సాక్షి, హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల కేంద్రం వద్ద మోహరించారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో జరగనున్న ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. బ్యాలెట్ పద్ధతిలో జరగనున్న ఈ ఎన్నికల్లో 883 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
గత ఆరువారాల నుంచి హోరాహోరీగా ప్రచారాలు, విమర్శలు, ప్రతి విమర్శలు వాడీవేడిగా కొనసాగాయి. హీరో మంచు విష్ణు, నటుడు ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. మా ఎన్నికలో ఓటు వేసే సభ్యులు తప్పని సరిగా గుర్తింపు కార్డు తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచించారు. జూబ్లీహిల్స్ స్కూల్ ప్రధాన గేటు వద్ద పోలీసులు, ఆయా ప్యానెళ్ల ఏజెంట్లు గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేంద్రంలోకి అనుమతిస్తారు. కేంద్రంలోకి వెళ్లిన తర్వాత జాబితాలో మరోసారి సభ్యుల పేర్లను తనిఖీ చేస్తారు. అక్కడ ఓటర్ స్లిప్ తీసుకున్న తర్వాతనే ఓటింగ్ కేంద్రంలోకి అనుమతిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment