
అల్లు అర్జున్-సంతోష్ శ్రీనివాస్-రవితేజ
తన మొదటి సినిమా 'కందిరీగ'తోనే సంతోష్ శ్రీనివాస్ మాస్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్నాడు. ఛాయాగ్రాహకుడు శ్రీనివాస్ దర్శకుడుగా మారి తనేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం తన మార్కులో జూనియర్ ఎన్టీఆర్తో 'రభస' చేయడానికి సిద్ధమయ్యాడు. మొదటి చిత్రం తరువాత కొంత గ్యాప్ వచ్చినా తన రెండవ చిత్రం ఎన్టీఆర్ లాంటి హీరోతో మంచి కసితో చేస్తున్నాడు. ఒక పక్క రభస చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటూనే మరో పక్క 'తిక్కరేగింది' అంటూ హడావిడి చేస్తున్నాడు.
'తిక్కరేగిందంటే నేను మామూలు మనిషిని కాదు' అని కొందరు కాస్త పొగరు, కాస్త గర్వంగా అంటూంటారు. ఇప్పుడు అదే 'తిక్కరేగింది' అనే టైటిల్తో సంతోష్ శ్రీనివాస్ ఓ పెద్ద హీరోతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఓ పెద్ద బ్యానర్ సిద్దమైనట్లు సమాచారం. అయితే ఇందులో హీరో మాస్ మహారాజు రవితేజ గానీ, స్టైలిష్ స్టార్ బన్నీ గానీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ఇద్దరిలో ఎవరికి తిక్కరేగుతుందో వేసి చూడాలి.
ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ ఎన్టీఆర్తో రభస షూటింగ్ పూర్తి చేశాడు. ఇందులో ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణీత నటించారు. ఈ చిత్రం తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆగష్ట్ 14న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రభస చేయనుంది. ఈ సినిమాను హిట్ చేయాలని శ్రీనివాస్, ఎన్టీఆర్ ఇద్దరూ బాగా పని చేశారు. ఎన్టీఆర్ నుంచి అభిమానులు, ప్రేక్షకులు ఏమేం కోరుకొంటారో అవన్నీ మా సినిమాలో ఉన్నాయని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉండటంతో శ్రీనివాస్కు టాలీవుడ్లో వరస ఆఫర్స్ వస్తున్నాయి.
రవితేజ సైతం సంతోష్ శ్రీనివాస్‌తో సినిమా చేయటానికి చాలా ఉత్సాహంగా ఉన్నట్లు సమాచారం. 'తిక్కరేగింది' లేక 'తిక్కరేగితే' అనే సినిమా విషయమై అల్లు అర్జున్తో కూడా శ్రీనివాస్ సంప్రదించినట్లు తెలిసింది. అయితే ఈ మూవీలో హీరోగా బన్నీ నటిస్తాడా? లేక రవితేజ చేస్తాడా? అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.
- శిసూర్య