శృంగారం కన్నా.. స్మార్ట్ఫోనే మిన్న!!
స్మార్ట్ఫోన్ కావాలా.. శృంగార అనుభవం కావాలా అని అడిగితే, తమకు స్మార్ట్ఫోన్లే కావాలని యువత అంటోందట!! అమెరికాలో ఈ విషయంపై జరిగిన సర్వేలో ఇదే తేలింది. స్మార్ట్ఫోన్ల కోసం వాళ్లు ఏవైనా వదులుకుంటామని, చివరకు శృంగారం కూడా అక్కర్లేదని చెబుతున్నారట. మొబైల్ ఫోన్ లేకుండా తాము బతకలేమని అమెరికన్ టీనేజర్లలో 26 శాతం మంది కుండ బద్దలుకొట్టి చెబుతున్నారు. శృంగారం లేకుండా ఉండలేమని చెప్పేవాళ్ల సంఖ్య 20 శాతమే ఉందట.
విద్యార్థులు రోజుకు దాదాపు ఐదు గంటలకు పైగా ఆన్లైన్లోనే గడుపుతున్నారని, ఒకేసారి ఐదారు యాప్లు అవలీలగా వాడేస్తున్నారని కూడా తేలింది. సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిపోవడంతో విద్యార్థుల ప్రాధాన్యాలు కూడా మారిపోతున్నాయి. తరగతి గదిలో అధ్యాపకుడు బోధిస్తుంటే నేర్చుకోడానికి చాలామంది విద్యార్థులు అబ్బే అనేస్తున్నారు. ఇప్పుడంతా డిజిటల్ క్యాంపస్లకే మొగ్గు చూపిస్తున్నారు. నోట్ పుస్తకంలో రాసుకోవడం కంటే మొబైల్ పరికరాల్లో నోట్స్ తీసుకోవడానికే 44 శాతం మంది విద్యార్థులు సై అంటున్నారని హఫింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.
యూనివర్సిటీలు, కాలేజిలు.. ఎక్కడైనా కూడా మొబైల్కు ఇంటర్నెట్తో అనుసంధానం కావడం జీవితంలో చాలా ముఖ్యమైన భాగం అయిపోయిందని, పనికోసమైనా.. ఆడుకోడానికైనా కూడా వీటిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారని అరుబా నెట్వర్క్స్ సీనియర్ డైరెక్టర్ క్రిస్ కొజుప్ తెలిపారు.