కిరణ్ X బొత్స | Kiran X Botsa | Sakshi
Sakshi News home page

కిరణ్ X బొత్స

Published Mon, Feb 17 2014 8:29 PM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

కిరణ్ X బొత్స - Sakshi

కిరణ్ X బొత్స

రాష్ట్ర విభజన వ్యవహారం కాంగ్రెస్ నేతలను సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన వర్గాలుగా ఏర్పడటానికి దారి తీసింది. ఇప్పుడు సీమాంధ్ర నేతలు కూడా రెండు  గ్రూపులుగా విడిపోయారు. సీమాంధ్ర కాంగ్రెస్‌లో తీవ్ర విభేదాలు తలెత్తాయి. కొందరు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి  వర్గంగా ఏర్పడితే, మరి కొందరు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వర్గంగా ఏర్పడ్డారు. పోటాపోటీగా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. బొత్స వర్గం కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కిరణ్ వర్గం కొత్త పార్టీ పెట్టాలన్న ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌ ఆడుతున్న విభజన జూదం సీమాంధ్రలో ఆ పార్టీ పునాదులనే కదిలించేస్తోంది.  రెండు ముక్కలాట అయిపోయి, ఇప్పుడు  మూడుముక్కలాట మొదలైంది.

బొత్స వర్గంగా భావిస్తున్న సీమాంధ్రకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి  సమావేశమయ్యారు. ఈ సమావేశాలలో  పలువురు సీమాంధ్ర మంత్రులు పాల్గొన్నారు. సీఎం రాజీనామా, కొత్త పార్టీ అంశంపై చర్చించారు. హాజరైన  మంత్రులలో ఆనం రామనారాయణ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, డొక్కా మాణిక్యవరప్రసాద్, రఘువీరారెడ్డి, శైలజానాథ్, కాసు కృష్ణారెడ్డి, టీజీ వెంకటేష్, బాలరాజు, కొండ్రు మురళి ఉన్నట్లు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత బొత్స విలేకరులతో మాట్లాడుతూ మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న సీమాంధ్ర మంత్రుల ప్రతిపాదనను ఆనాడు  సీఎం పట్టించుకోలేదని చెప్పారు. కార్యకర్త నుంచి సీఎం వరకూ అందరూ కాంగ్రెస్లోనే  కొనసాగాలని చెప్పారు. రాష్టాన్ని ఎలా సమైక్యంగా ఉంచాలన్నదే తమ ముందున్న ప్రధాన సమస్య అన్నారు. సీఎం రాజీనామా, కొత్త పార్టీ ఏర్పాటు అనే రెండు అంశాలకు అంత ప్రాధాన్యత లేదని బొత్స చెప్పారు.

ఇదిలా ఉండగా, బొత్స సత్యనారాయణ సీఎంకు ఒక బహిరంగ లేఖ కూడా రాశారు. సమైక్యాన్ని కోరుకుంటున్న టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, సీపీఎం రాష్ట్ర శాఖల అధ్యక్షులందరినీ ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఆ లేఖలో కోరారు. ప్రధానిని, వివిధ పార్టీల జాతీయ అధ్యక్షులను కలిసి విభజన ఆపాల్సిందిగా కోరాలని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్తో ఆయనకు సన్నిహితంగా ఉండే కొందరు సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. వారిలో మంత్రులు పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాస రావు తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది. వారు కొత్త పార్టీ పెట్టాలా? లేక వచ్చే ఎన్నికలలో స్వతంత్రులుగా పోటీ చేయాలా? అన్న విషయాలు చర్చించినట్లు సమాచారం. సిఎం రాజీనామా వ్యవహారం హాస్యాస్పదంగా మారింది. ఆయన ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు అని అనేకసార్లు వార్తలు వచ్చాయి. సీఎం కొందరు కేంద్ర మంత్రులను కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు సిఎం వెంట తిరిగినవారు ఇప్పుడు బొత్స వెంట తిరుగుతున్నారు. గతంలో సిఎంను కొత్త పార్టీ పెట్టమని ప్రోత్సహించినవారే ఇప్పుడు ఆయన వెంటలేరని తెలుస్తోంది.

సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ప్రస్తుతానికి సీఎం వర్గం, బొత్స వర్గంగా చీలిపోయి గ్రూపు రాజకీయాల్లో మునిగిపోయారు. అయితే ఇదంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం నాటకంలో భాగమేనని కొందరు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement