arunima sinha
-
కెరీర్ ఎవరెస్ట్‌కి!
ఇండియన్ ఇండస్ట్రీల్లో ప్రస్తుతం బయోపిక్స్‌పై విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ క్రేజ్‌ని బాక్సాఫీస్ దగ్గర క్యాష్ చేసుకోవాలనో, ఒక వ్యక్తి గురించి చెప్పాలనో కానీ దర్శక– నిర్మాతలు ఈ జానర్‌పై విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఆల్రెడీ చాలా బయోపిక్‌లు రిలీజ్ అయ్యాయి. బాలీవుడ్లో మరో అరడజను సినిమాలు సెట్స్‌పై కూడా ఉన్నాయి. ఇంకా దర్శక– నిర్మాతలు కొత్త బయోపిక్స్ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్గా హిమాలయాలను అధిరోహించిన అరుణిమా సిన్హా జీవితాన్ని సిల్వర్ స్కీన్‌పై చూపించడానికి సిద్ధమయ్యారు. అరుణిమ పాత్రను ఆలియా భట్ పోషించనున్నారని బాలీవుడ్ టాక్. అరుణిమా సిన్హా వాలీబాల్ ప్లేయర్. ఓసారి బందిపోటు దొంగల బారినపడి, వాళ్లు ట్రైన్లో నుంచి తోసేయడంతో ఒక కాలును పోగొట్టుకున్నారామె. అయినా నిరాశపడకుండా విధి తనకో చాలెంజ్ విసిరిందనుకొని భావించి, హిమాలయాలను అధిరోహించాలని శి„ý ణ పొందారు. 2012లో మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. ఈ రికార్డ్ స్థాపించిన ఫస్ట్ ఫిజికల్లీ చాలెంజ్డ్ ఉమన్‌గా రికార్డు సృష్టించారామె. ఆమె జీవితం ఆధారంగా తీయబోతున్న చిత్రం 2020లో ఆరంభం అవుతుంది. ముందుగా కంగనా రనౌత్‌ని అనుకున్నారట. ఇప్పుడు ఆమె ప్లేస్లోకు ఆలియా వచ్చారు. ధర్మ ప్రొడక్షన్స్, వివేక్ రంగాచారి నిర్మించనున్నారు. ‘గల్లీ బాయ్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఆలియా చేతిలో ప్రస్తుతం ‘కళంక్, బ్రహ్మాస్త్ర, తక్త్’ వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించే పాత్ర తన యాక్టింగ్‌కు సవాల్. ఈ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే ప్రక్రియలో బాలీవుడ్ టాప్ హీరోయిన్ చైర్‌ను కూడా ఆలియా ఈజీగా అందుకోవచ్చని ఊహించవచ్చు. -
శిఖరానికి డాక్టరేట్
అరుణిమా సిన్హా ఒకప్పుడు జాతీయ స్థాయి ఫుట్‌బాల్, వాలీబాల్ ప్లేయర్. ఇప్పుడు పర్వతారోహకురాలు. అరుణిమ 2013, మే 21వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే ఎవరెస్టును ఎక్కిన తొలి మహిళగా రికార్డు సాధించారు! తొలి మహిళా?! జపాన్ మహిళ జంకో తాబేకి ఆ రికార్డు ఉంది కదా! నిజమే. జంకో తాబే ఎవరెస్టును అధిరోహించిన తొలి మహిళ. అరుణిమది అంతకంటే పెద్ద రికార్డు, మనసును కదిలించే రికార్డు. స్ఫూర్తిని నింపే రికార్డు. వెక్కిరించిన విధిని ఒక్క తోపు తోసేసి శిఖరం పైకి నడిచిన విజయం ఆమెది. ఒక ఘర్షణలో ప్రమాదవశాత్తూ కాలిని (ఎడమ) పోగొట్టుకున్న అరుణిమ కృత్రిమ కాలితో ఎవరెస్టును అధిరోహించారు. ప్రపంచంలోనే తొలిసారి ఎవరెస్టును ఎక్కిన వికలాంగ మహిళగా రికార్డు సాధించారు. ఆ తర్వాత అనేక రికార్డులకు ఆమె గౌరవాన్ని తెచ్చారు. ఆఫ్రికాలో కిలిమంజరో, యూరప్‌లోని ఎల్బ్రస్, ఆస్ట్రేలియాలోని కోస్‌కుయిజ్‌కో, సౌత్ అమెరికాలోని ఆకాంకాగువా, ఇండోనేసియాలో కార్స్టెంజ్ పిరమిడ్లను అధిరోహించారు. ఈ పర్వతాలన్నీ ఆమె స్ఫూర్తి ముందు తలవంచాయి. ఇప్పుడు ఆమె దీక్షకు గుర్తింపుగా యుకెలోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ పురస్కరించింది. గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కాలు ఎలా పోయింది? 2011, ఏప్రిల్ 12వ తేదీ. ఉత్తర ప్రదేశ్, అంబేద్కర్ నగర్ కి చెందిన అరుణిమ ఢిల్లీకి వెళ్లడానికి లక్నోలో రైలెక్కింది. జనరల్ కోచ్‌లో ఉన్న అరుణిమ మీద దొంగల చూపు పడింది. ఆమె మెడ మీద వాళ్ల చెయ్యి పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు దండ, బ్యాగ్‌లో డబ్బు దొంగల పాలు కాకుండా కాపాడుకోవడానికి వారితో పెనుగులాడింది అరుణిమ. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) ఉద్యోగం కోసం పరీక్ష రాయడానికి వెళ్తున్న అమ్మాయి కావడంతో దొంగలకు లొంగిపోవడానికి సిద్ధంగా లేదామె. ఆ పెనుగులాటలో ఆమెను రైల్లోంచి బయటకు తోసేశారు దొంగలు. ఆమె ప్రయాణిస్తున్న రైల్లోంచి పక్కనే ఉన్న పట్టాల మీద పడిందామె. ఆ పట్టాల మీద మరో రైలు వస్తోంది. ఆ రైలు రావడం కనిపిస్తోంది, తనను తాను రక్షించుకోవడానికి పక్కకు తిరిగిందామె. దేహం పూర్తిగా పట్టాల మీద నుంచి బయటపడనేలేదు. మరో రెండు సెకన్లయితే పూర్తిగా పక్కకు దొర్లిపోయేదే, అంతలోనే వచ్చేసింది రైలు. కాలి మీదుగా వెళ్లిపోయిందా రైలు. మోకాలి కింద భాగం నుజ్జయిపోయింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో నాలుగు నెలల కాలం బెడ్‌మీదనే గడిచిపోయింది. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చిందామె. కోలుకున్న తరవాత జీవితాన్ని సాహసోపేతంగా గడపాలని. ఎవరెస్టును అధిరోహించాలనే కోరిక కూడా ఆ నిర్ణయంలోంచి పుట్టినదే. కృత్రిమ కాలితో శిక్షణ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఉత్తరాలు, టెలిఫోన్ ద్వారా బచేంద్రిపాల్‌ను (ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ) సంప్రదించింది అరుణిమ. బచేంద్రిపాల్ పూర్తి సంపూర్ణ సహకారాలందించారామెకి. అరుణిమ సోదరుడు ఓంప్రకాశ్ ప్రోత్సహించాడు. ప్రోస్థెటిక్ లెగ్ అమర్చిన తర్వాత పర్వతారోహణ శిక్షణ మొదలైంది. మొదట 2012లో హిమాలయాల్లోని ఐలాండ్ పీక్‌ను అధిరోహించి, ఫిట్నెస్ విషయంలో నిర్ధారణకు వచ్చింది. తర్వాత ఏడాది ఎవరెస్టును అధిరోహించింది. ఆ అనుభవాలను ‘బార్న్ అగైన్ ఆన్ ద మౌంటెయిన్’ అని పుస్తకంగా రాసింది అరుణిమ. భారత ప్రభుత్వం ‘పద్మశ్రీ’తోపాటు టెన్సింగ్ నార్గే అవార్డులతో అరుణిమలోని స్ఫూర్తిని గౌరవించింది. తనలాంటి వాళ్ల కోసం ఆరు పర్వత శిఖరాలను పూర్తి చేసుకున్న తర్వాత యుకె లోని స్ట్రాత్‌క్లైడ్ యూనివర్శిటీ గడచిన గురువారం నాడు గ్లాస్గోలో జరిగిన గ్రాడ్యుయేషన్ సెరిమనీలో అరుణిమకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. ‘ఈ పురస్కారాన్ని అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవార్డులు యువతకు మంచి సందేశాన్నిస్తాయి. సంకల్పశుద్ధితో చేసిన పనిని ప్రపంచం గుర్తిస్తుందనే సంకేతాన్ని జారీ చేస్తాయి’ అంది అరుణిమ. ఆమె స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న అరుణిమ ఫౌండేషన్ సేవలను కూడా స్ట్రాత్‌క్లైడ్ యూనివర్సిటీ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఆమె స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్‌కి మానసిక, శారీరక ఆరోగ్య సేవలతోపాటు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రోత్సాహం, మహిళల సాధికారత అవగాహన వంటి కార్యక్రమాలను తన చారిటీ ద్వారా నిర్వహిస్తోంది. అరుణిమ ఇప్పటి వరకు ఆరు శిఖరాలు అధిరోహించింది. అన్ని ఖండాల్లోని ప్రముఖ శిఖరాలను అధిరోహించాలని, ప్రతి శిఖరం మీదా భారత పతాకాన్ని ఆవిష్కరించాలనీ ఆమె ఆశయం. – మంజీర -
గాయం శరీరానికే..మనసుకు కాదు
‘ఏం చేయలేం.. అనుకుంటే మొదటి మెట్టే ఆఖరు అవుతుంది. అదే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే చివరి మెట్టు వరకూ చేరొచ్చు. ఆ నమ్మకంతోనే ఎన్ని లక్ష్యాలనైనాఅధిగమించొచ్చు. గాయం శరీరానికే.. కానీ మనసుకు కాదు. పోరాడితే విజయం మనదే. ఇది దివ్యాంగులు గుర్తించుకోవాలి’ అని చెప్పారు దివ్యాంగ పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన అరుణిమ... ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించింది. నగరానికి వచ్చిన అరుణిమ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, సిటీబ్యూరో: నా స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. చదువుకునే రోజుల్లో వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాను. అందులోనే అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాను. కానీ నేనొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రైలు ప్రమాదంలో నా కాలు పోయింది. అయితే ఎదగాలన్న నా పోరాటం ఆగలేదు. ఇంకా బలపడింది. ఇప్పటికీ సాఫ్ట్‌బాల్, జావలిన్‌త్రో లాంటి క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాను. దివ్యాంగులకు నేను చెప్పేద్దొక్కటే... కొందరికి పుట్టుకతో సమస్యలు వస్తాయి. మరికొందరికి నాలా కాలమే పరీక్షలు పెడుతుంది. కానీ మనం మాత్రం ఒకటి గుర్తించుకోవాలి. గాయాలు శరీరానికే.. కానీ మనసుకు కాదు. కాబట్టి పోరాడి జయించే శక్తి మనలో ఉన్నట్లే. బాధ... ఆనందం ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. స్కూల్, కళాశాల స్థాయిల్లో ఎన్నో విజయాలు, పతకాలు సాధించాను. కానీ 2011 ఏప్రిల్ 12న నా ఆశలు తలకిందులయ్యాయి. రైలు ప్రమాదం నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని అనుకున్నాను. అయినా పట్టుదలతో ముందుకెళ్లాను. 2013 మే 21న ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించినప్పుడు ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నా లక్ష్యాలను పొడిగించుకుంటూ ముందుకెళ్తున్నాను. అదే నా లక్ష్యం... ప్రపంచలోని ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలనేది నా లక్ష్యం. ఇప్పటికే ఆరు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను ఒంటి కాలితో ఎక్కేశాను. ఇక నా ముందున్న లక్ష్యం అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కడమే. అంతకముందే సౌత్ పోల్, నార్త్ పోల్ కవర్ చేస్తాను. హైదరాబాద్‌కు చెందిన బ్లేడ్ రన్నర్ పవన్‌కుమార్ తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆవిష్కరణలో పాల్గొనేందుకు సిటీకి వచ్చాను. ఒక దివ్యాంగుడు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. దీనికి నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా దివ్యాంగులు ఎవరైనా ముందుకొస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది. సిటీ.. వెరీ నైస్ తరచూ హైదరాబాద్‌కు వస్తుంటాను. ఐటీ ఉద్యోగుల్లో స్ఫూర్తినింపే కార్యక్రమాల్లో పాల్గొంటాను. సిటీ వెరీ నైస్... బాగుంది. ఇక్కడ టూరిజం స్పాట్స్ చాలానే ఉన్నాయి. వాతావరణం ఎంతో కూల్‌గా ఉంటుంది. మిగతా మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్. -
వెండితెరపై అరుణిమా జీవితం
అరుణిమా సిన్హా పేరు గుర్తుందా? ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగ మహిళ ఆమే! ఈ మాజీ క్రీడాకారిణి గురించి, ఆమె జీవితంలో ఎదురైన విషాదం గురించి, పట్టుదలతో అన్నిటినీ ఎదిరించి శిఖరాగ్రానికి చేరిన ఆమె దీక్ష గురించి పత్రికల్లో చాలా కథనాలు వచ్చాయి. అయితే, ఇప్పుడు ఆమె జీవితాన్ని వెండితెరకు ఎక్కించే ప్రయత్నం మొదలైంది. దర్శక - నటుడు ఫర్హాన్ అఖ్తర్ ఆ పని చేయడానికి ముందుకొచ్చారు. పరుగుల వీరుడు మిల్కాసింగ్ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ లాంటి నిజజీవిత కథా చిత్రానికి తెరపై ప్రాణం పోసిన ఆయన ఇప్పుడు అరుణిమా సిన్హా జీవితంపై దృష్టి సారించారు. ఇందుకోసం ఆయన ఈ వారం లక్నో వెళ్లి, అరుణిమను స్వయంగా కలసి, ఈ బయోపిక్ ప్రతిపాదన చేశారు. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణి అయిన అరుణిమ 2011లో రైలు ప్రయాణంలో దోపిడీ దొంగల్ని ప్రతిఘటించారు. ఆ ఘర్షణలో దొంగలు ఆమెను రైలులో నుంచి కిందకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె కాళ్లలో ఒకటి తొలగించాల్సి వచ్చింది. అయినా పట్టువదలకుండా ఆమె చేసిన ఎవరెస్ట్ శిఖరారోహణ గురించి ఫర్హాన్ చదివారు. ‘బోర్న్ ఎగైన్ ఆన్ ద మౌంటెన్’ అంటూ అరుణిమపై వచ్చిన పుస్తకం చదివిన ఫర్హాన్ అఖ్తర్ నేరుగా ట్విట్టర్లో నెల రోజుల క్రితం ఆమెను సంప్రదించారు. అప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న అరుణిమ ఇటీవల తిరిగి రాగానే, ఈ వారం ఆమెను ఫర్హాన్ స్వయంగా కలిశారు. అరుణిమ లాంటి వ్యక్తుల జీవితంపై సినిమా తీస్తే అది మరింత మందికి స్ఫూర్తినిస్తుందని ఫర్హాన్ అభిప్రాయం. కాగా, ఈ సినిమాకు తనకు వచ్చే రాయల్టీతో నిరుపేదలు, వికలాంగులకూ ఒక ఉచిత స్పోర్ట్స్ అకాడమీ స్థాపించాలని అరుణిమ భావిస్తున్నారు. లక్నోకు దగ్గరలో ‘పండిట్ చంద్రశేఖర్ వికలాంగ్ ఖేల్ అకాడమీ’ పేరిట సంస్థను నెలకొల్పాలనుకుంటున్న ఆమె ఇప్పటికే తనకు వస్తున్న ఆర్థిక సహాయం మొత్తాన్నీ అటు మళ్లిస్తున్నారు. ఫర్హాన్ వెండితెర ద్వారా, అరుణిమ నిజజీవిత ఆచరణ ద్వారా - మార్గాలు వేరైనా, స్ఫూర్తిదాయక ప్రయత్నాలే చేస్తున్నారు కదూ! -
స్పిరిట్.. ఎవరెస్ట్
‘ఎవరో ఒకరు దీపం వెలిగిస్తారు. ఎవరో ఒకరు దారిచూపిస్తారు’. ఆ ‘ఎవరో ఒకరు..’ ఆకాశంలోంచి ఊడిపడరు. శూన్యంలోంచి ఉద్భవించరు. మనలోనే ఉంటారు. అలాంటివారే అరుణిమా సిన్హా. అసమాన ధైర్యంతో, అనుపమాన సేవాగుణంతో చుట్టూ ఉన్న వ్యక్తుల్లో స్ఫూర్తిని నింపుతున్నారు. ‘యంగ్‌మైండ్స్’ ఆధ్వర్యంలో పీపుల్స్‌ప్లాజాలో ఇటీవల జరిగిన ‘యూత్ లీడర్షిప్ సమ్మిట్’ సందర్భంగా ‘సిటీ ప్లస్’ ఆమెను పలకరించింది... కష్టాలెన్నైనా వెరవక ముందుకు సాగే సాహసవంతుల చరిత్రే ప్రపంచ చరిత్ర... అదే తనకు స్ఫూర్తి అంటారు ఉత్తరప్రదేశ్ కు చెందిన అరుణిమాసిన్హా. విధి చేసిన పెనుగాయానికి ఆమె ఏమాత్రం వెరవలేదు. వైకల్యంతోనూ సవాళ్లను గెలిచింది. సాహసవనితగా నిలిచింది. ‘22 ఏళ్లపాటు నా జీవితం సజావుగానే సాగింది. లక్నో నుంచి ఢిల్లీకి రైలులో ప్రయాణిస్తున్న సమయంలో దోపిడీ దొంగల బారినపడ్డా. ప్రతిఘటించానన్న కసితో దొంగలు నెట్టివేయటంతో పరుగెత్తే రైలులో నుంచి కిందపడ్డా. ఓ కాలు పోయింది. ఒక్కసారిగా నా జీవితమే అంధకారమైనట్లు అనిపించింది. ఆస్పత్రిలో నాలుగు నెలలు. ఒక్కోసారి అంతా కోల్పోయినట్టు ఉండేది. నన్ను నేనే ఓదార్చుకునేదాన్ని.. ధైర్యం చెప్పుకునేదాన్ని. ఆ సమయంలోనే ఎవరూ ఊహించనిది, ఏదో గొప్పది సాధించాలని అనుకున్నా. దాని ఫలితమే ఎవరెస్ట్‌ను అధిరోహించాలన్న సంకల్పం’ అని చెప్పారు అరుణిమ. రోండా గ్రాహమ్ ఆదర్శం ‘ఓ కాలు లేకపోయినా అరవయ్యో ఏట ఎవరెస్ట్‌ను జయించిన అమెరికన్ మహిళ రోండా గ్రాహమ్ ఆదర్శంగా ఆశయానికి అంకురార్పణ చేశా. నా ఆలోచనను ఎవరెస్ట్ అధిరోహించిన ప్రథమ భారతీయ మహిళ బచేంద్రిపాల్ ముందు ఉంచాను. ఆమె సానుకూలంగా స్పందించారు. టాటా స్టీల్ సాహసకృత్యాల సహాయక సంస్థ బాధ్యతలను చూస్తున్న బచేంద్రిపాల్ ఆ సంస్థ తరపున సాయం అందించారు. పర్వతారోహణకు సంబంధించి ఉత్తర కాశీలో ఎన్నో శిక్షణలు తీసుకొన్నా. చిన్న చిన్న పర్వతాలను ప్రయోగాత్మకంగా ఎక్కా. ఆ సమయాల్లో ఎన్నో అడ్డంకులు, మరెన్నో ప్రతికూలతలు. అప్పుడు స్వామి వివేకానంద చెప్పిన అగ్ని కణాల వంటి మాటలే గుర్తొచ్చేవి. చిట్ట చివరకు బంధువులు, మిత్రుల సహకారంతో ఒంటికాలితో 2013 ఏప్రిల్ 1న ఎవరెస్ట్ సాహసయాత్ర ప్రారంభించాను. మే 21న ఆ పర్వతాగ్రాన జయకేతనాన్ని రెపరెపలాడించా. జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినప్పుడు వెరసి వెనుకడుగేయొద్దు. కలలను సాకారం చే సుకునే దిశగా ముందుకు సాగాలి’ అంటున్న అరుణిమ... మనిషి దృఢ దీక్షముందు 21వేల అడుగుల ఎవరెస్ట్ చాలా చిన్నదని నిరూపించింది. -
వివరం: స్ఫూర్తి శిఖరాలు
శిఖరం కన్న సంకల్పబలం ఎత్తైదని నిరూపించిన భారతీయ మహిళలు వీరంతా! బచేంద్రీపాల్ మొదలు... ఒంటికాలితో ఎవరెస్టును ఎక్కిన అరుణిమ సిన్హా వరకు ఒక్కొక్కరిదీ ఒక్కో ప్రత్యేకత. అందరిదీ ఒకే పట్టుదల. అందుకే వీరు స్ఫూర్తి శిఖరాలయ్యారు. ప్రపంచంలోకెల్లా ఎత్తయిన శిఖరం ఏది? ప్రశ్న పూర్తయే లోపు ‘ఎవరెస్టు’ అనే సమాధానం వస్తుంది. 29,029 అడుగుల ఎత్తయిన హిమాలయ పర్వతాల్లో మహలాంగుర్ సెక్షన్లో ఉంది ఎవరెస్టు శిఖరం. దీనిని నేపాలీయులు ‘సాగర్మాత’ అనీ, టిబెట్ వాసులు చోమోలుంగ్మా అనీ పిలుచుకుంటారు. ఎవరు ఎలా పిలుచుకున్నా... శిఖరం ఎప్పుడూ గొప్పదే. ఎవరికీ అందనంత ఎత్తులో ఉండడమే దాని గొప్పదనం. అయితే, ‘ఆ గొప్పదనమేంటో మేమూ చూస్తాం’ అంటూ ఎగబాకుతారు సాహసికులు. ఎవరెస్టును అధిరోహించిన సాహసికుల్లో... ఏడడుగులే కాదు, శిఖరయానం కూడా కలిసే అంటూ ఎవరెస్టునెక్కిన దంపతులు మరీజా, ఆమె భర్త యాండ్రెజ్ స్ట్రెమ్ఫెల్జ్... అరవైలలో ఒకసారి, డెబ్బైలలో మరోసారి ఎవరెస్టు ఎక్కిన రికార్డు నాది అంటూ టేమీ వాటనబుల్... ఇప్పటికి ఇరవైసార్లకు పైగా ఎక్కాను తెలుసా అంటూ అపా షెర్పా... ఇలా ప్రపంచదేశాల నుంచి లెక్కలేనంత మంది ఎవరెస్టును అధిరోహించి తమ కీర్తిని శిఖర స్థాయికి చేర్చుకున్నారు. ఈ అధిరోహణలో భారతీయుల స్థానం కూడా తక్కువేం కాదు. ఈ పరంపరకు తొలి అడుగు బచేంద్రిపాల్. ఆ తర్వాత తండోపతండాల్! ఆ మహిళల అడుగులే ఈవారం మన ‘వివరం’. బచేంద్రిపాల్: ఎవరెస్టును అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్. ఆమె 1984 మే నెల 23న ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు. బచేంద్రిపాల్ భారతీయ మహిళా పర్వతారోహకులకు స్ఫూర్తి ప్రదాత. ఆమె తర్వాత ఎవరెస్టును అధిరోహణకు పూనుకున్న ప్రతి పర్వతారోహకులూ ఒక్కసారైనా ఆమెను కలవాలనీ, సూచనలను తీసుకోవాలనీ, ఆమెతో ఫొటో తీసుకోవాలనీ ఉవ్విళ్లూరినవారే. బచేంద్రిపాల్ 1954 మే నెల 24వ తేదీన జన్మించారు. అంటే నిన్నటికి అరవై ఏళ్ల కిందట అన్నమాట. విశేషం ఏమిటంటే... ఆమె ఎవరెస్టును అధిరోహించింది 1984 మే నెలలోనే తన పుట్టినరోజుకు సరిగ్గా ఒక రోజు ముందే. అంటే ఆమెకు 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఆమె కీర్తి ఎవరెస్టు శిఖరానికి చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గడచిన ముప్ఫై ఏళ్లుగా ఆమె కీర్తి అలాగే శిఖరస్థాయిలో కొనసాగుతోంది. నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ ద్వారా ఆమె చాలాకాలంగా పర్వతారోహణలో మహిళలకు (పురుషులకు కూడా) శిక్షణనిస్తున్నారు. టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్‌కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. ఈ రికార్డులకంటే ముందు ఆమె సాధించిన మరో రికార్డు కూడా ఉంది. నకురి గ్రామంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తొలి అమ్మాయి బచేంద్రిపాల్. ఆ తర్వాత ఆమె సంస్కృతంలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేశారు. ఆమె తొలిసారి పర్వతారోహణ చేసింది పన్నెండేళ్ల వయసులో. స్కూలు విద్యార్థులతోపాటు పిక్నిక్లో భాగంగా 13, 123 అడుగుల పర్వతాన్ని అధిరోహించారు. సంతోష్‌యాదవ్: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండవ భారతీయ మహిళ సంతోష్ యాదవ్. ఆమె 1992, 1993లలో మే నెలలో ఎవరెస్టును అధిరోహించారు. అలా ఏడాది వ్యవధిలో రెండుసార్లు ఎవరెస్టును అధిరోహించారు. సంతోష్ యాదవ్1967 అక్టోబర్ 10న జన్మించారు. ఆమెది హర్యానా రాష్ట్రం, రెవారీ జిల్లాలో జోనియావాస్ గ్రామం. జైపూర్‌లోని మహారాణి కాలేజ్‌లో చదివారు. ఉత్తరకాశిలోని కస్తూర్బా హాస్టల్లో ఉంటూ ‘నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్’ సంస్థలో శిక్షణ పొందారు. ఆమె ఇండియన్ సివిల్ సర్వీసు పరీక్షలకు చదువుతూనే పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే ఆమె ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె ఇండో- టిబెట్ సరిహద్దు పోలీస్ అధికారి. ఆమె సేవలకు గాను భారత ప్రభుత్వం 2000 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది. కల్పనా దాస్: 2008, మే 21వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని చేరారు. అది ఆమెకు మూడవ ప్రయత్నం. ప్రతికూలమైన వాతావరణపరిస్థితులు, ఆరోగ్యం సహకరించకపోవడం వంటి కారణాల వల్ల ఈమె 2004, 2006లలో రెండుసార్లు విఫలమయ్యారు. మొదటిసారి 7,300 మీటర్లు, రెండవసారి 8, 048 మీటర్ల వరకు మాత్రమే వెళ్లగలిగారు. మూడవ ప్రయత్నానికి ముందు బచేంద్రిపాల్‌ను కలిసి సలహా తీసుకున్నట్లు ఆమె చెప్తారు. కల్పనాదాస్ 1966 జూలై 7వ తేదీన ఒరిస్సా రాష్ట్రం థేన్‌కానల్ జిల్లా సరియాపారా గ్రామంలో జన్మించారు. ఆమె వృత్తి రీత్యా న్యాయవాది. ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ ‘దేవుడి దయ వల్ల, మా కుటుంబ సభ్యుల ఆశీస్సుల వల్ల అత్యంత ఎత్తై శిఖరాన్ని అధిరోహించి రికార్డు సాధించగలిగాను. విఘ్నాలను అధిగమిస్తూ శిఖరాన్ని చేరడంతోపాటు అంతే క్షేమంగా వెనక్కు రాగలిగాను. ఆ శిఖరాన్ని మళ్లీ మళ్లీ అధిరోహించాలనుంది’’ అన్నారామె. ప్రస్తుతం ఆమె థేన్‌కానల్ పట్టణంలో నివసిస్తున్నారు. ప్రేమలతా అగర్వాల్: 2011, మే నెల 20వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఈ రికార్డుతోపాటు ఆమెకు ‘ఎవరెస్టును అధిరోహించిన భారతీయ మహిళల్లో పెద్ద వయస్కురాలిగా’ మరో రికార్డు కూడా ఉంది. ఎవరెస్టు ఎక్కేనాటికి ఆమె వయసు 45 ఏళ్లు. ఆమెకి ఇద్దరు కుమార్తెలు. ఆమె ఎవరెస్టు ఎక్కే నాటికే పెద్దమ్మాయికి వివాహమైంది కూడ. జార్ఖండ్‌కు చెందిన ప్రేమలత గృహిణి. ఆమె భర్త విమల్ అగర్వాల్ సీనియర్ పాత్రికేయులు. ఎవరెస్టు ఆరోహణకు ముందు ఆమె 40 రోజుల పాటు ఎడారిలో పర్యటించారు. థార్ డెజర్ట్ ఎక్స్పిడిషన్లో భాగంగా ఆమె గుజరాత్ లోని భుజ్ ప్రాంతం నుంచి పంజాబ్‌లోని అట్టారి (వాఘా బోర్డరు) వరకు ఒంటె మీద సవారీ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్సులో నమోదయ్యారు. ప్రపంచంలోని ఏడు శిఖరాలను అధిరోహించాలనే సంకల్పంతో ఆఫ్రికాలో ఎత్తై శిఖరం కిలిమంజరో అగ్నిపర్వత శిఖరాన్నీ, అర్జెంటీనాలోని మౌంట్ అకాంగువా శిఖరాన్నీ అధిరోహించారు. ఆమె తన పెద్ద కూతురు ప్రియాన్ష తోపాటు టాటా స్టీల్ అడ్వెంచర్ ఇన్స్ట్యూట్లో బచేంద్రిపాల్ దగ్గర శిక్షణ తీసుకున్నారు. విద్యాపతీ దేవి: 2013, మే 17వ తేదీన ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. పూర్తిపేరు నింగ్తోజమ్ విద్యాపతీదేవి. ఆ ఏడాది ఏప్రిల్ ఐదవ తేదీన ఆమె ఎవరెస్టు బేస్ క్యాంపుకు చేరారు. అక్కడి నుంచి హిమాలయ పర్వతాల ఆరోహణ మొదలు పెట్టిన వీరి బృందం ఏప్రిల్ నెలాఖరుకు 24,000 అడుగుల ఎత్తులో ఉన్న మూడవ క్యాంపుకు చేరింది. ఆ సమయంలో ఆ ప్రదేశంలో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. ఆ వాతావరణంలో కొనసాగుతూ మే నెల 17వ తేదీకి శిఖరాన్ని చేరారు. విద్యాపతీదేవి 2004లో ఉత్తరకాశిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణలో శిక్షణ పొందారు. దీనితోపాటు సియాచిన్ గ్లేసియర్‌లో వింటర్ ట్రైనింగ్ కోర్సు కూడా చేశారు. లైజన్ ఆఫీసర్ కోర్సు, సెర్చ్ అండ్ రెస్క్యూ, ఆల్పైన్ కోర్సు, మెథడ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కోర్సులు కూడా చేశారు. ప్రస్తుతం ఆమె మణిపూర్ మౌంటనియరింగ్ ట్రెకింగ్ అసోసియేషన్‌లో అడ్వెంచర్ ఇన్‌స్ట్రక్టర్‌గా కొనసాగుతున్నారు. విద్యాపతీదేవి ఎవరెస్టు ఎక్స్‌పెడిషన్‌ని మణిపూర్‌లోని ‘మణిపూర్ మౌంటనియరింగ్ అండ్ ట్రెక్కింగ్ అసోసియేషన్’ నిర్వహించారు. ఈ బృందంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అన్షు జామ్సెన్పా కూడా ఉన్నారు. వాన్‌షుక్ మిర్తాంగ్: ఈమె మేఘాలయకు చెందిన ఆర్మ్డ్ పోలీసు కానిస్టేబుల్. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 16 మంది పర్వతారోహకుల బృందంతోపాటు ఈమె 2013 మే నెల 17వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. వీరు బృందాలుగా విడిపోయి ఆరోహణ కొనసాగించారు. మొదటి బృందంలో విద్యాపతీదేవితోపాటు మరో ఇద్దరు ఉన్నారు. ఆరుగురితో కూడిన రెండవ బృందంలో వాన్‌షుక్ ఉన్నారు. వాన్‌షుక్ ‘నార్త్ ఈస్ట్ జోన్ స్పోర్ట్స్ క్లైంబింగ్ కమిటీ’ నిర్వహించిన పోటీల్లో రెండు బంగారు పతకాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. 2006లలో మేఘాలయ పోలీస్ శాఖలో చేరిన వాన్‌షుక్ ఉత్తరాఖండ్ రాష్ట్రం ‘ఔలి’ లో ఉన్న మౌంటనియరింగ్ అండ్ స్కీయింగ్ ఇన్స్టిట్యూట్లో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నారు. చందా గయేన్: 2013, మే నెల 18వ తేదీన ఎవరెస్టును అధిరోహించారు. హౌరాలో నివసిస్తున్న చందా ఈ రికార్డును సాధించిన బెంగాలీ మహిళ. డార్జిలింగ్‌లోని ‘హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్’లో ఆమె శిక్షణ పొందారు. ఎవరెస్టు అరోహణకు ముందు ఆమె గర్వాల్ జిల్లాలోని జోగిన్ శిఖరాలను, హిమాచల్ ప్రదేశ్‌లోని మనిరంగ్ శిఖరాన్ని అధిరోహించారు. కరాటే వంటి యుద్ధకళల్లో ప్రావీణ్యత సాధించిన చందా గయేన్ ఆత్మరక్షణ మెళకువలు నేర్పించే ఉపాధ్యాయిని. తన తల్లి జయా గయేన్ నుంచి స్ఫూర్తి పొందారు. జయాగయేన్కు ట్రెకింగ్ హాబీ. చందాగయేన్ రాక్ క్లైంబింగ్, ట్రెకింగ్, మౌంటనియరింగ్లలో శిక్షణ పొందారు. చందా డార్జిలింగ్‌లో హిమాలయన్ మౌంటనియరింగ్ ఇన్స్టిట్యూట్, నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్ లో పర్వతారోహణ సాధన చేశారు. దీంతోపాటు హిమాలయన్ నేచర్ అండ్ అడ్వెంచర్ ఫౌండేషన్ నిర్వహించిన అడ్వెంచర్ ట్రెకింగ్ క్యాంపులో పాల్గొన్నారు. ఆమె స్విమ్మింగ్, కబడీ, ఎన్సిసి, మార్షల్ ఆర్ట్స్, మౌంటనియరింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్తోపాటుగా పాటలు పాడడంలో కూడా సుశిక్షితురాలు. జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకం, రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో చాంపియన్‌షిప్, కరాటే చాంపియన్‌షిప్‌లు సాధించారు. తాషి మాలిక్, నాంగ్‌షి మాలిక్: ఈ అక్కాచెల్లెళ్లు ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలు. వీరు 2013 మే 19వ తేదీన శిఖరాన్ని చేరారు. అప్పటికి వారి వయసు 21 ఏళ్లు. వీరిది హర్యానాలోని సోనీపత్ జిల్లా. వీరి తండ్రి కల్నల్ వీరేంద్రసింగ్ మాలిక్ మిలటరీలో ఉద్యోగం చేసి డెహ్రాడూన్‌లో రిటైరవడంతో కుటుంబం అక్కడే స్థిరపడింది. వీరు 2010లో ఉత్తరకాశిలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనియరింగ్, జమ్ము-కాశ్మీర్ రాష్ట్రం, గుల్మార్గ్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కీయింగ్ అండ్ మౌంటనియరింగ్లో శిక్షణ పొందారు. పాఠశాల స్థాయి నుంచి ఆటల్లో, సాహస క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్న నేపథ్యం వీరిది. జర్నలిజం- మాస్ కమ్యూనికేషన్లో గ్రాడ్యుయేషన్ చేశారు. ఏడు శిఖరాల అధిరోహణలో భాగంగా ఇప్పటికి ఆసియా, ఆఫ్రికా, ఐరోపా, దక్షిణ అమెరికా ఖండాలలోని శిఖరాలను అధిరోహించారు. ఇండోనేసియా, యుఎస్, అంటార్కిటికాలలోని శిఖరాలను ఎక్కే ప్రయత్నంలో ఉన్నారు. అరుణిమా సిన్హా : 2013, మే 22వ తేదీన శిఖరాన్ని చేరారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతీయ మహిళల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి అరుణిమా సిన్హా. ప్రమాదవశాత్తూ ఒక కాలిని కోల్పోయిన తర్వాత అందరూ తన మీద చూపించే సానుభూతికి సమాధానంగా ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరుణిమ జాతీయస్థాయి వాలీబాల్ క్రీడాకారిణి. మూడేళ్ల కిందట ఒకసారి అరుణిమ రైలో ప్రయాణిస్తుండగా దొంగలు ఆమె పర్సును లాక్కునే ప్రయత్నం చేశారు. ఆ ప్రతిఘటనలో దొంగలు ఆమెను కదులుతున్న రైల్లోంచి బయటకు తోసేశారు. ఆ ప్రమాదంలో ఆమె ఎడమకాలు నుజ్జనుజ్జయింది. ఆమెను బతికించాలంటే ఆ కాలిని తీసేయడమే మార్గం అని తేల్చేశారు డాక్టర్లు. ఆమె ఎవరెస్టును అధిరోహించిన సందర్భంగా మాట్లాడుతూ... ‘కాలు పోతే జీవితాన్ని కోల్పోయినట్లు కాదు...’ అని నిరూపించడానికే ఈ సాహసం చేశానన్నారు. తన సాహసయాత్రను ‘టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్’ స్పాన్సర్ చేసింది. వ్యక్తిగతంగా వీళ్లే కాకుండా, 2005లో అంతా మహిళలే ఉండే ‘ఆల్ ఉమెన్ ఆర్మీ ఎక్స్‌పెడిషన్’ జరిగింది. భారతీయ సైనిక రంగానికి చెందిన మహిళల బృందం ఎవరెస్టును అధిరోహించి వచ్చింది. ఇక ఈ ఏడాది (2014) ఏప్రిల్ 18వ తేదీన శిఖరం మీద జరిగిన ప్రకృతి వైపరీత్యం కారణంగా 16 మంది పర్వతారోహకులు మరణించారు. ఈ ఘటన కారణంగా ఈ ఏడాది ఎవరెస్టు శిఖరారోహణను నిషేధించారు. అలా జరగకపోయి ఉంటే ఈ మే నెల మరికొంత మంది మహిళలను ఎవరెస్టు శిఖరంపై ఖాయంగా నిలబెట్టి ఉండేదే.ఎవరెస్టు శిఖరం అన్నిటి కన్నా ఎత్తయినది కావచ్చు. అయితే మహిళల సంకల్పబలం ఎవరెస్టును మించినదని ఈ పది మంది మహిళా పర్వతారోహకులు నిరూపించారు. - వాకా మంజులారెడ్డి