లిటిల్ కిచెన్
ఒకప్పుడు చిన్నారులు ఆడుకునే వస్తువులు చెక్క బొమ్మలు.. లక్క పిడతలు. ఎలక్ట్రానిక్ కార్లు.. బేబీ డాల్స్ తర్వాతి తరం పిల్లలకు ఆట వస్తువులయ్యాయి. ఈ తరం పేరెంట్స్ మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. పసి తనంలో వారు మిస్సయిన ఆటలు పిల్లలకు ఇవ్వాలనుకుంటున్నారు. చిన్నారుల కళ ్లల్లో ఆనందమే కాదు.. మస్తిష్కంలో సృజనాత్మకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం ఏకంగా బొమ్మరిల్లునే ఇంటికి తెస్తున్నారు.
అమ్మానాన్నలను, టీచర్లను అభినయిస్తూ ఆడుకోవడం చిన్నారులందరికీ సరదా. స్కూల్ నుంచి రాగానే టీచర్‌గా మారిపోయి పాఠాలు చెప్పేస్తుంటారు. వంటగదిలో అమ్మ చేసే పనులు గమనించి చిట్టి చిట్టి చేతులతో ఉత్తిత్తి వంట చేయడం ఆడపిల్లలకు మహా ఇష్టం. ఒకప్పుడు ఇంట్లో ఉండే గిన్నెలు, చెంచాలతోనే వంటింటి ఆట కానిచ్చేసే వారు. కానీ నేటి పిల్లలకు అచ్చంగా కిచెన్‌ను పోలి ఉండే మినియేచర్ కిచెన్లు అందుబాటులోకి వచ్చాయి.
రేటు కొద్దీ వసతి
కిడ్ క్రాప్ట్, వరల్ట్ టాయ్స్, లిటిల్ కొలరాడో లాంటి అనేక కంపెనీలు ఈ బుల్లి కిచెన్లను తయారు చేస్తున్నాయి. ఈబే, అమెజాన్ వంటి ఆన్‌లైన్ సైట్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఇక వీటి ధర రూ.800 నుంచి రూ.10 వేల వరకు ఉన్నాయి.
అచ్చంగా వంటిల్లే..
పోపుల పెట్టె నుంచి గ్యాస్ స్టవ్ వరకు అన్ని రకాల వంట సామగ్రి ఈ బొమ్మల కిట్‌లో ఉంటుంది. కూరగాయలు, పండ్లే కాదు బ్రెడ్డు, పిజ్జా ఇవన్నీ ఆటకు మరింత కిక్కునిస్తాయి. ప్లాస్టిక్, వుడెన్, స్టీల్‌తో తయారైన కిచెన్ సెట్లు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. బ్యాటరీలతో పని చేసే కిచెన్ సెట్లు.. పిల్లలకు అచ్చంగా వంట చేస్తున్న ఫీలింగ్ కలిగిస్తాయి. స్టవ్ ఆన్ చేయగానే వెలిగినట్లే ధ్వని వస్తుంది. నూడుల్స్‌నో, పాస్తానో పాన్‌లో (అన్నీ ప్లాస్టిక్‌వే) వేయగానే ఇప్పుడు పాస్తా చేద్దాం అంటూ స్టవ్ నుంచి సౌండ్ వస్తుంది. లేటెస్ట్ టెక్నాలజీతో రూపొందిన ఈ కిడ్ కిచెన్ సెట్లు.. పిల్లలనే కాదు తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. పెద్దలను అనుకరిస్తూ ఆడుకోవడం వల్ల చిన్నారుల్లో మానసిక పరిపక్వత పెరగడానికి దోహదం చేస్తుంది.
- విజయారెడ్డి