జీవితానికి కొత్తభాష్యం | Aravinda rao starts Second Life with Retirement | Sakshi
Sakshi News home page

జీవితానికి కొత్తభాష్యం

Published Fri, Jul 25 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

జీవితానికి కొత్తభాష్యం

జీవితానికి కొత్తభాష్యం

అరవిందరావు.. ఒకప్పుడు పోలీస్‌బాస్.. ఇప్పుడు సత్యాన్వేషి. లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రిక్టుగా అమలు చేసేవారో.. అద్వైతభావాన్ని అంత కచ్చితంగా ఆచరిస్తున్నారు. చట్టాలు, క్రిమినల్స్ చిట్టాలే కాదు.. సనాతన ధర్మంలోని లోతులు తెలిసిన వ్యక్తి. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో అసమాన పాండిత్యం ఆయన సొంతం. పదవీ విరమణ తర్వాత చాలామందికి లోకాభిరామాయణమే కాలక్షేపం. పదవిలో ఉండగా.. క్షణం తీరిక లేని ఈయన.. ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే బిజీగా ఉన్నారు.  సనాతన ధర్మాన్ని విజ్ఞానపథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు.  సెక్రెటేరియెట్ కాలనీలోని సొంతింట్లో ఆయన, భార్య  రమ మాత్రమే ఉంటారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. ఖాకీవనంలో ఫస్ట్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా ముగించుకొని.. ఆధ్యాత్మిక వాతావరణంలో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న ఆయనను సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
 
 నిజానికి ఇప్పుడే బిజీగా ఉన్నానేమో! కాకపోతే గతానికి భిన్నంగా ఉన్నా. టోపీ, లాఠీ లేకున్నా, నాలోని సంఘర్షణలు తెర మీదకొస్తున్నాయి. అందుకే, కలానికి పదును పెట్టాను. బోధననే సాధనంగా చేసుకున్నాను. గంటల తరబడి సంస్కృత పాఠాలు చెబుతున్నాను. వాటి వీడియోలను వెబ్‌లో పెడుతున్నా. గీతా భాష్యానికి, ఉపనిషత్ భాష్యానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. క్లాసుల తర్వాత పుస్తకాలు రాసే పనిలో ఉంటాను. ఇప్పటికే మూడు పుస్తకాలు రాశాను.
 
రచయితను అవుతాననుకోలేదు
 రిటైర్‌మెంట్ తర్వాత చేయాల్సిన పనుల గురించి డీఐజీగా ఉన్నప్పటి నుంచే ఆలోచించేవాణ్ణి. ఇలా రచయితను అవుతానని మాత్రం అనుకోలేదు. విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏ రాత్రి ఇంటికొచ్చినా కాసేపైనా భగవద్గీత చదివేవాణ్ణి. అప్పుడే ప్రశాంతంగా ఉండేది. చాలామందికి భగవద్గీత వృద్ధాప్యంలోనే చదువుతారనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఇలా జరిగిన ప్రచారమే నన్ను ఆలోచనల్లోకి తీసుకెళ్ళింది. హిందూ గ్రంథాల్లోని వాస్తవాలను సమాజంలోకి తీసుకెళ్ళాలనే తపనతో నిరంతర విద్యార్థినయ్యాను.
 
 రష్యా కోర్టు తీర్పు కలచివేసింది...
 భగవద్గీతను నిషేధించాలంటూ రష్యా కోర్టు ఇచ్చిన తీర్పు నన్ను కలచివేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలపై ఏదో కుట్ర జరుగుతోంది. హిందూ గ్రంథాలను వక్రీకరిస్తున్నారు. కాకపోతే మరేంటి? భగవద్గీత యుద్ధానికి ఉసిగొలిపేలా ఉందా? ఎంతన్యాయం! ‘బ్రేకప్ ఇండియా’ అనే పుస్తకం చదివాను. మన దేశంపై ఎలాంటి దాడులకు రంగం సిద్ధమైందో అందులో ఉంది. ఈ దేశంలో నక్సలిజమే ప్రమాదమని సర్వీసులో ఉన్నప్పుడు భావించాను. అంతకంటే ప్రమాదం హిందూయిజంపై జరుగుతున్న దాడి అని గమనించాను.
 
విదేశీ శక్తుల కుట్ర లేదా?
 అనేక ఇజాలు ఏకమై హిందువులను టార్గెట్ చేశాయి. వాళ్లను బలహీనపరిస్తే, దేశంపై దాడి చేయడం సులభమని భావిస్తున్నాయి. అందులో భాగంగానే భారత సంస్కృతిపై దాడి జరుగుతోంది. దీనివెనుక విదేశీ శక్తుల కుట్ర లేదా? హిందూ గ్రంథాల్లోని వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకే పుస్తకాలు రాస్తున్నాను. అయితే, ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత మేధావులదే. అలాగని ఆరెస్సెస్ భావజాలంతో ఏకీభవించను. మందిరం-మసీదు వంటి వివాదాలను సమర్థించను.
 
 స్వేచ్ఛగానే వెళ్తున్నాను
 నక్సల్స్ టార్గెట్‌లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. సెక్యూరిటీ పెంచాలన్నారు. కానీ ఇప్పటి వరకూ స్వేచ్ఛగానే వెళ్తున్నాను. అప్పుడప్పుడు పుల్లెల రామచంద్రుడు, దద్ధోజనానందను కలుస్తుంటాను. బెంగుళూరులో ఉన్న తమ్ముడి దగ్గరకు వెళ్తుంటా.
 
 గతం గురించి ఆలోచించడంలేదు
 రిటైరయ్యాక పోలీసు శాఖ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఎవరైనా, ఎప్పుడైనా, ఏవైనా సలహాలు కావాలంటే ఇస్తాను. నక్సలిజాన్ని నేనే అణచివేశాననే వాదనను అంగీకరించను. వాళ్ళలోనూ మార్పు వచ్చింది. దాంతో సాధించేదేమీ లేదని తెలుసుకున్నారు. అందుకే నక్సలిజం బలహీనపడింది. నా సర్వీసులో చేసిన వాటి గురించి ఇప్పుడు నేను ఎంతమాత్రం ఆలోచించను. నేను తప్పుచేయలేదనే భావిస్తాను.
 - అరవిందరావు, మాజీ డీజీపీ
 ..:: వనం దుర్గాప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement