దారుల్-షిఫా
16వ శతాబ్దంలోనే హైదరాబాద్‌లో నెలకొల్పిన ప్రముఖ యునానీ వైద్యశాల దారుల్-షిఫా. పాతబస్తీలోని బల్దియా కార్యాలయం దగ్గర్లో ఉన్న ఈ ఆస్పత్రి ఆనాడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. 1595లో, ఐదవ కులీ కుతుబ్‌షామీ కాలంలో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. హైదరాబాద్ నగర నిర్మాణానికి శ్రీకారం చుట్టిన తర్వాత ఐదేళ్లకు ఈ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.
దారుల్-షిఫా అనేది ఉర్దూ పదం. దారుల్ అంటే హౌస్ అని, షిఫా అంటే క్యూర్ అని అర్థం. దారుల్-షిఫా అంటే House of Cure అన్నమాట.‘స్వస్థత కేంద్రం’గా తెలుగులో సమానార్థం చెప్తారు. నాలుగు శతాబ్దాల కిందట ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన మూడు యునాని ఆస్పత్రుల్లో దారుల్-షిఫా ఒకటి. మిగితా రెండు బాగ్దాద్, బుఖ్రా ప్రాంతాల్లో ఉండేవి. ఆ రోజుల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యంగా యునానీ పేరు తెచ్చుకుంది.
శాస్త్ర ప్రకారం నిర్మాణం..
ఆనాడు కాలుష్యం సోకని మూసీ నీళ్లలో స్వచ్ఛత కనిపించేది. ఆ అలలపై నుంచి వ చ్చే చల్లటి గాలులు రోగులకు స్వస్థత చేకూరుస్తుందని మూసీ తీరాన దారుల్-షిఫాను నిర్మించారు. యునానీ వైద్య శాస్త్రం ప్రకారం.. ఉత్తర దిశగా వచ్చే గాలులు రోగ పీడితులకు ఎంతో మంచిదని నమ్మకం. ఆ మేరకు ఆసుపత్రి భవన నిర్మాణం మూసీనదికి ఉత్తర - దక్షిణ దిశలో చేపట్టారు. మూసీ నదికి దారుల్ షిఫాకి మధ్యన ప్రస్తుతం వున్న కాంక్రీటు భవనాలు ఆనాడు లేవు.
సరికదా, పచ్చని తోటలు, అనేక మొక్కలు, భారీ వృక్షాలతో పచ్చదనంతో ఈ ప్రాంతం నిండి వుండేదని చరిత్రకారులు పేర్కొంటారు. పేరెన్నికగన్న హకీంలు, వైద్యులను గ్రీసు, ఇటలీ, పర్షియన్ దేశాల నుంచి కుతుబ్‌షాహీ రాజులు పిలిపించారు. ఎందరో ప్రజలకు చక్కని వైద్య సౌకర్యం అందించారు. ఒకేసారి 400 మంది రోగులకు ఉచిత మందులు ఇచ్చేలా ఆస్పత్రిలో ఏర్పాట్లు చేశారు. రోగులకు వైద్యంతో పాటు వైద్య విద్యార్థులకు ఇక్కడ శిక్షణ ఇప్పించారు.
చరిత్రకు చిక్కిన కట్టడంలా..
హైదరాబాద్ సంస్థానాన్ని కుతుబ్‌షాహీల తర్వాత రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న అసఫ్‌జాహీ - నిజాం ప్రభువులలో మెుదటి నిజాం ప్రభువు, నిజాం-ఉల్-ముల్క్ పాలన వరకు అంటే అంటే 1762 దాకా, దారుల్ షిఫా రోగులకు అందుబాటులో ఉండేది. రెండో నిజాం కాలంలో దీన్ని మూసివేసి వ్యక్తిగత సంస్థానంలో విలీనం చేశారు. క్రమేణా
దారుల్-షిఫా చరిత్రలో ప్రసిద్ధికెక్కిన
కట్టడంగా మాత్రమే నేడు కనిపిస్తోంది. భవనంలో ఒక పక్క ఆషూర్‌ఖానా, ప్రార్థన
మందిరం ఏర్పాటు చేశారు. ఏడో నిజాం కాలంలో ఈ ప్రార్థనామందిరాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దాడు. దారుల్-షిఫాకు వెలుపల ఉత్తర - పశ్చిమ దిశలలో కుతుబ్‌షాహీలు విశిష్టశైలిలో నిర్మించిన ‘మసీదు’ ఉంది.
ఈ తరానికి తెలియదు..
దారుల్-షిఫా గురించి ఆ భవనం దగ్గరికి వెళ్లి అడిగినా ఇదే అదని చూపించేవారు ఉండరు. ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దవాఖానా ఇప్పుడు చాలామందికి ఆషూర్‌ఖానాగానే తెలుసు. 162 ఏళ్లకు పైగా ఎందరికో వైద్య సేవలు అందించిన దారుల్-షిఫా విశిష్టతను తెలియజేసే ఎలాంటి నమూనాలు ఆ సమీపంలో కనిపించవు. శతాబ్దాల చరిత్ర కల్గిన ఈ అద్భుత నిర్మాణం గురించి ఈ తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. గొప్ప హెరిటేజ్ కట్టడంగా గుర్తించిన దారుల్-షిఫా గురించి చారిత్రక అంశాలపై ఆసక్తి కనబర్చేవారు తగిన రీతిలో స్పందిచడం తక్షణ అవసరం!
మల్లాది కృష్ణానంద్
malladisukku@gmail.com