పెరిగిపోతున్న నగ్న సెల్ఫీలు
టెక్నాలజీ వెర్రిపుంతలు తొక్కుతోంది. టీనేజర్లు తమ నగ్న సెల్ఫీలు తీసుకుని పంపడం ఇటీవలి కాలంలో బాగా ఎక్కువైపోతోంది. ఇది తల్లిదండ్రులతో పాటు టీచర్లను కూడా బాగా ఇబ్బంది పెడుతోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా చేసిన పరిశోధనలో తేలింది. స్మార్ట్ఫోన్ల ద్వారా ఇలాంటి అసభ్య ఫొటోలను పంపడాన్ని 'సెక్స్టింగ్' అని అంటున్నారు. ఈ తరహా ప్రవర్తన ఇటీవలి కాలంలో టీనేజర్లలో ఎక్కువైందని చెబుతున్నారు. హైస్కూలు స్థాయిలో చదువుతున్న దాదాపు 1130 మందిని యూనివర్సిటీ ఆఫ్ ఉటాకు చెందిన సైకాలజీ ప్రొఫెసర్ డాన్ స్ట్రాస్బెర్గ్ నేతృత్వంలోని బృందం సర్వే చేసింది.
తాము తమ నగ్న ఫొటోను సెల్ఫీ తీసుకుని సెల్ఫోన్ ద్వారా వేరేవాళ్లకు పంపినట్లు దాదాపు 20 శాతం మంది చెప్పగా, తమకు అలాంటి ఫొటోలు వచ్చాయని 38 శాతం మంది చెప్పారు. అలా అందుకున్నవాళ్లలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ ఫొటోను వేరేవారికి ఫార్వర్డ్ చేశారట. ఇలా పంపేవాళ్లు, అందుకునేవాళ్లలో మగ, ఆడవారి సంఖ్య దాదాపు సమానంగానే ఉంటోంది. అయితే ఫార్వర్డ్ చేసేవాళ్లలో మాత్రం ఆడవాళ్ల కంటే మగవాళ్లే ఎక్కువగా ఉంటున్నారు. పంపేవాళ్లలో 24.2 శాతం మంది మగాళ్లుంటే, 13 శాతం మందే ఆడాళ్లు ఉన్నారు.