కిలిమంజరో పర్వతంపై జాతీయ జెండాతో రజిత (ఫైల్)
అతి చిన్న వయసులోనే ఎవరెస్టును అధిరోహించి రికార్డు సృష్టించింది మాలోత్ పూర్ణ. ఆమె బాటలోనే మరో గిరిజన యువతి పర్వతారోహణలో అవార్డులను తన ఖాతాలో వేసుకుంటోంది. పూర్ణనే తనకు ఆదర్శం అని చెబుతున్న మాలోత్ రజిత ఇటీవలే కిలిమంజరో పర్వతాన్ని సునాయసంగా అధిరోహించి భారత జాతీయ జెండాను ఎగురవేసింది. ఇప్పుడు ఎవరెస్టు ఎక్కడానికి సిద్ధమైంది.
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలో మారుమూలన ఉన్న సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ రజిత మెదక్ జిల్లాలోని కొల్చారం గురుకుల డిగ్రీ కాలేజీలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. చిన్ననాటి నుంచి ఆటల్లో ముందున్న రజిత డిగ్రీలో చేరిన తరువాత పర్వతారోహణలతో రికార్డు సృష్టించిన పూర్ణ విజయగాధను చూసి తను కూడా ఆమె అంత ఎత్తుకు ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగానే గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 60 మందిని ఎంపిక చేశారు. అందులో రజిత ఒకరు. భువనగిరిలో శిక్షణ ఇప్పించారు. అరవై మందిలో 16 మందిని ఎంపిక చేసి జమ్ము కాశ్మీర్‌లోని సిల్క్‌రూట్‌పాస్ (కార్‌దుంగ్లా)కు తీసుకువెళ్లి శిక్షణ ఇచ్చారు. అందులో నుంచి రజితతో పాటు లక్ష్మి అనే యువతినీ ఎంపిక చేశారు. ఇద్దరినీ గత జనవరి నెలలో టాంజానియాకు తీసుకువెళ్లారు. జనవరి 19న కిలిమంజారో పర్వతం ఎక్కడం మొదలై 23 కు పూర్తి చేశారు. 5,895 మీట్ల ఎత్తుకు ఎక్కి భారత పతాకాన్ని ఎగురవేశారు.
వ్యవసాయ కుటుంబం
సంగ్యానాయక్ తండాకు చెందిన మాలోత్ కుబియా–జీరి దంపతుల కుమార్తె రజిత ఐదో తరగతి వరకు ఎక్కపల్లితండా ప్రాథమిక పాఠశాలలో చదువుకుంది. ఆరు నుంచి పదో తరగతి వరకు ఎల్లారెడ్డిలోని కస్తూరిబా విద్యాలయంలో, ఇంటర్ మెదక్‌లోని ఓ ప్రై వేటు కాలేజీలో చదువుకుంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కొల్చారంలోని గురుకుల కళాశాలలో బీఎస్సీ బీజడ్‌సీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కాగా రజిత తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తున్నారు. వారికి నలుగురు కుమారులు కాగా వారంతా వ్యవసాయంలోనే ఉన్నారు. రజిత ఒక్కతే చదువుకుంటోంది. పాఠశాల స్థాయి నుంచే రజిత ఆటల్లో ముందువరుసలో ఉండేది. కబడ్డీతో పాటు రన్నింగ్‌లోనూ దూకుడుగా ముందుకు సాగేది. రాష్ట్ర స్థాయిలో పది కిలోమీటర్ల పరుగు పందెంలో పాల్గొని అవార్డులు పొందింది.
ఏడు పర్వతాల అధిరోహణ కల
పూర్ణ ఎవరెస్టు ఎక్కిన తరువాత తనకు కూడా పర్వతాలు అధిరోహించాలన్న కోరిక బలంగా కలిగిందని రజిత చెబుతోంది. గురుకులాల కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీన్‌కుమార్ ప్రోత్సాహంతో తాను కిలిమంజరో పర్వతాన్ని అధిరోహించింది. అలాగే తన కుటుంబ సభ్యులతో పాటు కొల్చారం గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ మాలతీదేవీలు ప్రోత్సహించారని పేర్కొన్నారు. రాబోయే సెలవుల్లో ఎవరెస్టు పర్వతం ఎక్కడానికి సిద్ధమవుతున్నట్టు పేర్కొంది. ఏడు పర్వతాలు అదిరోహించడమే తన లక్ష్యమని చెబుతోంది.
క్రీడాకారులను తయారు చేస్తా
ఏడు పర్వతాలు అధిరోహించిన తరువాత బీపీఈడీ పూర్తి చేస్తా. పీఈటీగా ఉద్యోగం చేయడంతో పాటు క్రీడాకారులను తయారు చేయడానికి స్పోర్ట్స్ స్కూల్ నడపాలన్నది నా కోరిక. లక్ష్య సాధనలో ఎలాంటి ఒత్తిడి, కష్టాలు ఎదురైనా లెక్కచేయకుండా ముందుకు నడుస్తా. స్వేరోస్ కమిటీ, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల సహకారం మరువలేనిది. కష్టమైన పని కావడం వల్ల అమ్మ వద్దంటున్నా నాన్న, అన్నలు ప్రోత్సహిస్తున్నారు. వారందరి ప్రోత్సాహంతో ఎవరెస్టునూ అధిరోహిస్తా.
– మాలోత్ రజిత, పర్వతారోహిణి
Comments
Please login to add a commentAdd a comment