evarest moutain
-
అరుదైన ఘనత సాధించిన మరో గిరిపుత్రిక
అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించింది మాలోత్ పూర్ణ. ఆమె బాటలోనే మరో గిరిజన యువతి పర్వతారోహణలో అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. పూర్ణనే తనకు ఆదర్శం అని చెబుతున్న మాలోత్ రజిత ఇటీవలే కిలిమంజరో పర్వతాన్ని సునాయసంగా అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మారుమూలన ఉన్న సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రజిత మెదక్ జిల్లాలోని కొల్చారం గురుకుల డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచి ఆటల్లో ముందున్న రజిత డిగ్రీలో చేరిన తరువాత పర్వతారోహణలతో రికార్డు సృష్టించిన పూర్ణ విజయగాధను చూసి తను కూడా ఆమె అంత ఎత్తుకు ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ 60 మందిని ఎంపిక చేశారు. అందులో రజిత ఒకరు. భువనగిరిలో శిక్షణ ఇప్పించారు. అరవై మందిలో 16 మందిని ఎంపిక చేసి జమ్ము కాశ్మీర్‌లోని సిల్క్రూట్పాస్ (కార్దుంగ్లా)కు తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి రజితతో పాటు లక్ష్మి అనే యువతినీ ఎంపిక చేశారు. ఇద్దరినీ గత జనవరి నెలలో టాంజానియాకు తీసుకువెళ్లారు. జనవరి 19న కిలిమంజారో పర్వతం ఎక్కడం మొదలై 23 కు పూర్తి చేశారు. 5,895 మీట్ల ఎత్తుకు ఎక్కి భారత పతాకాన్ని ఎగురవేశారు. వ్యవసాయ కుటుంబం సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ కుబియా–జీరి దంపతుల కుమార్తె రజిత ఐదో తరగతి వరకు ఎక్కపల్లితండా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్లారెడ్డిలోని కస్తూరిబా విద్యాలయంలో, ఇంటర్ మెదక్‌లోని ఓ ప్రై వేటు కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలోని గురుకుల కళాశాలలో బీఎస్సీ బీజడ్సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా రజిత తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వారికి నలుగురు కుమారులు కాగా వారంతా వ్యవసాయంలోనే ఉన్నారు. రజిత ఒక్కతే చదువుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే రజిత ఆటల్లో ముందువరుసలో ఉండేది. కబడ్డీతో పాటు రన్నింగ్‌లోనూ దూకుడుగా ముందుకు సాగేది. రాష్ట్ర స్థాయిలో పది కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని అవార్డులు పొందింది. ఏడు పర్వతాల అధిరోహణ కల పూర్ణ ఎవరెస్టు ఎక్కిన తరువాత తనకు కూడా పర్వతాలు అధిరోహించాలన్న కోరిక బలంగా కలిగిందని రజిత చెబుతోంది. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీన్‌కుమార్ ప్రోత్సాహంతో తాను కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించింది. అలాగే తన కుటుంబ సభ్యులతో పాటు కొల్చారం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతీదేవీలు ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాబోయే సెలవుల్లో ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొంది. ఏడు పర్వతాలు అదిరోహించడమే తన లక్ష్యమని చెబుతోంది. క్రీడాకారులను తయారు చేస్తా ఏడు పర్వతాలు అధిరోహించిన తరువాత బీపీఈడీ పూర్తి చేస్తా. పీఈటీగా ఉద్యోగం చేయడంతో పాటు క్రీడాకారులను తయారు చేయడానికి స్పోర్ట్స్ స్కూల్ నడపాలన్నది నా కోరిక. లక్ష్య సాధనలో ఎలాంటి ఒత్తిడి, కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు నడుస్తా. స్వేరోస్ కమిటీ, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల సహకారం మరువలేనిది. కష్టమైన పని కావడం వల్ల అమ్మ వద్దంటున్నా నాన్న, అన్నలు ప్రోత్సహిస్తున్నారు. వారందరి ప్రోత్సాహంతో ఎవరెస్టునూ అధిరోహిస్తా. – మాలోత్ రజిత, పర్వతారోహిణి -
సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే..
హైదరాబాద్‌లో రెండు రోజుల పాటు నిర్వహించే రన్నింగ్ మారథాన్లు కేవలం క్రీడాకారులకే కాదు, పరుగంటే ఆసక్తి ఉన్నవారందరికీ పండుగ లాంటివి. ఆరోగ్యం కోసం ప్రారంభించిన పరుగు నుంచి స్ఫూర్తి పొంది ఏకంగా ఎవరెస్టును అధిరోహించారు రొమెల్ బర్త్వాల్. మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్ ‘నేను ఢిల్లీ వాసినైనా..హైదరాబాద్ అంటే ఇష్టం. నా మారథాన్ విజయాలకు ఇక్కడే బీజం పడింది. మొదట హైదరాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటి రోజునుంచే ఈ క్లబ్ వాళ్లు రిసీవ్ చేసుకున్న తీరు, వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం ఎక్సలెంట్. నేను మొదటిసారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లో పాల్గొన్నాను. అలా నా పరుగుల పరంపర మొదలైంది. చివరకు ఎవరెస్ట్ కూడా అధిరోహించాను. ఈ విజయాలకు నాంది హైదరాబాద్ కావడం నా అదృష్టం.’ అంటూ తన విజయగాథను వివరించారు ప్రముఖ మారథాన్ రన్నర్ రోమిల్ బర్త్వాల్. సాక్షి, హైదరాబాద్: రొమెల్ బర్త్వాల్ ఢిల్లీవాసి. ఉద్యోగం రీత్యా ప్రభుత్వ అధికారి. ఎన్నో మారథాన్లలో పాల్గొన్నారు. వీటి నుంచి స్ఫూర్తిని పొంది ఈ ఏడాది మేలో ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారు. బోస్టన్ మారథాన్, లేహ్ 111 కి.మీ. లాల్ట్రా 14 గంటల రికార్డును ఆయన నెలకొల్పారు. ఢిల్లీ స్టేడియంలో 24 గంటల పరుగు పోటీలో పాల్గొని 185 కి.మీలు పరిగెత్తి రెండో స్థానంలో నిలిచాడు. వీటితో పాటు వాటర్ రాఫ్టింగ్, బంజీ జంపింగ్, పారాగ్లైడింగ్, పారామోటార్స్ వంటి మరెన్నో సాహసయాత్రలు, రికార్డులు ఆయన సొంతం. ఏడవది ఈజ్ నాట్ ఈజీ.. రొమిల్ బర్త్వాల్ ఏడు పర్వతాలను అధిరోహించారు. అందులో ఏడవది మౌంట్ ఎవరెస్ట్. ఎటువంటి గాయాలు లేకుండా ఎవరెస్టు యాత్ర పూర్తి చేసుకున్న అరుదైన రికార్డుని రొమిల్ టీం సొంతం చేసుకుంది. ఏడాది పాటు కఠిన శిక్షణతోనే ఇది సాధ్యమైంని చెబుతారు రొమిల్. సాహసయాత్రకు పునాదులు హైదరాబాద్‌లోనే.. అనేక రికార్డులు సొంతం చేసుకున్న రొమెల్ సాహస యాత్ర హైదరాబాద్‌లోనే మొదలైంది. ఇక్కడ ఐఐటీలో చదివేప్పుడు మారథాన్లపై ఆసక్తిని పెంచుకున్నా రు. ‘‘2012లో హైదరాబాద్‌కి