
ఖాకీలకు సెప్టెంబరు 7 భయం
ఈ నెల 7వ తేదీ అంటే హైదరాబాద్ పోలీసులు హడలిపోతున్నారు. ఆ రోజున ఏపిఎన్జిఓలు, తెలంగాణవాదులు హైదరాబాద్లో పెద్ద ఎత్తున వేరువేరు కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్ శాఖ అనుమతి ఇస్తే ఎల్బి స్టేడియం లోపల, అనుమతి ఇవ్వకపోతే బయట 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సదస్సు నిర్వహించాలన్న పట్టుదలతో ఏపి ఎన్జిఓ సంఘం ఉంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్న డిమాండ్తో ర్యాలీ చేపట్టనున్నట్లు తెలంగాణ రాజకీయ జెఎసి ప్రకటించింది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిజాం కాలేజీ వరకు వేలాది మందితో శాంతి ర్యాలీ నిర్వహించాలన్న పట్టుదలతో తెలంగాణ జేఏసీ నాయకులు ఉన్నారు.
సదస్సుకు పోలీసులు అనుమతి ఇవ్వాలని, లేకపోతే కోర్టు ద్వారా అనుమతిని తెచ్చుకుంటామని ఇప్పటికే ఏపీఎన్జీఓలు స్పష్టం చేశారు. అనుమతి రాకపోయినా సదస్సును నిర్వహించి తీరుతామని వారు చెబుతున్నారు. సేవ్ ఆంధ్రప్రదేశ్ సదస్సు కేవలం 13 జిల్లాల సభ కాదని, రాష్ట్రంలోని 23 జిల్లాల సభ అని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు స్పష్టం చేశారు. సమైక్యవాదాన్ని వినిపించే ఈ సభలో అన్ని ప్రాంతాలవారు పాల్గొంటారని చెప్పారు. ''ఉద్యోగుల సభను అడ్డుకుంటామంటున్నవారికి ఒకటే చెబుతున్నాం. మా సభ ఎవరికీ వ్యతిరేకం కాదు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, విభజన వల్ల జరిగే నష్టాలు, ఎదురయ్యే ఇబ్బందులను వివరించడానికే దీన్ని ఏర్పాటు చేస్తున్నాం. సభ పెట్టొద్దనే హక్కు ఎవరికీ లేదు. మా సభ విజయవంతం అయితే విభజన వాదనకు బలం లేనట్లే’’ అని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా తమ సభకు రావచ్చని, అయితే పార్టీల జెండా, ఎజెండాలను పక్కనబెట్టి వస్తేనే ఆహ్వానిస్తామని చెప్పారు. సమైక్యాంధ్రకు మద్దతు పలికే ఏ ప్రాంతం నాయకులైనా సభకు రావచ్చని తెలిపారు. సీమాంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఏపీఎన్జీఓల సభకు సంఘీభావం ప్రకటించారు.
తెలంగాణ ప్రక్రియను కేంద్రం త్వరగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఈ నెల 7న హైదరాబాదులో ముల్కీ అమరవీరుల శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. సిటీ కాలేజ్ నుంచి ఇందిరా పార్కు వరకు శాంతి ర్యాలీ జరుపుతామని చెప్పారు. తర్వాత ముగింపు సభ ఉంటుందని కూడా ఆయన తెలిపారు.
ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులు రెండు వర్గాలు చీలిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులలో రెండు ప్రాంతాల వారు ఒకే రోజు హైదరాబాద్ చేరుకుంటే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయోనని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. రెండు పక్షాలకూ అనుమతి ఇవ్వవద్దని హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు నివేదికను పంపించినట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ చర్చలు జరిపారు. ఏ ప్రాంతం వారైనా సచివాలయం ప్రాంగణంలో ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని మహంతి తెలిపారు. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా శాంతి యుతంగా నిరసన తెలుపుకోవాలని ఆయన ఉద్యోగులను కోరారు. ఇరు ప్రాంతాల ఉద్యోగులు నిరసనలు వ్యక్తం చేసేందుకు రెండు వేర్వేరు ప్రదేశాలను కేటాయించారు. సచివాలయం జే బ్లాక్ వద్ద తెలంగాణ ఉద్యోగులు శాంతియుత నిరసనకు అవకాశం కల్పించారు. సీమాంధ్ర ఉద్యోగులకు అమ్మవారి ఆలయం దగ్గర నిరసనకు అవకాశం ఇచ్చారు.
హైదరాబాద్ నగరంలో ఈనెల 10 తేదీ వరకు ఎలాంటి సభలు, ర్యాలీలు, బహిరంగ ప్రదర్శనలకు అనుమతి లేదని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. ఇక హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం పరిసర ప్రాంతాల్లో ఈనెల 10 వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల వారు సభలు నిర్వహించడానికి ప్రయత్నిస్తుంటే, పోలీసులు అందుకు అనుమతి ఇవ్వని పరిస్థితులలో 7వ తేదీన ఏం జరుగుతుందో వేచిచూడవలసిందే.