ప్రకాష్రాజ్
ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ జంటిల్మేన్ అనిపించుకున్నారు. తను అడ్వాన్స్గా తీసుకున్న సొమ్ముని ప్రకాష్రాజ్ తిరిగి ఇవ్వడంతో 'ఆగడు' సినిమా వివాదం పరిష్కారమైంది.14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రం నిర్మిస్తున్నారు. ప్రకాష్రాజ్ తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆగడు సినిమా సహాయ దర్శకుడు సూర్య తెలుగు సినిమా దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ సినిమా నుంచి ప్రకాష్రాజ్ను తొలగించారు. ఆయన స్థానంలో సోనుసూద్ను తీసుకున్నారు.
ఇదిలా ఉంటే, ప్రకాష్రాజ్ అనుచిత ప్రవర్తన అంశం దర్శకుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఏపిఎఫ్సిసి) దృష్టికి తీసుకువెళ్లింది. ఫిల్మ్ ఛాంబర్ సలహా మేరకు తాను అడ్వాన్సుగా తీసుకున్నే మొత్తం ఇవ్వడానికి ప్రకాష్రాజ్ అంగీకరించారు. అడ్వాన్సులో అధిక మొత్తం తిగిరి చెల్లించినట్లు కూడా తెలిసింది. మిగిలినది కూడా త్వరలో చెల్లిస్తానని ప్రకాష్రాజ్ చెప్పినట్లు సమాచారం.
ఈ విధంగా అధిక మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న సొమ్ముని తిరిగి ఇవ్వడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి అంటున్నారు. తనకు, సహాయదర్శకునికి మధ్య జరిగిన సంభాషణలు వివాదానికి దారితీసిన నేపధ్యంలో ఆ చిత్రం నుంచి తనను తొలగించినప్పటికీ ప్రకాష్రాజ్ అడ్వాన్సును తిరిగి ఇచ్చి జంటిల్మేన్గా నిలిచారని సినీవర్గాలు అంటున్నాయి.
ఈ విషయంలో తాను ఏ తప్పు చేయలేదని గతంలో ప్రకాష్‌రాజ్ చెప్పారు. ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం వల్ల ఇలా జరిగిందన్నారు. సినిమా సెట్లో తనకు దర్శకునికి మధ్య ఒక అంశంపై అభిప్రాయభేదాలు వచ్చిన మాట నిజమేనని చెప్పారు. దాంతో తనను కాదని, వేరొక నటుడిని తీసుకున్నారని తెలిపారు. అంతవరకు బాగానే ఉందని, అయితే ఆ తరువాత జరిగిన సంఘటనను వక్రీకరించి తనపై ఫిర్యాదు చేయడం బాధకలిగించిందన్నారు. ఈ విషయాన్ని ప్రకాష్రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దృష్టికి తీసుకువెళ్లారు.
పుస్తక ప్రియుడు, స్టేజీ ఆర్టిస్ట్గా, సినిమా నటుడుగా ఎంతో అనుభం ఉన్న ప్రకాష్రాజ్కు అయిదు భారతీయ భాషలలో పట్టుంది. నాలుగు జాతీయ అవార్డుల అందుకున్న అతను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించారు. జరిగిన సంఘటనపై అతను బాధపడుతూ అప్పట్లో ఓ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన బాధను వెళ్లగక్కారు. ఆ తరువాత ఓ కవిత కూడా వినిపించారు. తనని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు చెప్పకుండా, అతనిపైనే ప్రకాష్రాజ్ ఈ కవిత రాసి, చదివారు. ''నన్ను రాళ్లతో కొట్టాలనుకోకు నేను ఆ రాళ్లతో ఇల్లు కడతాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఆ నిప్పుతో నేను దీపం వెలిగిస్తాను. నన్ను పరిశ్రమ నుంచి పంపించాలనుకోకు, నేను చేరాల్సిన గమ్యానికి ఇంకా త్వరగా చేరుకొంటాను. నన్ను చంపాలని విషం పెట్టకు, దానిని మింగి నీలకంఠుడిని అవుతాను'' అని చదివారు.
ఏదిఏమైనా చివరకు ప్రకాష్రాజ్ అడ్వాన్స్ను తిరిగి ఇచ్చివేసి నిర్మాతలు నష్టపోకుండా చేశారు. ఇది శుభపరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
- శిసూర్య