శామ్స్(సమంత).. సపోర్ట్ | Samantha having a great helping nature in real life | Sakshi
Sakshi News home page

శామ్స్(సమంత).. సపోర్ట్

Published Tue, Sep 30 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM

Samantha having a great helping nature in real life

ఆమె నవ్వితే యువ హృదయాలు ఉప్పొంగుతాయి. ఆమె కళ్లు చెమరిస్తే వేల వదనాలు చినబోతాయి. వెండితెరపై వెలిగే ఆమె... నిజంగా నవ్వుల యేరయ్యిందంటే ఓ నిరుపేద గుండె ఆరోగ్యంగా కదిలిందన్నట్టే. తెరవెనుక ఆమె కళ్లు చెమరించాయంటే అది ఓ చిన్నారి చివరి కోరిక విన్న సందర్భం అన్నట్టే. నిన్నగాక మొన్న పరిచయమైన యువ నటి సమాజం కోసం తపిస్తున్నారు. ‘నెలవంక’ంటూ అభిమానం కీర్తిస్తున్నా.. ‘నేల’ చూపులు చూస్తున్నారు. ఆర్తుల కోసం ఆగ ‘మేఘాల’ మీద దిగొస్తున్నారు. చూపులకు పక్కింటి అమ్మాయిలా అనిపించే ఆ చెన్నై చిన్నది.. దక్షిణాది వెండితెర మున్నెన్నడూ చూసి ఉండని ఓ సే‘వి’ంత. ఆమే సమంత. హృదయం ఆకాశమంత. సిటీలోని అనాథ చిన్నారులకు, అనారోగ్యం పాలైన అభాగ్యులకు ఆ అందాల నటి అందిస్తున్న సేవ తెలుసుకుంటే థాంక్యూ ‘శామ్స్’ (సమంత ముద్దుపేరు) అనకుండా ఉండలేం.
 
 సేవా పిపాసకు నేపథ్యం చెప్పమని సమంతను అడిగితే.. అది తను పుట్టిన ఊరి గొప్పతనమే అంటారు సమంత.  ‘ఆ ఊరి పరిస్థితులు, అక్కడి వాతావరణం నామీద బాగా ప్రభావం చూపాయి. ఆకాశంలో విమానం కనిపిస్తే చాలు పరుగెడుతూ దానికి టాటాలు చెప్పేవాళ్లం. ఇప్పుడు ఏకంగా వాటిలోనే విహరిస్తున్నాం. అయితే అప్పటి కలలను, ఊహలను నేను మరచిపోలేదు. అందుకే ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఇద్దరు చిన్నారులు తాజ్‌మహల్ చూడాలనుంది అంటే వెంటనే వారిని విమానాల్లో తీసుకెళ్లి, చూపించి తీసుకొచ్చాం’ అంటూ వివరించారామె.
 
 ‘సపోర్ట్’ వెనుక..
 సినీనటిగా కెరీర్ పీక్‌లో ఉండగా సమంత అనారోగ్యానికి గురై మూడునెలల పాటు సినిమాలకు దూరమయ్యారు. దాని నుంచి శరీరం కోలుకోవడం మామూలు విషయమే కాని అప్పటి స్థితి ఆమె మనసును ‘కొత్తగా’ మేలుకునేలా చేయడం విశేషం. అదే ప్రత్యూష సపోర్ట్ స్థాపనకు నాంది పలికింది. ‘ఒక్క సినిమా ఫ్లాప్ అయితే తలకిందులవుతుంది స్టార్‌డం, చిన్న తేడా వస్తే ఆసుపత్రి పాలు చేస్తుంది శరీరం. నచ్చింది తిని, నచ్చింది కట్టుకుని, నచ్చినట్టు జీవించడానికి సరిపోయే డబ్బు ఉంటే చాలు కదా. అంతకు మించి మన దగ్గర ఉందంటే అది మనది కానట్టే కదా. నాకు ఇంత డబ్బు, హోదా ఉన్నాయంటే దానికి అర్థం వాటిని సద్వినియోగం చేయమని దేవుడు చెబుతున్నట్టే అనిపించింది.’ అంటున్న సమంతను చూస్తుంటే ఆమెలో అమ్మ కనిపిస్తుంది.

