Prakashraj
-
రంగమార్తాండ వచ్చేస్తున్నాడు
థియేటర్స్‌కు రావడానికి రెడీ అయ్యాడు రంగ మార్తాండ. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రంగ మార్తాండ’. కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 22న విడుదల కానుంది. ‘‘ఈ మార్చి 22న రంగమార్తాండుడి జీవన నాటకం..’ అని పేర్కొన్నారు దర్శకుడు కృష్ణవంశీ. రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్, ఆదర్శ్ బాలకృష్ణ, శివాత్మిక రాజశేఖర్ కీలక పాత్రలు ΄ోషించిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. మరాఠీ ఫిల్మ్ ‘నటసామ్రాట్’కు తెలుగు రీమేక్‌గా ‘రంగమార్తాండ’ రూ΄÷ందింది. -
నన్ను క్షమించగలవా?
ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ మార్తాండ’. నటుడు బ్రహ్మానందం కీలక పాత్రలో నటించారు. కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలవుతోంది. బ్రహ్మానందం పుట్టినరోజు (ఫిబ్రవరి 1) సందర్భంగా ‘రంగ మార్తాండ’ నుంచి బ్రహ్మానందం గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘‘ధగ ధగ్గాయ రాజమకుట సువర్ణ మణిగణ రాజరాజేశ్వరా, సుయోధన సౌర్వభౌమ.. శరాఘతాలతో ఛిద్రమై.. ఊపిరి ఆవిరై దిగంతాల సరిహద్దులు చెరిగిపోతున్న వేళ.. అఖండ భారత సామ్రాజ్యాన్ని కురుక్షేత్ర సంగ్రామంలో కానుకగా ఇస్తానని శుష్క వాగ్దానాలు వల్లెవేసిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనం కల్పిస్తున్నావా? నా దైవ స్వరూపమా.. నన్ను క్షమించగలవా?’’ అంటూ భావోద్వేగంతో బ్రహ్మానందం చెప్పే డైలాగ్స్‌తో గ్లింప్స్ సాగుతుంది. రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఇళయరాజా. -
హిట్టు కోసం అలా చేయడం నాకు చేతకాదు : కృష్ణవంశీ
ట్రెండ్ అనేది ఉందా? నో అంటారు కృష్ణవంశీ. ప్రేక్షకుల మైండ్‌సెట్ మారిందా? అస్సలు కానే కాదు అంటారు ఈ క్రియేటివ్ డైరెక్టర్. ‘సాక్షి’కి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో కృష్ణవంశీ ఇంకా చాలా విషయాలు చెప్పారు. ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ముఖ్య తారలుగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ మార్తాండ’. మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్‌లో విడుదల కానుంది. ఇక కృష్ణవంశీ ఇంటర్వ్యూలోకి వెళదాం... ► మీ కెరీర్లో ‘రంగ మార్తాండ’ రెండో రీమేక్ (నాగార్జునతో తీసిన ‘చంద్రలేఖ’ మలయాళ రీమేక్ ). మళ్లీ రీమేక్ సినిమా చేయాలని ఎందుకనుకున్నారు.. కథలు రాయలేకపోతున్నారా? కృష్ణవంశీ : (నవ్వుతూ)... కథలు రాయలేకపోవడం కాదు. ‘రంగ మార్తాండ’ నేను చేయాలనుకున్నది కాదు. మరాఠీ సినిమా ‘నట సామ్రాట్’ రీమేక్‌లో నటించడంతో పాటు డైరెక్ట్ చేయాలనుకున్నాడు ప్రకాశ్‌రాజ్. ‘ఈ సినిమాని రీమేక్ చేయా లనుకుంటున్నాను. నాకు స్క్రీన్ ప్లేలో సహాయం చెయ్’ అని అడిగాడు. ఒకరోజు రాత్రి కూర్చుని చూడటం మొదలెట్టా.. ఒకచోట కాదు ఐదార్లు చోట్ల ఏడుపొచ్చేసింది. ‘ఇది ఎక్స్ట్రార్డినరీ సినిమా. రీమేక్ చెయ్, నీకు ఎలాంటి సహాయమైనా నేను చేస్తాను’ అని ప్రకాశ్‌తో అన్నాను. ‘నేను డైరెక్ట్ చేసి యాక్ట్ చేయడం కంటే నువ్వెలాగూ ఎమోషన్స్‌ని అద్భుతంగా డీల్ చేస్తావు. నన్ను కూడా బాగా డీల్ చేస్తావు. నువ్వు డైరెక్ట్ చేస్తే బావుంటుంది. నాకోసం చెయ్’ అన్నాడు. సరే అన్నాను. అలా ‘రంగ మార్తాండ’ ప్రాజెక్ట్‌లోకి వచ్చాను. ► ‘నట సామ్రాట్’లో మిమ్మల్ని అంతగా కదిలించినదేంటి? ఇది మన తల్లిదండ్రుల కథ. మన తల్లిదండ్రులకు కావాల్సినంత విలువ ఇస్తున్నామా? లేదా గౌరవించి తప్పుకుంటున్నామా? అనే పాయింట్ ఉంది. సామాజిక పరిస్థితులు, ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ వల్ల మనుషులు ఒకరినొకరు అర్థం చేసుకోవడం మారుతోంది. సక్సెస్ సాధించాలని పరుగు తీయడంలోనో, అందరితో పొగిడించుకోవాలనే ప్రయత్నంలోనో, అందరికంటే అధికుణ్ణి అనిపించుకోవాలనే తపనలోనో మనల్ని మనం కోల్పోతున్నాం. అది ‘నట సామ్రాట్’లో నాకు కనిపించింది. ఇది ఒక స్టేజ్ యాక్టర్ కథ. అతను స్టేజ్ మీద విలువలతో బతికినవాడు.. బ్రహ్మాండమైన నటుడు. అందుకే ‘రంగ మార్తాండ’ అనే బిరుదు ఇస్తారు. ఆ బిరుదు వచ్చిన రోజునే అతను నటనకి రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు. అప్పటివరకూ నటుడిగా రంగుల ప్రపంచం, నిరంతరం చప్పట్ల మధ్య ఉండే అతను నిజ జీవితంలో తండ్రిగా, తాతగా, భర్తగా, స్నేహితుడిగా తన పాత్ర పోషించే సమయంలో లైఫ్‌లో ఎంతమంది నటులున్నారో తెలుస్తుంది. అతను నమ్మిన ఆదర్శాలకు, బయట నిజాలకు క్లాష్ అవుతుంది. తల్లిదండ్రులు స్వార్థపరులయిపోయారు. పిల్లలు స్వార్థపరులయిపోయారు అని నిందించకుండా ఎవరి పాయింట్లో వాళ్లే కరెక్ట్ అన్నట్టు చూపిస్తూ, వాళ్ల మధ్య క్లాష్ ఎలా వస్తుంది? అనేదే ఈ కథ. ► ‘రంగ మార్తాండ’ మళ్లీ మిమ్మల్ని హిట్ ట్రాక్‌లోకి తీసుకుని వస్తుందనుకుంటున్నారా? నేను ఇలా చెబితే నమ్మశక్యంగా ఉంటుందో లేదో తెలియదు కానీ హిట్ కోసం నేనెప్పుడూ సినిమా తీయలేదు. తీసిన తర్వాత జనానికి నచ్చితే హిట్ అవుతుంది అనుకునేవాణ్ణి. హిట్ కోసం తీయాలంటే అప్పటికి మార్కెట్లో ఉన్న హిట్ ఫార్ములాని వాడాలనిపిస్తుంది. అప్పుడు అది సినిమా మ్యానుఫాక్చరింగ్ అవుతుంది తప్ప మేకింగ్ అవ్వదు. అలా చేయడం నాకు చేతకాదు. ఒకవేళ హిట్ కోసమే చేసేలా అయితే మంచి థ్రిల్లర్ సబ్జెక్టో, హీరో ఓరియంటెడ్ కథలో చేస్తాను కానీ ఇదెందుకు చేస్తాను? ఒకవేళ అలాంటి సినిమాలు తీసినా హిట్ అవుతాయని గ్యారంటీ ఏంటి? నా అనుభవంలో నాకు అర్థమయిందేంటంటే ఎవ్వరూ హిట్ సినిమా తీయలేరు. తీసిన సినిమాలు హిట్ అవుతాయి... అంతే. ► ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా హవా సాగుతోంది. ఈ ట్రెండ్‌ని మీరెలా చూస్తారు? నా చిన్నప్పటినుంచి మా ఊర్లో హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మన సినిమా (తెలుగు) దేశం నలు మూలలకు వెళుతోంది. అన్ని ప్రాంతాల వాళ్లు ఆదరిస్తున్నారు. ఇది కేవలం సౌత్ సినిమాలా కాకుండా సౌత్ సినిమాని కూడా ఇండియన్ సినిమాగా చేయొచ్చు అనే అర్థంతో పాన్ ఇండియా సినిమా అంటున్నారని అనుకుంటున్నాను. ► మీరు పాన్ ఇండియా సినిమా ట్రై చేస్తారా? ఏమో చెప్పలేం. అది సినిమాను బట్టి ఉంటుంది. ► కరోనా వల్ల ఇండస్ట్రీలో చాలామందికి రెండేళ్లు గ్యాప్ వచ్చింది. కానీ దానికంటే ముందే మీకు రెండేళ్లు గ్యాప్ వచ్చింది.. కారణం? ఆటోమేటిక్‌గా వచ్చేసింది అలా. ఫ్లాప్ అయిన తర్వాత పుంజుకోవడం కష్టం. హిట్.. ఫ్లాప్ అనేది నేను తీసుకోను. కానీ ఆ ఎఫెక్ట్ నా మీదుంటుంది. హిట్ కోసమని మెట్టు దిగి, దిగజారి ప్రజల్ని మభ్యపెట్టి సినిమా తీయలేను. రాజీ పడలేను. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు కదా. గ్యాప్ అయితే ఫ్లాప్స్ వల్లే వచ్చింది. హిట్ ఇస్తుంటేనే ఇండస్ట్రీలో ఫాస్ట్‌గా ఉంటాం. ► ప్రేక్షకుల మైండ్ సెట్ మారిందని కొంత వల్గర్ కామెడీ, రేంజ్‌కి మించిన వయొలెన్స్ తీస్తున్నారు కొందరు... దీని గురించి మీరేం అంటారు? ప్రేక్షకుల మైండ్ సెట్ మారలేదని నా అభిప్రాయం. అయినా ఇదో ఫేజ్ అనుకుంటున్నాను. మనం ఆ తరం (పాత సినిమాలు) చూశాం కాబట్టి ఇప్పుడు సినిమాలు చూసి బాధపడతాం. కానీ ఇప్పటివాళ్లు ఇవే చూశారు కాబట్టి వారికి ఇదే కరెక్ట్ అనిపిస్తుందేమో. ► ఫార్ములా ఫాలో కాకపోతే మీరు పోటీలో ఎలా నిలబడతారు? సినిమా తీసే ఫార్మాట్ ఒక్కటే మారింది. బేసిక్ ఎమోషన్స్ అన్నీ అవే. అదే లవ్, అదే ఫ్యామిలీ, అదే విలనిజం అన్నీ అవే. మంచి మీద చెడు గెలుస్తుంది అని చివర్లో చెప్పడం. కొన్నిసార్లు రోడ్డు మీద ప్రమాదాలు జరుగుతాయి. అలా అని ప్రయాణం మానేస్తామా? మన ప్రయాణం మనది. మనం ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టకుండా, వీలైతే మన వల్ల కొందరైనా పాజిటివ్‌గా ఉండగలుగుతున్నారా అనేదే మనం పట్టించుకోవాల్సింది. సో.. పోటీ గురించి భయపడటం, బాధపడటం నాకు రాదు. ► అలాగే ఒకప్పుడు ఎమోషన్ అంటే బలంగా చూపించేవారు. ఇప్పుడు కొన్ని చిత్రాల్లో లైటర్‌వీన్‌గా కనిపిస్తోంది. అదేమంటే ట్రెండ్ మారిందంటున్నారు... ఎమోషన్ని స్ట్రాంగ్‌గా చూపించడానికి ఇష్టపడటంలేదా? తెలియడం లేదా? చేతకావడం లేదా? దాసరిగారిలా, కేవీ రెడ్డిగారిలా, విశ్వనాథ్‌గారిలా సినిమాలు తీయలేం. అలా ఎవ్వరూ తీయలేరు కాబట్టి ట్రెండ్ మారింది అనుకుందామా? కరెక్ట్‌గా తీయగలిగితే అలా అనుకోనక్కర్లేదా? మరి.. కరెక్ట్‌గా తీయడం అంటే ఏంటని నన్ను అడగకండి. నాక్కూడా తెలియదు. ‘శంకరాభరణం’ సినిమాను ప్రపంచం ఆదరించింది కదా? ట్రెండ్ అంటూ ఏదీ లేదు. ట్రెండ్ అంటే నా దృష్టిలో బూతు. మనకు రామాయణం, మహాభారతం, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అన్నీ అందర్నీ నీతిగా నిజాయితీగా సామరస్యంగా ఉండాలనే బోధించాయి. ఏ మతమయినా ఇదే చెప్పింది. ఇప్పటికీ మనం వాటినే అనుసరిస్తున్నాం. ఇప్పుడు సినిమా కూడా ఒక మతంలా అయిపోయింది. ఏం మాట్లాడాలి? ఏం బట్టలు వేసుకోవాలి? అన్నీ సినిమా చెబుతుంది. సో... అలాంటి మీడియమ్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనం ఏం చేసినా సోషల్ బెనిఫిట్ ఉండాలి. ఫ్యామిలీ, ఎడ్యుకేషన్.. ఇలా అన్నింటికీ ఉపయోగపడేలా తీయాలి. ► ‘రంగ మార్తాండ’కి చిరంజీవి చెప్పిన వాయిస్ ఓవర్ గురించి? ఒక నటుడు తనని తనెలా అర్థం చేసుకుంటాడు? అనేది ఓ కాన్సెప్ట్‌లా అనుకుని, వాయిస్ ఓవర్ చెప్పించాలని అనుకున్నాను. రచయిత లక్ష్మీ భూపాల్‌తో రెగ్యులర్ పాటలా.. మాటాలా వద్దు.. షాయిరీలా చెప్పిద్దాం.. అలా రాయమని అన్నాను. ఇదే మాట ఇళయరాజాగారికి చెబితే ‘నువ్వు రాయించుకుని తీసుకురా చేద్దాం’ అన్నారు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ వాయిస్ ఓవర్‌ని ఏదైనా పెద్ద యాక్టర్‌తో చెప్పిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు తట్టినవి రెండే పేర్లు. సీనియర్ ఎన్టీఆర్‌గారు... చిరంజీవిగారు. చిరంజీవిగారికి ఫోన్ చేస్తే, రమ్మన్నారు. వెళ్లి, వివరించాను. షాయరీ ఐడియా విని ఆయన థ్రిల్లయ్యారు. ‘నా గురించి నేను చెప్పుకున్నట్టు ఉంది’ అన్నారు. ► అన్నం’ సినిమా అనౌన్స్ చేశారు? ‘రంగ మార్తాండ’ తర్వాత అదే చేస్తాను. ‘సింధూరం, ఖడ్గం, మహాత్మ’ ఆ జోన్ ఫిల్మ్ ఇది. ఫుడ్ మాఫియా, వ్యవసాయం, అన్నం, మనిషి తన స్వార్థం కోసం ఆవుల్ని, కోళ్లను ఎలా వాడుకుంటున్నాడు? అనేది కాన్సెప్ట్. ► ‘రంగ మార్తాండ’ సినిమాలో ఒక నటుడు తన రియల్ లైఫ్ గురించి ఏం తెలుసుకున్నాడో చూపిస్తున్నారు. మరి.. మీ లైఫ్‌ని విశ్లేషించుకుంటే మీకేమనిపిస్తోంది? నా అర్హతకి కొన్ని వేల రెట్లు ఎక్కువే ఇచ్చింది ఈ జీవితం. ఇప్పుడు నా మనసిక స్థితి ఎలా ఉందంటే.. ఏం చేసినా అది నేను చేయలేదు. అది (విధి) చేయించింది నాతో. ఎంత కాలం చేయించదలచుకుంటే అంత కాలం చేయిస్తుంది. నేనంటూ ఏం కోరుకోవడం లేదు. మన పుట్టుక మన కంట్రోల్లో లేదు. ఎప్పుడు పోతామో కూడా తెలియదు. మా ఊరి నుంచి మద్రాస్ తోసింది, అక్కడి నుంచి వర్మగారి దగ్గరకు తోసింది హైదరాబాద్‌కు. అక్కడ నుంచి దర్శకుడిని అయ్యాను. అన్నీ అలా జరుగుతూ వచ్చేశాయి.. అంతే. ► చాలామంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.. మీకు ఆ ఉద్దేశం లేదా? వచ్చే ఏడాది చేసే ప్లాన్ ఉంది. ఇప్పుడే చెప్పను కానీ పెద్ద బ్లాస్ట్ అది. 200–300 కోట్ల బడ్జెట్ అవుతుంది. ఓటీటీలో క్రియేటివ్ ఫ్రీడమ్ ఉంది. స్టార్సే ఉండాలని రూల్ కూడా లేదు. సినిమాను స్వచ్ఛంగా తీయొచ్చు. ► మీ సినిమాల్లో హీరోలతో బ్రహ్మాండంగా నటింపజేశారు. మీ అబ్బాయి రిత్విక్తో సినిమా చేస్తారా? వాడేం అవ్వాలనుకుంటాడో అది వాడి ఇష్టం. కాసేపేమో ఫుట్‌బాల్ అంటాడు. రేసర్ అంటాడు. యాక్టర్ అంటాడు. ఇప్పుడు టీనేజ్‌లో ఉన్నాడు కదా. కొత్తది ఏది చూసినా దాని మీదకు ధ్యాస వెళ్లిపోతుంది. ► మీ అబ్బాయి ఏమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేనేం అనుకోవడంలేదు. వాడి అదృష్టం ఎలా ఉంటే అలా జరుగుతుంది. నాకు, రమ్యకృష్ణకి బిడ్డ అయ్యాడంటేనే వాడి అదృష్టం మీకు అర్థం అవుతుంది కదా (నవ్వుతూ). – డి.జి. భవాని -
నేడే 'మా' ఎన్నికలు
సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు. -
MAA Elections 2021: ‘మా’ గొడవ మాదే
దాదాపు నాలుగైదు నెలలుగా ఎక్కడ చూసినా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల గురించి జరుగుతున్న చర్చల్లో ప్రధాన అంశాలివి. ‘మా గొడవ మాదే.. మేమంతా ఒక్కటే’ అంటూనే రాజకీయ ఎన్నికలను తలపించే రీతిలో ‘మా’ ఎన్నికల తీరు కనిపిస్తోంది. గత 28 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వివాదాలు, విమర్శలకు తోడు ఒకదశలో అభ్యంతరకర పదజాలంతో దూషణలూ వినిపించాయి. ఈ నెల 10న ‘మా’ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అంశంపై ఓ రౌండప్.. లోకల్.. నాన్‌లోకల్.. ‘సినిమా బిడ్డలం’ ప్యానల్ అంటూ ప్రకాశ్‌రాజ్, ‘మాకోసం మనమందరం’ అంటూ మంచు విష్ణు ‘మా’ అధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే. కొద్దిరోజులుగా రెండు పక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు ఘాటుగా సాగుతున్నాయి. మొదట్లో ‘‘ప్రకాష్‌రాజ్ నాన్‌లోకల్. షూటింగ్లకే సరిగా రాడు. ఇక ‘మా’ సమస్యలు పట్టించుకునే తీరిక ఎక్కడుంటుంది?’’ అనే ఆరోపణలు వచ్చాయి. అయితే.. ‘‘మూడు దశాబ్దాలుగా ఇక్కడ సినిమాలు చేస్తున్నాను. తెలంగాణలో గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఎవరూ నన్ను నాన్ లోకల్ అనలేదు. ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ అవుతాను’’ అని ప్రకాశ్‌రాజ్ తన వాదన వినిపించుకున్నారు. ఆయనకు మద్దతుగా నాగబాబు మూడు రోజుల కింద ఓ వీడియో విడుదల చేశారు. ‘‘మెగాస్టార్ చిరంజీవి మద్దతు ప్రకాశ్‌రాజ్‌కే. ఆయన ఉంటే ‘మా’ అసోసియేషన్ బాగుపడుతుంది. మన తెలుగువాళ్లు వేరే భాషల్లో నటించడం లేదా?’’ అని పేర్కొన్నారు. మరోవైపు.. ‘మీకు ఏ సమస్య వచ్చినా నేనిక్కడే ఉంటా.. ఈ ఊళ్లోనే ఉంటా’ అని మంచు విష్ణు ప్రకటించారు. ఆయన తండ్రి మోహన్‌బాబు కూడా.. ‘‘ఈ ఊళ్లోనే ఉండే నా కుమారుడు ఏ సమస్య వచ్చినా మీ పక్కన నిలబడి ఉంటాడని నేను మాట ఇస్తున్నాను. మీ ఓటును మంచు విష్ణుకు, అతడి పూర్తి ప్యానల్‌కు వేసి సమర్థవంతమైన పాలనకు సహకరించాలని కోరుకుంటున్నాను’’ అని శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. మెగా వర్సెస్ మంచు! మోహన్‌బాబు ‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణును నిలబెట్టాలనుకున్నప్పుడు చిరంజీవిని మద్దతు అడిగారని.. కానీ అప్పటికే ప్రకాశ్‌రాజ్‌కు సపోర్టు చేస్తానని మాటిచ్చానని చిరంజీవి చెప్పారనే వార్తలు వెలువడ్డాయి. దానిపై స్పందించిన మోహన్‌బాబు.. మెగాస్టార్ కుటుంబానికి చెందిన రామ్‌చరణ్, నాగబాబు వంటి వారు ఎన్నికల్లో నిలబడితే తాను మరో ఆలోచన లేకుండా మద్దతు తెలిపేవాడినని పేర్కొన్నారు. ఇలా ‘మా’ ఎన్నికలు ‘మెగా వర్సెస్ మంచు’లా మారాయి. పోస్టల్ బ్యాలెట్ వర్సెస్ ఈవీఎం తాము గెలిస్తే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారన్న ఆరోపణలు వచ్చే అవకాశముందని, పేపర్ బ్యాలెట్ పెట్టాలని మంచు విష్ణు కోరగా.. ఎన్నికల అధికారి పేపర్ బ్యాలెట్‌ను ఆమోదించారు. అయితే విష్ణు 60 మంది సీనియర్ నటులతో తనకు అనుకూలంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేయించుకున్నారని ప్రకాశ్‌రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ‘మా’ ఎప్పుడు మొదలైంది? తెలుగు సినిమా నటీనటుల సంక్షేమం కోసం ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ని 1993లో ఏర్పాటు చేశారు. చిరంజీవి వ్యవస్థాపక అ«ధ్యక్షుడిగా, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి వారు ముఖ్య సలహాదారులుగా వ్యవహరించారు. అసోసియేషన్ ప్రారంభంలో 150 మంది సభ్యులు ఉండేవారు. ఇప్పుడు దాదాపు 900 మందికిపైగా ఉన్నారు. పెద్దదిక్కు ఎవరు? ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరువర్గాల సభ్యులు పరుషంగానే మాటల తూటాలు విసురుకున్నారు. ఈ సందర్భంలో చాలామంది ‘దాసరి నారాయణరావు’ను గుర్తు చేసుకున్నారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా దాసరి సామరస్యంగా పరిష్కరించేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకపోవడం వల్లే ఇంత రచ్చ జరుగుతోందని అభిప్రాయపడ్డారు. కాగా.. సినిమా అంటే వినోదం అని.. ఇప్పుడు నటీనటులు ‘మా’ ఎన్నికల రూపంలో బయట వినోదం పంచుతున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి. ఇంతా చేసి ‘మా’ ఎన్నిక కాగానే మేమంతా ఒక్కటే అన్నట్టు కలసిపోతారని ఇండస్ట్రీ అంటున్న మాట. చదవండి: MAA Elections 2021: రెండు రోజుల్లో ఎన్నికలు.. ‘మా’కు సీవీఎల్ షాక్ -
ప్రాణం ఉన్న కథ చెబుతా
‘‘మనదేశంలోని ఓ అందమైన మహారణ్యంలో ఉంటున్న జంతుజీవాల గురించి ఎవరూ చెప్పని, ఎక్కడా వినని ప్రాణం ఉన్న కథను చెబుతాను’’ అంటున్నారు ప్రకాష్‌రాజ్. వచ్చే నెల 5న ప్రపంచపర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ఓ ప్రముఖ చానెల్లో జూన్ 5న ‘వైల్డ్ కర్ణాటక’ అనే ఓ డాక్యుమెంటరీ ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీకి తెలుగు, తమిళ భాషల్లో వాయిస్ ఓవర్ ఇచ్చారు ప్రకాష్‌రాజ్. ‘‘ప్రకృతికి గొంతుగా మారిన నా ఈ కొత్త ప్రయాణం అర్థవంతమైనది. వైల్డ్‌లైఫ్‌కి సంబంధించిన ఈ డాక్యుమెంటరీకి వాయిస్ ఓవర్ ఇవ్వడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారు ప్రకాష్‌రాజ్. ఈ ‘వైల్డ్ కర్ణాటక’ కన్నడ వెర్షన్‌కు రిషబ్‌శెట్టి, హిందీ వెర్షన్‌కు రాజ్‌కుమార్ రావ్ వాయిస్ ఓవర్ అందించారు. -
కేటీఆర్‌ను కలిసిన నటుడు ప్రకాశ్‌రాజ్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను సినీనటుడు ప్రకాశ్‌రాజ్ బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ గెలుపు నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపిన ప్రకాశ్‌రాజ్, నూతన సంవత్సర గ్రీటింగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా తన రాజకీయ ప్రవేశ విషయమై కేటీఆర్‌తో చర్చించారు. అనంతరం కేటీఆర్‌తో భేటీ ఫొటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నట్టు ప్రకటించిన ఆయన, తన రాజకీయ ప్రవేశానికి కేటీఆర్ ఇచ్చిన స్ఫూర్తి దాయక మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. -
మారొచ్చు ట్రెండు!
నటునిగా, నిర్మాతగా, దర్శకునిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు ప్రకాశ్‌రాజ్. ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిన ‘సాక్ష్యం’ సినిమాకు ఆయన వాయిర్ ఓవర్ ఇచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడాయన ‘హలో గురు ప్రేమకోసమే...’ సినిమా కోసం హీరో రామ్‌తో కలిసి పాట పాడారు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమాలో ‘ఫ్రెండ్ కోసం మారొచ్చు ట్రెండు’ అనే పాటను కలిసి పాడారట రామ్ అండ్ ప్రకాశ్‌రాజ్. ఈ పాటను త్వరలోనే విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఈ చిత్రాన్ని దసరా పండగ సందర్భంగా ఈ నెల 18న విడుదల చేయాలనుకుంటున్నారు. -
ఒకటి ముగిసింది.. మరొకటి మొదలైంది.
వయసు పెరుగుతున్నా సినిమాలు చేయడంలో మాలీవుడ్ స్టార్ మోహన్‌లాల్ స్పీడ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా రెట్టింపు అవుతోంది. ఇలా ఒక సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగానో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా ‘మార్కర్–అరబీ కదాలింటే సింహం’. శనివారం ఈ సినిమాను ప్రకటించారు మోహన్‌లాల్. ‘‘ప్రియదర్శన్ దర్శకత్వంలో ఆంటోని పెరంబవూర్ నిర్మాణంలో రూపొందనున్న నా కొత్త సినిమాలో నటించనున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. వీఏ శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో మోహన్‌లాల్, ప్రకాశ్‌రాజ్, మంజు వారియర్ ముఖ్య తారలుగా రూపొందిన సినిమా ‘ఒడియన్’ కంప్లీట్ అయ్యింది. ‘‘ఒడియన్’ షూటింగ్‌ను కంప్లీట్ చేశాం. 123 రోజుల ఈ సినిమా జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అన్నారు మోహన్‌లాల్. అంటే మోహన్‌లాల్ ఒక సినిమా పూర్తి చేయగానే మరో సినిమా మొదలుపెట్టేస్తారన్న మాట. మరోవైపు మోహన్‌లాల్ నటిస్తున్న మరో సినిమా ‘నీరళి’ మోషన్ పోస్టర్‌ను రీసెంట్గా రిలీజ్ చేశారు. అజయ్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పార్వతి నాయర్ కథానాయికగా నటిస్తున్నారు. ‘నీరళి’ చిత్రాన్ని ఈ ఏడాదే రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
ప్రచారతెరకు సినీ హంగు
కన్నడ ఎన్నికల ప్రచారం సినీ గ్లామర్‌తో సొగసులు అద్దుకోబోతోంది. తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిన ముఖ్య పార్టీలు సినీ తారలను మోహరించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఎంత త్వరగా సినీ స్టార్లు వస్తారా? అని అభిమానులు, జనం కూడా నిరీక్షిస్తున్నారండోయ్. సాక్షి, బెంగళూరు:అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పక్షాలు పోరాడుతున్నాయి. అన్ని పార్టీల అధినేతలు, రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారాగ్నికి ఆజ్యం పోసినట్లుగా సినిమా తారలను రంగంలోకి దింపేలా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్‌ను జేడీఎస్ ప్రచారానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం కిచ్చసుదీప్, కుమారస్వామి భేటీ అనేక ఊహాగానాలకు తావిస్తోంది. తెలుగు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచారానికి జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పిలిపించే పనిలో ఉన్నారు. రాజధానితో పాటు రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ద్వారా ప్రచారం నిర్వహించాలని కుమార ఆశిస్తున్నారు. సుదీప్ ప్రచారంపై తన అభిమానుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్ కూడా ప్రచారానికి రావడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి నటి రమ్య, బీజేపీ నుంచి ఎంపీ హేమామాలిని ప్రచారం నిర్వహిస్తారని పార్టీల నాయకులు తెలిపారు. నామినేషన్లు ఆరంభమయ్యాక మరింతమంది సినీతారలు రంగంలోకి దిగనున్నారు. వారిలోప్రముఖ తెలుగు, తమిళ, హిందీ స్టార్లు ఉన్నా ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్‌కే తారాబలం కాంగ్రెస్‌కు అత్యధికంగా సినిమా తారల బలం ఉంది. హీరోయిన్, కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రమ్య, అంబరీష్, మాలాశ్రీ, అభినయ, భావన, జయమాల వంటి ఉద్ధండులు ప్రచారానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కాంగ్రెస్ తరఫున ప్రచారంలోకి దింపేందుకు ఆ పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. బీజేపీ శిబిరంలోనూ తారాగణం బీజేపీకి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో స్టార్ ప్రచారకుడు ఉండనే ఉన్నారు. ఆయనతో పాటు కన్నడ నటులు జగ్గేష్, తార అనురాధ, శ్రుతి, మాలవిక అవినాష్, సాయికుమార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరమీదకు రానున్నారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని కూడా రంగంలోకి దింపి రాష్ట్రంలోని పలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించాలని చూస్తున్నారు. కాగా నటుడు ఉపేంద్ర రాజకీయ భవితవ్యంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన ఇటీవలే సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ పెట్టడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఉప్పి హడావుడి కనిపించడమే లేదు. దీంతో అభిమానుల్లో నిరాశ అలముకుంది. -
మహానటిని వదల్లేక!
సావిత్రిలా నడవటం, చూడటం. పెదవి విరవడం, డ్యాన్స్ చేయడం... ఇలా కొన్ని నెలలుగా కీర్తీ సురేశ్ తనను తాను సావిత్రిలా ఊహించుకున్నారు. అందుకే ఇక ఆమెలా అభినయించే అవకాశం లేదని ఫీలయ్యారు. ‘మహానటి’ షూటింగ్ చివరి రోజున కీర్తీ సురేశ్ ఎమోషన్ అయ్యారు. సావిత్రి చిత్రపటం దగ్గర దీపం వెలిగించారు. చెమర్చిన కళ్లతో చిత్రబృందం నుంచి వీడ్కోలు తీసుకున్నారామె. అలనాటి అందాల అభినేత్రి సావిత్రి జీవితం ఆధారంగా నాగ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మహానటి’. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంకా దత్ నిర్మించారు. సావిత్రి పాత్రలో కథానాయిక కీర్తీ సురేశ్ నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. నిర్మాత ప్రియాంకా దత్ మాట్లాడుతూ – ‘‘మహానటి’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని నిర్మించినందుకు గర్వపడుతున్నాం. కీలక పాత్రలు చేసిన మోహన్‌బాబుగారు, రాజేంద్ర ప్రసాద్‌గారు స్ట్రాంVŠ సపోర్ట్‌గా నిలబడ్డారు. కీర్తీ సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్ ఇలా భారీ తారాగణంతో మా బ్యానర్లో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. ఏయన్నార్ పాత్రలో నటించిన అక్కినేని నాగచైతన్యకు రుణపడి ఉంటాం. మే 9న చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. -
మణిరత్నం సినిమాలో మళ్లీ!
‘హిట్ పెయిర్’ పేరుతో ఓ జంట మళ్లీ మళ్లీ స్క్రీన్‌పై కన్పిస్తుంటే కొన్నాళ్లకు బోర్ కొట్టేస్తారు. కానీ, ఎన్నేళ్లైనా వెండితెరపై వన్నె తరగని జంటలు కొన్ని ఉంటాయి. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్, సహజ నటి జయసుధలది అలాంటి జంటే. ‘అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి’, ‘బొమ్మరిల్లు’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఇలా చెప్పుకోవడానికి చాలా సినిమాలున్నాయి! గతేడాది జాతీయ అవార్డు సాధించిన ‘శతమానం భవతి’తో సహా! జయసుధ, ప్రకాశ్‌రాజ్‌లు వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించిన ప్రతి సిన్మాలోనూ ప్రేక్షకులను తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ‘హిట్ పెయిర్’ అనే పదానికి కరెక్ట్ ఎగ్జాంపుల్‌గా నిలుస్తున్నారు. తాజాగా మణిరత్నం దర్శకత్వం వహించనున్న తమిళ సినిమాలోనూ ఈ ‘హిట్ పెయిర్’ వైఫ్ అండ్ హజ్బెండ్‌గా నటించేందుకు అంగీకరించారు. హీరోలు అరవింద్ స్వామి, శింబు, ఫాహద్ ఫాజిల్ వీళ్ల తనయులుగా కనిపిస్తారట. మరో హీరో విజయ్ సేతుపతి ఇన్స్పెక్టర్గా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్లు జ్యోతిక, ఐశ్వర్యా రాజేశ్‌లు కీలక పాత్రధారులు. జనవరిలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది!! -
