హాలోవీన్ డెవిల్స్ డే ఔట్ | Horror movie: halloween devils day out | Sakshi
Sakshi News home page

హాలోవీన్ డెవిల్స్ డే ఔట్

Published Fri, Oct 31 2014 12:20 AM | Last Updated on Sat, Sep 2 2017 3:37 PM

హాలోవీన్ డెవిల్స్ డే ఔట్

హాలోవీన్ డెవిల్స్ డే ఔట్

హారర్ సినిమాలు తీసే రామ్సేలూ, రామ్‌గోపాల్‌వర్మలకు డూప్‌లు పుట్టుకొచ్చే రోజిది. కాళరాత్రి నుంచి కాంచన దాకా సినిమా దెయ్యాలన్నింటిని గుర్తు చేసే రోజిది. భూత ప్రేత పిశాచాలంటే నమ్మని నవ యువత సైతం నేనే దెయ్యం.. నేనే డెవిల్ అంటూ సందడి చేసే ‘డెవిల్స్ డే అవుట్’ ఇది. శుక్రవారం హాలోవీన్ నైట్ సందర్భంగా భయపడేవారినీ, భయపెట్టే వారినీ ఒకచోట చేరుస్తూ సిటీలో పబ్బులూ క్లబ్బుల్లో స్పెషల్ థీమ్స్ సిద్ధమయ్యాయి. చీర్స్‌తో చిల్ అవుట్ అవడంతో పాటు హర్రర్‌తో హ్యాంగవుట్‌కమ్మని ఆహ్వానిస్తున్నాయి.
 
 భయపెట్టడంలో, భయపడడంలో ఉన్న సరదా యూనివర్సల్. అందుకేనేమో... హాలోవీన్ నైట్ అనే వెస్ట్రన్ కాన్సెప్ట్ సిటీలో బాగా ఊపందుకుంటోంది. వెరైటీ అనుభవాల్ని ఆశించే యూత్ కారణంగా ఏటా అక్టోబర్ 31న హాలోవీన్ నైట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. హారర్‌ను థీమ్‌గా తీసుకుని సాగే ఈ హాలోవీన్ నైట్ ఇప్పుడు దాదాపు ప్రతి పబ్‌కూ, క్లబ్‌కూ తప్పనిసరి నైట్ ఈవెంట్.
 
 ‘అవును’ నేను దయ్యాన్ని..
 అని చెప్పుకున్నట్టు ఉంటాయీ హాలోవీన్ పార్టీలు. వీటికి హాజరైన వారికి వెల్‌కమ్ చెప్పే వ్యక్తి నుంచి వీడ్కోలు పలికే వారి వరకూ అంతా భయపెట్టే గెటప్స్‌తోనే ఉంటారు. గెస్ట్‌లు కూడా పార్టీలోకి ఎంటరైన కాసేపటికే తాము సైతం దయ్యాలైపోతారు. శక్తిమేరా ఇతరుల్ని భయపెట్టడం కోసం మాస్క్‌లు మస్కారాలు, టాటూలు, పెయింట్లూ.. యువత వంటిపై నాట్యం చేస్తాయి. దయ్యాలు, భూతాలు, మంత్రగాళ్లు, రాబందులు, వాంపైర్స్, ఏంజెల్స్... ఇలా కాదేదీ గెటప్‌కూ, డ్రెస్సప్‌కూ అనర్హం అన్నట్టు అమ్మాయిలు, అబ్బాయిలు సిద్ధమవుతారు.
 
 భయ‘భ్రాంతులు’...
 చిమ్మ చీకటి. పిన్‌డ్రాప్ సెలైన్స్. ఆకాశంలో నక్షత్రాల్లాగా అక్కడక్కడ మెరుపులు. ఫెడేల్మని ఏదో విరిగిన శబ్దం. దాని వెంటనే హిహిహి... హెహెహె అంటూ ప్రేతాత్మలు రువ్వే వెకిలి నవ్వులు. కాసేపటికి ఆ శబ్దం ఊపందుకుంటూ...దానితో పాటే ఒకటొకటిగా విరబోసుకున్న కురులతో దయ్యాలు...(మాస్క్‌లు ధరించిన అమ్మాయిలు) ఊగిపోవడం మొదలు. అలాగే వీరిని నియంత్రించే మంత్రగాళ్లలా, స్తోత్రించే భూతారాధకులు... ఇలాంటి సందడి ఒకచోటైతే... మరోచోట... ఆత్మల్ని ఆహ్వానిస్తూ పూజలు చేస్తున్నట్టుంటే మరికొందరు ప్రత్యక్షమైన ఆత్మల్లా అభినయిస్తారు. జడిపించే మైఖేల్ జాక్సన్ ఆల్బమ్ ‘థ్రిల్లర్’, తీతువుపిట్ట అరుపుల దగ్గర్నుంచి నక్కల ఊళలు, కీచురాళ్ల చప్పుళ్ల దాకా హారర్ మూవీస్‌లోని థీమ్ మ్యూజిక్‌లన్నీ కలగలిపి భయపెట్టడం డీజే వంతు.
- హాలోవీన్ నైట్ అనేది శతాబ్దాల క్రితం నాటి పాశ్చాత్య ఒరవడి. దీని పుట్టుక వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఎక్కువగా వినిపించేది...చనిపోయిన వారి ఆత్మల్ని గౌరవించడానికి, అదే సమయంలో అవి తమనేవీ చేయలేవని చెప్పడానికి ఈ సెలబ్రేషన్ పుట్టిందనే కథ.
- ఇది విశ్వసించే వారు ప్రత్యేకంగా ఒకరోజును నిర్ణయించుకుని, ఆ రోజు రాత్రి వేడుకలు నిర్వహిస్తారు. రాత్రివేళ తిరిగే భూతప్రేతాల్ని భయపెట్టడానికి భయంకరమైన కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. కాలక్రమంలో ఇదొక కాస్ట్యూమ్స్ పార్టీలా మారింది.
 
- ఇది పెద్దవాళ్ల వేడుక కాబట్టి దీనిలో పిల్లల కోసం ట్రిక్ ఆర్ ట్రీట్ అనే ప్రత్యేకత జత చేశారు. స్పైడర్‌మ్యాన్, సూపర్‌మ్యాన్ తరహా గెటప్స్ వేసుకున్న పిల్లలు ఇంటింటికీ వెళ్లి ట్రిక్ ఆర్ ట్రీట్ అని అడుగుతారు. అప్పుడు ఆ ఇంటి యజమాని వీరి గుప్పిట్లో బోలెడు చాక్లెట్స్ వేస్తారు. అలా పోగు చేసుకువచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు...ఎట్సెట్రాలన్నింటినీ పిల్లలు రాత్రి సమయంలో ఒకచోట చేర్చి ఎంజాయ్ చేస్తారు.
 
 సిటీలో... హారర్ హంగామా...
 ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ నెల చివరి వారం నుంచే దీనిని నిర్వహిస్తున్నారు. సిటీలో వారం క్రితం నుంచి ఈ హడావుడి మొదలైంది. హాలోవీన్ బార్బీ ఫ్రైడే, హాలోవీన్ సన్‌డౌన్ పూల్ పార్టీ, థ్రిల్లర్ థీమ్ పార్టీ వంటివి జోరందుకున్నాయి. ఇక శుక్రవారం రాత్రి సందడికి... దాదాపు అన్ని పబ్స్, క్లబ్స్ రెడీ అయ్యాయి. రాజ్‌భవవన్ రోడ్‌లోని కిస్మత్, జూబ్లీహిల్స్‌లోని అవాస, దుర్గం చెరువు దగ్గరున్న ఆలివ్, ప్లేబోయ్...
 
 స్వదేశీ దెయ్యాలు...
మనుషులకున్నట్టే పిశాచాల్లో కూడా స్వదేశీ, విదేశీ ఉంటాయి కదా. అందుకే కిస్మత్ పబ్ దేశీ థీమ్‌తో ఈ దెయ్యాల పండుగ నిర్వహిస్తోంది. హాలోవీన్ పార్టీ సంథింగ్ డిఫరెంట్. అంతా థీమ్ బేస్డ్. అందుకే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఈసారి పార్క్ హోటల్‌లోని కిస్మత్ పబ్‌లో హాలోవీన్ నైట్ పార్టీలో ప్లే చేస్తున్నా. ఇది దేశీ థీమ్‌తో సాగుతుంది. ఈ హాలోవీన్ నైట్‌ని సిటీ యూత్ బాగా ఎంజాయ్ చేస్తారు.     
 - డీజే పీయూష్
 
 టాటూల జోరు.. గెటప్పుల హుషారు
 తేళ్లు, సాలెపురుగులు, రక్తపిశాచి.. ఎట్సెట్రా రూపాలు వేసుకుని భయపెట్టాలంటే తప్పనిసరిగా టాటూలు జత చేయాల్సిందే ‘‘శుక్రవారం అంతా ఫుల్ బిజీ.  మా క్రియేటివిటీకి  పదును పెట్టిస్తుంది హాలోవీన్ నైట్’’ అంటున్నాడు సిటీకి చెందిన టాటూ డిజైనర్ శ్రవణ్‌కుమార్. ఇక శ్రీనగర్‌కాలనీ, బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ ఎదురుగా ఉన్న రోడ్లలోని షాప్స్, సికింద్రాబాద్‌లోని ప్రకాష్ పార్టీ షాప్... వంటి షాప్‌లు రెండురోజులుగా భయపెట్టే మాస్క్‌లు, కోరలు... వగైరాల అమ్మకాల్లో బిజీగా ఉన్నాయి. ‘‘భయపెట్టేందుకు ఎన్ని దారులున్నాయా అని యూత్ అన్వేషిస్తున్నారు. మేం కూడా రకరకాల ప్రొడక్ట్స్‌ను తీసుకొస్తున్నాం. పబ్స్‌కు, క్లబ్స్‌కు స్కెలిటిన్, స్కల్, పంప్‌కిన్, మాస్క్‌లు, డ్రాకులా టీత్, విట్జ్ హ్యాట్స్ వంటివి సప్లయ్ చేయడంతో పాటు ఈసారి ఆలివ్ బిస్ట్రో పబ్‌లో హాలోవీన్ థీమ్ డెకరేషన్ కూడా చేశాం’’ అంటూ చెప్పారు పార్టీ నీడ్స్ నిర్వాహకులు సునీల్.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement