అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే ఆయన కృషి కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన కృషిని ‘తొలి అంబేడ్కరిజం’గా పరిగణించాలి. రాజ్యాంగ రచనా సమయంలో– అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా, విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. మొత్తం సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఈ బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి. తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని గ్రహించాల్సిన తరుణమిది.
అంబేడ్కర్ ఆలోచనలు, కృషిని గతం లో కంటే భిన్నంగా ప్రజాపోరాట శక్తులూ, పాలక శక్తులూ గుర్తిస్తుండటం చూస్తున్నాం. గతంలో చాలాకాలం పాటు అంబేడ్కర్‌ను ఏ మాత్రమూ గుర్తించని సామాజిక శక్తులు 1980 ల నుంచి హఠాత్తుగా ఆయనను ఆరాధించడంలోని ఔచిత్యం ఏమిటి? ప్రపంచ వ్యాప్త సామాజిక ఆర్థిక సంక్షోభం ప్రారంభం; సోషలిజం సహా సకల సైద్ధాంతిక భావజాలాల్లో సంక్షోభం; సామాజిక చైతన్య కేంద్రాల విస్ఫోటనం జరిగి... అస్తిత్వ ఉద్యమాలు, అస్తిత్వ సిద్ధాంతాలు అనే సరికొత్త కేంద్రాల చుట్టూ సమీకృతమయ్యేందుకు శకలాలుగా మారడం వంటి పరిణామాలు సంభవించాయి. ఈ సామాజిక నేపథ్యంలో ప్రబలంగా ముందుకొచ్చిన కుల అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా అంబేడ్కర్, ఆయన సిద్ధాంతాలు నిలిచాయి. ఈ నూతన ఒరవడి నుంచి లబ్ధి పొందేందుకు పాలక వర్గాలు సైతం అంబేడ్కర్‌ను తలకెత్తుకుంటున్నాయి. అయితే సమకాలీన సమాజంలోని ప్రగతిశీల శక్తులూ, అంబేడ్కర్‌వాదులూ అంబేడ్కర్ మూల తాత్వికతను గ్రహించడంలో విఫలమై... తమ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యాఖ్యానిస్తున్నారు.
అంబేడ్కర్ అనగానే దళిత సామాజిక సమూహాలకు ప్రాతినిధ్యం వహించే లేదా వారి నుంచి ఉద్భవించిన జాతీయ నాయకుడుగా పలువురు భావిస్తారు. ఆయనలో ఈ రెండు ఛాయలు ఉన్నమాట నిజమే. బ్రిటిష్ వలస పాలన కాలంలో ప్రధానంగా ఆయన అణగారిన దళిత, అçస్పృశ్య ప్రజానీకం పరిస్థితులు, సామాజిక అణచివేత, వివక్ష తదితర ముఖ్యమైన సమస్యల పరిష్కారం కోసం అటు బ్రిటిష్ ప్రభుత్వంతోనూ; ఇటు స్వాతంత్రోద్యమకారులు, దేశీయ అగ్రకుల పెత్తందార్ల తోనూ సైద్ధాంతిక భావజాల పరంగా, భౌతికంగా ద్విముఖ పోరాటాలు చేయవలసి వచ్చింది. సమకాలీన సామాజిక వాస్తవికతకు అనుగుణంగా ఆయన వ్యవహరించారు. అందులో భాగంగా కమ్యూనిస్టు/కార్మికోద్యమాల్లో కులం పాత్ర, వర్గపోరాటంలో (ప్రత్యామ్నాయంగా కాదు) కుల నిర్మూలన పోరాటానికున్న విశిష్ట స్థానం వగైరా అంశాలపై కమ్యూనిస్టులతోనూ తనదైన శైలిలో ఆయన ఘర్షణ పడటం సరైనదే. దాంతో ఆ కాలమంతా ఆయన కృషి దేశాన్ని ఒక జాతిగా సంఘటితమవడాన్ని అడ్డుకుంటున్న కుల అణచివేత సమస్యను జాతీయ రాజకీయ ఎజెండా మీదకు తీసుకురావడంపైనే కేంద్రీకృతమైంది. ఈ దశలో అంబేడ్కర్ చేసిన సైద్ధాంతిక, రాజకీయ కృషిని తొలి అంబేడ్కరిజంగా పరిగణించాలి.
