అత్తారింటికి దొంగదారి!!
సినిమా అంటే కోట్లాది రూపాయల పెట్టుబడి.. వందలు, వేల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్ల శ్రమ ఫలితం. ఎంతోమంది అభిమానుల ఆశలకు ప్రతిరూపం. ఒక హీరో.. ఒక హీరోయిన్.. ఓ దర్శకుడు.. నిర్మాత.. ఇలా ప్రతి ఒక్కరికీ జీవన్మరణ పోరాటం. అలాంటి సినిమాలు.. విడుదలైన రెండు మూడు రోజులకే పైరసీ సీడీలు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఓ మాదిరి సినిమాలైతే మరీ దారుణంగా విడుదలైన రోజు సాయంత్రమో, మర్నాడో వచ్చేస్తున్నాయి.
సినిమాలు పాత రికార్డులను తిరగరాస్తున్నాయంటే, అటు కలెక్షన్లలోనో.. ఇటు ఎక్కువ రోజులు ఆడటంలోనో అనుకుంటాం. కానీ 'అత్తారింటికి దారేది' చిత్రం మాత్రం మరో కొత్త మార్గంలో చరిత్రను తిరగరాసింది. అసలు సినిమా ప్రివ్యూ వేయకముందే, కనీసం యూనిట్ సభ్యుల కోసం వేసే ప్రదర్శన కూడా వేయకముందే పైరసీ సీడీ మార్కెట్లోకి వచ్చేసింది. ఫస్టాఫ్ సినిమా మొత్తాన్ని సీడీ రూపంలోకి మార్చేసి 50 రూపాయల చొప్పున అమ్మేశారు!! అది కూడా ఏ మెగా నగరాల్లోనో కాదు.. కృష్ణా జిల్లాలో ఎక్కడో మారుమల ఓ మండల కేంద్రమైన పెడన అనే ఊళ్లో. పెడన ప్రాంతం సాధారణంగా అయితే కలంకారీ పరిశ్రమకు పెట్టింది పేరు. చీరలు, పంజాబీ డ్రస్సుల మీద అద్దకం వేయడంలో ఈ ప్రాంతం వారిది అందెవేసిన చేయి. కానీ ఇప్పుడు సినిమాలను కూడా అలా అద్దకం అద్దేసినట్లు తేలింది!! ఎడిట్ రూంలో కూర్చున్న ఎవరో తన మిత్రులకు దాన్ని చూపించేందుకు యూట్యూబ్లో 90 నిమిషాల పాటు పెట్టగా, ఈలోపే దాన్ని చూసిన కొంతమంది దాన్ని వెంటనే డౌన్లోడ్ చేసేసి.. పైరసీ సీడీలుగా రూపొందించారు. దాంతో ఆ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కుమారుడు బాపినీడు పైరసీదారులపై డీజీపీ దినేష్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఒక తల్లి బిడ్డను ప్రసవించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో.. పుడమి తల్లి కడుపు చీల్చుకుని ఒక మొక్క పైకి వచ్చి, పెరిగి పెద్దదై ఫలాలు ఎలా ఇస్తుందో.. అలా, అన్ని కష్టాలు పడి మరీ ఒక సినిమాను విడుదల చేస్తారు. ఆ సినిమా ఎలా ఆడుతుందోనని అంతా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తారు. ప్రేక్షకుల ఆదరణ బాగుందంటే అందరికీ ఆనందమే. కానీ ఆ ఆనందాన్ని కాస్తా ఈ పైరసీ సీడీలు ఆవిరి చేసేస్తున్నాయి. కోట్ల రూపాయల కష్టాన్ని ఐదు రూపాయలకు దొరికే సీడీలోకి రైట్ చేసి, ఇట్టే అమ్మేస్తున్నారు. దీని గురించి గతంలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ సహా అనేకమంది అగ్రహీరోలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఇప్పటికీ పైరసీ భూతాన్ని అదుపులోకి తీసురాలేకపోయారు.
ఎక్కడికక్కడ ఏదో ఒక రూపంలో ఇది బయట పడుతూనే ఉంది. అమెరికాలోనో.. అలాస్కాలోనో .. ఆఫ్రికాలోనో పైరసీ సీడీలు బయటపడుతూనే ఉన్నాయి. తమిళంలో అయితే అచ్చంగా పైరసీ, ఇతర వ్యవహారాల మీద 'అయ్యన్' అనే సినిమా కూడా విడుదలైంది. దాన్ని తెలుగులోకి 'వీడొక్కడే' పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేయగా, అది కూడా సూపర్ హిట్ అయ్యింది. యాంటీ పైరసీ స్క్వాడ్ పేరుతో కొన్ని దళాలు వచ్చినా.. సైబర్ క్రైం పోలీసులు కూడా దీనిపై ఉక్కుపాదం మోపినా, ఇంకా విడుదల కాకముందే సీడీలు విడుదల కావడం పైరసీకి పరాకాష్ఠ.