి అన్నమాటలు అక్షర సత్యాలు కావా? జీవన సంకుల సమరంలో మనిషికి మనిషికి మధ్య పెరిగిన అంతరాల దొంతరలు మన ఋషులకు/ సన్యా సులకు పట్టలేదనీ, ఆ పరిణామాన్ని మనిషికీ, అందుబాటులో లేని దైవానికీ మధ్య సంబంధంగానే చూశారు గాని, అది మనుషుల మధ్య అసమ సంబం ధాల పరిణామక్రమంగా చూడలేకపోయారని అంబేడ్కర్ విశ్లేషించాడు. అంతేగాదు, ‘కులవ్యవస్థ వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతాంగ, వ్యవ సాయ కార్మిక ఉత్పాదకశక్తుల సమష్టి శ్రమకు అత్యంత హానికరమనీ, ఆర్థికాభ్యున్నతికి చేటు అనీ’ హెచ్చరించాడు. కుల వ్యవస్థలో గ్రామీణాభివృద్ధి సమసమాజ వ్యవస్థాపక సూత్రాలకే విరుద్ధం అని కూడా చాటాడు అం బేద్కర్. కనుకనే అంబేడ్కర్ సకల జాతుల, మత ధర్మాల సువర్ణ సేతువుగా ఉన్న ‘భారత జాతీయవాదే’ గాని కుహనా ‘హిందూ జాతీయవాదికాదు. నటనా నేషనలిస్టు అంతకన్నా కాడనీ, వృత్తి సమాజపు దీపధారి మాత్రమేననీ మరవరాదు, మరవరాదు!
(వ్యాసకర్త మొబైల్: 9848318414)