
జియా బోయు ఫైల్ ఫొటో
జియా బోయు.. నిరాశ, డిప్రెషన్‌తో కుంగిపోయేవారికి అద్భుతమైన ఔషధంగా పనిచేసే పేరు అతనిది. తమ జీవితం ఇంతటితో ముగిసిపోయిందనుకునే వారుసైతం ఏదైనా సాధించేలా స్ఫూర్తినిచ్చే వ్యక్తి అతను. ఈ రెండు మాటలు చదివిన తర్వాత అంతలా గొప్పదనం ఏముంది అతనిలో? అని తెలుసుకోవానిపిస్తోంది కదూ..! నిజంగా చెప్పాలంటే అతడు సామాన్యుడి కంటే కూడా బలహీనుడు. అయితే అది శారీరకంగా మాత్రమే. మానసికంగా ఎంతో బలవంతుడు. ఎంతగా అంటే... చదవండి..
సాక్షి, స్టూడెంట్ ఎడిషన్: రెండు కాళ్లు లేకున్నా ఎవరైనా ఎవరెస్టు ఎక్కగలరా? పైగా బ్లడ్ క్యాన్సర్ ఓవైపు శరీరాన్ని తొలిచేస్తుంటే.. పర్వతాలను అధిరోహించాలన్న ఆలోచన ఎవరైనా చేస్తారా? అదీ ఏడు పదుల వయసులో.. ఎవరికైనా సాధ్యమేనా? అలాంటి వ్యక్తి ఎవరైనా ఉంటే అతని గురించి తెలుసుకోకుండా ఉండడం భావ్యమా? అందుకే జియా బోయును మీ ముందుకు తీసుకొచ్చాం.
కల నెరవేరే రోజు కోసం..: కళ్లు లేనివారు, కాళ్లు లేనివారు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించడానికి వీల్లేకుండా నేపాల్ ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చింది. దీంతో జియా బోయు తీవ్రంగా నిరాశపడ్డాడు. ఇక తన కల.. కలగానే మిగిలిపోతుందని కుమిలిపోయాడు. ఎందుకంటే బోయుకు రెండు కాళ్లు లేవు. నలభై ఏళ్ల కిందట ‘మంచుకాటు’తో రెండు కాళ్లు కోల్పోయాడు. కానీ ఓ స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాటంతో ఎట్టకేలకు నేపాల్ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో బోయు ఎంతగానో సంతోషపడుతున్నాడు. మరోసారి ప్రపంచ పైకప్పుపైకి ఎక్కి సగర్వంగా నిలబడాలనుకుంటున్నాడు.
ఐదోసారి ఎక్కేందుకు..: ఇప్పటికి నాలుగుసార్లు ఎవరెస్టు అధిరోహించాడు జియా. చివరిసారిగా 1975లో చైనాకు చెందిన ఓ బృందంతో కలిసి ఎవరెస్టును ఎక్కుతుండగా మంచు తుపాను ముంచెత్తింది. దీంతో తమతో వచ్చినవారంతా భయపడి వెనకడుగు వేశారు. జియా, మరికొంత మంది మాత్రం శిఖరంవైపే వెళ్లారు. మరికొన్ని అడుగులు వేస్తే ఎవరెస్టును చేరుకుంటామనగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. వెళ్లినవారంతా మంచులో కూరుకుపోయారు. వారిలో జియా కూడా ఉన్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినా మంచుకాటు కారణంగా అతని కాళ్లు చచ్చుబడిపోయాయి. చేసేదిలేక వైద్యులు రెండు కాళ్లను తొలగించారు. అప్పుడే బ్లడ్ క్యాన్సర్ కూడా ఉన్నట్లు తేలింది.
విధిని ఎదిరించి.. : వయసు పైడుతున్నా, బ్లడ్ క్యాన్సర్ మరణానికి చేరువ చేస్తున్నా.. అంగవైకల్యాన్ని మర్చిపోయి జియా బోయు ఎవరెస్టు వైపు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ ఏప్రిల్‌లోనే పర్వాతారోహణకు వాతావరణం అనుకూలంగా ఉండడంతో త్వరలోనే తన యాత్ర ప్రారంభించబోతున్నాడు. ఎవరెస్టు అధిరోహిస్తాడా? లేదా? అన్నది పక్కనబెడితే.. జీవితంలో ఇన్ని ఎదురుదెబ్బలను తట్టుకొని నిలబడిన జియా మనందరి దృష్టిలో విజేతే.
Comments
Please login to add a commentAdd a comment