స్పిరిట్.. ఎవరెస్ట్
‘ఎవరో ఒకరు దీపం వెలిగిస్తారు. ఎవరో ఒకరు దారిచూపిస్తారు’. ఆ ‘ఎవరో ఒకరు..’ ఆకాశంలోంచి ఊడిపడరు. శూన్యంలోంచి ఉద్భవించరు. మనలోనే ఉంటారు. అలాంటివారే అరుణిమా సిన్హా. అసమాన ధైర్యంతో, అనుపమాన సేవాగుణంతో చుట్టూ ఉన్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ‘యంగ్‌మైండ్స్’ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో ఇటీవల జరిగిన ‘యూత్ లీడర్‌షిప్ సమ్మిట్’ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ఆమెను పలకరించింది...
కష్టాలెన్నైనా వెరవక ముందుకు సాగే సాహసవంతుల చరిత్రే ప్రపంచ చరిత్ర... అదే తనకు స్ఫూర్తి అంటారు ఉత్తరప్రదేశ్ కు చెందిన అరుణిమాసిన్హా. విధి చేసిన పెనుగాయానికి ఆమె ఏమాత్రం వెరవలేదు. వైకల్యంతోనూ సవాళ్లను గెలిచింది. సాహసవనితగా నిలిచింది. ‘22 ఏళ్లపాటు నా జీవితం సజావుగానే సాగింది. లక్నో నుంచి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దోపిడీ దొంగల బారినపడ్డా. ప్రతిఘటించానన్న కసితో దొంగలు నెట్టివేయటంతో పరుగెత్తే రైలులో నుంచి కిందపడ్డా. ఓ కాలు పోయింది. ఒక్కసారిగా నా జీవితమే అంధకారమైనట్లు అనిపించింది. ఆస్పత్రిలో నాలుగు నెలలు. ఒక్కోసారి అంతా కోల్పోయినట్టు ఉండేది. నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని.. ధైర్యం చెప్పుకునేదాన్ని. ఆ సమయంలోనే ఎవరూ ఊహించనిది, ఏదో గొప్పది సాధించాలని అనుకున్నా. దాని ఫలితమే ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్న సంకల్పం’ అని చెప్పారు అరుణిమ.
రోండా గ్రాహమ్ ఆదర్శం
‘ఓ కాలు లేకపోయినా అరవయ్యో ఏట ఎవరెస్ట్‌ను జయించిన అమెరికన్ మహిళ రోండా గ్రాహమ్ ఆదర్శంగా ఆశయానికి అంకురార్పణ చేశా. నా ఆలోచనను ఎవరెస్ట్ అధిరోహించిన ప్రథమ భారతీయ మహిళ బచేంద్రిపాల్ ముందు ఉంచాను. ఆమె సానుకూలంగా స్పందించారు. టాటా స్టీల్ సాహసకృత్యాల సహాయక సంస్థ బాధ్యతలను చూస్తున్న బచేంద్రిపాల్ ఆ సంస్థ తరపున సాయం అందించారు. పర్వతారోహణకు సంబంధించి ఉత్తర కాశీలో ఎన్నో శిక్షణలు తీసుకొన్నా. చిన్న చిన్న పర్వతాలను ప్రయోగాత్మకంగా ఎక్కా. ఆ సమయాల్లో ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రతికూలతలు.
అప్పుడు స్వామి వివేకానంద చెప్పిన అగ్ని కణాల వంటి మాటలే గుర్తొచ్చేవి. చిట్ట చివరకు బంధువులు, మిత్రుల సహకారంతో ఒంటికాలితో 2013 ఏప్రిల్ 1న ఎవరెస్ట్ సాహసయాత్ర ప్రారంభించాను. మే 21న ఆ పర్వతాగ్రాన జయకేతనాన్ని రెపరెపలాడించా. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వెరసి వెనుకడుగేయొద్దు. కలలను సాకారం చే సుకునే దిశగా ముందుకు సాగాలి’ అంటున్న అరుణిమ... మనిషి దృఢ దీక్షముందు 21వేల అడుగుల ఎవరెస్ట్ చాలా చిన్నదని నిరూపించింది.