..స్వేచ్ఛగా పనిచేస్తున్నా! | KV Ramana chary speaks about his second life | Sakshi
Sakshi News home page

..స్వేచ్ఛగా పనిచేస్తున్నా!

Published Tue, Sep 23 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

..స్వేచ్ఛగా పనిచేస్తున్నా!

..స్వేచ్ఛగా పనిచేస్తున్నా!

ఆయన సుదీర్ఘకాలం సమాచార వారధి. అలుపెరగని ఆధ్యాత్మిక భావజాల సారధి. మూడు పదుల సివిల్ సర్వీస్‌లో తెలుగు భాషా వికాసం కోసం తపించారు. మలిదశలో ఇదే భావజాలంతో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సలహాదారుగా కొత్త ప్రభుత్వంలో క్షణం తీరికలేకుండా గడుపుతున్న కేవీ రమణాచారి తన సెకండ్‌లైఫ్ విశేషాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు.
 
 ఆశయాలు గొప్పవైనప్పుడు.. ఆచరణే మార్గమైనప్పుడు వయో పరిమితితో పనేముంది. లక్ష్య సాధనకు అవిశ్రాంత పోరాటం తథ్యమని భావిస్తాను. అందుకే రిటైరైనా తీరిక లేకుండా ఉన్నాను. ఉద్యోగంతో ఉన్న అనుబంధం వేరు.. ప్రస్తుత సామాజిక జీవనం వేరు. వృత్తిగతంలో అంతర్లీనంగా కొంత ఘర్షణ పడేవాణ్ని. ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తున్నా. విశ్రాంత ఉద్యోగి సమయం కుటుంబానిదే అని చాలా మంది అంటారు. ఆ వెలితి నా ఇంట్లో కనిపించడం లేదు. నా భార్య అర్థం చేసుకుంది.
 
 దేవుడ్ని పాలించే వాళ్లమా!
 సలహాదారుడు అనే పదం గొప్పది. సరైన దారిలో నడిపించే వాడని నా భావన. సలహాలు తీసుకునే వారే లేనప్పుడు సలహాలు ఎవరికివ్వాలి? ఏమివ్వాలి? రిటైరయ్యాక నాలో అంతర్మథనం. కారణాలనేకం ఉండొచ్చు. కానీ, ఒకటే బలీయమైనది. పాలకమండళ్ల చేతిలో పెట్టి ధార్మిక వ్యవస్థను పాలకవర్గాలు విచ్ఛిన్నం చేశాయి. దీన్ని మొదట్నుంచీ వ్యతిరేకించాను. భగవంతుడిని పాలించే సంస్కృతేమిటని నిలదీశాను. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విసిగి స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భాధ్యతలు చూడటం ఓ వరంగా భావిస్తాను. ఇప్పటికీ ఆ స్వామి కృప ఉందని భావిస్తాను. తెలంగాణలో పాలకమండళ్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం భరోసా ఇవ్వడం నాలో ఆశావాహ దృక్పథాన్ని పెంచింది.
 
 భాషా వికాసానికి కృషి..
 సాంస్కృతిక సలహాదారు బాధ్యతలు కీలకమైనవనే అనుకుంటున్నాను. నిర్వహణలో నవయవ్వన ఆలోచనలు ఉండాలనేది నా అభిప్రాయం. సర్వీసులో ఉన్నప్పుడు సింహభాగం సమాచార శాఖనే నిర్వహించడం వల్ల చాలామందితో అనుబంధం ఉంది. వాళ్ల అనుభవాలతో బంధం ఉంది. ఇప్పుడు వాళ్లంతా నాకు ప్రధాన సలహాదారులు. భాషా వికాసానికి వారి భావజాలంతో వారధి కడుతున్నారు. ఈ కర్తవ్య దీక్ష వెనుక ఓ బలమైన సంఘటన ఉంది. ప్రపంచ తెలుగు భాషా ఉత్సవాలు వేడుకగా మిగిలిపోవడం కలచివేస్తోంది. తీసుకున్న నిర్ణయాలేవీ అమలుకు నోచుకోకపోవడం కష్ట పెట్టింది. అందుకే తెలుగు భాష కోసం నిరంతం శ్రమించాలనే కోరిక ఉంది. దీని కోసం మరికొన్ని గంటలు పనిచేయాలనిపిస్తుంది.
 
 అనుభవాలే మార్గన్వేషణ లు..
 ఓ సివిల్ సర్వీస్ ఉద్యోగి ఏంటి...? ప్రాంతీయ పార్టీలో చేరడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. దానికి కచ్చితమైన సమాధానం లేకపోయినా.. విద్యార్థి దశలోనే ఉన్న ప్రేరణలే కారణాలుగా చెబుతాను. సిద్దిపేటలో 16 ఏళ్ల విద్యార్థిగానే తెలంగాణ కోసం పోరాడి అరెస్టయ్యాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. కాకపోతే డిగ్రీలో గోల్డ్ మెడల్ కొట్టడంతో రాజకీయం మార్గం కాదన్పించింది. సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నాను. తెలుగు భాషంటే ప్రాణం. తెలుగు వికాసం కోసం ఎవరు వేదిక ఏర్పాటు చేసినా వెళ్లేవాణ్ని. సంస్కృతి, సంప్రదాయాలపై అనర్గళ ఉపన్యాసం ఇచ్చేవాణ్ని. ఆ అనుభవాలే ఇప్పుడు మార్గాన్వేషణలు.
 
 ఏదేమైనా రాత్రికి ఇంటికే
 సాయంసంధ్య నాన్నగారు దీపారాధన చేస్తారు. ఆ తర్వాత అంతా కలిసి రాత్రిపూట భోజనం చేయడం అలావాటు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. 85 ఏళ్ల నాన్నకు నలుగురు సోదరులు. ఇప్పటికీ మాట జవదాటరు. అంతగా గౌరవించే నాన్నను నా పనులు ఇబ్బంది పెడతాయా? కొత్త జీవితం అడ్డంకిగా ఉంటుందా ? రాజకీయాల్లోకి చేరాక పక్కా ప్రణాళిక అనుసరిస్తున్నాను. రాత్రి 9 గంటలకు ఇంటికొస్తాను. అందరితో కలిసి భోజనం చేస్తాను.
 
 రిటైరైనా.. యంగే
 నాలుగేళ్ల కిందటే పదవీ విరమణ చేయాలనుకున్నా.. వీలు పడలేదు. ఇపుడు రిటైర్ అయ్యాక మాత్రం ఆ భావమే నాలో కన్పించడం లేదు. అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి టీఆర్‌ఎస్‌లో చేరడం, కేవలం రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. మరచిపోలేని కల. సంస్కృతి కాపాడలన్న మనోభీష్టం నెరవేరేందుకు ఇంకా అడ్డంకి ఏంటి? సలహాదారుగా సంతృప్తినిచ్చే జీవితం మలిదశలో వచ్చినప్పుడు ఇంతకన్నా ఆనందం ఏమిటి? అందుకే నౌవ్ అయామ్... యంగ్...  నా ఆలోచనలు, అభీష్టాలు, ఆశయాలు యంగ్..!
 - వనం దుర్గాప్రసాద్
 కేవీ రమణాచారి, ఐఏఎస్ అధికారి (రిటైర్డ్)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement