shop.. eat.. & సెలబ్రేట్
ఒకప్పుడు థియేటర్లో సినిమా అంటే.. నేల టికెట్ల నుంచి వినిపించే ఈలలు.. గోలలు. కత్తిలాంటి సీన్‌కు బాల్కనీ నుంచి కురిసే కాగితాలు.. ఇవన్నీ ఉంటేనే సినిమా చూసినట్టు. మారుతున్న కాల ం.. థియేటర్ స్వరూపాన్నే మార్చేసింది. తారల తళుకులు కనిపించే తెరను మల్టీస్క్రీన్లుగా మార్చి.. అన్ని రకాల ఆనందాలకు నెలవుగా చేసేశారు. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌గా తీర్చిదిద్దారు. మల్టీప్లెక్స్‌లోకి అడుగుపెట్టిన వాళ్లను సినిమా రెండున్నర గంటలు కట్టిపడేస్తే.. మాల్‌లో కళ్లు చెదిరే షాపులు రోజంతా ఎంగేజ్ చేస్తాయి. వెరైటీ రుచులు గాలం వేస్తాయి. నగరంలో ఎంట్రీతోనే సక్సెస్ కొట్టిన మల్టీప్లెక్స్‌లు హైదరాబాదీలకు మరింత దగ్గరవ్వడంతో.. బిజినెస్‌మెన్లు ఒంటరి థియేటర్లను రంగుహంగుల మల్టీప్లెక్స్‌లుగా
మార్చేస్తున్నారు.
హైదరాబాద్ కొత్తదనానికి చిరునామాగా మారుతోంది. అంతర్జాతీయ నగరాలతో అన్నింటా పోటీపడుతోంది. నయా పోకడలను కూడా అంతే తొందరగా మమేకం చేసుకుంటోంది. థియేటర్ల విషయంలోనూ ‘మల్టీ’ట్రెండ్ సక్సెస్ కొడుతోంది. భారీ మాల్స్‌లో మల్టీప్లెక్స్‌కు చోటిచ్చి బిజినెస్‌మెన్ హైదరాబాదీల మనసు దోచేస్తున్నారు. ఒంటరి థియేటర్లను మల్టీ స్క్రీన్లుగా మలిచి.. ప్లెంటీ లాభాలు పొందుతున్నారు.
‘తెర’మరుగవుతున్నాయి..
ఒకప్పుడు హైదరాబాద్ అంటే చారిత్రక కట్టడాలకే కాదు సినిమా థియేటర్లకు కేరాఫ్ అడ్రస్. 1927లో నగరంలో మొదటి థియేటర్‌గా పేరొందిన ‘రాయల్’ టాకీస్ ఓ వెలుగు వెలిగింది. రామ్‌కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల ఏరియాలో ఉన్న ఈ టాకీస్, ఇక్కడే హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడిచిన ‘దిల్‌షాద్’ థియేటర్ తెరమరుగయ్యాయి. ఐదు దశాబ్దాల క్రితం గోల్కొండ కోట సమీపంలో పరదాలపైనే సినిమాలు ప్రదర్శించేవారు. తర్వాత అక్కడ ‘తస్వీర్ మహల్’ థియేటర్‌ను కట్టారని చరిత్రకారులు చెబుతుంటారు. రాణి రజియా బేగం సినిమాలను చూసేందుకు వారింట్లోనే రెండో అంతస్తును థియేటర్‌గా మార్చారట. 50 సీట్ల సామర్థ్యం ఉండేదట.
తర్వాత ఈ థియేటర్‌నే ‘లైట్ హౌస్’గా పేరు మార్చారు. 1948లో ముషీరాబాద్‌లో ‘రహత్ మహల్’ థియేటర్‌ను నిర్మించారు. రాజాడీలక్స్‌గా పేరు మార్చుకున్న ఈ థియేటర్.. ప్రస్తుతం శ్రీసాయిరాజాగా అలరిస్తోంది. అబిడ్స్‌లో ఇప్పుడున్న బిగ్‌బజార్ స్థానంలో ఒకప్పుడు ‘ప్యాలెస్’ థియేటర్ ఉండేది. మోజంజాహి మార్కెట్‌లోని ‘నవరంగ్’ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్‌గా, ‘విక్రాంత్’ థియేటర్ రేస్ కోర్స్ కార్యాలయంగా మారిపోయాయి. మోండామార్కెట్ దగ్గర్లోని రాజేశ్వరీ టాకీస్‌కు నగరంలోనే మొదటి డీలక్స్ థియేటర్‌గా గుర్తింపు ఉండేది.
అదే బాటలో నేటి థియేటర్లు..
ఈ మధ్య కాలంలో మూతపడుతున్న థియేటర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఏడాదిగా నగరంలో సమారు 10 థియేటర్ల వరకు మూతపడ్డాయి. నారాయణగూడలోని వెంకటేశ, శ్రీనివాస, దీపక్ థియేటర్లు, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ డీలక్స్, 70 ఎంఎం, మినీ ఓడియన్, సుదర్శన్ 70 ఎంఎం థియేటర్లు ఇటీవల మూతపడ్డాయి. వీటిలో చాలా వరకు ఫంక్షన్ హాళ్లుగా, షాపింగ్ మాల్స్‌లా మారుతున్నాయి.
తొలి ‘ఐమాక్స్’ నగరంలోనే..
నగరంలో థియేటర్ల చరిత్ర ఇలా ఉంటే, సౌతిండియాలో తొలి ఐమాక్స్ థియేటర్ ఏర్పాటైంది హైదరాబాద్‌లోనే. 2003లో ప్రసాద్ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నెక్లెస్ రోడ్‌లో ‘ప్రసాద్ ఐమాక్స్’ పేరుతో మల్టిప్లెక్స్‌ను నిర్మించింది. ఇందులో 5 స్క్రీన్లపై సినిమాలాడుతున్నాయి.
ఒకదాని వెనుక మరొకటి..
ఐమాక్స్ రాకతో నగరవాసుల్లో మల్టీప్లెక్స్‌పై మోజు పెరిగింది. దీన్ని గమనించిన దేశ, విదేశీ కంపెనీలు నగరంలో మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి క్యూ కట్టాయి. పంజగుట్ట సర్కిల్‌లో ప్యాంటలూన్ రిటైల్ ఇండియా లిమిటెడ్ నిర్మించిన ‘హైదరాబాద్ సెంట్రల్ ’ మాల్‌లో 5 స్క్రీన్ల మల్టీప్లెక్స్ ఉంది. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 1లోని ‘జీవీకే వన్’ మాల్‌లో 6 స్క్రీన్లు ప్రేక్షకులను రంజింపజేస్తున్నాయి. కొంపల్లిలో సినీప్లానెట్, బంజారాహిల్స్‌లో సినీమాక్స్, అమీర్‌పేటలో బిగ్‌బజార్, మాదాపూర్‌లో ఇనార్బిట్‌మాల్, కూకట్‌పల్లిలో మంజీరా ట్రినిటీ వంటివెన్నో మల్టీ స్క్రీన్లతో ప్రేక్షకులకు మల్టీ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నాయి. ఉప్పల్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో ఇటీవల ఏషియన్ సినిమాస్ ‘సినీ స్క్వేర్’ పేరుతో 4 స్క్రీన్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇదే సంస్థ త్వరలోనే అత్తాపూర్‌లో మల్టీప్లెక్స్‌లు నిర్మించనుంది.
ఆల్ ఇన్ వన్ బెస్ట్ చాయిస్
బిజీలైఫ్‌లో రిలాక్స్ కోసం, వీకెండ్స్ జోష్ కోసం మెట్రోవాసులు షాపింగ్ మాల్స్‌కు వస్తున్నారు. థియేటర్ అంటే సినిమా, షాపింగ్, ఫన్ ఇలా అన్నీ ఒక్క చోటుండే కేంద్రమని నేటి మెట్రోవాసుల అభిప్రాయం. దాన్ని ఫుల్‌ఫిల్ చేయడమే వ్యాపార సూత్రం. అందుకే మల్టీప్లెక్స్, మాల్స్‌కు ఆదరణ పెరుగుతోంది.
- మంజీరా గ్రూప్ సీఎండీ యోగానంద్
వచ్చేస్తున్నాయ్..
నగరంలో 2015 చివరి నాటికి 24 షాపింగ్ మాళ్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో 60కి పైగా స్క్రీన్లు ఉంటాయని అంచనా. డజనుకు పైగా మాల్స్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి కూడా.
* కొండాపూర్‌లో శరత్స్ సిటీ క్యాపిటల్ నిర్మిస్తున్న షాపింగ్ మాల్‌లో 7 స్క్రీన్లకు ప్లాన్ చేస్తున్నారు.
* ల్యాంకోహిల్స్ సంస్థ ల్యాంకోహిల్స్‌లో 12 స్క్రీన్లతో మెగామాల్ నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది.
* శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్స్ సంస్థ ప్యాట్నీ సర్కిల్‌లో 4 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌తో ఓ షాపింగ్ మాల్ నిర్మిస్తోంది.
* ఇదే సంస్థ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఓడియన్ కాంప్లెక్స్‌లో 6 స్క్రీన్లతో భారీ షాపింగ్‌మాల్ నిర్మిస్తోంది. సుదర్శన్ థియేటర్ స్థానంలో కూడా షాపింగ్ మాల్ కం మల్టీప్లెక్స్ కూడా నిర్మిస్తోంది. బేగంపేటలో కమర్షియల్ కాంప్లెక్స్, గచ్చిబౌలిలో భారీ మాల్, హోటల్‌ను నిర్మిస్తోంది. వీటిల్లో కూడా మల్టీప్లెక్స్‌లకు ప్లాన్ చేస్తోంది.
* ఎస్‌ఎంఆర్ హోల్డింగ్స్ సంస్థ మియాపూర్‌లో ‘ఎస్‌ఎంఆర్ వినయ్’ పేరుతో మెట్రో షాపింగ్ విత్ మల్టీప్లెక్స్ నిర్మిస్తుంది. ఇదే ప్రాంతంలో 6 స్క్రీన్లతో మరో మాల్ ప్లాన్ చేస్తోంది.
* ఫీనిక్స్ గ్రూప్ కూకట్‌పల్లిలో 11 స్క్రీన్ల మల్టీప్లెక్స్‌తో ఫీనిక్స్ లోటస్ మాల్ డిజైన్ చేస్తోంది.
* కూకట్‌పల్లిలో ఐజేఎం (ఇండియా) ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ మల్టీప్లెక్స్‌తో ‘రెయిన్‌ట్రీ మాల్’ను నిర్మిస్తోంది.
‘మెట్రో’రూట్‌లో మల్టీప్లెక్స్..
హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ‘మెట్రో’రూట్‌లో కూడా మల్టీప్లెక్స్‌లు దూసుకుపోనున్నాయి. మెట్రోకారిడార్లలో కళ్లు చెదిరే మాల్స్‌తో పాటు మల్టీప్లెక్స్‌లు కనువిందు చేయనున్నాయి. హైటెక్‌సిటీ, పంజాగుట్ట, ఎర్రగడ్డ, మూసారాంబాగ్ , అమీర్‌పేట్, సికింద్రాబాద్, బాలానగర్, ఎల్బీనగర్, ముషీరాబాద్, రాయదుర్గం ప్రాంతాల్లో మెట్రో మాల్స్ రానున్నాయి. ప్రస్తుతం పంజగుట్టలో షాపింగ్‌మాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తి అయ్యాక మాల్స్, మల్టీప్లెక్స్‌ల నిర్మాణానికి మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
- శ్రీనాథ్ ఆడెపు