‘ఎయిర్‌లిఫ్ట్’లో నిర్మాట్ కౌర్
‘లంచ్‌బాక్స్’ కథానాయిక నిర్మాట్ కౌర్ తాజాగా అక్షయ్‌కుమార్ సరసన నటించే చాన్స్ కొట్టేసింది. నిఖిల్ అద్వానీ రూపొందించనున్న ‘ఎయిర్‌లిఫ్ట్’లో అక్షయ్‌కుమార్ భార్యగా నిర్మాట్ కనిపించనుంది. కువైట్‌పై 1990లో ఇరాక్ దాడి చేసినప్పుడు అక్కడి నుంచి భారీఎత్తున భారతీయులను స్వదేశానికి తరలించిన నేపథ్యంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
‘‘ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతం
ఫైండింగ్ ఫ్యానీ’ స్క్రిప్ట్ అద్భుతమని, ఇందులోని తన పాత్రను చక్కగా తీర్చిదిద్దారని డింపుల్ కపాడియా సంబరపడుతోంది. హోమీ అదాజానియా రూపొందించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదల కానుంది. చాలాకాలం తర్వాత డింపుల్ తెర ముందుకు వస్తుండటంతో బాలీవుడ్ వర్గాల్లోనూ ఈ చిత్రంపై ఆసక్తి వ్యక్తమవుతోంది.
‘షాన్‌దార్’లో సనా కపూర్
షాహిద్ కపూర్ చెల్లెలు సనా కపూర్ త్వరలోనే తెరంగేట్రం చేయనుంది. వికాస్ భల్ రూపొందిస్తున్న ‘షాన్‌దార్’ చిత్రంలో ఆమె తన సోదరుడు షాహిద్ కపూర్, తండ్రి పంకజ్ కపూర్‌లతో కలసి నటించనుండటం విశేషం. షాహిద్ సరసన కథానాయికగా ఆలియాభట్ ఇందులో నటించనుంది. ఆలియా సోదరిగా సనా కీలక పాత్రలో కనిపించనుంది.