
అగస్త్యుడు
జ్యోతిర్మయం
చెట్లు కాసే తీయని పళ్లలా, నదులు మోసుకొచ్చే చల్ల ని నీళ్లలా, సజ్జనుల సంపదలన్నీ పరోపకారం కోసమే. జనావాసాలకు దూరంగా కొండల్లో, కోనల్లో, ఆశ్రమా లలో నిరాడంబరంగా జీవిస్తూ తపస్సు చేసుకొనే మహర్షుల తపోబలం కూడా లోకోపకారం కోసమే. ఉదాహరణగా అగస్త్య మహర్షి అద్భుత చరిత్రను చూపవచ్చు.
వాతాపీ, ఇల్వలుడూ అనే రాక్షస సోదరులు కామరూపులు. అరణ్యమార్గంలో వెళ్లే బ్రాహ్మణులను భోజనం మిషతో ఆకర్షించి తెచ్చేవారు. వాతాపి మేక రూపం ధరించితే, ఇల్వలుడు ఆ మేక మాంసం బ్రాహ్మణులకు వడ్డించేవాడు. భోజనమైన తర వాత ఇల్వలుడు ‘వాతాపీ, ఇక బయటకు రా!’ అని కేక వేయ గానే వాతాపి బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా వాళ్లు ఎందరో బ్రాహ్మణులను చంపారు. వాళ్ల దుర్మార్గం అణచేందు కు, ఒకనాడు అగస్త్యుడు వాళ్ల అతిథిగా వెళ్లాడు. తన కు వడ్డించిన వాతాపిని జీర్ణం చేసేసుకొన్నాడు. భోజ నం తర్వాత, ఇల్వలుడు ఎంత అరిచినా లాభం లేకపో యింది. ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’ అని అగస్త్యుడు పొట్ట నిమురుకోటంతో వాతాపి కథ ముగిసింది.
కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తప స్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగ స్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణా లకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవ తలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ.
వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనం తరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగా నికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృద యాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలు వగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే.
వింధ్య పర్వతం అహంకరించి మితిలేకుండా పెరిగిపోతుంటే, దేవతల ప్రార్థన మేరకు అగస్త్యుడు తనకు ప్రాణంతో సమానమైన కాశీ క్షేత్రాన్ని వదిలి దక్షిణా పథానికి బయలుదేరాడు. ఆయనకు కొండెక్కే శ్రమ కలగకూడదని వింధ్య పర్వతం వినమ్రతతో ఒంగక తప్పలేదు. ‘నాయనా, నేను తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు!’ అని ఆదేశించి అగస్త్యుడు ముందుకు సాగాడు. ఆయన తిరిగి వెళ్లకనే పోవటంతో వింధ్య ఔద్ధత్యం శాశ్వతంగా అణగారిపోయింది. ఇలాంటి పరోపకార పరాయణులైన మహనీయుల స్ఫూర్తి దా యకమైన చరిత్రలు మానవాళికి నిత్యస్మరణీయాలు.
ఎం. మారుతిశాస్త్రి