
బాగా చదువుకోవాలన్నదే అమ్మ ఆశయం
‘తల్లి ప్రభావం మనిషి మీద ఎల్లప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది.
డాక్టర్ భాస్కర్‌రావు
‘తల్లి ప్రభావం మనిషి మీద ఎల్లప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది. జీవితమంతా నడిపిస్తుంది. మనిషి నడతలో అది ప్రతిబింబిస్తూనే ఉంటుంది. తల్లి చెప్పిన మాట మాట తప్పా ఒప్పా అనే విశ్లేషణ ఉండదు. పిల్లలకు అదే వేదవాక్కు’ అంటారు ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్, కిమ్స్ వైద్య సంస్థల సీఈవో డాక్టర్ బొల్లినేని భాస్కర్‌రావు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ... అమ్మ నుంచి ఔదార్యం, పాజిటివ్‌గా స్పందించడం నేర్చుకున్నానన్నారు.
‘‘మాది నెల్లూరు జిల్లా, చేజర్ల మండలం, మాముడూరు. మా అమ్మ పేరు వెంకమ్మ. పెద్దగా చదువుకోలేదు. నాన్న కంటే సంపన్న కుటుంబం నుంచి వచ్చిందామె. మా భవిష్యత్తు పట్ల ఆమెకు కచ్చితమైన లక్ష్యాలు ఉండడానికి అదే కారణం అనుకుంటాను. అందరినీ ఉన్నత విద్యావంతుల్ని చేయాలని కంకణం కట్టుకున్నట్లు శ్రమించింది. పెద్దన్న ఇంజనీరు, రెండవ అన్న ఎమ్‌ఎస్‌సి, నేను డాక్టరు అయిన తర్వాత లక్ష్యాన్ని చేరాననే సంతృప్తితో విశ్రమించింది. మా అమ్మలో మేము చదువుకోవాలనే తపన తప్ప, ఫస్ట్ రావాలని ఒత్తిడి పెట్టడం వంటివేమీ లేవు. అయితే మేము ఏం చదువుతున్నామనే పర్యవేక్షణ బాధ్యత మా పెద్దన్నకిచ్చింది. అది క్రమంగా మాలో పెద్దన్న మాట వినడం అనే క్రమశిక్షణకు దారి తీసింది. కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సినప్పుడు పెద్దన్నకు చెప్పడం, ఆయన చిన్నన్నను కూడా ఇన్‌వాల్వ్ చేయడం కొనసాగుతోందిప్పటికీ.
ఈతకెళ్లిన రోజు!
అమ్మ ఎప్పుడూ ప్రేమను పంచడమే తన బాధ్యత అన్నట్లు ఉండేది. కానీ ఒక్కసారి ఆమె కోపం నా వీపు మీద నాట్యం చేసింది. అవి ఫిఫ్త్ క్లాసు సెలవులు. ఓ రోజు పెన్నానది ఏటి చాలులో ఈతకొట్టడానికి వెళ్లి నాలుగు గంటల సేపు రాలేదు. పిల్లాడేమయ్యాడని ఆమ్మకు భయం, ఆందోళన పెరిగిపోయాయి. నేను ఇంటికి రాగానే కోపంతో నా వీపు మీద బాదింది.
అన్నింటికీ భగవంతుడే!
మాది వ్యవసాయ కుటుంబం. అవసరార్థం అప్పులు చేయక తప్పని రోజుల్లో కూడా అమ్మ మాకు ఏ లోటూ రానివ్వలేదు. ఎవరైనా పెళ్లికి మంగళసూత్రం, పిల్లలకు పుస్తకాలడిగితే ఇచ్చేది. చుట్టుపక్కల ఊళ్లలోని బంధువులు ఎటు వెళ్లాలన్నా మా ఇంట్లో ఆగి భోజనం చేసి వెళ్లే అలవాటుండేది. చివరి బస్సెళ్లిపోతే రాత్రి బస మా ఇంట్లోనే. ‘మీకే డబ్బు చాలకపోతే ఇంత మందిని సాకడమెందుకు’ అని ఎవరైనా అంటే ‘ఆ భగవంతుడే ఉన్నాడ’నేది.
అమ్మలు ఎన్ని బాధల్లో ఉన్నా పిల్లలందరికీ టైమిస్తారు. అదే పిల్లలు పెద్దయి తల్లి కోసం టైమ్ కేటాయించలేని అశక్తులవుతుంటారు. అది పూర్తిగా తప్పే. మా అమ్మ అరవై ఏళ్లకు పక్షవాతానికి గురైంది. వైద్యం చేయించి ఆమెను సౌకర్యంగా ఉంచాం. అమ్మ కంఫర్టబుల్‌గా ఉందా లేదా అని మాత్రమే ఆలోచించానప్పట్లో. కానీ, అమ్మ దగ్గర రోజుకో గంట కూర్చుని ఉంటే ఆమె ఎంత సంతోషించేదో కదా అనిపిస్తుంటుందిప్పుడు. ఆ అపరాధ భావన నన్ను వెంటాడుతూనే ఉంది.
ధైర్యాన్ని వీడలేదెప్పుడూ!
మా చిన్న సిస్టర్‌కి 19 ఏళ్ల వయసులో పక్షవాతం వచ్చినప్పుడు అమ్మలో కొత్త వ్యక్తిని చూశాను. పరామర్శకు వచ్చి పోయేవాళ్లు అధైర్యపరిచే మాటలంటుంటే అమ్మ ఖండించేది. తాను ధైర్యంగా ఉంటూ, ఇంట్లో అందరికీ ధైర్యం చెప్పింది. దాంతో సానుకూల భావన ఇంట్లో నెలకొంది. ముఖ్యంగా మా సిస్టర్ కోలుకోవడానికి ఆ వాతావరణం కొండంత ధైర్యాన్నిచ్చింది.
సిచ్యుయేషన్ మేనేజ్‌మెంట్‌లో దిట్ట!
ఓ కోడలు మాట్లాడిన మాట తప్పనిపిస్తే నలుగురిలో ఏమీ మాట్లాడేది కాదు. అప్పటికా పరిస్థితిని చక్కబరిచి, ఆ కోడలు ఒక్కతే ఉన్నప్పుడు ‘నువ్వు చెప్పాలనుకున్నది ఇలా చెప్పి ఉంటే ఎవరూ నొచ్చుకోరు’ అని వివరించేది. ఆ లక్షణం వల్లనే బంధువుల్లో ఎవరితో ఆమెకు పొరపొచ్చాల్లేవు. మాట్లాడకపోవడం, వేడుకలకు రాకపోవడం వంటి దూరాలు రాలేదు.
జీవితమంటే!
కోట్లు సంపాదించి... నీ డబ్బుతో నువ్వే తిని, నువ్వే కట్టుకుని నీదే లోకంగా బతకడం కాదు జీవితమంటే! నీ కోసం నీ ఇంటికి ఎంతమంది వస్తున్నారనేదే ముఖ్యం అనేది. అందరితో సఖ్యతగా మెలగలేనప్పుడు ఎంత సంపాదించినా వ్యర్థమే అనేది.
- సంభాషణ: వాకా మంజులారెడ్డి