‘మనం’ సినిమాలో మనల్ని మెప్పించిన యంగ్ మదర్ గుర్తొస్తుంది.  నిజానికి ప్రత్యూష సపోర్ట్ ప్రారంభమై ఆర్నెల్లు మాత్రమే అయింది. ఒక స్వచ్ఛంద సంస్థ తనను తాను నిరూపించుకోవడానికి ఇది చాలా స్వల్ప సమయం. అయితే దీని వెనుక సమంత ఉండటమే సంస్థకు బోలెడంత పాపులారిటీని తెచ్చిపెట్టింది. ‘ప్రస్తుతం మా సంస్థకు అన్ని రకాలుగా గుర్తింపు వచ్చింది. దాతలు కూడా బాగా ముందుకు వస్తున్నారు. మరింత మందికి సాయం చేసేందుకు అవకాశం కలుగుతోంది’ అని ఆనందంగా చెప్పారు సమంత.
 
 అన్నీ బాగున్నప్పుడే చేయాలి..
 సినిమా నటిగా ఇంకా ప్రారంభ దశలోనే ఉన్న మీరు అప్పుడే సామాజిక  బాధ్యత తలకెత్తుకోవడం అవసరమా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ...‘మనం శారీరకంగా, ఆర్థికంగా బాగున్నప్పుడే అనుకున్న మంచిపనులు చేయాలని నా ఉద్దేశం. తరాలకు సరిపడా సమకూర్చి పెట్టేసి, రిటైరయ్యాక సేవ అంటూ బయలుదేరడం నాకు సరైంది కాదనిపిస్తుంది. అందుకే లైమ్‌లైట్‌లో ఉండగానే మనసుకు నచ్చిన పనులు చేస్తున్నాను’అని చెప్పారు.
 
 పర్సనల్ లైఫ్ రెస్పాన్సిబుల్‌గా ఉండాలి..
 తరచుగా సాహసోపేతమైన కామెంట్లతో వార్తల్లో ఉండే సమంత. నటీ నటుల పర్సనల్ లైఫ్ వారి వ్యక్తిగతం అని తను అనుకోవడం లేదని కుండబద్దలు కొట్టారు. సినిమా నటులను ప్రేక్షకులు, అభిమానులు కుటుంబసభ్యులుగా భావిస్తారని, ఆరాధిస్తారని.. అందుకే  వారి లైఫ్‌స్టైల్‌ను అనుకరిస్తారని సమంత అభిప్రాయపడ్డారు. తాము నిజజీవితంలో అనుసరించే జీవనశైలి ప్రభావం అభిమానుల మీద తప్పకుండా ఉంటుందని, కాబట్టి ‘మా పర్సనల్ లైఫ్ మా ఇష్టం’ అనుకోవడం కుదరదని స్పష్టం చేశారు. తాము మంచి పనులు చేసినా, చెడ్డపనులు చేసినా జనం అనుసరించే ప్రయత్నం చేస్తారని ఆమె అన్నారు.
 
 ‘సపోర్ట్ ’చేస్తున్న విధమిదీ..
 ఈ సంస్థ సమంత ఫౌండర్‌గా, వాలంటరీ ఆర్గనైజేషన్ నిర్వహణలో అనుభవమున్న డాక్టర్ మంజుల కోఫౌండర్‌గా గత ఫిబ్రవరిలో ఏర్పాటైంది.  అప్పటి నుంచి తీవ్రమైన జబ్బులకు గురై శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు నిరుపేద చిన్నారులకు ఈ సంస్థ ఆపరేషన్స్ చేయించింది. ఇందులో కిడ్నీ ప్రాబ్లెమ్స్, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం బ్లడ్‌కేన్సర్ తో బాధపడుతున్న పదినెలల వయసున్న బాబుకు చికిత్స చేయిస్తోంది. దీని కోసం బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకుంది.
 
 అలాగే గత మూడునెలల నుంచి సిటీలోని ఆర్ఫన్ హోమ్‌లలో చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు, చికిత్సలు అందించేందుకు లివ్‌లైఫ్ హాస్పిటల్‌తో కలసి పనిచేస్తోంది. నగరంలో నెలకు ఒక హోం చొప్పున వీరు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే మృత్యుముఖంలో ఉన్న చిన్నారుల చివరి కోరికలు తీర్చాలనే బాధ్యతను కూడా సంస్థ తీసుకుంది. తొలుత ఈ కార్యక్రమాల వ్యయమంతా సమంత వ్యక్తిగతంగా భరించారు. అయితే ఆ తర్వాత చాలామంది స్పందిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు కూడా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణకు పరిమితమైన ఈ సంస్థ సేవల్ని త్వరలోనే సమంత సొంతూరు చెన్నైకి కూడా విస్తరించనున్నారు.
 - ఎస్.సత్యబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement