కన్నడ ఎన్నికల ప్రచారం సినీ గ్లామర్‌తో సొగసులు అద్దుకోబోతోంది. తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయిన ముఖ్య పార్టీలు సినీ తారలను మోహరించడానికి సన్నాహాలు చేస్తున్నాయి. ఎంత త్వరగా సినీ స్టార్లు వస్తారా? అని అభిమానులు, జనం కూడా నిరీక్షిస్తున్నారండోయ్.
సాక్షి, బెంగళూరు:అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే పరమావధిగా కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పక్షాలు పోరాడుతున్నాయి. అన్ని పార్టీల అధినేతలు, రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రచారాగ్నికి ఆజ్యం పోసినట్లుగా సినిమా తారలను రంగంలోకి దింపేలా పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి. శాండల్‌వుడ్ సూపర్ స్టార్ కిచ్చ సుదీప్‌ను జేడీఎస్ ప్రచారానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మూడురోజుల క్రితం కిచ్చసుదీప్, కుమారస్వామి భేటీ అనేక ఊహాగానాలకు తావిస్తోంది.
తెలుగు సినీ హీరో, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను కూడా ప్రచారానికి జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి పిలిపించే పనిలో ఉన్నారు. రాజధానితో పాటు రాష్ట్రంలో తెలుగువారు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ ద్వారా ప్రచారం నిర్వహించాలని కుమార ఆశిస్తున్నారు. సుదీప్ ప్రచారంపై తన అభిమానుల నుంచి అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ఇక పవన్‌కల్యాణ్ కూడా ప్రచారానికి రావడానికి సుముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి నటి రమ్య, బీజేపీ నుంచి ఎంపీ హేమామాలిని ప్రచారం నిర్వహిస్తారని పార్టీల నాయకులు తెలిపారు. నామినేషన్లు ఆరంభమయ్యాక మరింతమంది సినీతారలు రంగంలోకి దిగనున్నారు. వారిలోప్రముఖ తెలుగు, తమిళ, హిందీ స్టార్లు ఉన్నా ఆశ్చర్యం లేదు.
కాంగ్రెస్‌కే తారాబలం
కాంగ్రెస్‌కు అత్యధికంగా సినిమా తారల బలం ఉంది. హీరోయిన్, కాంగ్రెస్ సోషల్ మీడియా చీఫ్ రమ్య, అంబరీష్, మాలాశ్రీ, అభినయ, భావన, జయమాల వంటి ఉద్ధండులు ప్రచారానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నారు. బహుభాష నటుడు ప్రకాశ్‌రాజ్‌ను కాంగ్రెస్ తరఫున ప్రచారంలోకి దింపేందుకు ఆ పార్టీలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
బీజేపీ శిబిరంలోనూ తారాగణం
బీజేపీకి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ రూపంలో స్టార్ ప్రచారకుడు ఉండనే ఉన్నారు. ఆయనతో పాటు కన్నడ నటులు జగ్గేష్, తార అనురాధ, శ్రుతి, మాలవిక అవినాష్, సాయికుమార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు తెరమీదకు రానున్నారు. ప్రముఖ బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని కూడా రంగంలోకి దింపి రాష్ట్రంలోని పలు ఎన్నికల ర్యాలీలు నిర్వహించాలని చూస్తున్నారు. కాగా నటుడు ఉపేంద్ర రాజకీయ భవితవ్యంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఆయన ఇటీవలే సొంత పార్టీకి గుడ్‌బై చెప్పి మరో పార్టీ పెట్టడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఉప్పి హడావుడి కనిపించడమే లేదు. దీంతో అభిమానుల్లో నిరాశ అలముకుంది.
Comments
Please login to add a commentAdd a comment