
కుతంత్రాలలో గణతంత్రం
రెండో మాట
రాజ్యాంగం చేసిన సమానత్వ, సామాజిక శాంతి రక్షణ శపథాలన్నింటినీ పాలకవర్గాలు సముద్రంలో నిమజ్జనం చేస్తూ వచ్చిన ఫలితమే నేటి ఈ అశాంతి. నేడు బహుజనుల పట్ల కొనసాగుతున్న వివక్షకు ‘హైందవ సమాజం’ ముసుగులో కొన్ని రాజకీయ పక్షాలూ, వాటి కుల మత సంస్థలూ నెరపుతున్న కార్యకలాపాలే కారణం. ఎందుకో మరి, తొలి ప్రధాని నెహ్రూ, ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ ఆరెస్సెస్ వర్గీయులు తిష్ట వేశారు’ అన్నారొకసారి.
‘ప్రజలను వేల కులాలుగా విభజిస్తే, అది ఒక దేశంగా లేదా జాతిగా ఎలా మనగలుగుతుంది? సాంఘికంగా చూసినా, వైజ్ఞానికంగా చూసినా మనమింకా ఒక దేశ పౌరులుగా, సమగ్ర జాతిగా రూపొందలేదన్న సత్యాన్ని ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.’ -డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
ఇది గణతంత్ర వ్యవస్థకు పునాదులు వేసిన రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్ చర్చల సందర్భంగా వెలిబుచ్చిన అభిప్రాయం. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న ఘటనల నేపథ్యంలో అంబేడ్కర్ వెల్లడించిన ఈ అభిప్రాయానికి ఎంతో విలువ ఉంది. శతాబ్దాల తరబడి దేశంలో రాచరికాలు, కులమత, సంపన్న వర్గాలు ‘హైందవం’ పేరుతో పెంచి పోషిస్తూ వచ్చిన వ్యవస్థ రానురాను ఏ విపరిణామాలకు బాటలు వేయ బోతున్నదో; దాని ఫలితం ఎలా ఉండబోతున్నదో రాజ్యాంగ ముసాయి దాను ప్రవేశపెడుతూ అదే సభలో అంబేడ్కర్ ఆనాడే హెచ్చరించారు- ‘భారతదేశం రాజకీయంగా సమతను సాధించవచ్చు గాక; కానీ సామాజిక, ఆర్థిక రంగాలలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ అసమా నతల వల్ల ప్రజాజీవనంలో పొడసూపుతున్న వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా తొలగించాలి. ఆ లక్ష్యం నెరవేరకపోతే, అసమానతల వల్ల బాధలకు గురవుతున్న ప్రజా బాహుళ్యం ఈ సభ వారం ఎంతో శ్రమించి నిర్మించుకున్న ఈ రాజకీయ ప్రజాస్వామ్య భవంతిని కూల్చివేస్తారు.’ (కానిస్టిట్యూషనల్ అసెంబ్లీ డిబేట్స్, 3/5 సంపుటాలు) ఇంత తీవ్రమైన, పరుషమైన భావనకూ, పదజాలం వైపునకూ అంబేడ్కర్‌ను నెట్టిన పరిస్థితులు ఏమిటి?
అప్పటిదాకా అస్వతంత్రులమే
అసమ సామాజిక వ్యవస్థలో దశాబ్దాల స్వాతంత్య్ర సిద్ధి తరువాత కూడా ఆఖరి నిరుపేద లేదా దళితుడు కూడా విముక్తి పొంది, స్వేచ్ఛాజీవిగా ఊపిరి పీల్చుకునే దాకా మనం అస్వతంత్రులమేనని చాటారు గాంధీజీ. 2006 నాటి సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఈ అంశాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక కేసులో (యూపీ వర్సెస్ సంత్‌రాజ్ సింగ్) తీర్పు చెబుతూ, ‘చట్ట విరుద్ధమైన చర్యలో పౌరులకు సమానత్వాన్ని ఎవరూ ఆశించలేరు’ అని వ్యాఖ్యానించింది. ఈ జీవన సత్యాన్ని తన కుటుంబం అనుభవించిన కటిక పేదరికం నేపథ్యం నుంచే అంబేడ్కర్ తెలుసుకున్నారు. కనుకనే స్వతంత్ర భారతదేశంలో కుల వ్యవస్థ నీడన అధికారంలోకి వచ్చే సంపన్నవర్గ ప్రభుత్వాల మధ్య; ఏ బ్రాండ్‌కు చెందినప్పటికీ ఆయా పాలకుల మధ్య దళిత బహుజన వర్గాల ప్రయోజనాలకు కలుగనున్న నష్టాలను ముందుగానే ఊహించారాయన.
నిన్నగాక మొన్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పాలనా పరమైన వివక్ష ఫలితంగా దళిత వర్గ పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంబేడ్కర్ ఊహలోని వాస్తవికతను మరోసారి చాటింది. స్వాతం త్య్రం వచ్చిన తరువాత వివిధ రాష్ట్రాలలో; కాంగ్రెస్, బీజేపీల పాలనలో, లేదా యూపీఏ, ఎన్‌డీఏ కూటముల ఏలుబడిలో దళిత బహుజనులపై సాగిన, ఇంకా సాగుతున్న విపరిణామాలు కూడా ఆయన ఊహకు తగ్గట్టే ఉన్నాయి. ‘భారత ప్రజలమైన మేము...’ అంటూ వివక్ష లేని ఒక సమాజానికి రాజ్యాంగం పూచీ పడుతున్నది. అలాంటి సంకల్పబలంతో ప్రకటించుకున్న రాజ్యాంగం ఉన్నప్పటికీ సంపన్నవర్గాల ప్రభుత్వాలే షెడ్యూల్డ్ కులాల, తెగల మధ్య చిచ్చు రేపుతూ వచ్చాయి. రాజ్యాంగం చేసిన సమానత్వ, సామాజిక శాంతి రక్షణ శపథాలన్నింటినీ పాలక వర్గాలు సముద్రంలో నిమజ్జనం చేస్తూ వచ్చిన ఫలితమే నేటి ఈ అశాంతి.
నేడు బహుజనుల పట్ల కొనసాగుతున్న వివక్షకు ‘హైందవ సమాజం’ ముసుగులో కొన్ని రాజకీయ పక్షాలూ, వాటి కుల మత సంస్థలూ నెరపుతున్న కార్యకలాపాలే కారణం. ఎందుకో మరి, తొలి ప్రధాని నెహ్రూ, ‘కాంగ్రెస్‌లో ఆది నుంచీ ఆరెస్సెస్ వర్గీయులు తిష్ట వేశారు’ అన్నారొకసారి. అందుకే అధికారంలో ఉన్నా, లేకున్నా ఆ రెండు ప్రధాన పార్టీలు కులమత వ్యవస్థా రాజకీయాలకు అతీతంగా రాజ్యాంగం పూచీ పడిన సెక్యులర్, మతాతీత వ్యవస్థలను ఆచరణలో పటిష్టం చేయడం దగ్గర విఫలమవుతున్నాయి. దీని వెనుక కారణాన్నీ, బీజాన్నీ అంబేడ్కర్ ఆనాడు శాస్త్రీయంగా నిర్ధారణ చేయగలిగారు. ‘హైందవ సమాజ నిర్మాణానికి పునాది కులం’ అని చాటారాయన.
ఏ కులమూ నీదంటే....
కులానికి సూత్రాలేమిటి? జన్మను బట్టి మానవుల మధ్య అసమానతలు, వృత్తులలో అసమానతలు. నాలుగు ప్రధాన కులాల మధ్య సమాజ విభజన, అందులో మళ్లీ ఉపకులాలు ఉన్నాయని స్వార్థపరులు తీర్మానించారనీ, ఈ విభజనను శాసించినది బ్రాహ్మణ్య సిద్ధాంతమని అంబేడ్కర్ చెప్పారు. ముస్లింల దండయాత్రకు ప్రధాన కారణం బ్రాహ్మణ్యానికీ, బౌద్ధానికీ మధ్య జరిగిన నైతిక పరమైన సంఘర్షణేనని కూడా ఆయన విశ్లేషించారు. భారతీయ సంస్కృతిలో చారిత్రకంగా మూడు రకాల ఇండియాలు ఉన్నాయనీ, అవి బ్రాహ్మనిక్ ఇండియా, బుద్ధిస్టిక్ ఇండియా, హిందూ ఇండియా అని వర్గీకరించారు అంబేడ్కర్. ఇందులో బౌద్ధ భారతం కులాల ప్రాతిపదికగా కాకుండా, వృత్తులపైన ఆధారపడినదని చెప్పారాయన. ఈ అవగాహనే ఆయనను బౌద్ధం వైపు మళ్లించింది. హైందవంలోని చిక్కుముడుల మీద ధ్వజమెత్తేటట్టు చేసినది శాస్త్రీయమైన ఆ అవగాహనే. ఈ ఆవిష్కరణే రాజ్యాంగ రచనలో సాధ్యమైనంత మేర మానవీయ కోణాలను చొప్పించేం దుకు కృషి చేయించింది. కానీ ఆరున్నర దశాబ్దాల తరువాత దేశం ఏ స్థితికి చేరుకుంది? కులాన్ని కులంతోనే ఎదుర్కొనాలన్న భావనతో స్వార్థ రాజకీయ వర్గాలు కుట్ర పన్నే స్థితికి వచ్చింది. అక్కడితోనే ఆగిపోకుండా, కులంలో ఉప కులాలను వెతకడం ఆరంభమైంది కూడా. వర్ణాంతర వివాహాలను చెడగొట్టే వరకూ, రోహిత్ ఆత్మహత్యలో కుల వివక్షను వెతికే వరకూ పాలక వర్గం కుల కండూతి కొనసాగింది.
అతడి ఆత్మహత్యకు దారి తీసిన అసలు కారణాన్ని మభ్య పరిచేందుకు తల్లీబిడ్డల పుట్టుకకు తబిశీళ్లు తీసేదాకా ఈ ధోరణి పాకింది. ఆపై, తాజాగా అమెరికా అందుబాటులోకి తెచ్చిన ఉగ్రవాద రాజ కీయాలతో, లేదా రాడికల్ రాజకీయాలతో రోహిత్‌కూ, అతడి మిత్రులకూ సంబంధం కలిపే వరకూ కూడా వెళ్లింది. దీనితో పాటు ఈ ఆత్మహత్య మూల కారణాన్ని ట్రాష్‌లోకి తోయడానికి కమిటీలు, విచారణలతో ప్రయత్నం జరుగుతోంది. కానీ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ కేబినెట్ మంత్రులు (మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ సహా) అంతా నదురూ బెదురూ లేకుండా పదవులను కాపాడుకుంటున్నారు. రోహిత్‌ది ఏ కులం, అతడి తల్లిది ఏ కులం అని కొందరు దుర్భిణీ వేసి మరీ వెతకడం దారుణం. అతడిది మాల కులం కాదు, వడ్డెర కులమని నిరూపించే ప్రయత్నం జరిగింది. ఈ రెండూ కాదు, కుమ్మరి కులమని కొందరు తీర్మా నించారు. ఈ స్థితిలో తాను ఏ పరిస్థితులలో భర్తకు విడాకులు ఇచ్చినది చెప్పుకోవలసి రావడమే కాకుండా, తాను షెడ్యూల్డ్ కులాలకు చెందినదాన నేనని ప్రకటించుకోవలసి వచ్చిందంటే ఎంతటి అనాగరిక ధోరణో అర్థమవు తుంది. రోహిత్ కమ్మరి, కుమ్మరి అయినా అతని కుటుంబానిది మరే కుల మైనా, శరీర కష్టాన్ని స్ఫురింపచేసే కొలిమి, చక్రం, మగ్గం, పలుగూ పార, బౌద్ధం తలదాల్చిన వృత్తి సమాజపు చిహ్నలేగానీ కుల చిహ్నాలు కావు.
టీ అమ్ముకుని జీవనం సాగించానని మనకు తెలియని ఒక రహస్యాన్ని ఎన్నికల సమయంలో ప్రకటించుకున్న ప్రధాని మోదీకి, అంతకన్నా దారుణమైన పరిస్థితులలో పెరిగి చివరికి రోహిత్ ఎందుకు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడో తెలుసుకోలేనంత అమాయకుడు కాదు. అయినా దొంగలు పడిన ఆరుమాసాల తరువాత ఏదో స్పందించాలన్నట్టు రోహిత్ ఆత్మహత్యతో భారతమాత ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని నివాళి అర్పించారు. ఆ సమయంలో ఆయన కన్నీటి పర్యంతం అయినారని వార్తా కథనాలు వచ్చాయి. ఆ కథనం మాటెలా ఉన్నా ప్రసిద్ధ మీడియా న్యూస్ ఏజెన్సీ ‘ఫాక్స్‌న్యూస్’ దీనికి సమాంతరమైన కథనం ఒకటి ఇచ్చింది. అమెరికన్ పాఠశాలల్లో తుపాకీ వాడకం మితిమీరిపోవడంతో తోటి పిల్లలను కొందరు పిట్టల్లా కాల్చేస్తున్నారని విచారం వ్యక్తం చేస్తూ అధ్యక్షుడు బరాక్ ఒబామా కన్నీళ్ల పర్యంతమైనట్టు పత్రికలు రాస్తే, అతడు ఉపన్యసించిన పోడియం దగ్గరకు వెళ్లి చూస్తే, కన్నీళ్లు తెప్పించగల ఓ ఉల్లిపాయ కిందపడి ఉందట. చివరకు ఈ జబ్బు కుల వ్యవస్థకూ పాకిపోయింది. 1967/1969 లగాయితు ఈ ‘కులంగాడి’ గారడీలు, దౌర్జన్యాలు, హత్యలు, వేర్పాటు వాదాలు సాగుతూనే ఉన్నాయి- రోహిత్ ఆత్మహత్య వరకు.
నమ్మకం పెంచాలి
స్వాతంత్య్రానంతరం షెడ్యూల్డ్ కులాల పట్ల వివక్ష మరీ పెట్రేగి పోయిందని ఎలా పెరుమాళ్ కమిటీ, షెడ్యూల్డ్ కులాల, తెగల జాతీయ కమిషన్ కూడా తెలిపాయి. ఈ పరిణామాలను చైతన్య వంతులైన దళిత యువకులు, మేధావులు గమనిస్తూనే ఉన్నారు. ప్రసిద్ధ రచయిత డబ్ల్యు. ఎన్. కుబేర్ ‘దళిత బహుజనులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాంతియుత ఉద్యమాలు నడుపుతున్నా వాటినీ దారుణంగా అణచివేయడాన్ని నేటి యువత గమనిస్తున్నారు. ఈ దమనకాండను దళిత బహుజనులు ఇక సహించరు. జాతీయ చిహ్నాలలో వీరు విశ్వాసం కోల్పోకూడదు’ అన్నారు. ఇంటిగుట్టు గురించి జాషువ చెప్పిన మాటలను గుర్తు చేసుకోవాలి. ‘దేవుడొకడు మాకు దేవళంబులు రెండు... మాటవరుస కొక్క మతమందురే గాని/ కుల సమస్య వద్ద కుమ్ముదుమ్ము. ’ ఆ దుమ్మును అణచలేకే అంబేడ్కర్ బౌద్ధాన్ని ఆశ్రయించారు. ఇప్పటికైనా ఐకమత్య పాఠంతో దళిత బహుజనులు ముందుకు సాగి, మహోద్యమ నిర్మాతలు కావాలి.
సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్
abkprasad2006@yahoo.co.in