
రామా కనవేమిరా
‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి..’ కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక నినాదం మారుమోగుతోంది. రాముడి కల్యాణోత్సవాన్ని కళ్లారా వీక్షించేందుకు భద్రాచలం దివ్య మందిరానికి రావాల్సిందిగా ఊరూరా... వాడవాడలా ఆహ్వానాలందుతున్నాయి. శనివారం జరిగే ఈ ఉత్సవానికి లక్షల మంది భద్రాచలం తరలుతున్నారు. కల్యాణోత్సవ ఘట్టం జరిగేవేళ మన చారిత్రక గోల్కొండ కోట కూడా మురిసిపోతోంది.
గౌరీభట్ల నరసింహమూర్తి
పద్నాలుగు అడుగుల ఎత్తుతో ఉన్న ఈ గదికున్న చరిత్ర అసాధారణం. ‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి... సీతమ్మకు చేయిస్తీ చింతాకూ పతకమూ రామచంద్రా...’ ఇలా ఒకటి కాదు రెండు కాదు 300 కీర్తనలకు పట్టాభిషేకం జరిగిందిక్కడే. భద్రాచల క్షేత్రాన్ని నిర్మించిన కంచెర్ల గోపన్న పుష్కర కాలం కారాగృహ వాసం గడిపిన గది ఇదే. అప్పటి వరకు కంచర్ల గోపన్నగా ఉన్న ఆ రామభక్తుడు రామదాసుగా నామకరణం జరిగిన ప్రాంతమిది.
మన చరిత్రలో ఇదో విచిత్ర ఘట్టం. అప్పటి వరకు హైందవ ప్రాభవం వెలుగొందుతున్న తరుణంలో దండయాత్రగా వచ్చిన ముస్లిం చక్రవర్తులు ఇక్కడి దేవాలయాలను నేలమట్టం చేస్తున్న కాలం. అందునా ముస్లిం ఏలుబడిలో ఉన్న ఈ కారాగారం గొప్ప హిందూ భక్తుడి చరిత్రను శాశ్వతం చేసింది. తహసీల్దారుగా ఉద్యోగం చేస్తూ ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల్లోంచి ఆరు లక్షల రూపాయలను భద్రాచల రామాలయ నిర్మాణానికి ఖర్చు చేసినందుకు నాటి పాదుషా అబుల్‌హసన్ తానాషా ఆగ్రహానికి గురై 12 సంవత్సరాల కఠిన కారాగార వాసం ఈ గదిలోనే గడిచింది.
341 ఏళ్ల క్రితం ఆయన భద్రాచలంలో రామాలయం నిర్మించి, గోల్కొండలో శిక్ష అనుభవించిన ఆ తర్వాత విడుదలయ్యారు. దేవాలయ నిర్మాణానికి వాడిన మొత్తాన్ని బంగారు మహరీల రూపంలో స్వయంగా రామలక్ష్మణులు తానాషాకు చెల్లించారని, ఆయన లిఖితపూర్వక పత్రం ఇవ్వటం, దాన్ని జైలర్‌కు చూపి రామదాసును విడిపించటం, ఆ వచ్చింది రామలక్ష్మణులే అని తెలుసుకుని తానాషా రామభక్తుడిగా మారిపోవటం... అంతా పురాణ గాథ.
ఆ ఏడాది నుంచే తానాషా ప్రతి రామకల్యాణోత్సవానికి ముత్యాల తలంబ్రాలను పంపటం మొదలుపెట్టారు. కుతుబ్‌షాహీ వంశంలో అబుల్ హసన్ తానాషా చివరి వాడు. ఆ శకం ముగిసి అసఫ్‌జాహీల జమానా మొదలైన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగింది. మధ్యలో కొన్నేళ్లు ముత్యాల తలంబ్రాల పంపకం నిలిచిపోయినప్పుడు అరిష్టం వాటిల్లిందని, ఆ తర్వాత దాన్ని తిరిగి కొనసాగించారని ప్రచారంలో ఉంది. రాచరికపాలన అంతమై ప్రజాస్వామ్యయుత ప్రభుత్వాలు కొలువుదీరిన తర్వాత ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వ పక్షాన ముఖ్యమంత్రి భద్రాచల రాముడికి అందజేసే పద్ధతి కొనసాగుతోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ సంప్రదాయాన్ని శనివారం నిర్వహించనున్నారు.
పురావస్తు శాఖ నిర్లక్ష్యం...
ఈ జైలు గదిలో గోడలపై శ్రీరామ పరివారానికి సంబంధించిన 12 చిత్రాలున్నాయి. అవన్నీ 12 సంవత్సరాల కారాగార శిక్షా సమయంలో రామదాసు రూపొందించిందేనని చారిత్రక గాథ ఆధారంగా నమ్ముతున్నారు. కానీ సరిగ్గా అవి చెక్కిన కాలం ఏంటి, దాన్ని కచ్చితంగా రామదాసే స్వయంగా చెక్కాడా, దీనికి అనుబంధంగా నాటి కుతుబ్‌షా స్పందన కోటలో ఇంకెక్కడైనా ఉందా, రామదాసు విడుదల తర్వాత తానాషాపరంగా జరిగిందేంటి... తదితర వివరాలకు సంబంధించి ఇప్పటి వరకు పురావస్తు శాఖ ఆధారాలు సేకరించే పని చేయలేదు. కనీసం దాన్ని రూఢీ చేసే నాటి గ్రంథాల జాడలు కూడా కనుక్కునేందుకు సిద్ధపడలేదు. చారిత్రక గాథ ఆధారంగా వస్తున్నవాటికే పరిమితమైంది.
రాచకొండలో ‘రామాయణం’
హైదరాబాద్‌కు అతి చేరువలో ఉన్న రాచకొండ గుట్టల్లో అతి పురాతన ‘రామాయణ’ చిత్రాలు అబ్బురపరుస్తున్నాయి. నల్గొండ జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పరిధిలోకి వచ్చే ఈ గుట్టల్లోని అతి పురాతన వైష్ణవాలయ పై కప్పునకు గీసి ఉన్న చిత్రాలు ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి. దాదాపు 650 సంవత్సరాల క్రితం వీటిని గీసి ఉంటారని అంచనా. ఆలయం దాదాపుగా శిథిలమైంది. పైకప్పులోని కొంతభాగం పదిలంగా ఉండటంతో దానిపై గీసిన చిత్రాలు ఇప్పటికీ మసకమసకగా దర్శనమిస్తున్నాయి. రామాలయం ధ్వజ స్తంభానికి చెక్కిఉన్న శాసనంలో అనపోతనాయుడనే రాజు ఆ ఆలయాన్ని 1365లో కట్టించాడని ఉంది.
1360లో గోనబుద్ధ భూపతి రాసిన రంగనాథ రామాయణంలోని ఘట్టాల ఆధారంగా పుత్రకామేష్టి యాగం చిత్రాలను డంగు సున్నం పేస్టుతో రూపొందించిన నునుపైన గచ్చుపై నలుపు రంగు రేఖలతో చిత్రించారని ఔత్సాహిక పురావస్తు పరిశోధకులు సత్యనారాయణ పేర్కొన్నారు. దశరథుడు, ఆయన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి, గురువు వసిష్ఠుడు సమక్షంలో యజ్ఞం నిర్వహిస్తున్నట్టుగా, అశ్వమేథ యాగం పూర్తయినతర్వాత రాజులు ఆ గుర్రాన్ని పూజిస్తున్నట్ట చిత్రాలున్నాయని పేర్కొన్నారు.