దెయ్యాలు ఉన్నాయా? లేవా? ఇది ఇప్పట్లో ఒడవని ముచ్చట. కానీ దెయ్యాల మీద వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను భయపెట్టించి మరీ కాసులు కురిపించాయి. ముఖ్యంగా హాలీవుడ్‌లో దెయ్యాల సినిమాలు అనగానే గుర్తుకువచ్చేవి ది ఎగ్జారిస్ట్, ది కంజ్యూరింగ్, అనబెల్లె. వీటికి సీక్వెల్స్ కూడా వచ్చాయి. అయితే "ది కంజ్యూరింగ్" సినిమా పుట్టుకకు కారణం.. పైన కనిపిస్తున్న భవనమే. ఇప్పుడీ భవనం లోపల ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు, మనమూ హారర్ సినిమాలో ఓ భాగమైనట్లు అనుభూతి చెందేందుకు ఓ కొత్త కార్యక్రమం రాబోతోంది. కొంతమంది ఈ ఇంట్లోకి వెళ్లి వారి ప్రతీ కదలికలను లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. దాన్ని మనం ఇంట్లో నుంచే వీక్షించవచ్చు.
చుక్కలు చూపించిన దయ్యాలు
ఎన్నో యేళ్ల క్రితం జరిగిన సంఘటన ఇది. అమెరికాలోని రోడ్ ఐలండ్‌లో తరతరాలుగా నివసిస్తున్న ఓ కుటుంబం ఆ ఇంట్లో నుంచి నిష్క్రమిద్దాం అనుకునే లోపే వారు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి అడుగుపెట్టినవారికి వింత అనుభవాలు ఎదురయ్యేవి. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు దెయ్యాల పరిశోధకులు లోరెన్, ఎడ్ వారెన్ ఆ భవనంలోకి అడుగుపెట్టి సునితంగా అధ్యయనం చేశారు. అనంతరం అక్కడ దెయ్యాలు ఉన్నాయన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. అదే సమయంలో వారి కుమార్తె ఆండ్రియా ఈ ఇంటి గురించి "హౌస్ ఆఫ్ డార్క్‌నెస్ హౌస్ ఆఫ్ లైట్: ద ట్రూ స్టోరీ" అనే పుస్తకం రాసింది.
లైట్లు వెలుగుతూ.. ఆరిపోతూ..
ఆ తర్వాత 1970లో ఓ కుటుంబం ఆ ఇంట్లోకి దిగింది. అయితే నెమ్మదిగా అక్కడ ఉన్న దెయ్యాలు చుక్కలు చూపించడం మొదలు పెట్టాయి. దీంతో బతుకు జీవుడా అనుకుంటూ వాళ్లు ఏడాదికే ఇల్లు వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత అది ఎన్నో హారర్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచింది. హీన్‌జెన్ అనే వ్యక్తి గతేడాది ఆ ఇంట్లోకి వెళ్లినప్పుడు అతీత శక్తుల కదలిక ఉన్నట్లుగా గుర్తించాడు. ఆ మేరకు గదుల్లో అడుగుజాడలతోపాటు, తలుపు కొట్టుకుంటున్న శబ్ధాలు, లైట్లు వాటంతటవే వెలుగుతూ, ఆగిపోవడం కనిపించిందన్నారు. దీంతో కొంతమంది దెయ్యాల పరిశోధకులను ఇంట్లోకి పంపించి, వారి అనుభవాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. మే 9 నుంచి ఇంట్లోనే ఉంటూ వారం రోజులపాటు లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు. అయితే మే 8న ద హౌస్ లైవ్ కార్యక్రమానికి సంబంధించి చిన్న ప్రివ్యూ కూడా వదలనున్నారు. దీన్ని డార్క్ జోన్ వెబ్‌సైట్ ఏర్పాటు చేస్తోంది. (ఈ ‘ఇంట్లో’కి వెళ్లొస్తే 14 లక్షల అవార్డు)
నిజమైన దెయ్యాలను చూడవచ్చు
ఇక ప్రేక్షకులు కంజ్యూరింగ్ హౌస్‌లో ఉన్నట్లుగా అనుభూతి చెందేదుకు ఆ ఇంట్లో పలు కెమెరాలను అమర్చనున్నారు. తద్వారా అతీత శక్తుల అలజడిని ప్రతి ఒక్కరూ స్వయంగా చూడగలరని డార్క్ జోన్ వెబ్‌సైట్ పేర్కొంటోంది. ఇంకేముందీ మీరూ సినిమా చూసేస్తామని రెడీ అయిపోకండి. ఎందుకంటే ఇది ఉచితమేమీ కాదు చిన్నపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఒక్కరోజు లైవ్ స్ట్రీమింగ్ చూడటానికి నాలుగున్నర డాలర్లు, వారమంతా చూడటానికి పంతొమ్మిదిన్నర డాలర్లు ముట్టజెప్పాల్సి ఉంటుంది. అలా వచ్చిన డబ్బునంతా కోవిడ్-19 వ్యతిరేకంగా పనిచేసే చారిటీలకు ఇవ్వనున్నారు. టికెట్లు కొనుగోలు మే1 నుంచే ప్రారంభమైంది. ఇంకెందుకాలస్యం.. మరిన్ని వివరాలకు Darkzone వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసేయండి, టికెట్లు బుక్ చేసుకుని దెయ్యాలను కనులారా వీక్షించండి.
Comments
Please login to add a commentAdd a comment