పాత కోక.. కొత్త షోకు | new designs with old sarees | Sakshi
Sakshi News home page

పాత కోక.. కొత్త షోకు

Published Tue, Nov 11 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM

పాత కోక.. కొత్త షోకు

పాత కోక.. కొత్త షోకు

పెళ్లి నాటి చీరను ఆడవాళ్లు కలకాలం దాచుకుంటారు. మొదటి పెళ్లి రోజుకు శ్రీవారు ప్రేమగా బహూకరించిన బెనారస్ శారీ.. ఆ జంట సిల్వర్ జూబ్లీ వేడుక రోజు కూడా బీరువాలో దర్శనమిస్తుంది. ప్రతి మధురానుభూతికి చిహ్నంగా నిలిచిన పట్టు చీరలు, డిజైనర్ శారీస్ ఎన్నో ట్రంకు పెట్టెలో పదిలంగా పదికాలాల పాటు ఉంటాయి.

ప్రేమగా దాచుకున్న ఆ చీరలను ఎవరికీ ఇవ్వలేరు. అలాగనితరచూ ధరించాలనుకున్నా.. మారుతున్న ట్రెండ్ ఆ పని చేయనీయదు. ఈ సమస్యకు చెక్ పెడుతూ.. పాత చీరకే కొత్త సొబగులద్ది కొంగొత్తగా చూపిస్తున్నారు సిటీలోని ఫ్యాషన్ డిజైనర్లు.

 
ఆడవారి మనసు గెలుచుకున్న వాటిలో మొదటి స్థానంలో నిలిచేవి చీరలే. అందుకే ఎప్పటి ట్రెండ్‌ను అప్పుడు ఫాలో అవుతుంటారు. కొత్తరకం శారీస్ మార్కెట్‌లో కనిపిస్తే చాలు.. సిరిగల స్త్రీలు వాటిని కొనకుండా వదిలిపెట్టరు. అయితే ఆనాడుఫ్యాషన్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేసిన శారీస్.. రేపటికి ఓల్డ్ ఫ్యాషన్ అయిపోతుంది. అందుకే ఈ చీరలను రీమేక్ చేసి నయా లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఆనాటి క్వాలిటీని ఈనాటి నేటివిటీకి షిఫ్ట్ చేసి మగువలకు మహదానందాన్ని కలిగిస్తున్నారు.

కొత్తగా పాతలు..
పాత పట్టు చీరలకు మగ్గం వర్క్‌తో సరికొత్తగా తీర్చిదిద్దుతున్నారు. చమ్కీలు, లేసులు, పాచెస్ ఉపయోగించి.. శారీ లుక్కే మార్చేస్తున్నారు. కంచి, ధర్మవరం, బెనారస్ పట్టు చీరలను వాటి అందాలు రెట్టింపు అయ్యే విధంగా.. ఈ కాలానికి తగిన విధంగా ముస్తాబు చేస్తున్నారు. కస్టమర్ల అభిరుచులను ఆ చీరపై మరోసారి నేస్తున్నారు.

అమ్మమ్మలు, బామ్మల జమానాలో చీరలను ఈ తరం మనవరాళ్లకు డ్రెస్ మెటీరియల్స్‌గా మార్చేస్తున్నారు. నేత చీరలతో.. అనార్కలీ వేర్, కంచి, బెనారస్ పట్టు చీరలతో ఫ్లోర్ లెన్త్ ఫ్రాక్స్ చేస్తున్నారు. అంతేకాదు డ్రెస్‌గా తీర్చిదిద్దిన తర్వాత మిగిలిపోయిన చీర ముక్కలతో.. మ్యాచింగ్ క్లచెస్, డిజైనర్ బ్యాగ్‌లు తయారు చేసి ఇస్తున్నారు. అంతేకాదు కలర్ తేలిపోయి, పాదాల దగ్గర చీకిపోయిన్న జీన్స్‌ను కూడా యూజ్‌ఫుల్‌గా మలుస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. వాటితో బ్యాగులు, ఫుట్‌వేర్, ఇంటీరియర్ షోపీస్‌లు, వాల్ హ్యాంగింగ్స్‌గా తీర్చిదిద్దుతున్నారు.
 
చీర పోయి డ్రెస్ వచ్చే..

పాతకాలం పట్టు చీరలతో వచ్చే చాలా మంది కొత్తగా రూపొందించే డ్రెస్ ఇన్నోవేటివ్‌గా ఉండాలని అడుగుతుంటారు. ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ల అమ్మ, అమ్మమ్మ చీరలు తె చ్చి వెస్ట్రన్ వేర్‌గా మార్చమని అడుగుతున్నారు. ఈ రీ మేకింగ్ ప్రాసెస్‌లో వారి ఆలోచనలు, అభిరుచులకు ఇంపార్టెన్స్ ఇస్తాం. కొంతమంది అమ్మమ్మలు తమ పెళ్లి చీరలు.. వాళ్ల మనవరాళ్లకు లంగా ఓణీగా కుట్టమని చెప్తుంటారు.ఆ చీరలకు మోడ్రన్ టచ్ ఇస్తే అవి వాళ్ల పిల్లలకు వేసి మురిసిపోతుంటారు. ఈ తరహా రీ మేకింగ్‌కు రూ.మూడు వేల వరకు చార్జ్ చేస్తున్నాం.
 
- దీప్తి రెడ్డి, ఫ్యాషన్ డిజైనర్, ఖైరా బొటిక్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement