‘ఏం చేయలేం.. అనుకుంటే మొదటి మెట్టే ఆఖరు అవుతుంది. అదే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే చివరి మెట్టు వరకూ చేరొచ్చు. ఆ నమ్మకంతోనే ఎన్ని లక్ష్యాలనైనాఅధిగమించొచ్చు. గాయం శరీరానికే.. కానీ మనసుకు కాదు. పోరాడితే విజయం మనదే. ఇది దివ్యాంగులు గుర్తించుకోవాలి’ అని చెప్పారు దివ్యాంగ పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన అరుణిమ... ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించింది. నగరానికి వచ్చిన అరుణిమ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
సాక్షి, సిటీబ్యూరో: నా స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. చదువుకునే రోజుల్లో వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాను. అందులోనే అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాను. కానీ నేనొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రైలు ప్రమాదంలో నా కాలు పోయింది. అయితే ఎదగాలన్న నా పోరాటం ఆగలేదు. ఇంకా బలపడింది. ఇప్పటికీ సాఫ్ట్‌బాల్, జావలిన్‌త్రో లాంటి క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాను. దివ్యాంగులకు నేను చెప్పేద్దొక్కటే... కొందరికి పుట్టుకతో సమస్యలు వస్తాయి. మరికొందరికి నాలా కాలమే పరీక్షలు పెడుతుంది. కానీ మనం మాత్రం ఒకటి గుర్తించుకోవాలి. గాయాలు శరీరానికే.. కానీ మనసుకు కాదు. కాబట్టి పోరాడి జయించే శక్తి మనలో ఉన్నట్లే.
బాధ... ఆనందం
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. స్కూల్, కళాశాల స్థాయిల్లో ఎన్నో విజయాలు, పతకాలు సాధించాను. కానీ 2011 ఏప్రిల్ 12న నా ఆశలు తలకిందులయ్యాయి. రైలు ప్రమాదం నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని అనుకున్నాను. అయినా పట్టుదలతో ముందుకెళ్లాను. 2013 మే 21న ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించినప్పుడు ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నా లక్ష్యాలను పొడిగించుకుంటూ ముందుకెళ్తున్నాను.
అదే నా లక్ష్యం...
ప్రపంచలోని ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలనేది నా లక్ష్యం. ఇప్పటికే ఆరు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను ఒంటి కాలితో ఎక్కేశాను. ఇక నా ముందున్న లక్ష్యం అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కడమే. అంతకముందే సౌత్ పోల్, నార్త్ పోల్ కవర్ చేస్తాను. హైదరాబాద్‌కు చెందిన బ్లేడ్ రన్నర్ పవన్‌కుమార్ తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆవిష్కరణలో పాల్గొనేందుకు సిటీకి వచ్చాను. ఒక దివ్యాంగుడు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. దీనికి నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా దివ్యాంగులు ఎవరైనా ముందుకొస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది.
సిటీ.. వెరీ నైస్
తరచూ హైదరాబాద్‌కు వస్తుంటాను. ఐటీ ఉద్యోగుల్లో స్ఫూర్తినింపే కార్యక్రమాల్లో పాల్గొంటాను. సిటీ వెరీ నైస్... బాగుంది. ఇక్కడ టూరిజం స్పాట్స్ చాలానే ఉన్నాయి. వాతావరణం ఎంతో కూల్‌గా ఉంటుంది. మిగతా మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్.
Comments
Please login to add a commentAdd a comment