వచ్చినప్పుడు నా కల నిజమయ్యే అవకాశం కలిగింది. ఈ సిటీ నా ఫేవరెట్. హైదారాబాద్ రన్నర్ క్లబ్లో చేరాను. చేరిన మొదటిరోజు నుంచే ఈ క్లబ్ రిసీవ్ చేసుకున్న తీరు వాళ్లు ఒక బిగినర్‌కి ఇచ్చే సలహాలు, సమాచారం, చాలా మరిచిపోలేను’’ అని భావోద్వేగాని గురయ్యారు. పరుగు.. ఒక వ్యసనం మొదటి సారి పీపుల్స్ ప్లాజాలో, తర్వాత సీబీఐటీ రన్లలో పాల్గొన్నాను. ఆదివారం ఎప్పుడొస్తుందా అని ఎదురు ప్రతి రోజూ చూసేవాడిని. అంతగా ఈ పరుగులలో పాల్గొనడానికి అడిక్ట్ అయిపోయాను. హైదరాబాద్ హెరిటేజ్ వాక్, హాఫ్ మారథాన్ (21 కి.మీ)కి ముందు చెయ్యగలనా లేదా అని సంశయించాను. కానీ ఇక్కడ ఆర్గనైజర్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. అలా ప్రారంభమైన పరుగుల పరంపర ఒక వ్యసనంలా మారింది ఎవరెస్ట్ అధిరోహణ అసాధ్యమేమీ కాదు.. ఉద్యోగం, చదువు పేరుతో బిజీగా ఉన్న వాళ్లు ఒక్క రోజులో ఫుల్ మారథాన్ పరిగెత్తడం, ఎవరెస్ట్ ఎక్కడం కుదరదు. కానీ ప్రయత్నిస్తే తప్పకుండా సాధించగలరు. 2 కి.మీ. నడక నుంచి ప్రారంభించి, 5, 10 కి.మీ. పరుగుకు చేరుకోవచ్చు. 5 కి.మీలు నటక, పరుగు నుంచి ప్రారంభించటం వల్ల శారీరక స్థితి మెరుగవుతుంది. తర్వాత చిన్న చిన్న ట్రెక్కింగ్‌ను ప్రారంభించవచ్చు. ఆ తర్వాత తక్కువ ఎత్తున్న పర్వతాలను ఎక్కుతూ, ఎవరెస్ట్ అధిరోహణ శిక్షణ తీసుకోవడానికి సిద్ధం కావచ్చు. హైదరాబాద్ రన్నర్స్ క్లబ్‌ను మరువలేను 2012 నుంచి క్లబ్లో మెంబర్‌గా ఉన్నాను. ఇక్కడి మారథాన్లలో నాలుగు సార్లు పాల్గొన్నాను. నేను పాల్గొన్న క్లబ్లన్నింటి కంటే హైదరాబాద్ రన్నర్స్ క్లబ్ చాలా ప్రత్యేకం. ఇక్కడ చాలా దేశాల్లో మారథాన్‌లో పాల్గొన్న రన్నర్లు ఉన్నారు. వీరు చాలా ఈవెంట్ల గురించి వివరాలు తెలియజేస్తారు. సలహాలిస్తారు. ఇక వేరే నగరాల్లో ఇలాంటి గ్రూప్‌లు ఏర్పాటు అయి కొంతకాలానికి కనుమరుగవుతుంటాయి. ఈ గ్రూప్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. డిసిప్లిన్, హెల్ప్ఫుల్నెస్ హైదరాబాద్‌లో చాలా బాగుంటుంది. 2015లో నగరం వదిలినా ఈ క్లబ్‌ని, ఇక్కడి మిత్రులను కలవడం మాత్రం మానలేదు. -
ప్రారంభమైన బోగిబీల్... ప్రత్యేకతలెన్నో!
-
ప్రారంభమైన బోగిబీల్... ప్రత్యేకతలెన్నో!
గువహటి : భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బోగిబీల్ రోడ్ కమ్ రైల్ బ్రిడ్జి’ని ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. 5 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జిగా నిలిచింది బోగిబీల్ బ్రిడ్జి. బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలోని దిబ్రూఘర్, ధేమాజీ జిల్లాల నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని వల్ల 170 కిలోమీటర్ల దూరంతో పాటు, 4 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికలను, ఫైటర్ జెట్ల ల్యాండింగ్లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్ బ్రిడ్జిని నిర్మించారు. ఈ బ్రిడ్జ్‌కు సంబంధించి విశేషాలు.. 1. స్వీడన్, డెన్మార్క్‌ల మధ్య నిర్మించిన వంతెన ఆధారంగా 1997లో ఈ బ్రిడ్జ్‌ని డిజైన్ చేశారు. భారతదేశంలోనే పూర్తిస్థాయిలో వెల్డింగ్ చేసిన బ్రిడ్జిగా మాత్రమే కాక యూరోపియన్ కోడ్స్, వెల్డింగ్ స్టాండర్డ్‌ని పాటించిన తొలి బ్రిడ్జిగా బోగిబీల్ బ్రిడ్జి నిలిచింది. పూర్తిగా వెల్డింగ్ చేయడం వల్ల దీనికి నిర్వహణ ఖర్చు చాలా తక్కువగా ఉంటుందంటున్నారు ఇంజనీర్లు. 2. బోగిబీల్ బ్రిడ్జి ఆసియాలోనే రెండో అతి పొడవైన బ్రిడ్జిగా నిలిచింది. దీని జీవితకాలం 120 సంవత్సరాలు. 3. ఈ బ్రిడ్జి నిర్మాణంలో కింది భాగంలో రెండు రైల్వే ట్రాక్‌లు ఉండగా.. పై భాగంలో మూడు రోడ్ ట్రాక్‌లను నిర్మించారు. వీటి వల్ల ఢిల్లీ నుంచి దిబ్రూఘర్ మధ్య ప్రయాణ కాలం మూడు గంటలు తగ్గుతుంది. 4. బ్రిడ్జి ప్రారంభంతో పాటు మోదీ తిన్సుకియా - నహర్లాగున్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును కూడా ప్రారంభించారు. ఇది వారంలో ఐదు రోజులు నడుస్తుంది. 5. తొలుత దీన్ని రూ. 3, 200 కోట్ల బడ్జెట్‌తో 4. 31 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని భావించారు. కానీ తరువాత దీన్ని 4. 9 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ఫలితంగా బడ్జెట్ రూ. 5, 900 కోట్లకు చేరింది. 6. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ 1997, జనవరి 22న ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అయితే వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో పని ప్రారంభించారు. నేడు వాజ్‌పేయి జయంతి సందర్భంగా ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. 7. బ్రహ్మపుత్ర నదిలో నవంబర్ నుంచి మార్చి నెలల్లో వచ్చే వరదల వల్ల దాదాపు 5 నెలల పాటు పనులకు అంతరాయం ఏర్పడిందని అందువల్లే బ్రిడ్జి నిర్మాణానికి ఇంత ఆలస్యమయ్యిందని ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ మోహిందర్ సింగ్ తెలిపారు. 8. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం దాదాపు 30 లక్షల బస్తాల సిమెంట్‌ను వాడినట్లు తెలిపారు. ఇది దాదాపు 41 ఒలంపిక్ స్విమ్మింగ్ పూల్ల నిర్మాణానికి సరిపోతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కోసం దాదాపు 19, 205 మీటర్ల స్టీల్‌ను వాడారు. ఇది ఎవరెస్ట్ శిఖరం ఎత్తుకు రెండింతలన్నారు. 9. ఈ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్‌లోని అంజా, చాంగ్లాంగ్, లోహిత్, లోయర్ దిబాంగ్ వాలీ, దిబాంగ్ వాలీ, తిరాప్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. దాంతో పాటు అస్సాంలోని దిబ్రూఘర్, ధెమాజీ జిల్లాల ప్రజలు కూడా లాభపడనున్నారు. 10. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికకు, ఫైటర్ జెట్ల ల్యాండింగ్లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబీల్ బ్రిడ్జి నిర్మించారు. -
ఎవరెస్టు ప్రసాద్
ఒళ్లు కొరికే చలి..చుట్టూ మంచు గడ్డలు.. 8,848 మీటర్ల ఎత్తు..ఇదెక్కడో ఊహించే ఉంటారు. ఎవరెస్టు శిఖరం. అత్యంత ఎత్తయిన పర్వతం..అధిరోహించాలంటే ఎంతటి ధైర్యం కావాలి. ఎంత సాహసం చేయాలి.. మూడు నెలలు కఠోరంగా కష్టపడి ఓ యువకుడు అనుకున్నది సాధించా డు. తాను కలలు గన్న ఎవరెస్టు ఎక్కి భారత పతాక ఎగురేశాడు. జిల్లాకు చెంది న వరప్రసాద్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. ఎలాగో తెలుసుకుందాం.. చిత్తూరు రూరల్: చిత్తూరు రూరల్ మండలం పాలంతోపు గ్రామానికి చెందిన వరప్రసాద్‌కు తొలినాళ్ల నుంచి పర్వతారోహణపై విపరీతమైన ఆసక్తి..ఆ మక్కువే అతడ్ని ఎవరెస్టు శిఖరాలకు చేర్చింది. నాగరాజు, జమున దంపతులకుమారుడు వరప్రసాద్ ఎంసీఏ చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి కొండలెక్కడమంటే ఇష్టం.. గతేడాది సెట్విన్ (యువజన సర్వీసుల శాఖ) ఇచ్చిన ప్రకటన అతడ్ని ఆకట్టుకుంది. ఎవరెస్టు అధిరోహణకు ఆ శాఖ అక్టోబర్‌లో దరఖాస్తులు ఆహ్వానించింది. అధికారులు నవంబర్ 18న తిరుపతిలోని ఎన్టీఆర్ స్టేడియంలో శిక్షణ నిర్వహించింది. వరప్రసాద్ ఈ శిక్షణలో పాల్గొన్నాడు. రన్నింగ్, లాంగ్‌జంప్ వంటి విభాగాల్లో ప్రతిభ కనబరిచాడు. రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడు. శిక్షణ ఇలా...గత ఏడాది డిసెంబర్లో విజయవాడ సీబీఆర్ అకాడమి వద్ద జరిగిన రాష్ట్రస్థాయి ఎంపికల్లో వరప్రసాద్ పాల్గొన్నాడు. ఐదు రోజుల పాటు జంగిల్ ట్రాకింగ్, రాక్ క్లైంబింగ్, వాల్ క్లైంబింగ్ వంటి విభాగాల్లో కఠోర శిక్షణ పొందాడు. మరో 40 మంది కూడా ఈ శిక్షణలో ఫిజికల్ ఫిట్నెస్ పొందారు. వీరంతా ఈ ఏడాది జనవరి 18న డార్జిలింగ్‌లోని హిమాలయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనింగ్‌లో 20 రోజుల పాటు మళ్లీ శిక్షణ పొందారు. ఇక్కడ ప్రతిభ చాటిన 20 మందిలో వరప్రసాద్ ఒకడు. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలోని పెహల్గామ్లో జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనింగ్ శిక్షణ కేంద్రానికి పంపించారు. పర్వతారోహణలో సాహసోపేత శిక్షణ పొందాడు. ఏప్రిల్ 20న చైనా ప్రాంతంలోని లాసాకు చేరుకున్నాడు. అక్కడి నుంచిఎవరెస్ట్ బేస్‌క్యాంప్ చేరుకుని కొద్ది రోజుల పాటు ఎవరెస్ట్ ఎక్కుతూ, దిగుతూ వాతావరణ అనుమతుల కోసం వేచి చూడాల్సి వచ్చింది. ఈ ఏడాది మే 13న ఎవరెస్ట్ పర్వతారోహణ ప్రారంభించాడు. గతనెల 19 నాటికి 8,848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్ట్‌ను ఎక్కి రికార్డు సృష్టించాడు. నాలుగు రోజుల్లోనే పూర్తిచేసి ఎవరెస్టు శిఖరానికి చేరుకుని జాతీయ జెండాను ఎగురవేశాడు. జిల్లాలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి యువకుడిగా చరిత్ర సృష్టించాడు. కలెక్టర్ ప్రద్యుమ్న, ఎస్పీ రాజశేఖర్‌బాబు, ఏఎస్పీ రాధికలతో పాటు పలువురు ఇటీవల వరప్రసాద్‌ను సన్మానిం చారు. జూలై 5వ తేదీన సీఎం చేతుల మీదుగా వరప్రసాద్ రివార్డు, అవార్డు అందుకోనున్నాడు. అందరి సహాయ, సహకారాలతోనే.. ఏదో ఒక రంగంలో రాణించాలనే పట్టుదల నన్ను ఎవరెస్టు ఎక్కేలా చేసింది. అమ్మానాన్న బాగా ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి విద్యతో పాటు క్రీడలు, ఇతర రంగాల్లోనూ ప్రోత్సహించారు. సొంత ఊరివారు స్వాగతించిన తీరును ఎప్పటికీ మరిచిపోలేను. ఇది ఒక మధురానుభూతి. - వరప్రసాద్ -
‘ఎవరెస్ట్’విద్యార్థులకు ఘన స్వాగతం
సాక్షి, విజయవాడ: ఎవరెస్ట్ శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించి తిరిగి వచ్చిన సాంఘిక సంక్షేమ శాఖ, ట్రైబెల్ వెల్ఫెర్ రెసిడెన్షియల్ విద్యార్థుల బృందానికి మంత్రి అనందబాబు ఘన స్వాగతం పలికారు. ఎవరెస్ట్ శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన ముగ్గురు సోషల్ వెల్ఫెర్, ఇద్దరు ట్రైబెల్ వెల్ఫెర్ విద్యార్థులను మంత్రి ఘనంగా సన్మానించారు. శిఖరాన్ని పూర్తిగా అధిరోహించిన విద్యార్థులకు రూ.10లక్షలు, మధ్యలో వెనుతిరిగిన విద్యార్థులకు రూ.5లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎవరెస్ట్ శిఖరరోహణ ద్వారా విద్యార్థులు రాష్ట్ర ప్రతిష్టతను మరింత పెంపొందించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఎవరెస్టంత ఎదిగారు
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థులు గురువారం ఉదయం 4 గంటల నుంచి 7 గంటల మధ్య ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. మొత్తం 22 మంది ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించేందుకు వెళ్లగా వారిలో ఒకరు విరమించుకున్నారు. మిగిలిన 21 మందిలో సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్న జె.ప్రవీణ్, కొత్తూరు గురుకులంలో చదువుతున్న పి.భానుసూర్యప్రకాష్, విశాఖపట్నం జిల్లా వెలుగొండ గురుకులంలో జూనియర్ ఎంపీసీ చదువుతున్న జి.రాజు, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయ సొసైటీలోని నెల్లూరు జిల్లా చిట్టేడు గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న వెంకటేష్, తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల గురుకులంలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ప్రసన్నకుమార్‌లు ఎవరెస్ట్‌ను అధిరోహించిన వారిలో ఉన్నారు. గతేడాది 9 మంది విద్యార్థులు ఈ రెండు విద్యా సంస్థల నుంచి ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. వీరు లడక్‌లో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో శిక్షణ పొందారు. మూడు బృందాలుగా బయల్దేరిన వీరిలో మొదటి బృందం విజయం సాధించింది. రెండో బృందం ఈ నెల 19వ తేదీ ఎవరెస్ట్‌ను అధిరోహించనుంది. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు గురువారం అభినందనలు తెలిపారు. ఆత్మ విశ్వాసం పెరగాలి: సీఎం విద్యార్థులు శిఖరమంతటి ఆత్మ విశ్వాసాన్ని పెంచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. ఎవరెస్ట్‌ను అధిరోహించిన విద్యార్థులను అభినందిస్తూ గురువారం సీఎం కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అత్యంత కఠినమైన శిక్షణను తట్టుకొని అనుకున్న గమ్యం చేరుకున్న విద్యార్థుల మనోస్థైర్యాన్ని సీఎం చంద్రబాబు కొనియాడారు. శిఖరారోహణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పట్టుదల, కష్టాలను తట్టుకునే ధృడత్వం అలవడుతుందన్నారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన శేఖర్‌బాబును, ఆయా శాఖల అధికారులను సీఎం అభినందించారు. మరిన్ని అధిరోహణలు సాధించాలి: వైఎస్ జగన్ ఎవరెస్ట్‌ను అధిరోహించిన ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని అధిరోహణలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు గురువారం వైఎస్ జగన్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
గాయం శరీరానికే..మనసుకు కాదు
‘ఏం చేయలేం.. అనుకుంటే మొదటి మెట్టే ఆఖరు అవుతుంది. అదే ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తే చివరి మెట్టు వరకూ చేరొచ్చు. ఆ నమ్మకంతోనే ఎన్ని లక్ష్యాలనైనాఅధిగమించొచ్చు. గాయం శరీరానికే.. కానీ మనసుకు కాదు. పోరాడితే విజయం మనదే. ఇది దివ్యాంగులు గుర్తించుకోవాలి’ అని చెప్పారు దివ్యాంగ పర్వతారోహకురాలు అరుణిమ సిన్హా. ఎవరెస్ట్‌ను అధిరోహించిన అరుణిమ... ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించింది. నగరానికి వచ్చిన అరుణిమ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే.. సాక్షి, సిటీబ్యూరో: నా స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్. చదువుకునే రోజుల్లో వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాకారిణిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాను. అందులోనే అత్యున్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్నాను. కానీ నేనొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచింది. రైలు ప్రమాదంలో నా కాలు పోయింది. అయితే ఎదగాలన్న నా పోరాటం ఆగలేదు. ఇంకా బలపడింది. ఇప్పటికీ సాఫ్ట్‌బాల్, జావలిన్‌త్రో లాంటి క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తున్నాను. దివ్యాంగులకు నేను చెప్పేద్దొక్కటే... కొందరికి పుట్టుకతో సమస్యలు వస్తాయి. మరికొందరికి నాలా కాలమే పరీక్షలు పెడుతుంది. కానీ మనం మాత్రం ఒకటి గుర్తించుకోవాలి. గాయాలు శరీరానికే.. కానీ మనసుకు కాదు. కాబట్టి పోరాడి జయించే శక్తి మనలో ఉన్నట్లే. బాధ... ఆనందం ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని అనుకున్నాను. స్కూల్, కళాశాల స్థాయిల్లో ఎన్నో విజయాలు, పతకాలు సాధించాను. కానీ 2011 ఏప్రిల్ 12న నా ఆశలు తలకిందులయ్యాయి. రైలు ప్రమాదం నా జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదని అనుకున్నాను. అయినా పట్టుదలతో ముందుకెళ్లాను. 2013 మే 21న ఎవరెస్ట్ శిఖరంపై భారత జెండాను రెపరెపలాడించినప్పుడు ఆనందంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా.. నా లక్ష్యాలను పొడిగించుకుంటూ ముందుకెళ్తున్నాను. అదే నా లక్ష్యం... ప్రపంచలోని ఏడు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించాలనేది నా లక్ష్యం. ఇప్పటికే ఆరు ఖండాల్లోని అత్యంత ఎత్తైన పర్వతాలను ఒంటి కాలితో ఎక్కేశాను. ఇక నా ముందున్న లక్ష్యం అంటార్కిటికాలోని ఎత్తైన శిఖరాన్ని ఎక్కడమే. అంతకముందే సౌత్ పోల్, నార్త్ పోల్ కవర్ చేస్తాను. హైదరాబాద్‌కు చెందిన బ్లేడ్ రన్నర్ పవన్‌కుమార్ తన పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆవిష్కరణలో పాల్గొనేందుకు సిటీకి వచ్చాను. ఒక దివ్యాంగుడు ఫౌండేషన్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయం. దీనికి నా సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయి. ఇలా దివ్యాంగులు ఎవరైనా ముందుకొస్తే నా సంపూర్ణ సహకారం ఉంటుంది. సిటీ.. వెరీ నైస్ తరచూ హైదరాబాద్‌కు వస్తుంటాను. ఐటీ ఉద్యోగుల్లో స్ఫూర్తినింపే కార్యక్రమాల్లో పాల్గొంటాను. సిటీ వెరీ నైస్... బాగుంది. ఇక్కడ టూరిజం స్పాట్స్ చాలానే ఉన్నాయి. వాతావరణం ఎంతో కూల్‌గా ఉంటుంది. మిగతా మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్. -
విధిని ఎదిరించిన విజేత!
జియా బోయు.. నిరాశ, డిప్రెషన్‌తో కుంగిపోయేవారికి అద్భుతమైన ఔషధంగా పనిచేసే పేరు అతనిది. తమ జీవితం ఇంతటితో ముగిసిపోయిందనుకునే వారుసైతం ఏదైనా సాధించేలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి అతను. ఈ రెండు మాటలు చదివిన తర్వాత అంతలా గొప్పదనం ఏముంది అతనిలో? అని తెలుసుకోవానిపిస్తోంది కదూ..! నిజంగా చెప్పాలంటే అతడు సామాన్యుడి కంటే కూడా బలహీనుడు. అయితే అది శారీరకంగా మాత్రమే. మానసికంగా ఎంతో బలవంతుడు. ఎంతగా అంటే... చదవండి.. సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: రెండు కాళ్లు లేకున్నా ఎవరైనా ఎవరెస్టు ఎక్కగలరా? పైగా బ్లడ్ క్యాన్సర్ ఓవైపు శరీరాన్ని తొలిచేస్తుంటే.. పర్వతాలను అధిరోహించాలన్న ఆలోచన ఎవరైనా చేస్తారా? అదీ ఏడు పదుల వయసులో.. ఎవరికైనా సాధ్యమేనా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతని గురించి తెలుసుకోకుండా ఉండడం భావ్యమా? అందుకే జియా బోయును మీ ముందుకు తీసుకొచ్చాం. కల నెరవేరే రోజు కోసం..: కళ్లు లేనివారు, కాళ్లు లేనివారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వీల్లేకుండా నేపాల్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో జియా బోయు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇక తన కల.. కలగానే మిగిలిపోతుందని కుమిలిపోయాడు. ఎందుకంటే బోయుకు రెండు కాళ్లు లేవు. నలభై ఏళ్ల కిందట ‘మంచుకాటు’తో రెండు కాళ్లు కోల్పోయాడు. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటంతో ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో బోయు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మరోసారి ప్రపంచ పైకప్పుపైకి ఎక్కి సగర్వంగా నిలబడాలనుకుంటున్నాడు. ఐదోసారి ఎక్కేందుకు..: ఇప్పటికి నాలుగుసార్లు ఎవరెస్టు అధిరోహించాడు జియా. చివరిసారిగా 1975లో చైనాకు చెందిన ఓ బృందంతో కలిసి ఎవరెస్టును ఎక్కుతుండగా మంచు తుపాను ముంచెత్తింది. దీంతో తమతో వచ్చినవారంతా భయపడి వెనకడుగు వేశారు. జియా, మరికొంత మంది మాత్రం శిఖరంవైపే వెళ్లారు. మరికొన్ని అడుగులు వేస్తే ఎవరెస్టును చేరుకుంటామనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెళ్లినవారంతా మంచులో కూరుకుపోయారు. వారిలో జియా కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినా మంచుకాటు కారణంగా అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. చేసేదిలేక వైద్యులు రెండు కాళ్లను తొలగించారు. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ కూడా ఉన్నట్లు తేలింది. విధిని ఎదిరించి.. : వయసు పైడుతున్నా, బ్లడ్ క్యాన్సర్ మరణానికి చేరువ చేస్తున్నా.. అంగవైకల్యాన్ని మర్చిపోయి జియా బోయు ఎవరెస్టు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏప్రిల్‌లోనే పర్వాతారోహణకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో త్వరలోనే తన యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తాడా? లేదా? అన్నది పక్కనబెడితే.. జీవితంలో ఇన్ని ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడిన జియా మనందరి దృష్టిలో విజేతే. -
ఏఎస్పీ రాధికకు సన్మానం
ఆదిలాబాద్ : ఇటీవల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన ఆదిలాబాద్ ఏఎస్పీ జీఆర్ రాధికను రాష్ట్ర పోలీసు అసోసియేషన్ అధ్యక్షుడు గోపినాథ్‌రెడ్డి సన్మానించారు. శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పోలీసు అసోసియేషన్ అధ్యక్షులు అశోక్, సురేందర్, బొర్లకుంట పోచలింగంలతో కలిసి పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఏఎస్పీ జీఆర్ రాధికను కలిశారు. పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఏఎస్పీ రాధిక ఎవరెస్టు శిఖరం అధిరోహించడంతో తెలంగాణ రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసు శాఖకు ఆమె ఆణిముత్యమని కొనియాడారు. యావత్ తెలంగాణ పోలీసులు దీనిని గర్వంగా భావిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉట్నూర్ డీఎస్పీ ఎస్.మల్లారెడ్డి, పోలీసు అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మీర్ విరాసత్‌అలీ పాల్గొన్నారు.