Vanam Durga prasad
-
..స్వేచ్ఛగా పనిచేస్తున్నా!
ఆయన సుదీర్ఘకాలం సమాచార వారధి. అలుపెరగని ఆధ్యాత్మిక భావజాల సారధి. మూడు పదుల సివిల్ సర్వీస్‌లో తెలుగు భాషా వికాసం కోసం తపించారు. మలిదశలో ఇదే భావజాలంతో ముందడుగు వేస్తున్నారు. రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక సలహాదారుగా కొత్త ప్రభుత్వంలో క్షణం తీరికలేకుండా గడుపుతున్న కేవీ రమణాచారి తన సెకండ్‌లైఫ్ విశేషాలను ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. ఆశయాలు గొప్పవైనప్పుడు.. ఆచరణే మార్గమైనప్పుడు వయో పరిమితితో పనేముంది. లక్ష్య సాధనకు అవిశ్రాంత పోరాటం తథ్యమని భావిస్తాను. అందుకే రిటైరైనా తీరిక లేకుండా ఉన్నాను. ఉద్యోగంతో ఉన్న అనుబంధం వేరు.. ప్రస్తుత సామాజిక జీవనం వేరు. వృత్తిగతంలో అంతర్లీనంగా కొంత ఘర్షణ పడేవాణ్ని. ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేస్తున్నా. విశ్రాంత ఉద్యోగి సమయం కుటుంబానిదే అని చాలా మంది అంటారు. ఆ వెలితి నా ఇంట్లో కనిపించడం లేదు. నా భార్య అర్థం చేసుకుంది. దేవుడ్ని పాలించే వాళ్లమా! సలహాదారుడు అనే పదం గొప్పది. సరైన దారిలో నడిపించే వాడని నా భావన. సలహాలు తీసుకునే వారే లేనప్పుడు సలహాలు ఎవరికివ్వాలి? ఏమివ్వాలి? రిటైరయ్యాక నాలో అంతర్మథనం. కారణాలనేకం ఉండొచ్చు. కానీ, ఒకటే బలీయమైనది. పాలకమండళ్ల చేతిలో పెట్టి ధార్మిక వ్యవస్థను పాలకవర్గాలు విచ్ఛిన్నం చేశాయి. దీన్ని మొదట్నుంచీ వ్యతిరేకించాను. భగవంతుడిని పాలించే సంస్కృతేమిటని నిలదీశాను. ప్రభుత్వాలు పట్టించుకోలేదు. విసిగి స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేశాను. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం భాధ్యతలు చూడటం ఓ వరంగా భావిస్తాను. ఇప్పటికీ ఆ స్వామి కృప ఉందని భావిస్తాను. తెలంగాణలో పాలకమండళ్లు ఏర్పాటు చేయబోమని ప్రభుత్వం భరోసా ఇవ్వడం నాలో ఆశావాహ దృక్పథాన్ని పెంచింది. భాషా వికాసానికి కృషి.. సాంస్కృతిక సలహాదారు బాధ్యతలు కీలకమైనవనే అనుకుంటున్నాను. నిర్వహణలో నవయవ్వన ఆలోచనలు ఉండాలనేది నా అభిప్రాయం. సర్వీసులో ఉన్నప్పుడు సింహభాగం సమాచార శాఖనే నిర్వహించడం వల్ల చాలామందితో అనుబంధం ఉంది. వాళ్ల అనుభవాలతో బంధం ఉంది. ఇప్పుడు వాళ్లంతా నాకు ప్రధాన సలహాదారులు. భాషా వికాసానికి వారి భావజాలంతో వారధి కడుతున్నారు. ఈ కర్తవ్య దీక్ష వెనుక ఓ బలమైన సంఘటన ఉంది. ప్రపంచ తెలుగు భాషా ఉత్సవాలు వేడుకగా మిగిలిపోవడం కలచివేస్తోంది. తీసుకున్న నిర్ణయాలేవీ అమలుకు నోచుకోకపోవడం కష్ట పెట్టింది. అందుకే తెలుగు భాష కోసం నిరంతం శ్రమించాలనే కోరిక ఉంది. దీని కోసం మరికొన్ని గంటలు పనిచేయాలనిపిస్తుంది. అనుభవాలే మార్గన్వేషణ లు.. ఓ సివిల్ సర్వీస్ ఉద్యోగి ఏంటి...? ప్రాంతీయ పార్టీలో చేరడం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో వస్తున్నాయి. దానికి కచ్చితమైన సమాధానం లేకపోయినా.. విద్యార్థి దశలోనే ఉన్న ప్రేరణలే కారణాలుగా చెబుతాను. సిద్దిపేటలో 16 ఏళ్ల విద్యార్థిగానే తెలంగాణ కోసం పోరాడి అరెస్టయ్యాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలనే కోరిక ఉండేది. కాకపోతే డిగ్రీలో గోల్డ్ మెడల్ కొట్టడంతో రాజకీయం మార్గం కాదన్పించింది. సివిల్స్‌ను లక్ష్యంగా చేసుకున్నాను. తెలుగు భాషంటే ప్రాణం. తెలుగు వికాసం కోసం ఎవరు వేదిక ఏర్పాటు చేసినా వెళ్లేవాణ్ని. సంస్కృతి, సంప్రదాయాలపై అనర్గళ ఉపన్యాసం ఇచ్చేవాణ్ని. ఆ అనుభవాలే ఇప్పుడు మార్గాన్వేషణలు. ఏదేమైనా రాత్రికి ఇంటికే సాయంసంధ్య నాన్నగారు దీపారాధన చేస్తారు. ఆ తర్వాత అంతా కలిసి రాత్రిపూట భోజనం చేయడం అలావాటు. ఇది ఇప్పటికీ కొనసాగుతోంది. 85 ఏళ్ల నాన్నకు నలుగురు సోదరులు. ఇప్పటికీ మాట జవదాటరు. అంతగా గౌరవించే నాన్నను నా పనులు ఇబ్బంది పెడతాయా? కొత్త జీవితం అడ్డంకిగా ఉంటుందా ? రాజకీయాల్లోకి చేరాక పక్కా ప్రణాళిక అనుసరిస్తున్నాను. రాత్రి 9 గంటలకు ఇంటికొస్తాను. అందరితో కలిసి భోజనం చేస్తాను. రిటైరైనా.. యంగే నాలుగేళ్ల కిందటే పదవీ విరమణ చేయాలనుకున్నా.. వీలు పడలేదు. ఇపుడు రిటైర్ అయ్యాక మాత్రం ఆ భావమే నాలో కన్పించడం లేదు. అన్ని వైపుల నుంచి వచ్చిన ఒత్తిడికి టీఆర్ఎస్లో చేరడం, కేవలం రెండు నెలల్లోనే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం.. మరచిపోలేని కల. సంస్కృతి కాపాడలన్న మనోభీష్టం నెరవేరేందుకు ఇంకా అడ్డంకి ఏంటి? సలహాదారుగా సంతృప్తినిచ్చే జీవితం మలిదశలో వచ్చినప్పుడు ఇంతకన్నా ఆనందం ఏమిటి? అందుకే నౌవ్ అయామ్... యంగ్... నా ఆలోచనలు, అభీష్టాలు, ఆశయాలు యంగ్..! - వనం దుర్గాప్రసాద్ కేవీ రమణాచారి, ఐఏఎస్ అధికారి (రిటైర్డ్) -
పాదం మీద.. పుట్టుమచ్చనవుతా
ఆ మువ్వల సవ్వడిలో అక్కల ఆప్యాయత ఉంది. ఎలుగెత్తి వినిపించే ఆ గొంతుకలో తోబుట్టువుల అనురాగం దాగుంది. అందుకే ఆ గళం.. ఆడపడుచుల ఆర్తనాదమైంది. ఆ పాదాల మీద పుట్టుమచ్చై రుణం తీర్చుకుంటానంది. మల్లె తీగకు పందిరిలా మారిపోతానంది. మసక చీకటిలో వెన్నెల వెలుగులు నింపుతానంది. ఈ ఆర్ద్రత వెనుక అలవికాని అనురాగం ఉంది. సిరిమల్లె చెట్టు కింద చినబోయిన లచ్చువమ్మ గోస ఉంది. అజ్ఞాతంలో పల్లవించిన గళం కోసం అల్లాడిపోయిన అక్కల ఆవేదన ఉంది. తన జీవితమంతా అక్కలతో ముడిపడి ఉందంటున్న ప్రజాగాయకుడు గద్దర్ రాఖీ బంధాన్ని, అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. - వనం దుర్గాప్రసాద్ నాకు ముగ్గురు అక్కలు. నా చిన్నతనంలోనే వాళ్ల పెళ్లిళ్లు అయ్యాయి. అయినా వాళ్లకు నేనంటే ప్రాణం. పెద్దక్క పేరు సరస్వతీబాయి. రెండో అక్క శాంతాబాయి. మూడో అక్క బాలమణి. మొదటి ఇద్దరూ కాలం చేశారు. ఇప్పుడున్నది మూడో అక్కే. పెద్దక్కను ఔరంగాబాద్‌కు ఇచ్చాం. రెండో అక్క అల్వాల్‌లోనే ఉండేది. మూడో అక్క మేడ్చల్‌లో ఉంటుంది. నిజానికి రెండో అక్క దగ్గరే ఎక్కువ కాలం ఉండేవాణ్ని. ఆమెలో ఉద్యమ భావాలు బాగా నచ్చేవి. నక్సల్స్ ఉద్యమంపై తీవ్ర నిర్బంధం ఉన్న రోజుల్లోనూ ఉద్యమ నేతలకు ఆమె రాఖీ కట్టేది. కొండపల్లి సీతారామయ్య వంటి నాయకులకు శాంతాబాయి చాలాసార్లు రాఖీ కట్టింది. అందుకే ఆమె ప్రజా ఉద్యమానికే సోదరిగా భావిస్తాం. అజ్ఞాతంలో ఎక్కువ గడపడం వల్ల నేను వాళ్లకు చాలా కాలం దూరంగానే ఉన్నాను. పెద్దక్క మాత్రం ఏటా ఇంటికొచ్చేది. బావ వాళ్ల తమ్ముళ్లకు దుస్తులు కొంటే తను నాకు కూడా కొనేది. అక్కంటే ప్రాణం కావడం వల్లేమో, ఆమె తెచ్చేవన్నీ నాకు నచ్చేవి. ఆ రాఖీ అలాగే.. రాఖీ పండుగొస్తే ఎంతో మంది ఈ అన్నకు రాఖీలు కడతారు. కానీ రెండో అక్క శాంతాబాయి రాఖీ అంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ఊడిపోయే వరకూ విప్పే ప్రసక్తే లేదు. ఒక రోజు ముందే రాఖీ కొనేది. ‘రేపు రాఖీ... ఎక్కడికీ వెళ్లకూ...’ అని ముందే హెచ్చరించేది. పొద్దున్నే స్నానం చేసేవరకే అక్క సిద్ధంగా ఉండేది. రాఖీ కట్టి ఆత్మీయంగా కౌగిలించుకునేది. ఆ అక్కకు నేనేమిచ్చి రుణం తీర్చుకుంటాన? అక్క కట్టిన ఆ రాఖీ చేతికున్నంత సేపు రాలిపోయే స్వర్ణక్కలు.. వాడిపోయే లచ్చుమమ్మలు గుర్తుకొస్తారు. ఆ రాఖీలో అంత శక్తి ఉందనిపిస్తుంది. మాదంతా రివర్స్ ‘రాఖీ కట్టావ్.. అన్న నీకు ఏం ఇచ్చాడు?’ సాధారణంగా విన్పించే ప్రశ్న ఇది. కానీ మా ఇంట్లో భిన్నంగా ఉంటుంది. రాఖీ కట్టిన అక్క ఆ రోజు ఆమె దగ్గర ఎంత ఉంటే అంత ఇవ్వాల్సిందే. సోదర భావాన్ని సామాజిక, మానవీయ కోణంలో చూడాలని కోరుకుంటాను. నిజానికి ఆ సోదర ప్రేమను ఏ రూకలతో కొలుస్తాం? ఆ సెంటిమెంట్‌ను బలమైన బంధంగా మార్చే సన్నివేశానికి ఎలా వెలకడతాం? నేను మాత్రం పాట, మాట, ఆటతోనే ఆ అక్కలకు జోహార్లర్పిస్తాను. ఎర్రపూల దారిలోనే పాదాభివందనం చేస్తాను. అజ్ఞాతంలో మరుపురాని జ్ఞాపకం నేను అజ్ఞాతంలో ఉన్నాను. ఒకసారి పెద్దక్కను ఔరంగాబాద్‌లో రహస్యంగా కలుసుకోవాలనుకున్నా. పోలీసుల నిఘా తీవ్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతుందనుకున్నా. చెప్పినట్టే ఓ రహస్య ప్రదేశానికి వచ్చింది. అప్పుడూ ఆమె ఒట్టి చేతులతో రాలేదు. నాకు ఇష్టమని గోధుమ రొట్టెలు, టీ తీసుకుని వచ్చింది. టీలో ఆ రొట్టెలు ముంచుకుని తినడం.. అప్పుడు అక్క ఆప్యాయంగా చూడటం.. ఆ తర్వాత నన్ను కౌగిలించుకుని భోరున ఏడ్వటం ఇప్పటికీ మరచిపోలేను. అప్పుడు రాఖీ జీవితంలో మరపురానిది. దేవుడికి ముడుపులు కట్టారు పోలీసులు అణువణువూ గాలిస్తున్న రోజులవి. అప్పుడప్పుడు కంటపడితే ‘ఏంటిరా ఇది.. నీ బిడ్డల ముఖమైనా చూడవా?’ అని ప్రశ్నించేవాళ్లు. నేను మారాలనే అక్కలే.. బయటవాళ్ల ముందు మాత్రం ‘మా తమ్ముడు ఏం తప్పు చేశాడు?’ అని ప్రశ్నించేవాళ్లు. అజ్ఞాతంలో ఉన్న నేను క్షేమంగా ఉండాలని దేవుళ్లకు ముగ్గురక్కలూ ముడుపులు కట్టేవాళ్లు. ఒకసారి ఔరంగాబాద్‌లో పెద్దక్క రైల్వే స్టేషన్లో నన్ను చూసి, ముద్దుపెట్టుకుని, కన్నీళ్లు పెట్టింది. పాటకు ప్రాణం అనుభవాలే ఒకసారి ప్రశాంతంగా గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు, కళ్లు చెమర్చిన రాఖీ అనుబంధాలు.. ‘మల్లెతీగకు పందిరి వోలె..’ అనే పాటగా మారాయి. ఆ సమయంలోనే నారాయణమూర్తి తన సినిమా కోసం కదిలించే పాట కావాలన్నారు. ఓ పాఠశాలలో నేను రాసిన పాట విన్నారు. వందేమాతం శ్రీనివాస్ ట్యూన్ కట్టారు. ఆ పాట నారాయణమూర్తిని కదిలించింది. సినిమా విడుదలయ్యాక దాసరి నారాయణరావు భార్య పద్మ ఒక రోజంతా కన్నీరు పెట్టారు. ఊరూవాడా అంతగా కదిలించిన ఆ పాటకు అక్కల మమకారమే ప్రేరణని సగర్వంగా చెబుతాను. అందుకే వాళ్లు కట్టే రాఖీకి వెలకట్టలేమని భావిస్తాను. నా తమ్ముడికి ఎందరో అక్కాచెల్లెళ్లు: బాలమణి గద్దర్ ప్రపంచానికి పాటై పల్లవించినా.. మాకు మాత్రం పిల్లాడే. నాన్న చెప్పిన అంబేద్కర్ భావాల ప్రభావమో.. గద్దర్‌తో ఉన్న మమకారమో.. ఆ ఆత్మీయత అలా బలపడింది. ఏ చిన్న కష్టమొచ్చినా ఆదుకుంటాడు. కన్నీళ్లు పెడితే ఊరడిస్తాడు. ఇంతకన్నా ఏ అక్కకైనా కావాల్సిందేంటి? ఏటా రాఖీ పండుగకు రావడం అలవాటు. నేనొచ్చేసరికే సిద్ధమవుతాడు. తమ్ముడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాఖీ కట్టలేదన్న వేదన కలచివేసేది. కానీ గద్దర్‌కు ఎక్కడున్నా అక్కాచెల్లెళ్లు ఉంటారు. నాలాంటి వాళ్లు ఎక్కడో ఒక చోట రాఖీ కట్టే ఉంటారని మనసును ఓదార్చుకునేదాన్ని. ఇప్పుడా ఇబ్బంది లేదు. ఈ జన్మలోనే కాదు.. ఇంకెన్ని జన్మలకైనా నా తమ్ముడు నా చేత, నాలాంటి వాళ్ల చేత రాఖీ కట్టించుకోవాలని కోరుకుంటున్నా. - ఫొటోలు: సృజన్పున్నా -
ఫేస్బుక్ యువత.. కేర్‌ఫుల్
ఫేస్బుక్... యువ భావజాల సమ్మిళితానికి ఇదో వేదిక. ఆపదలో ఆత్మీయత పంచినా... అభిప్రాయాల వెల్లువలో అవధులు దాటినా అదో సామాజిక విప్లవమే. కాకపోతే మంచి పక్కనే నయవంచన ఉంటోంది. ఈ చెడు దారులే కట్టడికి కారణాలవుతున్నాయనేది హబ్సిగూడ విజ్ఞాన్ కాలేజీ విద్యార్థుల మనోభావం. ఫేస్‌బుక్‌పై సరదాగా సాగిన ఆ యువత మనోభావాలే ఈ వారం ‘క్యాంపస్ కబుర్లు’... పుష్ప: ఏయ్ ప్రవల్లిక... ఇందాకేంటి మీ సెక్షన్లో లెక్చరర్‌గారు ఏంటో క్లాస్ తీసుకుంటున్నారు? ప్రవల్లిక: ఎఫ్బీ తల్లీ! ఎవరిదో ఫొటో ఎవడో మార్ఫింగ్ చేశాడట. దాంతో సోమెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయట. అమ్మాయిలంతా అలర్ట్‌గా ఉండమని చెబుతున్నారు. అఖిల: ఈ మగాళ్లంతా ఇంతే. ఫ్రెండ్షిప్గా చాట్ చేస్తే అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఫేక్ ఐడీలు క్రియేట్ చెయ్యడం.. ఏడిపించడం మామూలైంది. వెంకటేష్: ఆగాగు... మగాళ్లంతా విలన్సేనా ఏంటి? మీ జాగ్రత్తలో మీరు ఉంటున్నారా? ప్రవల్లిక: కాకపోతే ఏంటి? పిక్చర్స్‌ను మార్ఫింగ్ చేయడం లేదా? అబ్బా రోజూ చీటింగ్ వార్తలు ఎన్ని వస్తున్నాయి. వెంకటేష్: ఛా... గర్ల్స్ చేయడం లేదా ఏంటి? ప్రవల్లిక: గర్ల్స్కేం అవసరం? ఎవరో ఒకళ్లు అలా చేస్తే..? వెంకటేష్: ఇక్కడా అంతే.. ఎవడో ఒకడు మిస్యూజ్ చేస్తే టోటల్‌గా మగాళ్లదే తప్పంటే ఎలా? అలాంటప్పుడు ఎఫ్‌బీలోకి రాకండి. పిక్చర్స్ పెట్టకండి. అఖిల: ఏదేమైనా... ఇలాంటి పనుల వల్ల పేరెంట్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. ఎందుకమ్మా ఫేస్బుక్కే అతుక్కుంటావ్ అంటారు. మధు: కరెక్ట్... ఫేస్బుక్ ప్రయోజనాలపై అవగాహన అవసరం. దానివల్ల ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్కడో నా ఎల్కేజీ ఫ్రెండ్ ఈ మధ్య ఎఫ్బీ వల్లే కలిశాడు. సిమ్రాన్: మా పక్కన ఓ ఆంటీ... ఇంట్లో చేసే వంటకాలు ఎఫ్బీలోనే ప్రమోట్ చేసుకుంది. ఇప్పుడు ఫుల్ బిజీ. బిజినెస్ యాంగిల్లో మోర్ యూజ్‌ఫుల్. ప్రవల్లిక: ఎస్... ఎస్... అమెరికాలో ఉన్న రిలెటివ్స్ను రోజూ విష్ చేస్తున్నాం. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాం. మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు. హబీబ్ సిమ్రాన్: కొన్ని సమస్యలున్న మాట నిజమే కానీ... ఉపయోగాలూ ఎక్కువే. కాకపోతే ప్రాబ్లమ్స్ వల్ల పేరెంట్స్ కొంత అబ్జెక్ట్ చేస్తున్నారు. మధు: ఆ ప్రాబ్లమ్స్ ధైర్యంగా బయటకు ఎందుకు చెప్పరు? ప్రతిదానికి నిందలేసి ఊరుకోవడం కాదు. వెంకటేష్: అందుకే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నా. అన్నోన్ ఐడీని ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అఖిల: అలా నెగెటివ్‌గా ఆలోచించి వెళ్లాలంటే ఎలా వీలవుతుంది! నువ్వు అన్నది నిజమే కావచ్చు. రిక్వెస్ట్ పంపే వ్యక్తి మంచోడని అనుకుంటాం. మధు: పరిమితులు దాటినప్పుడే సమస్యలొస్తున్నాయి. పేపర్లలో వచ్చే వార్తలు క్లియర్‌గా చదవండి. ఎక్కడో అమ్మాయిలూ రాంగ్రూట్లో వెళ్తున్నారు. బహుశా అవగాహన లోపం కావచ్చు. సృజన: ఈ మధ్య ఓ వార్త చదివా. ప్రమాద సమయాల్లో రక్తం కావాల్సి వస్తే మెయిన్‌గా సోషల్ మీడియాపైనే డిపెండ్ అవుతున్నారట. వుంచి రెస్పాన్స్ కూడా వస్తోందట. పుష్ప: ఫేస్బుక్లో మెజారిటీ యూత్ ఉంటున్నారు. వాళ్లతో పాటు డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌తోనూ లింక్ అవ్వాలి. దీనివల్ల మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. వెంకటేష్: యుూ ఆర్ రైట్. మిస్యూజ్ చేసేవాళ్లపై నిఘా కూడా అవసరం. అఖిల: అవును. తల్లిదండ్రులకు దీనిపై అవగాహన కల్పించాలి. కాలేజీ యాజమాన్యాలు కూడా ‘మీ అమ్మాయిని ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంచండి’ అని చెబుతున్నారే తప్ప... ఎందుకో వివరించడం లేదు. ప్రవల్లిక: ఎనీ హౌ... లెక్చరర్స్ ఏం చెప్పినా... అమ్మానాన్నా ఎంత కట్టడి చేసినా... ఫేస్బుక్ యూజ్‌ఫుల్. కాకపోతే కొన్ని ఇబ్బందుల నుంచి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే. - వనం దుర్గాప్రసాద్ -
గులాబి.. బతుకునిచ్చిన భాగ్యనగరం
సంగీతం నేర్చిన కోయిల గొంతెత్తితే ఎలా ఉంటుంది.. అంతే అందంగా ఉంటుంది సునీత పాట. ఏ వేళలో విన్నా.. ఆమె గానం అమృతం కురిపిస్తుంది. ఆమెను.. ఆశల వారధిగా ఆహ్వానించిన హైదరాబాద్, ఆశయాల సాధన దిశగా ముందుకు నడిపింది. సప్తస్వరాలకు వేదికగా నిలిచి కీర్తిని ఎల్లలు దాటించింది. అందుకే హైదరాబాద్ అంటే ఆమెకు ఎంతో అభిమానం. ఎప్పుడు చూసినా ఈ నగరం తనకు అప్పుడే అరవిరిసిన గులాబీలా కనిపిస్తుందంటున్నారు సునీత. నగరంతో తన అనుబంధాన్ని ‘సిటీప్లస్’తో పంచుకున్నారు. సిటీ నాకు గుర్తింపునిచ్చింది. సింగర్‌గా ఎదిగేలా చేసింది. యాంకర్‌గా నిలబడే వీలు కల్పించింది. డబ్బింగ్ ఆర్టిస్టుగా స్థిరపడేలా చేసింది. అందుకే హైదరాబాద్ నాకు ఇష్టం. కాకపోతే గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే కుటుంబ సహకారం తప్పకుండా ఉండాలి. ఫ్రెండ్స్ అంతా సాఫ్ట్వేర్ ఫీల్డ్‌లోనే ఉన్నారు. కష్టాల్లోనూ సుఖాల్లోనూ భాగస్వాములవ్వడం చాలా అనందంగా అన్పిస్తుంది. నిండుగా చీర.. సిగలో పూలు.. పాదాలకు పసుపు.. చేతికి తోరణం.. శ్రావణ గౌరికి పూజ చేస్తున్న ప్రతిసారీ అమ్మ నన్ను ఎంత మురిపెంగా చూస్తుందో..! ‘ఉరుకుల పరుగుల జీవితంలో ఇంత సంప్రదాయంగా నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలే’ అనే ఆ మాటలు మనసును హత్తుకుంటాయి. ఫాస్ట్ కల్చర్‌లో మా ఊరు గుర్తొస్తుంది. నగరంతో బంధమూ పెరుగుతుంది. సంగీత భారతి ‘ఒక్కసారైనా రవీంద్రభారతిలో ప్రోగ్రాం ఇవ్వాలి’ సిటీకి రాకముందు అది నా లక్ష్యం. అమ్మ సంగీతం టీచర్. నాన్న బిజినెస్మెన్. నా మీద అమ్మ ప్రభావం ఎక్కువ. నాక్కూడా సంగీతం అంటే ప్రాణం. దానికి తగ్గట్టే మంచి స్వరం ఉందని అమ్మ బాగా ప్రోత్సహించేది. ఆకాశవాణి కార్యక్రమాలు, పాటల పోటీల్లో వెళ్లేందుకు అమ్మ సాయం చేసేది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌తో.. అనుకున్నట్టే రవీంద్రభారతిలో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి, నా కల నెరవేర్చుకున్నాను. అతిథిగా వచ్చాను.. నాకు పాటంటే ప్రాణం. ఆ పాటే నాకు సిటీకి ముడివేసింది. ఇంటర్ వరకూ గుంటూరులోనే చదువుకున్నాను. చుట్టం చూపుగా తార్నాకలోని మావయ్య ఇంటికి వచ్చాను. అనుకోకుండా ఓ చానల్లో పాట పాడే అవకాశం వచ్చింది. తర్వాత ఒకదాని వెంట మరొకటి. కొన్ని రోజుల్లోనే చిక్కడపల్లిలో అద్దెంటికి మారాను. సింగర్‌గా స్థిరపడే ధైర్యం రావడంతో అమ్మా, నాన్న కూడా ఇక్కడే షిఫ్ట్ అయ్యారు. చాలా కాలం చిక్కడపల్లిలోనే ఉన్నాం. తర్వాత యూసుఫ్‌గూడకు, అక్కడి నుంచి మాదాపూర్‌కు మారాం. ఇప్పుడు ల్యాంకో హిల్స్‌లో ఉంటున్నాం. చిక్కడపల్లి చౌరస్తా భలే.. చిక్కడపల్లి చౌరస్తా అంటే భలే ఇష్టం. రోజూ సాయంత్రం చౌరస్తాకు వెళ్లి కూరగాయలు తెచ్చేదాన్ని. అక్కడ విరజాజులు, మల్లెలు రాశులుగా పోసి అమ్మేవాళ్లు. అవి చూస్తుంటే మనసు పులకించేది. అక్కడందరూ మధ్యతరగతి వాళ్లే. మనసు విప్పి మాట్లాడేవాళ్లే..! ఆ పక్కనే ఉన్న త్యాగరాయ గానసభలో జరిగే ప్రోగ్రామ్స్‌కు తరచూ వెళ్లేదాన్ని. ఆ టైంలో సిటీ చూడాలి మొదటిసారి గులాబీ సినిమాకు పాట పాడే చాన్స్ వచ్చింది. రామానాయుడు స్టూడియోలో రికార్డింగ్. ఆటో అతను ఆ కొండల మీదకు ఎవరొస్తారు అంటూ చాలా దూరంలో దించేశాడు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లాను. ఆ సంఘటన ఇప్పటికీ మరచిపోలేను. ‘ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో..’ నా మొదటి పాట. ఇది పాడిన తర్వాత సిటీ మీద ఆసక్తి మరీ పెరిగింది. అర్ధరాత్రి ఒక్కసారి చార్మినార్ ఎక్కి సిటీ ఎలా ఉంటుందో చూడాలనుకుని వెళ్లాను. కానీ పోలీసులు ఆ చాన్స్ ఇవ్వలేదు. నిశిరాత్రిలో సిటీ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో.. ఒక్కసారైనా చూడాలి. ముగ్గు తొక్కితే అంతే మాదాపూర్ అంటే బాగా ఇష్టం. సంక్రాంతి పండుగొస్తే రోడ్డుపై మొత్తం ముగ్గులు పరిచే సి పట్నానికి పల్లెను పార్శిల్ చేసేవాళ్లం. అందులో నేనే ఫస్ట్. అపార్ట్మెంట్లోకి ఏ కారును అనుమతించే వాళ్లం కాదు. ముందే వార్నింగ్ ఇచ్చేవాళ్లం. కొందరి కారు తాళాలు లాక్కునే వాళ్లం. అందమైన ముగ్గులు, మా సందడి చూసి సర్దుకుపోయేవారు. ఆ భావం తప్పు సునీత రిజర్వుడ్‌గా ఉంటుంది. కాస్త గర్వం ఎక్కువ? అప్పుడప్పుడు విన్పించే కామెంట్స్ ఇవి. ఇందులో నిజం లేదు. సంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగాను. అందుకే సోషల్‌గా మూవ్ అవ్వడం అంటే ఏంటో పూర్తిగా తెలిసుండకపోవచ్చు. అవకాశాల కోసం పరిధులు దాటడం తెలియకపోవచ్చు. జీవితంలో ఎత్తుపల్లాలు సహజం. ఏదైనా ప్రాప్తం ఉంటేనే దక్కుతుందని నమ్ముతాను. కాకపోతే మనసు విప్పి మాట్లాడే వాళ్లతో నేనెప్పుడు నిష్కల్మషంగానే మాట్లాడతాను. ఇదే నాకు సిటీ నేర్పిన సోషలిజం. - వనం దుర్గాప్రసాద్ -
జీవితానికి కొత్తభాష్యం
అరవిందరావు.. ఒకప్పుడు పోలీస్‌బాస్.. ఇప్పుడు సత్యాన్వేషి. లా అండ్ ఆర్డర్ ఎంత స్ట్రిక్టుగా అమలు చేసేవారో.. అద్వైతభావాన్ని అంత కచ్చితంగా ఆచరిస్తున్నారు. చట్టాలు, క్రిమినల్స్ చిట్టాలే కాదు.. సనాతన ధర్మంలోని లోతులు తెలిసిన వ్యక్తి. తెలుగు, ఆంగ్ల, సంస్కృత భాషల్లో అసమాన పాండిత్యం ఆయన సొంతం. పదవీ విరమణ తర్వాత చాలామందికి లోకాభిరామాయణమే కాలక్షేపం. పదవిలో ఉండగా.. క్షణం తీరిక లేని ఈయన.. ఉద్యోగ విరమణ తర్వాత కూడా అంతే బిజీగా ఉన్నారు. సనాతన ధర్మాన్ని విజ్ఞానపథంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సెక్రెటేరియెట్ కాలనీలోని సొంతింట్లో ఆయన, భార్య రమ మాత్రమే ఉంటారు. పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారు. ఖాకీవనంలో ఫస్ట్ ఇన్నింగ్స్ దిగ్విజయంగా ముగించుకొని.. ఆధ్యాత్మిక వాతావరణంలో రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తున్న ఆయనను సిటీప్లస్ పలకరించింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. నిజానికి ఇప్పుడే బిజీగా ఉన్నానేమో! కాకపోతే గతానికి భిన్నంగా ఉన్నా. టోపీ, లాఠీ లేకున్నా, నాలోని సంఘర్షణలు తెర మీదకొస్తున్నాయి. అందుకే, కలానికి పదును పెట్టాను. బోధననే సాధనంగా చేసుకున్నాను. గంటల తరబడి సంస్కృత పాఠాలు చెబుతున్నాను. వాటి వీడియోలను వెబ్‌లో పెడుతున్నా. గీతా భాష్యానికి, ఉపనిషత్ భాష్యానికి యూట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. దీనికోసం ఎన్నో పుస్తకాలు చదువుతున్నాను. ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. క్లాసుల తర్వాత పుస్తకాలు రాసే పనిలో ఉంటాను. ఇప్పటికే మూడు పుస్తకాలు రాశాను. రచయితను అవుతాననుకోలేదు రిటైర్మెంట్ తర్వాత చేయాల్సిన పనుల గురించి డీఐజీగా ఉన్నప్పటి నుంచే ఆలోచించేవాణ్ణి. ఇలా రచయితను అవుతానని మాత్రం అనుకోలేదు. విధుల్లో బిజీగా ఉన్నప్పటికీ ఏ రాత్రి ఇంటికొచ్చినా కాసేపైనా భగవద్గీత చదివేవాణ్ణి. అప్పుడే ప్రశాంతంగా ఉండేది. చాలామందికి భగవద్గీత వృద్ధాప్యంలోనే చదువుతారనే అపోహ ఉంది. అది నిజం కాదు. ఇలా జరిగిన ప్రచారమే నన్ను ఆలోచనల్లోకి తీసుకెళ్ళింది. హిందూ గ్రంథాల్లోని వాస్తవాలను సమాజంలోకి తీసుకెళ్ళాలనే తపనతో నిరంతర విద్యార్థినయ్యాను. రష్యా కోర్టు తీర్పు కలచివేసింది... భగవద్గీతను నిషేధించాలంటూ రష్యా కోర్టు ఇచ్చిన తీర్పు నన్ను కలచివేసింది. మన సంస్కృతీ సంప్రదాయాలపై ఏదో కుట్ర జరుగుతోంది. హిందూ గ్రంథాలను వక్రీకరిస్తున్నారు. కాకపోతే మరేంటి? భగవద్గీత యుద్ధానికి ఉసిగొలిపేలా ఉందా? ఎంతన్యాయం! ‘బ్రేకప్ ఇండియా’ అనే పుస్తకం చదివాను. మన దేశంపై ఎలాంటి దాడులకు రంగం సిద్ధమైందో అందులో ఉంది. ఈ దేశంలో నక్సలిజమే ప్రమాదమని సర్వీసులో ఉన్నప్పుడు భావించాను. అంతకంటే ప్రమాదం హిందూయిజంపై జరుగుతున్న దాడి అని గమనించాను. విదేశీ శక్తుల కుట్ర లేదా? అనేక ఇజాలు ఏకమై హిందువులను టార్గెట్ చేశాయి. వాళ్లను బలహీనపరిస్తే, దేశంపై దాడి చేయడం సులభమని భావిస్తున్నాయి. అందులో భాగంగానే భారత సంస్కృతిపై దాడి జరుగుతోంది. దీనివెనుక విదేశీ శక్తుల కుట్ర లేదా? హిందూ గ్రంథాల్లోని వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అందుకే పుస్తకాలు రాస్తున్నాను. అయితే, ప్రజలను జాగృతం చేయాల్సిన బాధ్యత మేధావులదే. అలాగని ఆరెస్సెస్ భావజాలంతో ఏకీభవించను. మందిరం-మసీదు వంటి వివాదాలను సమర్థించను. స్వేచ్ఛగానే వెళ్తున్నాను నక్సల్స్ టార్గెట్‌లో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి. సెక్యూరిటీ పెంచాలన్నారు. కానీ ఇప్పటి వరకూ స్వేచ్ఛగానే వెళ్తున్నాను. అప్పుడప్పుడు పుల్లెల రామచంద్రుడు, దద్ధోజనానందను కలుస్తుంటాను. బెంగుళూరులో ఉన్న తమ్ముడి దగ్గరకు వెళ్తుంటా. గతం గురించి ఆలోచించడంలేదు రిటైరయ్యాక పోలీసు శాఖ గురించి పెద్దగా ఆలోచించడం లేదు. ఎవరైనా, ఎప్పుడైనా, ఏవైనా సలహాలు కావాలంటే ఇస్తాను. నక్సలిజాన్ని నేనే అణచివేశాననే వాదనను అంగీకరించను. వాళ్ళలోనూ మార్పు వచ్చింది. దాంతో సాధించేదేమీ లేదని తెలుసుకున్నారు. అందుకే నక్సలిజం బలహీనపడింది. నా సర్వీసులో చేసిన వాటి గురించి ఇప్పుడు నేను ఎంతమాత్రం ఆలోచించను. నేను తప్పుచేయలేదనే భావిస్తాను. - అరవిందరావు, మాజీ డీజీపీ ..:: వనం దుర్గాప్రసాద్ -
వెల్కమ్ టూ 4జీ
కొత్త టెక్నాలజీ సిటీకి సరికొత్త హంగులు దిద్దుతుందనేదే యువత మనోగతం. అయితే నిర్వహణపరమైన అంశాలపైనే వారిలో సందేహాలున్నాయి. 4జీని తేవాలనే యోచనలో 2జీ, 3జీల పనితీరును, దానిపై ఉన్న అవగాహనను అంచనా వేయాలని, లోపాలను సరిచేసుకోవాలని సూచిస్తున్నారు. అత్తాపూర్ ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్‌లో ఎంబీఏ విద్యార్థుల మధ్య సాగిన డిస్కషన్... అర్చన: దేవుడా... దేవుడా... డిస్కనెక్ట్ అవ్వొద్దు.. అవ్వొద్దు... శరణ్య: ఏయ్! అర్చనా.. ఎన్నిసార్లు పిలవాలి! కాఫీ కొస్తావా? ఇక్కడ అంతా వెయిటింగ్. అర్చన: థ్యాంక్ గాడ్... ఇప్పుడు చెప్పు. శరణ్య: ఏం చేస్తున్నా....వ్? అర్చన: త్రీజీ తల్లీ.. త్రీజీ.. నా ఖర్మకొద్దీ హాఫెనవర్ నుంచి కనెక్ట్ అవడం... డిస్ కనెక్ట్ అవడం. మా అంకుల్కేమో మెయిల్ అర్జంట్. శ్రావ్య: రాత్రి నాకూ సేమ్ ప్రాబ్లమ్. అయినా ఇంకెంత కాలంలే. 4 జీ వస్తోంది కదా! అశ్వని: వస్తోంది.. వస్తోంది. 2జీ, 3జీకే దిక్కులేదు. కీర్తన: ఎందుకలా నెగెటివ్ మాట్లాడతావ్. సిటీ ఇక హైఫై అవుతుంది. చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అర్చన: అఫ్కోర్స్.. 4జీ తేవడం మాటలు కాదు. వర్క్‌లో సిన్సియారిటీ ఉండాలి. డొమొయిన్స్ మార్చాలి. వాటికి పర్మిషన్స్ కావాలి. సాఫ్ట్వేర్ అప్‌గ్రేడ్ అవ్వాలి. నిఖిల: ఎస్..ఎస్.. కనెక్టివిటీలో ఉండే సమస్యలు కూడా ఆలోచించాలి. వాటిపై పబ్లిక్ సర్వే చేస్తే బాగుంటుంది. దీనివల్ల గుడ్ సజెషన్స్ వస్తాయి. ప్రదీప్: అవన్నీ ఆలోచించే ప్రభుత్వం ముందుకెళ్తోంది. కొత్త టెక్నాలజీని వెల్కం చేయాల్సింది యూతేనవ్మూ! వంశీ: ఆహాహా... ఏం సెలవిచ్చారు సార్! స్పీచ్ అదుర్స్. కాకపోతే అంత స్పీడ్‌లో మన వాళ్లు వెళ్తారా? ఇప్పటికీ ప్రభుత్వాఫీసుల్లో క్రీస్తు పూర్వం సర్వర్లు. జీవిత కాలం నెట్ ముందున్నా పబ్లిక్ సైట్స్‌కు కనెక్ట్ అవ్వలేం. చతుర్వేది: కరెక్ట్. లోకం మొత్తం విండోస్ 8 వరకూ వెళ్తే.. మన గవర్నమెంట్ ఆఫీసులు ఇంకా ఎక్స్పీ నుంచి బయటపడలేదు. ఇదేనా స్పీడ్. మనోజ్: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడటానికి వైఫై... హై ఫై అంటున్నారు. ప్రాపర్ విజన్ మాత్రం ఉన్నట్టు లేదు. ఎంతమంది 4జీ యూజ్ చేస్తారు. అసలు 2జీ గురించి పూర్తిగా తెలియకుండానే 3 జీ వచ్చింది. 3జీ ఫోన్స్‌ను కనీసం ఆపరేట్ చేయలేని వాళ్లు మన ఇళ్లల్లోనే లేరా? శ్రీలక్ష్మి: అంటే ఏంటి నీ ఉద్దేశం. అమ్మలు, నాన్నలకు కూడా 4జీ వాడకం తెలిశాకే దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలా? శ్రావ్య: ఎందుకే అంతదూరం ఆలోచిస్తున్నారు. 4జీ రావాలంటే కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఇన్స్టలేషనే కనీసం వన్ ఇయర్ పడుతుంది. ప్రభుత్వ కార్యాలయాలు, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ లింక్ అవ్వడానికి.. చాలా టైం కావాలి. అప్పటిలోగా మనోళ్లు అన్నీ నేర్చేసుకోరంటావా? అర్చన: త్రీజీ వచ్చినా మన ట్రాఫిక్ వాళ్లు ఏం చేస్తారు? చౌరస్తాలో నిలబడి కెమెరాతో ఫొటోలు తీస్తారు. వాటిని ఆన్లైన్లో కనెక్ట్ చేయడం మరో ప్రాసెస్. సిటీ మొత్తం సీసీ కెమెరాలున్నాయి కదా... వాటినే నేరుగా ఆన్‌లైన్‌కు కనెక్ట్ చేయొచ్చు కదా... అంటే త్రీజీనే మనం సరిగా యూజ్ చేసుకోవడం లేదని తెలిసిపోతోంది కాదా? నిఖిల: ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ గవర్నమెంట్‌కు సాధ్యం కాదు. కాబట్టి ప్రైవేటు భాగస్వామ్యం అవసరమవుతోంది. కీర్తన: దాంతో బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. ప్రదీప్: బిల్లు నిర్ణయించేది ట్రాయ్ అమ్మా! లివింగ్ స్టాండర్డ్స్‌ను బట్టి చార్జింగ్ ఉంటుంది. శ్రావ్య: అదే, హైదరాబాద్‌లో లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయని నిక్కచ్చిగా ఎలా చెబుతారు. ఏవేవో లెక్కలేస్తే ఎలా? దాన్నే బేస్ చేసుకుని బిల్లు వేస్తే ఎలా? ప్రదీప్: ఇలా అంటే ప్రోగ్రెస్ ఎలా? ఆధునిక పరిజ్ఞానం ఉంటేనే కదా... మన హైదరాబాద్‌కు ఇండస్ట్రీస్ వచ్చేది? అలా వస్తేనే కదా ఎంప్లాయ్మెంట్ సమస్య తీరేది? ఆ కోణంలో ఎందుకు ఆలోచించడం లేదు? తేజస్వీ: ఏదేమైనా 4జీని వెల్కమ్ చేయాల్సిందే. కానీ, దాని ఉపయోగం ఏమిటి? ఎలా ఉపయోగంలోకి తేవాలనే విషయంలో అన్ని వర్గాలతోనూ ప్రభుత్వం చర్చలు జరపాలి. ముఖ్యంగా ఇందులో యూత్‌ను భాగస్వామ్యం చేయాలి. కట్టడి అవసరమే మహానగరాన్ని వైఫై సిటీగా మార్చాలనే ఆలోచన మంచిదే. కాకపోతే కొన్ని సైట్స్‌పై కట్టడి అవసరం. ప్రభుత్వం దీన్ని చాలెంజ్‌గా తీసుకోవాలి. లేకపోతే సైబర్ క్రైం రేటు పెరిగిపోయే ప్రమాదం ఉంది. - ప్రొఫెసర్ ఎస్ జరార్ డెరైక్టర్, ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్స్‌లెన్స్ - వనం దుర్గాప్రసాద్ ఫొటోలు: ఠాకూర్ -
సమ్‌థింగ్ స్పెషల్ కావాలి: ఉదయభాను
మీ.. ఉదయభాను కడలికి పొంగు నేర్పింది ఆటుపోట్లు. జీవితానికి దిశానిర్దేశం చేసేది ఒడిదుడుకులు. ఒక్క ఘటన చాలు.. గుండెల్లో ప్రతిఘట న శక్తిని నింపడానికి. బలమైన సంఘటన చాలు బలీయమైన దారి వేయడానికి. అందుకే.. పట్నం వచ్చిన పల్లెటూరి పిల్ల మౌనానికి సూటిపోటి మాటలు.. మాటలు నేర్పాయి. ఆమె అమాయకత్వానికి ఎగతాళి గడుసుతనం నేర్పింది. యాంకర్‌గా తాను చెప్పే మాటలు కావివి.. ఉదయభానుగా తన సందేశమిదని సందేహాలూ వద్దు! అనుభవాలు నేర్పిన పాఠాలివి.. అంటోంది మీ ఉదయభాను. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ నా ఊరు. ఓ పల్లెటూరు. అమ్మ... స్కూల్లో ఫ్రెండ్స్. చుట్టపక్కల వాళ్ళు. ఇదే ప్రపంచం. అల్లరిగా ఆడుకోవడం. పెంకిగా గోలచేయడం. చిలిపిగా ఊరంతా తిరగడం. ఇంతే.. పదేళ్ల దాకా నాకు తెలిసిన లైఫ్. అమ్మకు మాత్రం నేనంటే ప్రాణం. ఆమె దృష్టిలో నేనే అందగత్తెను. ఆమెకు నచ్చిన ఫ్యాషన్ డ్రెస్ వేసేది. మూడు నెలల వయసులోనే డిఫరెంట్ ఫ్రాక్స్ కుట్టించి వేసేదట. కసి పెంచింది చిలిపిగా ఎగిరే ఈ సీతాకొక చిలకను సిటీకి పరిచయం చేసింది మా అమ్మే. వసంతం వస్తే మురిసిపోయే కోయిలమ్మ గ్రీష్మ తాపం భరించగలదా..? పల్లెటూరులో పిల్లవాగులా ప్రవహించిన నేను సిటీలైఫ్‌లో పరిగెత్తగలనా..? ఇక్కడి వ్యక్తిత్వాలు కొత్త.. ఏం మాట్లాడాలో.. ఎలా మాట్లాడాలో అసలే తెలియదు. ‘పైకి రావాలంటే పదిమందితో కలసిపోవాలి’ అన్న మాటలు బాగానే తోచాయి. ఊళ్ళో ఇలాగే ఉండేదాన్నే... సిటీలో ఇలా ఉండకూడదా...? ఎలా ఉంటే పైకొస్తాం? ఆలోచించాను. ఎన్నో రాత్రులు. ఒక్కోసారి బుర్ర హీటెక్కేది. ఎదుటివారి చులకన భావం నాలో కసి పెంచింది. అతి చిన్న వయసులో బుల్లితెరపై కన్పించే అవకాశం కల్పించింది. దూరదర్శన్‌లో హిట్ అయిన వసంత సమీరం ఫస్ట్ బ్రేక్ అనే చెప్పాలి. మాటల గోదారి.. మీరు బాగా మాట్లాడుతున్నారు.. ఓ టీవీ ప్రోగ్రాం ప్రొడ్యూసర్ చెప్పడం ఆశ్చర్యం అన్పించింది. ఇదెలా సాధ్యమైంది? అన్న ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాలనిపించలేదు. కానీ ఇప్పుడు చెప్పాలనుంది. జనాలు ఏం కోరుకుంటున్నారో తొందరగా అర్థం చేసుకున్నాను. ఇంగ్లిష్ నేర్చుకున్నాను. ఎప్పుడో మరచిపోయిన అక్షరాలను గుర్తు చేసుకున్నాను. రామ్మూర్తి అనే లెక్చరర్ వద్దకు ట్యూషన్‌కి వెళ్లాను. పట్టుదలగా ప్రయత్నించాను. ఆయన నన్ను తన కూతురు కన్నా ఎక్కువగా అభిమానించారు. ఫ్యాషన్‌గా మాట్లాడే స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్నాను. ఇంగ్లిష్ ఒకటేనా.. ఎన్నో పుస్తకాలు చదివాను. సాహిత్య పరమైన జ్ఞానాన్ని పెంచుకున్నాను. పట్టుదలే సోపానాలుగా మలచుకున్నాను. అప్పటి వరకు నన్ను డామినేట్ చేసిన బిడియం ఆమడ దూరం పారిపోయింది. యాంకర్‌గా నా కెరీర్ మంచి మలుపు తిరిగింది. పదిమంది కోసం.. ఏ భావమూ తెలియని ఈ పల్లెటూరి పిల్లను అప్పుడప్పుడూ మూగబోయిన గొంతులు పలకరిస్తాయి. వేదనామయ హృదయాలు ఆలోచింపజేస్తాయి. ఉదయభాను.. నాటోన్లీ యాంకర్.. సంథింగ్ స్పెషల్ కావాలి. దానికి వేదిక సోషల్ యాక్టివిటీ. సమాజ సేవ. చేయాలనుంది. చేసేందుకు దాదాపు మార్గం సిద్ధం చేసుకున్నాను. త్వరలోనే ప్రణాళిక ప్రకటిస్తాను. గప్‌చుప్ తినాలనిపిస్తే.. లవ్ మ్యారేజ్ నాది. బిజీ లైఫ్ సరేసరి. ఖాళీ ఉన్నప్పుడు మావారితో సరదాగా కాలక్షేపం చేస్తాను. అప్పుడు చిన్నపిల్లలా అలా బయటకు వెళ్లాలనిపిస్తుంది. వీధి చివరలో ఉండే గప్‌చుప్ బండి దగ్గర ఆగాలన్పిస్తుంది. అప్పుడప్పుడు అలా చేస్తూంటాను. ఇంతడైనమిక్గా కన్పించే నేను ఎప్పుడూ పబ్‌లు, క్లబ్‌లకు వెళ్లలేదు. నాకు నచ్చదు. అయితే బయటకు వెళ్తే మాత్రం నన్ను ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త తీసుకుంటాను. ఒక రకంగా బురఖా వేసుకుంటాననుకోండి. - వనం దుర్గాప్రసాద్