నవయువ జక్కన
కాన్వాస్‌పై రంగులు అద్ది మనోహర దృశ్యాలను ఆవిష్కరించడమంటే అంత సులువు కాదు. ఇందులో అద్భుతాలు సాధిస్తూనే... చెక్క, మైనం తదితరాలతో ముచ్చటైన బొమ్మలు రూపొందించడం ఎంతమందికి సాధ్యం! రెండూ రెండు కళలు. ఒకటి కుంచెతో వర్ణాలద్దుకున్న భావ చిత్రం... మరొకటి మనసులోని ఆలోచనలకు ‘ప్రతి’రూపం. దేనికదే ప్రత్యేకం. రెండింటిలో రాణిస్తూ... తనలోని కళకు మెరుగులు అద్దుతున్నాడు సాయిప్రసాద్. కళాభిమానుల ప్రశంసలు అందుకొంటూ ముందుకు సాగుతున్న సాయితో ‘సిటీ ప్లస్’ ముచ్చట్లు...
సనత్‌నగర్ బీకే గూడలో మా నివాసం. నాన్న కార్పెంటరీ వర్క్ షాప్ కూడా అక్కడే. ఇందులో పనిచేసేవారిని చూసి నాకు బొమ్మలు తయారు చేయాలనిపించింది. మొదటి సారిగా ఆరో తరగతి చదువుతున్నప్పుడు చాక్‌పీస్‌తో శివలింగం చేశా. ఆ తరువాత చాక్‌పీస్, చాక్ పౌడర్‌తో మరిన్ని వస్తువులు చేయడం అలవాటయింది.
బాపు బొమ్మలా...
బొమ్మలు తయారు చేయడం వేరు. గీయడం వేరు. కానీ నాకు రెండూ ఆసక్తే. అందుకే అప్పుడప్పుడు బొమ్మలు గీసేవాడిని. ‘బాగా వేస్తున్నావ్’ అని అనిపించుకున్నాక అదే కంటిన్యూ చేశా. కార్టూన్స్, మహనీయులు, ప్రకృతి, దేవుళ్లతో పాటు తంజావూరు బొమ్మలు వేయడం కూడా నేర్చుకున్నా. కానీ అన్నింటికన్నా నాకు బాపు బొమ్మలంటే ఇష్టం. ఆయన శైలిని
అనుకరిస్తూ కూడా బొమ్మలు వేశాను.
రకరకాలుగా...
చాక్‌పీస్‌తో బొమ్మలు వేయడం మొదలుపెట్టిన తరువాత ఆ తరువాత పెన్సిలిడ్స్, వుడ్, క్యాండిల్‌తో అనేక రకాల బొమ్మలు చేశా. ఆపై ప్లాస్టిక్ పైపులకు వాడే ఎమ్సిల్, న్యూస్ పేపర్స్, ఎరైజర్స్, వాక్స్, మట్టితో బొమ్మలు తయారుచేశా. కొన్ని వస్తువులను ఇంటర్‌నెట్లో సెర్చ్ చేసి కొన్నా. ఇంకో విషమేమిటంటే వీటిని తయారు చేసేందుకు కావలసిన టూల్స్‌ని కూడా నేనే తయారు చేసుకున్నా.
మై గ్యాలరీ
ఎనిమిదేళ్లుగా నేను వేసిన బొమ్మలన్నీ భద్రపరిచా. మొత్తం 250 బొమ్మలు, 50 పేపర్ డ్రాయింగ్స్ ఉన్నాయి. చెక్కతో చేసిన పైరేట్స్ షిప్, షాట్ గన్ అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం చెక్కతో ఛత్రపతి శివాజి కత్తి చేస్తున్నా. అలాగే ఎరైజర్‌తో స్పైడర్‌మ్యాన్, మైఖేల్ జాక్సన్‌తో పాటు అష్ట వినాయకులు, లక్ష్మీదేవి, శివుడు, ఆంజనేయుడు తదితర దేవతామూర్తులు రూపొందిస్తున్నా. చాక్‌పీస్‌తో సెవన్ వండర్స్, వరల్డ్స్ టాలెస్ట్ బిల్డింగ్స్, జుమ్మా మసీదు, బుద్ధుడు, క్రికెట్ వరల్డ్ కప్స్ వంటివి రూపొందించా.
ఎమ్సిల్‌ను ఉపయోగించి బాల కృష్ణుడు, మహా విష్ణువు, సింహం వంటి విగ్ర హాలు, పేపర్, వ్యాక్స్‌తో బొజ్జవినాయకుడిని రూపొం దించా. ఏటా వినాయకచవితికి నేనే వినాయకుడిని తయారుచేస్తా. ఇష్టపడే బీటెక్‌లో మెకానికల్ తీసుకున్నా. టూల్ డిజైనింగ్ నాకిష్టం. భవిష్యత్‌లో మంచి టూల్ డిజైనర్ కావాలన్నది లక్ష్యం.
ఎస్.శ్రావణ్‌జయ
ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి