హైదరాబాద్ ట్రెండ్స్ రెడ్ రోజెస్
సందె వన్నెల్లో సాగే మబ్బు ఎర్రదనంతో ప్రకృతి కాంతకు సొగసులు అద్దితే.. ఎరుపులో మెరిసిపోయే మాణిక్యం కనువిందు చేస్తుంది. తొగరు రంగులో.. కాస్త పొగరుగా కనిపిస్తామని యువత రెడ్ డిజైనింగ్స్‌పై మోజు పడుతోంది. వాలెంటైన్స్ కలర్‌గా ముద్రపడిన ఎరుపును నగర యువత తెగ ప్రేమించేస్తోంది.
నిన్నమొన్నటి వరకు మూన్‌లైట్ ఫంక్షన్స్‌లో బ్లాక్ డ్రెసప్‌తో మతులు పోగొట్టిన బ్యూటీలు ఇప్పుడు ఎర్రబడిపోతున్నారు. కోపంతో కాదండోయ్.. ఎర్రని ఆహార్యంతో గుంపులో ఇంపుగా కనబడుతున్నారు. రెడ్ లుక్స్ రిచ్ అని ఫిక్సయిన తరుణులు.. చెంగావి రంగులో బంగారు వన్నెలీనుతున్నారు. ఎర్రటి లాంగ్ గౌన్లలో తళుక్కుమంటున్న ఈ యువతులు అప్పుడే విచ్చుకున్న రోజాల్లా ఉన్నారు కదూ..! మగువలే కాదు, మగాళ్లు కూడా రెడ్ ట్రెండ్‌కు సలామ్ కొడుతున్నారు. సిటీలో ఇప్పుడు స్పెషల్ అకేషన్స్‌లో ఎర్రందనానికే పట్టం కడుతున్నారు.
రొమాంటిక్ కలర్..!
సైకలాజికల్‌గా ఫాస్టర్ హార్ట్ బీట్, బ్రీతింగ్‌కు సింబాలిక్‌గా రెడ్ కలర్‌ను చూపిస్తే, ఫ్యాషన్ డిజైనర్స్ మాత్రం రెడ్‌ను రొమాంటిక్ కలర్‌గా మార్చేశారు. ప్రమాదానికి, వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఎర్రజెండా ఊపితే.. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం రెడ్ కలర్‌కు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇక పెళ్లి తంతులో రెడ్‌కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నుదుటిన సింధూరం నుంచి పాదాల పారాణి వరకు ఎర్రదనంతో దర్శనమిచ్చే వధువు వివాహ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్. ఇటీవల ఫ్యాషన్ ప్రపంచంలోనూ రెడ్ హల్‌చల్ చేస్తోంది.
ఫ్యాషన్ వరల్డ్ రోజురోజుకీ కొత్తందాలను ఆహ్వానిస్తోంది. వెరైటీ డిజైన్స్ ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఒక్కోసారి కలర్స్ కూడా ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తుంటాయి. అకేషన్‌కు తగ్గ కలర్ ఫాలో అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ మధ్య అందరూ రెడ్ కలర్‌పై మోజు పెంచుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీ వేర్ బ్లాక్ కలర్ హవా నడిచింది. తర్వాత గ్రీన్, పర్పుల్, ఎల్లో, బ్లూ కాంబినేషన్స్ వచ్చి వెళ్లాయి. ప్రజెంట్ మాత్రం రెడ్ కలర్‌కు అందరూ ఆకర్షితులవుతున్నారు. సెలబ్రెటీల నుంచి కామన్ యూత్ వరకు అందరూ ఫంక్షనల్ బ్రాండ్‌గా రెడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దివ్య, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేటివ్‌స, హిమాయత్‌నగర్