అంబేద్కర్ సుదీర్ఘకాలంగా బౌద్ధాన్ని అధ్యయనం చేస్తున్న నేపథ్యంలో; రాజ్యాంగ రచన ప్రభావంతో ఆయన అణగారిన అస్తిత్వాల దృక్పథం పునాదిగా సమగ్ర మానవ విముక్తి మార్గం వైపు అడుగులు వేశారు. 1955లో ఆయన ‘భారతీయ బుద్ధ మహాసభ’ను స్థాపించారు. 1956 ఆక్టోబర్ 14న 22 ప్రమాణాలతో రూపొందిన ‘ధర్మ చక్ర ప్రవర్తన’ సమావేశంలో లక్షలాది ప్రజల సమక్షంలో కుటుంబ సమేతంగా ఆయన బౌద్ధాన్ని స్వీకరించి ‘నవయాన’ బౌద్ధాన్ని ప్రతిపాదించారు. రాజ్యాంగ రచనా ప్రక్రియ అంబేడ్కర్‌ను సర్వమానవ విముక్తి దృక్పథాన్ని అలవర్చుకునేట్లు చేసింది. ‘ధర్మచక్ర ప్రవర్తన దినం’ సమావేశంలోని 22 ప్రమాణాల్లో ఏ ఒక్క ప్రమాణం కూడా కుల అణిచివేత పునాదిగా శుద్ధ అగ్రకుల వ్యతిరేకతను, ధిక్కారాన్ని మాత్రమే సూచించేదిగా లేకపోవడమనేది ఆయన దృక్పథంలో వచ్చిన విస్తృతిని తెలియజేస్తుంది. వర్గ పోరాటం, సామాజిక సమానత్వం అనే భావనలతో కూడిన నవయాన బౌద్ధ దృక్పథమే భారత విముక్తి మార్గంగా అంబేడ్కర్ బోధించారు.
భారతీయ సమాజంలో అణగారిన సమూహాలు అనుభవిస్తున్న బాధల పునాదిగా... విశ్వమానవ విముక్తి దిశగా ఆయన ఆలోచనలు ప్రవహించాయి. దళితులు, బహుజనులు, శ్రామికులు, మహిళలు తదితర అణగారిన ప్రజల దక్పథం పునాదిగా... మొత్తం భారత సమాజ విముక్తి మార్గాన్ని సూచిస్తున్న ఆయన బోధనలు మలి అంబేడ్కరిజంగా నిలిచాయి.సామాజిక, వైయక్తిక బాధల నుంచి మానవ విముక్తి మార్గం ఆయనకు బౌద్ధంలో దర్శనమిచ్చింది. ఈ అవగాహనతో ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన స్వప్నించారు. 1956 సెప్టెంబర్ 30వ తేదీన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ (ఆర్పీఐ)ను స్థాపిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. తన జీవితపు చరమదశలో ‘ఆర్పీఐ’ ద్వారా కమ్యూనిస్టేతర ప్రగతిశీల శక్తులను సమీకరించే పనికి శ్రీకారం చుట్టారు. బౌద్ధం ప్రభావంతో... సామాజిక సమానత్వం, వర్గపోరాటం అనే ద్విముఖ కార్యాచరణ పునాదిగా రాజకీయ పార్టీని నడపాలని ఆయన భావించారు. ఇంతలో ఆయన 1956 డిసెంబర్ 6వ తేదిన మరణించారు. ఆయన మరణానంతరం 1957లో ఆర్పీఐ ఏర్పడింది. అంబేడ్కర్ దార్శనిక పరిణామాన్ని సక్రమంగా ఆకళింపు చేసుకోలేని అంబేడ్కర్‌వాదులు చీలిపోయారు. అమెరికాలో ‘బ్లాక్ పాంథర్స్’ తరహాలో మహారాష్ట్రలో కూడా ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం కుల అత్యాచారాలకు వ్యతిరేకంగా బయలుదేరింది. అయితే అస్తిత్వాన్ని మించి, అణచివేతకు గురవుతున్న వారందరూ దళితులేనని ఈ ఉద్యమం నిర్వచించింది. ఆ తర్వాత 1980–90లలో ప్రపంచవ్యాప్తంగా నాల్గవ తరం సాంకేతిక విప్లవ కాలంలో ముందుకొచ్చిన... ఆధునికానంతర వాద దార్శనికత ప్రభావంతో ఏర్పడిన అస్తిత్వ ఉద్యమాల ఒరవడిలో అంబేడ్కరిజం దేశ రాజకీయ యవనికపై ప్రబలంగా ముందుకొచ్చింది. ఆ కాలంలో వివిధ సంస్థలూ, వ్యక్తులూ అంబేడ్కర్‌వాద లేబుల్‌ను విస్తృతంగా వినియోగిస్తూ ఆయన దార్శనికతను కుల అస్తిత్వానికి సంబంధించినదిగానే (తొలి అంబేడ్కరిజం) కుదించి చూసేవారు.
మలి అంబేడ్కరిజంలోని బౌద్ధ భావజాలం, సమతా వాదం వంటి అంశాలను ఇప్పటికీ వారు అస్సలు పట్టించుకోనేలేదు. బ్రాహ్మణిజం, కేపిటలిజం అనే రెండు రకాల సామాజిక శత్రువులను అంబేడ్కర్ గుర్తించారు. పెట్టుబదారీ సామ్రాజ్యవాదం కంటే అగ్రకుల నియంతృత్వానికి (బ్రాహ్మణిజం) మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉండటం వల్ల... హిందూ సామ్రాజ్యవాదాన్ని ముందుగా నిర్మూలించాలన్నది అంబేడ్కర్ లక్ష్యం. అందుకే ఆయన పోరాటాలన్నీ అగ్రకుల బ్రాహ్మణీయ ఆధిపత్య వ్యతిరేక పోరాటాలే. అయితే మలి అంబేడ్కరిజంను ఆయన ప్రతిపాదించిన అనంతరం అతి కొద్ది కాలంలోనే మరణించడం వల్ల... ఆయనలోని పరిణామం వారి తర్వాత తరాలకు ఆచరణాత్మక పద్ధతుల్లో నేర్చుకునేందుకు అవకాశం కలగకపోవడం దురదృష్టకరం.
అంబేడ్కర్ ఆచరణాత్మక వాది. వివిధ దార్శనికతల కలనేత. పాలకవర్గాలే కాకుండా, అంబేడ్కర్ వాదులు, వామపక్షవాదులు సైతం అంబేడ్కర్ దార్శనికతను విమర్శనాత్మక, విప్లవాత్మక దార్శనికుడుగా చూడకుండా ఒక దేవునిగా, విగ్రహమాతృనిగా పూజిస్తున్న వైనం దురదృష్టకరం. మలి అంబేడ్కరిజంలోని సమతావాద స్వభావాన్ని ఆకళింపు చేసుకోకుండా, తొలి అంబేడ్కరిజంలోని శుద్ధ అస్తిత్వ వాద కోణాన్ని మాత్రమే పుణికిపుచ్చుకోవడం వల్ల సమగ్ర సామాజిక విప్లవానికి విఘాతం కలుగుతుందన్న విషయాన్ని మేధావులు, సామాజిక ఉద్యమశక్తులు సత్వరం గ్రహించాల్సిన తరుణమిది.కొందరు అస్తిత్వ వాద నాయకులు శకల మతవాదమైన కుల అస్తిత్వవాద దృక్పథాలకు పరిమితం కాకుండా సామాజిక సమానత్వం, వర్గ పోరాటం అనే భావనల పునాదిగా రూపొందిన మలి అంబేడ్కరిజాన్ని నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరం. ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ’ అనే మలి అంబేడ్కరిజం వైఖరిని కుల అస్తిత్వ/వామపక్ష ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
(నేడు అంబేడ్కర్ జయంతి)
వ్యాసకర్త: వెన్నెలకంటి రామారావు
సీనియర్ పాత్రికేయుడు ∙95503 67536
Comments
Please login to add a commentAdd a comment