విభజనలో కిరణ్ లిక్విడేటరేనా?
రాష్ట్ర విభజనకు సానుకూలంగా కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్న తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఏంటన్న ప్రశ్న అన్ని వర్గాల్లోనూ తలెత్తింది. గతంలో తెలంగాణకు అనుకూలంగా చిదంబరం ప్రకటన చేసినప్పుడు నాటి ముఖ్యమంత్రి రోశయ్యకు ముందు నామమాత్రంగా కూడా చెప్పలేదు. అప్పట్లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, నిమ్స్లో ఆయనకు చికిత్స, రాష్ట్రంలో పరిస్థితులు.. ఇలా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. దాంతో కేంద్రం సత్వరం స్పందించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత చకచకా రాజకీయ పరిణామాలు మారడం, దాంతో మళ్లీ ప్రకటన మార్చడం లాంటివి తెలిసిందే.
ఈసారి తెలంగాణ అనుకూల ప్రకటన చేసేటప్పుడు ముఖ్యమంత్రి పదవిలో రోశయ్య తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డే కొనసాగుతున్నారు. అప్పట్లో ప్రభుత్వపరంగా ప్రకటన చేసినా, ఇప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా.. కాంగ్రెస్ పార్టీ తరఫునే ప్రకటన చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఎంతవరకు విశ్వాసంలోకి తీసుకున్నారన్న విషయం మాత్రం బ్రహ్మపదార్థం లాగే మిగిలిపోయింది. ఆ తర్వాతి పరిణామాల్లో కూడా ముఖ్యమంత్రి కిరణ్.. చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. కేవలం అంతర్గత సమావేశాల్లో మాత్రమే, అదికూడా తనకు సన్నిహితులుగా పేరొందిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేల వద్ద మాత్రమే తాను కూడా పూర్తిగా సమైక్యవాదానికే మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు. అంతేతప్ప బహిరంగంగా మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడటంలేదు. అడపా దడపా ఢిల్లీ వెళ్లి, అక్కడి పెద్దలకు కూడా సమైక్యవాదం గురించి చెబుతున్నా, వాళ్లు పెద్దగా పట్టించుకున్న పాపాన పోయినట్లు కనపడటంలేదు.
సీఎం ఎలా వ్యవహరిస్తున్నారో కూడా అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. తెలంగాణ నేతలు కలసినప్పుడు మీ రాష్ట్రం మీకు వచ్చేస్తోంది కదా అంటూ పలుకరిస్తున్న సీఎం... సీమాంధ్ర నేతలు కలసినప్పుడు తెలంగాణ ఏర్పాటు అంత సులభం కాదని నమ్మబలుకుతున్నారు. ఏ విషయంలోనూ సీఎం మాటలకు జరుగుతున్న పరిణామాలకు పొంతన లేకపోవడం నేతల అనుమానాలను మరింత పెంచుతోంది.
విభజనకు సీడబ్లూసీ తీర్మానం చేసిన నేపథ్యంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేయాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు అందరూ సీఎంతో భేటీ అయ్యారు. అయితే సీఎం మాత్రం రాజీనామాలు వద్దని, అసెంబ్లీలో తీర్మానం వచ్చినప్పుడు దానికి వ్యతిరేకంగా వ్యవహరించడానికి వీలుంటుందని చెప్పుకొచ్చారు. అసెంబ్లీలో తీర్మానం వరకు ప్రక్రియ వస్తే ఆ తరువాత విభజన ప్రక్రియపై అధిష్టానం ముందుకే వెళ్తుంది తప్ప ఆగదని, ఇలాంటి పరిణామాలు స్పష్టంగా అర్థమవుతున్నా సీఎం రాజీనామాలకు ఎందుకు అడ్డంపడుతున్నారో అర్థం కావడం లేదని నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ను కాంగ్రెస్ అధిష్ఠానం ఎలా ఉపయోగించుకోవాలనుకుంటోందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఏదైనా కంపెనీకి సంబంధించిన వివాదాలు వచ్చినప్పుడు ఆ కంపెనీ ఆస్తులు, అప్పులు ఎన్నెన్ని ఉన్నాయో, వాటిని ఎవరెవరికి ఎంతెంత పంచాలో తేల్చడానికి కోర్టు ఒక 'లిక్విడేటర్'ను నియమిస్తుంది. ఇప్పుడు రాష్ట్ర విభజన విషయంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్ఠానం ఇలాగే లిక్విడేటర్గా ఉపయోగించుకుంటోందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం వాటాలు తేల్చడానికే ఆయన పరిమితం అయిపోతారేమో చూడాలి మరి!!