మతం పేరుతో భయపెడుతున్నారు: ప్రకాశ్‌రాజ్
చెన్నై: మతం, సంస్కృతి, నైతికత పేరుతో కొందరు ప్రజలను భయపెడుతున్నారంటూ నటుడు ప్రకాశ్‌రాజ్ శుక్రవారం ఆరోపించారు. ‘నైతికత పేరుతో నా దేశపు వీధుల్లో యువ జంటలపై దాడులు చేయడం భయపెట్టడం కాకపోతే మరేమిటి? గోవధ చేశారేమోనన్న చిన్న అనుమానంతో మనుషులపై సామూహిక దాడులు చేసి హతమార్చడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం భయపెట్టడం కాక మరేంటి? అసమ్మతితో చిన్న స్వరం వినిపించినా వారిని బెదిరించడం, దూషించడం అంటే భయపెట్టడం కాదా?’ అని ట్వీట్లు చేశారు. -
అత్తగారికి మామిడి ముక్కలు
సమ్సారం సంసారంలో సినిమా మూడు రోజులుగా రమేశ్‌కి అమీర్‌పేట్ కాకతీయ మెస్‌లో భోజనం ఇంత బాగుంటుందని తెలిసొస్తోంది. కొంచెం రష్ ఉన్నా, పెరుగులోకి వచ్చిన వాణ్ణి కనిపెట్టి, వాడి వెనుక నిలబడి, టక్కున టేబుల్ మీద టోకెన్ పెట్టి, వాడు లేచిన వెంటనే సీట్‌ని గ్రాబ్ చేసి, భోజనం చేసి ఇంటికి వస్తున్నాడు. వస్తూ వస్తూ భార్యకు కూడా ఒక మీల్స్ పార్శిల్ తెచ్చి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాడు. ‘తిను సుజా’ అని అనడానికి ధైర్యం లేదు. ఆమెకు ఎప్పుడు తినాలని అనిపిస్తే అప్పుడే తింటోంది. ఇదంతా వేసవి వల్లే జరిగిందా అంటే అవునని చెప్పక తప్పదు. అందరికీ ఎండల కష్టాలు వస్తే రమేశ్‌కి మామిడి పండ్లతో కష్టాలు వచ్చాయి. వారం క్రితం తల్లి ఊరి నుంచి వచ్చి కొన్నాళ్లు ఉందామని ఆశ పడింది. తల్లి స్టేషన్లో దిగి ఒక్కతే రాలేదు. వెళ్లి రిసీవ్ చేసుకుందామని రమేశ్ అనుకున్నాడు కాని అది అత్యుత్సాహంగా ఉంటే సుజా హర్ట్ అవుతుంది. అందుకని చాలా క్యాజువల్‌గా ‘అమ్మను ఆటో ఎక్కి రమ్మందామా’ అన్నాడు. ‘ఎందుకులేండి... ఎలాగూ మీరు ఆఫీసుకు వెళ్లే టైమేగా. స్టేషన్ దాకా వెళ్లి మీరే ఆటో ఎక్కించి పంపండి’ అని సుజా అంది. అలా అనే అవకాశం ఇచ్చినందుకు, అలా ఉదారంగా వ్యవహరించే చాన్స్ ఇచ్చినందుకు సుజా ఈగో శాటిస్ఫై అవుతుంటుంది. ఈ విషయం కనిపెట్టే రమేశ్ కాపురాన్ని ‘ఔర్ ఏక్ ధక్కా... మనశ్శాంతి పక్కా’ నినాదంతో నెట్టుకొస్తూ ఉన్నాడు. చివరకు అమ్మ వచ్చింది. ఇంట్లో దిగింది. ఆమెకు రోజూ నాలుగు రకాల కూరలు చేయడం అలవాటు. పెద్ద చేయి. సుజా ఏమో నాలుగు ముక్కలు క్యారెట్ తరిగి ఫ్రై చేసి, ‘పెద్దిరాజు పికిల్’ పేరుతో అమ్మే పచ్చడి సీసాను టేబుల్ మీద పెట్టి, మనం దుబారాగా జీవించడం లేదు అనేలా హంబుల్‌గా సింపుల్‌గా రమేశ్‌కు కూడా అదే తిండి అలవాటు చేసింది. ఇలాంటి టైములో కూరగాయల బుట్ట అందుకుని అలా రైతు బజార్‌కు వెళ్లి కూరగాయలు తెస్తాను అని రమేశ్ అంటే అతడి జీవుడు అనూహ్యమైన పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుంది. అందుకే రమేశ్ ‘అమ్మ నాలుగు రకాల కూరలు చేయమంటుంది కాని నువ్వు పడనీకు. నువ్వు మాత్రం ఎక్కడని చేస్తావు. అస్సలు చేయకు’ అని సుజాతో అంటే ఆమె ఆ మాటకు చివుక్కున చూసి ‘ఏమండీ... మీ అమ్మకు నేను కడుపు నిండుగా తిండి పెట్టట్లేదని అందరూ అనుకోవాలనా? ఆమెకు కూరలంటే ఇష్టమైతే ఏం నేను చారు చేసి పెట్టనా? మిరియాల చారు చేసి పెట్టనా? చింతపండు చారు చేసి పెట్టనా? నిమ్మకాయ చారు చేసి పెట్టనా? ఏం ఆఖరుకు టొమాటా చారు కావాలంటే నాలుగు డబ్బులవుతాయని వెరవక అదీ చేసి పెట్టనా? మనింటికి మనిషి వచ్చినప్పుడు నాలుగు రకాల చార్లైనా చేసి పెట్టకపోతే ఎలాగండీ’ అంటుంది. ఆమెను అలా అననిచ్చినందుకు, అంత ఉదారంగా వ్యవహరించేలా చేసిందుకు ఈగో శాటిస్ఫై అయ్యి రమేశ్‌కు డే టు డే లైఫ్ స్మూత్ ఫంక్షనింగ్‌కు అవకాశం వస్తుంది. ఇంత తెలివైన రమేశ్ మామిడి పండ్ల విషయంలో పప్పులో.. సారీ తొక్కలో.. కాలు వేశాడు. నూజివీడు మామిడిపండ్లు కిలో ఎనభై అనంటే అరవైకి బేరం చేసి రెండు కిలోలు పట్టుకొని వచ్చాడు. తల్లికి మామిడిపండ్లంటే ఇష్టం. చిన్నప్పుడు ఊళ్లో తండ్రి బతికి ఉండగా వందా రెండు వందల కాయలు తెప్పించి గడ్డిలో మాగపెట్టి పిల్లలకు పెట్టడమే కాదు తనూ ఇష్టంగా తినేది. అది గుర్తుంది కాబట్టే తెచ్చాడు. తెచ్చి, ఇన్నోసెంట్‌గా వాటిని డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాటి సంగతి మర్చిపోవాల్సింది. మరుసటి రోజు రాత్రి భోజనం చేస్తూ సుజా తన పక్కన కూర్చుని చాకుతో మామిడి పండు తొక్క తీసి ముక్కలు చేస్తూ ఉండగా నోరు జర్రున జారాడు. ‘అమ్మకు కోసి పెట్టావా?’ అన్నాడు. అంతే. సుజా చివుక్కున చూసింది. పుటుక్కున చాకు కింద పడేసింది. చటుక్కున లేచి నిలబడింది. తటుక్కున డైలాగ్ అందుకుంది. ‘అంటే మీరు కోసి పెట్టమంటేనే నేను పెడతానా? నాకు తెలియదా? నాకు ఆ మాత్రం మనసు ఉండదా. ఊరి నుంచి వచ్చిన మనిషి, మీ అమ్మ, మా అత్తగారు ఇంట్లో ఉంటే ఆమెకు రెండు– మూడు ముక్కలు మామిడి పండు కోసి పెట్టాలన్న ఇంగితం కూడా లేని మనిషినా నేను? కావాలంటే రోజూ పెరుగన్నంలో ఒక ముక్క ఆసాంతం పెట్టనా? నిన్న పెట్టానో లేదో అడగండి. ఇవాళ పెట్టనో లేదో మీ నోటితో మీరే అడిగి నిర్థారణ చేసుకోండి. మనిషి మీద విశ్వాసం ఉండాలండీ. నమ్మకం ఉండాలి. నిశ్చింత ఉండాలి. అసలు అది పక్కన పెట్టండి. పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడైనా మీరు నన్ను... ఇదిగో ఇది తిను అన్నారా. అదిగో అది తింటావా అని అడిగారా. ఇదిగో మామిడి పండు కోయనా... మ్యాంగో మిల్క్ షేక్ చేసి ఇవ్వనా అని ఒక్కటంటే ఒక్కనాడైనా ఎన్నడైనా అడిగారా? మీ అమ్మ ముందు నన్ను తక్కువ చేయడానికి కాకపోతే ఎందుకండీ ఈ మాటలు... మనిషికో మాట కోడలికో ప్రశంస అన్నారు... పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నాను ఒక్కరోజైనా అమ్మా సుజా నువ్వు బాగా చేశావు అని మీ అమ్మా కొడుకులు అనగలిగారా అనడానికి నోరొచ్చిందా అలాంటి నాలికను ఆ దేవుడు మీకిచ్చాడా అని...’ ఆమె ఆ మాటలను ఎంతో దుగ్ధతో నొప్పితో జెన్యూన్ బాధతో చాలా మెల్లగా లోగొంతుకలో అన్నా రమేశ్‌కి అతని తల్లికి రమేశ్ వాళ్ల ఫ్లోర్ మీద ఉన్న మరో రెండు ఫ్లోర్లకి కింద ఉన్న ఇంకో ఐదు ఫ్లోర్లకి వీటితో పాటు చందా నగర్, నిజాం పేట్, రామచంద్రాపురం చుట్టుపక్కల ప్రాంతాల వాళ్లకి స్పష్టంగా వినపడ్డాయి. ఆ తెల్లవారే రమేశ్ తల్లి తన మేనబావగారి చిన కోడలి మరదలు జియాగూడలో గర్భంతో ఉందని ఆమెను చూసి అక్కడే నాలుగురోజులు ఉండి ఊరు వెళిపోతానని ఆటో ఎక్కకుండానే వెళ్లిపోయింది. ఆ వెంటనే ఎక్కడి నుంచో ఒక గండు పిల్లి వచ్చి గ్యాస్ బర్నర్ మీద పడుకుంది. పిల్లి లేవలేదు. అన్నం ఉడకలేదు. ఫ్రెండ్స్‌ని సలహా అడిగితే అమీర్‌పేట కాకతీయ మెస్ బెస్ట్ అని రమేశ్‌కి చెప్పారు. మూడు రోజులుగా ఇది నడుస్తోంది. ఇంకా ఎంతకాలం నడుస్తుందో తెలియదు. అనవసరంగా సుజా మనసును బాధ పెట్టానే అని రమేశ్ బాధ పడని క్షణం లేదు. సుజా అలక మాని తిరిగి మామూలు మనిషి అయ్యి ఆ క్యారెట్ ఫ్రై ఏదో చేసి తన మొహాన కొడితే తప్ప అతడికి తృప్తి లేదు. అదే జరిగిన రోజున ఇష్టదైవానికి గట్టి కొబ్బరి కాయ కొడతానని గాఢంగా మొక్కుకున్నాడు. అయితే ఆ రోజు ఎంతో దూరంలో లేదు మనందరికీ తెలుసు. ఏం... మరో రెండు మూడు నెలలు కాకతీయ మెస్ భోజనం చేస్తే రమేశ్ ఏమైనా అరిగిపోతాడా కరిగిపోతాడా... చోద్యం కాకపోతే. సినిమాలో సంసారం సినిమా: మల్లీశ్వరి వెంకటేశ్ నటించిన మల్లీశ్వరిలో వెంకటేశ్‌కు అన్న నరేశ్, వదిన రాజ్యలక్ష్మి. వెంకటేశ్ ఆ అన్నా వదినలతోనే కలిసి ఉంటాడు. అతడి పెళ్లి గురించి అన్నా వదినలకు పెద్దగా పట్టదు. వెంకటేశ్... యువరాణి కత్రినాతో ప్రేమలో పడతాడు. అయినా అన్నా వదినలు పట్టించుకోరు. వెంకటేశ్ తిడతాడు. ‘తమ్ముడి బ్యాగ్ తీసుకుని ఒకమ్మాయి ఇంటికి ఎందుకొచ్చింది. అసలా అమ్మాయి ఇంటికి వాడెందుకెళ్లాడు. బ్యాగెందుకు మర్చిపోయాడు. అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు. ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డాడా. అందుకే ఇంత కష్టపడ్డాడా. పోనీ ఒకమాటడిగితే నష్టమేమైనా ఉందా’ అని చెడామడా తిడతాడు. చివరకు వెంకటేశ్ కత్రినా వాళ్ల ప్యాలెస్‌కు వెళతాడు. అక్కడే నాలుగురోజులు ఉండాల్సి వస్తుంది. మధ్యలో ఇంటికి ఫోన్ చేస్తాడు. అది భోజనాల టైము. ‘అన్నయ్యా... వదినను నా బండి అప్పుడప్పుడు తుడుస్తుండమని చెప్పు’ అంటాడు. అప్పుడే ఆ ఒదిన పళ్లెం కడిగిన నీళ్లని ఎత్తి బండి మీద గిరాటు వేస్తుంటుంది. ‘మీ వదిన ఏకంగా బండి కడిగేస్తోంది’ అంటాడు అన్న. వాళ్లకు తొమ్మిదేళ్ల కూతురు ఉంటుంది. ‘పాప నీ గురించి బెంగ పెట్టుకుంది... మాట్లాడు’ అని నరేశ్ ఫోన్ పాపకిస్తాడు. వెంకటేశ్ ఫోన్లో ‘ఎందుకమ్మా బెంగ నాల్రోజుల్లో వచ్చేస్తానుగా’ అని అంటే పాప బదులుగా ‘అదేంటి... బాబాయి ఇంక రాడు మనం హాయిగా ఉండొచ్చు అని అమ్మ చెబుతోంది’ అంటుంది. వెంకటేశ్ ఖంగు తింటాడు. కాని ఇదంతా వింటున్న బ్రహ్మానందంతో ‘ఏమిటో మా మధ్యతరగతి అనుబంధాలు డబ్బున్నోళ్లకు తెలియవు’ అని నిట్టూరుస్తాడు. సంసారంలో ఇవన్నీ సరిగమలు. పదనిసలు. అదేంటి.. బాబాయ్ ఇంక రాడు.. మనం హాయిగా ఉండొచ్చని అమ్మ చెబుతోందీ.. సినిమా: ఆకాశమంత తండ్రులు పిల్లలను గారం చేయవచ్చు. కాని తల్లులు నిక్కచ్చిగా ఉంటారు. ‘ఆకాశమంత’ సినిమాలో ప్రకాష్‌రాజ్, ఐశ్వర్యలకు కూతురు పుడుతుంది. ఆ కూతురంటే ప్రకాశ్‌రాజ్‌కు వల్లమాలిన ప్రేమ. కాలు కందకుండా పెంచుకుంటూ ఉంటాడు. పాపకు మూడేళ్లు వస్తాయి. అప్పుడే భార్య బాంబు పేలుస్తుంది. ‘పాపను స్కూల్లో చేర్పించాలి’ అంటుంది. ‘ఇప్పుడే నడవడం నేర్చుకుంది. అప్పుడే స్కూల్ ఏమిటి’ అంటాడు ప్రకాష్‌రాజ్. నథింగ్ డూయింగ్ చేర్పించాల్సిందే అంటుంది ఐశ్వర్య. అంతే కాదు ‘పేరెంట్స్‌కు కూడా ఇంటర్వూ్య ఉంటుంది. ప్రిపేర్ అవ్వండి’ అని పుస్తకాలు నెత్తిన పడేస్తుంది. ఇంట్లో మాక్ టెస్ట్‌లు కూడా నిర్వహిస్తుంటుంది. ఒక టెస్ట్‌లో ప్రకాష్‌రాజ్ జపాన్ రాజధాని ‘నోక్యో’ అని రాస్తాడు. ఈ సంగతి తెలిసి అతడు పని చేసే టీ ఎస్టేట్‌లో కార్మికులందరూ ప్రకాష్‌రాజ్‌ను మందలిస్తారు. బాగా చదవమని చెప్తారు. చివరకు స్కూల్ అడ్మిషన్ రోజు వస్తుంది. ప్రకాష్‌రాజ్ క్యూలో నిలుచుంటాడు. అతని పక్కన ఒకతను చాలా వర్రీతో చదివేస్తుంటాడు. అతడు లాస్ట్ ఇయర్ ఇంటర్వూ్య ఫెయిల్ అయ్యాడట. కారణం ‘భారతదేశంలో బంగారం ఎక్కడ దొరుకుతుంది’ అని అడిగితే ‘ఆర్.ఎస్.బ్రదర్స్’ అని సమాధానం చెప్పాడు. ఈలోపు ప్రకాష్‌రాజ్‌కు ‘అలెగ్జాండార్ గుర్రం పేరు ఏమిట’నే డౌట్ వస్తుంది. పక్కనున్న అతన్ని అడుగుతాడు. అతను చాలా కంగారుగా ‘ఆ గుర్రం మేలా ఫిమేలా’ అని ప్రశ్నిస్తాడు. చివరకు ఈ ప్రశ్న పెద్ద కలకలమే రేపుతుంది. సంసారంలో పిల్లల చదువు అనేది పెద్ద పిడకల వేట. ఆ వేటకు అంతం లేదు. అలెగ్జాండర్ గుర్రం పేరు? – కె -
మహానటి భర్తగా విలక్షణ నటుడు..?
ఎవడే సుబ్రమణ్యం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నాగ అశ్విన్ చేస్తున్న రెండో సినిమా మహానటి. అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులతో పాటు నటీనటుల ఎంపిక కూడా జరుగుతోంది. ఇప్పటికే సావిత్రి పాత్రకు కీర్తి సురేష్ ను ఫైనల్ చేయగా, కథను నడిపించే జర్నలిస్ట్ పాత్రకు సమంతను తీసుకున్నారు. సావిత్రి సమకాలీన నటి అయిన జమున పాత్రను అనుష్క చేయించాలని భావిస్తున్నారు. అయితే సావిత్రి జీవితంలో కీలకమైన ఆమె భర్త, హీరో జెమినీ గణేషన్ పాత్రను ఎవరితో చేయిస్తారన్న ప్రశ్న చాలా రోజులుగా అభిమానులను వేదిస్తోంది. ఈ పాత్రకు నెగెటివ్ షేడ్స్ కూడా ఉండే అవకాశం ఉండటంతో ఎవరు చేస్తారన్న దానిపై మరింత ఆసక్తి నెలకొంది. ఒక సమయంలో హీరో సూర్య సావిత్రి భర్తగా నటిస్తున్నరన్న టాక్ వినిపించినా.. తరువాత కాదని తేలిపోయింది. తాజాగా ఈ పాత్రకు విలక్షన నటుణ్ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటుడిగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ మహానటి సినిమాలో సావిత్ర భర్తగా నటించనున్నాడు. ఇప్పటికే దర్శకుడు నాగఅశ్విన్ ప్రకాష్ రాజ్ కు కథ కూడా వినిపించాడు. త్వరలోనే సావిత్రి సినిమాలో పాత్రలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతల... మన ఊరి రామాయణం
ప్రకాశ్‌రాజ్ దర్శకుడిగా తీసిన తొలి రెండు సినిమాలు ప్రేక్షకులకు చేరువ కాలేకపోయుండొచ్చు. కానీ ఆయనలో ఓ మంచి కథకుడు ఉన్నాడనే విషయాన్ని మాత్రం ఆ సినిమాలు స్పష్టంగా చాటి చెప్పాయి. మనవైన కథల్ని ప్రేక్షకులకు చూపించాలనే ప్రకాశ్‌రాజ్‌లోని ఓ తపన ఆ సినిమాలతోనే బయటపడింది. అందుకే ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టాడనగానే ప్రేక్షకులు ఆసక్తిగా ఆ సినిమావైపు చూడటం మొదలుపెట్టారు. ‘మన ఊరి రామాయణం’ అంటూ ప్రకాశ్‌రాజ్ దర్శకత్వం వహించి, నటించి, నిర్మించిన ఆ సినిమా ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ పాఠకుల కోసం కొన్ని విశేషాలు... మనందరి రామాయణం: ప్రతి మనిషిలోనూ రాముడు, రావణుడు ఉంటాడు. పరిస్థితుల్నిబట్టి ఒక్కో సందర్భంలో ఒకొక్కరు మనలో నుంచి బయటికొస్తుంటారు. ఆ విషయాన్నే దుబాయ్ రిటర్న్ అయినటువంటి ఒక వ్యక్తి నేపథ్యంలో చెప్పే ప్రయత్నం చేశారు ప్రకాశ్‌రాజ్. సమాజంలో ఎంతో గౌరవింపబడే ఆ వ్యక్తికి శ్రీరామనవమి సమయంలో ఎదురైన అనుభవాలు ఎలాంటివి? తన జీవితాన్ని ఆ సంఘటనలు ఏ విధంగా మలుపు తిప్పాయి? అనే విషయాల్ని ఆసక్తికరంగా చూపించా మంటున్నారు ప్రకాశ్‌రాజ్. ఐదుగురు జాతీయ అవార్డు గ్రహీతలు: ప్రకాశ్‌రాజ్‌లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, తనకి తెలిసింది చేస్తారు, తెలియని దాని కోసం వినమ్రంగా వేరే వ్యక్తుల దగ్గరికి వెళతారు. ‘మీరే చేయాలి’ అని బాధ్యనంతా వారిపై పెడతారు. ‘మన ఊరి రామాయణం’కి ప్రకాశ్‌రాజ్ ఓ కథకుడు, ఓ దర్శక-నిర్మాత, ఓ నటుడిగా మాత్రమే చేశారు. సాంకేతికత విషయంలో మాత్రం నిష్ణాతులైన వ్యక్తుల్ని సంప్రదించారు. సంగీతం కోసం ఇళయరాజా, ఎడిటింగ్ కోసం శ్రీకర్ ప్రసాద్, కథానారుుక పాత్ర కోసం ప్రియమణి, కళా దర్శకత్వం కోసం శశిధర్ అడపాల్ని సంప్రదించారు. వాళ్లంతా కూడా జాతీయ అవార్డు గ్రహీతలే. ప్రకాశ్‌రాజ్‌తో కలుపుకొంటే మొత్తం ఐదుగురు జాతీయ పురస్కార గ్రహీతలు ‘మన ఊరి రామాయణం’కి పనిచేశారు. మనదైన ఓ కథని చెప్పాలనే ఓ ప్రయ త్నమే దర్శకత్వంవైపు అడుగేయించింది. దర్శకత్వంలో ఓ గొప్ప సంతృప్తి లభిస్తోంది. నా తొలి, మలి సినిమాల ఫలితాన్ని పట్టించుకోను. ఒక సినిమా ఆడటానికి, ఆడకపోవ డానికి చాలా కారణాలుంటాయి. కానీ మన మనసులోని కథని ఎలా చెప్పామన్నదే నాకు ముఖ్యం. ‘మన ఊరి రామాయణం’ విషయంలో ఓ కథకుడిగా చాలా సంతృప్తిగా ఉన్నా. కానీ నా కథ గురించి నేను సంతృప్తి పడితే సరిపోదు. అది ప్రేక్షకులకూ సంతృప్తినివ్వాలి. ఆ తీర్పు కోసమే ఎదురు చూస్తున్నా. ఫలితమెలా ఉన్నా... నావైన ప్రయత్నాలు ఇకపై కూడా జరుగుతూనే ఉంటాయి - ప్రకాశ్‌రాజ్ -
నమ్మకం నిలబెట్టుకుంటా!
‘‘ఎనిమిదేళ్ళుగా కమల్‌హాసన్‌గారి దగ్గర పనిచేస్తున్నా. నాతో పాటు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన నాకే ఈ చిత్ర దర్శకత్వ అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది’’ అని రాజేశ్ అన్నారు. రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ పతాకంపై కమల్‌హాసన్, ప్రకాశ్‌రాజ్, త్రిష, మధుశాలిని ముఖ్య పాత్రల్లో రాజేశ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘చీకటి రాజ్యం’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతోంది. దర్శకుడు రాజేశ్ మాట్లాడుతూ -‘‘మొదటి సినిమాతోనే అగ్ర నటులతో పనిచేయడం ఆనందంగా ఉంది. నటీనటులు, సాంకేతిక బృందాన్ని నేనే ఎంపిక చేసుకున్నాను. కమల్‌గారికి నా మీద ఉన్న నమ్మకం అలాంటిది. యాక్షన్ చెప్పాక, నటించి వెళ్లిపోతారు. ఇక నాకు ఏదైనా సన్నివేశం సరిగ్గా రాలేదనిపించి అడిగితే ఎన్నిసార్లయినా చేస్తారు. ఈ సినిమా రోడ్డు ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. యాక్షన్ సన్నివే శాలు చాలా క్లిష్టంగా ఉంటాయి. అందుకే అంతర్జాతీయ స్థాయి స్టంట్ మాస్టర్స్‌తో పనిచేస్తున్నాం. నా మీద చాలా నమ్మకంతో కమల్‌హాసన్‌గారు నాకు దర్శకత్వ బాధ్యత అప్పగించారు. కచ్చితంగా నిలబెట్టుకుంటాను’’ అని చెప్పారు. -
కొందరు మారరు: ప్రకాష్‌రాజ్
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల విమర్శలకు ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ సోషల్ మీడియా ద్వారా వెంటనే స్పందించారు. ప్రిన్స్ మహేశ్‌బాబు ఆగడు సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య తలెత్తిన విభేదాలు చిలికిచికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. ప్రకాష్‌రాజ్ శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శ్రీను వైట్లను విమర్శిస్తే, శ్రీను వైట్ల ఈరోజు ప్రెస్మీట్లో ప్రకాష్‌రాజ్‌ను విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రకాష్‌రాజ్ ఫేస్బుక్లో, ట్విట్టర్ లో ఇలా రాశారు: కొందరు మారరు ''తాటి చెట్టు కింద దొరికిపోయినవాడిని ఏమి చేస్తున్నావు అని అడిగితే, పాలు తాగుతున్నానని చెప్పాడట'' ఆల్ ది బెస్ట్ ఛీర్స్. Kondaru mararu " thaati chettu kinda doriki poina vadni em chestunnav Ani adigithe paalu thaaguthunna ani chepyadanta " all the best cheers — Prakash Raj (@prakashraaj) October 5, 2014 -
జంటిల్మేన్ అనిపించుకున్న ప్రకాష్‌రాజ్!
ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ జంటిల్మేన్ అనిపించుకున్నారు. తను అడ్వాన్స్‌గా తీసుకున్న సొమ్ముని ప్రకాష్‌రాజ్ తిరిగి ఇవ్వడంతో 'ఆగడు' సినిమా వివాదం పరిష్కారమైంది.14రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థ మహేష్ బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు చిత్రం నిర్మిస్తున్నారు. ప్రకాష్‌రాజ్ తనపట్ల అమర్యాదగా ప్రవర్తించారని ఆగడు సినిమా సహాయ దర్శకుడు సూర్య తెలుగు సినిమా దర్శకుల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో ఆ సినిమా నుంచి ప్రకాష్‌రాజ్‌ను తొలగించారు. ఆయన స్థానంలో సోనుసూద్‌ను తీసుకున్నారు. ఇదిలా ఉంటే, ప్రకాష్‌రాజ్ అనుచిత ప్రవర్తన అంశం దర్శకుల సంఘం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఏపిఎఫ్సిసి) దృష్టికి తీసుకువెళ్లింది. ఫిల్మ్ ఛాంబర్ సలహా మేరకు తాను అడ్వాన్సుగా తీసుకున్నే మొత్తం ఇవ్వడానికి ప్రకాష్‌రాజ్ అంగీకరించారు. అడ్వాన్సులో అధిక మొత్తం తిగిరి చెల్లించినట్లు కూడా తెలిసింది. మిగిలినది కూడా త్వరలో చెల్లిస్తానని ప్రకాష్‌రాజ్ చెప్పినట్లు సమాచారం. ఈ విధంగా అధిక మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న సొమ్ముని తిరిగి ఇవ్వడం టాలీవుడ్లో ఇదే మొదటిసారి అంటున్నారు. తనకు, సహాయదర్శకునికి మధ్య జరిగిన సంభాషణలు వివాదానికి దారితీసిన నేపధ్యంలో ఆ చిత్రం నుంచి తనను తొలగించినప్పటికీ ప్రకాష్‌రాజ్ అడ్వాన్సును తిరిగి ఇచ్చి జంటిల్మేన్గా నిలిచారని సినీవర్గాలు అంటున్నాయి. ఈ విషయంలో తాను ఏ తప్పు చేయలేదని గతంలో ప్రకాష్‌రాజ్ చెప్పారు. ఒక వ్యక్తి ఆడుతున్న నాటకం వల్ల ఇలా జరిగిందన్నారు. సినిమా సెట్లో తనకు దర్శకునికి మధ్య ఒక అంశంపై అభిప్రాయభేదాలు వచ్చిన మాట నిజమేనని చెప్పారు. దాంతో తనను కాదని, వేరొక నటుడిని తీసుకున్నారని తెలిపారు. అంతవరకు బాగానే ఉందని, అయితే ఆ తరువాత జరిగిన సంఘటనను వక్రీకరించి తనపై ఫిర్యాదు చేయడం బాధకలిగించిందన్నారు. ఈ విషయాన్ని ప్రకాష్‌రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దృష్టికి తీసుకువెళ్లారు. పుస్తక ప్రియుడు, స్టేజీ ఆర్టిస్ట్‌గా, సినిమా నటుడుగా ఎంతో అనుభం ఉన్న ప్రకాష్‌రాజ్‌కు అయిదు భారతీయ భాషలలో పట్టుంది. నాలుగు జాతీయ అవార్డుల అందుకున్న అతను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో దాదాపు 200 సినిమాలలో విలక్షణమైన పాత్రలలో నటించారు. జరిగిన సంఘటనపై అతను బాధపడుతూ అప్పట్లో ఓ రోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తన బాధను వెళ్లగక్కారు. ఆ తరువాత ఓ కవిత కూడా వినిపించారు. తనని ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించిన వ్యక్తి పేరు చెప్పకుండా, అతనిపైనే ప్రకాష్‌రాజ్ ఈ కవిత రాసి, చదివారు. ''నన్ను రాళ్లతో కొట్టాలనుకోకు నేను ఆ రాళ్లతో ఇల్లు కడతాను. నన్ను కాల్చేయాలని నిప్పు పెట్టకు, ఆ నిప్పుతో నేను దీపం వెలిగిస్తాను. నన్ను పరిశ్రమ నుంచి పంపించాలనుకోకు, నేను చేరాల్సిన గమ్యానికి ఇంకా త్వరగా చేరుకొంటాను. నన్ను చంపాలని విషం పెట్టకు, దానిని మింగి నీలకంఠుడిని అవుతాను'' అని చదివారు. ఏదిఏమైనా చివరకు ప్రకాష్‌రాజ్ అడ్వాన్స్‌ను తిరిగి ఇచ్చివేసి నిర్మాతలు నష్టపోకుండా చేశారు. ఇది శుభపరిణామంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. - శిసూర్య -
మా ఇద్దరినీ కలిపింది కవిత్వం కాదు... జీవనోత్సాహం!
తనికెళ్ల భరణి... ఈ ప్రపంచానికి ఒక్కడిగా కనిపించొచ్చు! కానీ ప్రకాశ్‌రాజ్‌కి మాత్రం భరణి చుట్టూరానే ప్రపంచం కనిపిస్తుంది! ప్రకాశ్‌రాజ్ సుదీర్ఘ ప్రయాణంలో ఓ రహదారిలా... ఓ వారధిలా... దొరికిన సాంగత్యం భరణి! వీరిద్దరి స్నేహంలో ఓ ప్యాసా ఉంది... ఓ అంతుచిక్కని మజా ఉంది..! భరణి గురించి ప్రకాశ్‌రాజ్ హృదయావిష్కరణ... ‘సాక్షి’కి ప్రత్యేకం మనం ప్రేమించిన క్షణం... గడిచిపోయిన క్షణం కాదు. తలచుకొన్నప్పుడల్లా కాలాన్ని గెలిచి, మళ్లీ మళ్లీ బతికే క్షణం! ‘దేవదాసు’ చేసిన 20 ఏళ్ల తర్వాత దిలీప్‌కుమార్‌గారు బెంగళూరు వెళ్లారు...ఓ అభిమాని ‘దేవదాసు’ని గుర్తు చేసి‘ఎంత బాగా చేశారండీ’ అని ప్రశంసించాడు.దిలీప్‌కుమార్ కదిలిపోయారు.నేను వేషం వేస్తున్నప్పుడు బతికింది ఒక్క క్షణమే.తెరపై ఆ పాత్రను చూసి ప్రేక్షకుడు పులకించిందీ ఒక్క క్షణమే! అయితే ఆ పులకింతలన్నీ అనంతవాహినిలా ప్రవహిస్తూ... ఇరవై ఏళ్ల తర్వాత కూడా మళ్లీ నా క్షణాన్ని నాకు గుర్తు చేసింది కదా అనుకున్నారు దిలీప్‌కుమార్. తనికెళ్ల భరణి పొయిట్రీ చదువుతుంటే కూడా నాకదే ఫీలింగ్... మళ్లీ మళ్లీ బతికే క్షణం! అసలు తనికెళ్ల భరణి ఎవరు? నేను ఎవరు? ఓ రచయితగా, నటునిగా వాడు నాకు తెలియదు... నేనూ వాడికంతే! ఓ జర్నీ చేయడానికి ఇద్దరం దొరికాం.పది పదిహేనేళ్ల నుంచి జరుగుతున్న జర్నీ ఇది. ఒకరికొకరం వెతుక్కుంటూ వెళ్తే దొరికినవాళ్లం కాదు! వాడి ప్రపంచం వేరు... నా ప్రపంచం వేరు.అయినా కలిశాం. ఎందుకు కలిశామంటే... మేం కలవాలంతే! భరణి అంటే ఎందుకిష్టమంటే? ఏమో చెప్పలేను. కొన్నింటిని ఎక్స్‌ప్రెస్ చేస్తే ఆ మిస్టరీ పోతుంది. మా ఇద్దర్నీ కలిపింది కవిత్వం కాదు.. జీవనోత్సాహం! వాడు చాలా ప్రామాణికుడు... నిజంగా ప్రేమిస్తాడు. ఆత్మబంధువులా ఉంటాడు. కొందరే ఉంటారలా! తన ఆంతర్యాన్ని, ఆత్మను, అభివ్యక్తీకరించే తీరు... అదే నాకు నచ్చుతుందేమో! భరణి రాసిన ‘శృంగార గంగావతరణం’ చదివారా? వెంటనే చదవండి. ‘గంగోత్రి’ షూటింగ్ జరుగుతున్నప్పుడు గంగానది ఒడ్డున కూర్చుని, వినిపించాడు నాకు.శివుడు తన జటాజూటంలో గంగాదేవిని బంధిస్తే..గంగకే చెమట్లు పట్టడం లాంటి ఎక్స్ప్రెషన్స్... ఎన్నెన్నో! కొన్ని నెలల తర్వాత కలిసినా... ‘అరె.. నిన్ననే కలిశాం కదా’ అనిపించడమంటే.. ఆ బంధంలోని గాఢత్వం గురించి ఇంకేం చెప్పాలి? వాడు సంబరం చేసుకుంటుంటే వాడిలో సగమై నేనుంటా! నేను ఉత్సాహంతో ఊరేగుతుంటే వాడు నాలో ఉంటాడు! ఎక్కడో అమలాపురంలో షూటింగంతా కానిచ్చేసి మహ్మద్ రఫీ పాట వింటూ... ఓ తన్మయావస్థలో ఉన్నప్పుడు వాడు గుర్తుకొస్తాడు. చిన్న ఫోన్ కాల్... రెండు నిమిషాల టాక్... ఎందుకో ఆ సఖ్యం ఎప్పుడూ కావాలనిపిస్తుంది. ప్రపంచంలో వాడొక భాగం కాదు... వాడి చుట్టూరా ఉన్నదే ప్రపంచం! అక్కడ్నుంచే అసలు ప్రపంచం మొదలైందనిపిస్తుంది. వాడి అమెరికా వేరు... వాడి పల్లెటూరి వేరు. వాడి శివుడు వేరు.. వాడి ప్రేమ వేరు. నాదీ అదే పరిస్థితి! ఈ తీవ్రతే... ఈ విభిన్నతే... మా ఇద్దరికీ బ్రిడ్జ్ వేసినట్టుంది. ప్రతి మనిషిలోనూ పొయిట్రీ ఉంటుంది. ఆస్వాదించడం తెలియాలి... ఆహ్వానించడం రావాలి. వాడి ఆలోచనలెప్పుడూ ప్రెగ్నెంటే! అదే వాడిలో ఉన్న బ్యూటీ ఏమో!! ఫేమస్ పొయిట్ వర్డ్స్‌వర్త్ ఏమంటాడంటే... నువ్వో చెట్టు కింద విశ్రమిస్తే- ఎక్కడి నుంచో కోయిల పాట వినిపిస్తుంది.. ఆస్వాదించు. అంతేగానీ... అది ఎక్కడ నుంచి పాడుతుంది? ఎందుకు పాడుతుంది? దాని సైజేంటి? కలరేంటి? ఇలాంటి ప్రశ్నలన్నీ అవసరమా నీకు? ఎక్కడో పడిన వర్షానికే ఇక్కడ చల్లగాలి వీస్తుంది. ఇదొక జర్నీ. దాన్ని స్వచ్ఛంగా ఆస్వాదించడం తెలియాలి. భరణితో ప్రయణాన్ని కూడా ఎలాంటి ప్రశ్నలూ వేసుకోకుండా సంపూర్ణంగా ఆస్వాదిస్తున్నా! నేను ‘భరణీ’ అని పిలుస్తాను. వాడు నన్ను ‘ప్రకాశ్’ అంటాడు. ఎందుకో ఆ చనువు అలా వచ్చేసింది! నా వయసెంతో తనకు తెలీదు... అతని వయసు గురించి నాకనవసరం. ఎక్కడో నేను చూసిన వింతైన మనుషులు, గమ్మత్తయిన సంఘటనలు, కొన్ని మాటలు, కొంత మౌనం... ఇవన్నీ భరణితో షేర్ చేసుకోవాల్సిందే. బయటకు చెప్పుకోలేనివి చాలా ఉంటాయి. కానీ, ఎవరో ఒకరితో చెప్పుకోవాల్సిందే. మన దృష్టితో ఆలోచించేవాడయితేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ కుదురుతుంది. భరణి అలాంటివాడే! గుత్తొంకాయ కూర... తింటే వాడింట్లో తినాల్సిందే! షూటింగ్లో కలుసుకున్నప్పుడు... రేపు లంచ్‌లో మెనూ ఇదీ అంటాడు. తను రాకపోయినా గుత్తొంకాయ కూర వస్తుంది. ఆ రంగు.. రుచి.. వాసన.. ఆహా.. నోరూరిపోతుంది! ఫోన్ చేసి బావుందిరా అంటే... వాడి మనసు నిండిపోతుంది. అప్పుడప్పుడూ... చెన్నైలో సముద్రపు ఒడ్డున కూర్చుంటాం. ఎదురుగా సముద్రం... మాకిష్టమైన బ్రాండ్... ఇక మాటలే మాటలు..! నేను కర్నాటక పొయిట్రీ గురించి చెబుతాను... వాడు తెలుగు లిటరేచర్‌లోని అందాలు ఆవిష్కరిస్తాడు! ఇద్దరం అలా అలా... మరాఠీ కవితల్లోకి .. బెంగాలీ కథల్లోకి కొట్టుకెళ్లిపోతాం. జయంత్ కైకిని అని కన్నడంలో గొప్ప కవి. తను రాసిన ‘శబ్ద తీర’ పుస్తకం ఇప్పుడు చదువుతున్నా. ఓసారి అనుకోకుండా ముగ్గురం కలిశాం. జయంత్‌కి, భరణికి ఒకరికొకరికి ముఖపరిచయం లేదు. కానీ బాగా పరిచయస్తుల్లా కలిసిపోయారు. భరణి పొయిట్రీ గురించి జయంత్ ఆశువుగా చెప్పేస్తున్నాడు... జయంత్ కథల్లోని మెరుపుల గురించి భరణి తన్మయంగా వివరిస్తున్నాడు... వాళ్లిద్దర్నీ అలా చూస్తూ నాలో నేనే మైమరచిపోయా! వారిద్దరికీ బ్రిడ్జ్‌ని నేనే కదా మరి! ఈ భార్య, పిల్లలు, ప్రియురాలు, స్నేహితుడు... ఇలా కొంతమందికే పరిమితమైన ఆప్తవలయంలో వాడు ఉన్నాడు. మా రిలేషన్షిప్ దేనికీ ఆనదు. దేర్ ఆర్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే నేనెక్కువ మాట్లాడలేకపోతున్నా. అయినా మా జర్నీ ఇంకా ఉంది కదా... మరింకెలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందుకే మళ్లీ కలుద్దాం! బై! సంభాషణ: పులగం చిన్నారాయణ -
ప్రకాశ్‌రాజ్ వడ్డిస్తున్న స్పెషల్ వంటకం
ఉలవచారు ఏంటి? బిర్యాని ఏంటి? అసలు ఈ రెండింటి కాంబినేషన్ ఏంటి? వాటి రెసిపీ వేరు. రుచులు వేరు. మరి.. ఈ మిక్సింగ్ దేనికో? దీని గురించి చెప్పాల్సింది ప్రకాశ్‌రాజే. ఎందుకంటే ఈ స్పెషల్ వంటకానికి సూత్రధారి, పాత్రధారి ఆయనే. తెలుగు, తమిళ, కన్నడ భాషల ప్రేక్షకులకు ఈ ‘ఉలవచారు బిర్యానీ’ని గరమ్ గరమ్‌గా సిద్ధం చేస్తున్నారు ప్రకాశ్‌రాజ్. కేయస్ రామారావు సమర్పణలో ప్రకాష్‌రాజ్ ప్రొడక్షన్స్, క్రియేటివ్ కమర్షియల్స్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వల్లభ నిర్మాత. ప్రకాశ్‌రాజ్, స్నేహ, తేజస్, సంయుక్త ముఖ్య తారలు. మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఉగాది సందర్భంగా ఈ నెల 31న విడుదల చేయనున్నారు. నేడు ప్రకాష్‌రాజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్, మేకింగ్ వీడియోలను విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా కేయస్ రామారావు మాట్లాడుతూ - ‘‘ఓ వినూత్న ప్రేమకథాంశంతో ప్రకాష్‌రాజ్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా అందించిన పాటలు ఈ చిత్రానికి ప్రాణం. ఆడియో వేడుక రోజున ఇళయరాజాను ఘనంగా సత్కరించనున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రీతా జయరామన్, ఆర్ట్: కదిర్, ఎడిటింగ్: జో.ని. హర్ష.