విభజన వద్దు.. సమైక్యమే ముద్దు!
స్వాతంత్ర్యం కావాలా.. యూకేలోనే కలిసుంటారా అని అడిగితే స్కాట్లండ్ వాసులు సమైక్యానికే మొగ్గు చూపారు. దేశమంతా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తీర్పునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి స్కాట్లండ్ మొత్తమ్మీద 55.30 శాతం మంది వ్యతిరేకంగాను, 44.70 శాతం మంది అనుకూలంగాను స్పందించారు. అయితే.. స్కాట్లండ్ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, వద్దా అన్న విషయంలో రెఫరెండం నిర్వహించడం ఇది తొలిసారి ఏమీ కాదు. 1707 నుంచి యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న స్కాట్లండ్లో ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇదే అంశం గురించి రెఫరెండంలు జరిగాయి. అప్పుడు కూడా తాము సమైక్యంగానే ఉంటామని అక్కడి ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తీర్పు వచ్చింది.
ఆండీ ముర్రే లాంటి టెన్నిస్ స్టార్లు, చివరకు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కూడా ఓటింగ్ జరగడానికి ముందు ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ముర్రే అయితే నేరుగా సమైక్యానికే ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఎలిజబెత్ రాణి మాత్రం మీకు మంచి చేసే నిర్ణయానికి ఓటేయండి అంటూ నర్మగర్భంగా చెప్పారు. అది కూడా స్కాట్లండ్ వాసుల మీద కొంతవరకు పనిచేసింది. మొత్తం 84.48 శాతం ఓట్లు పోలయ్యాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ ఈ రెఫరెండంను పర్యవేక్షించింది.
ఇకవేళ ఈ రెఫరెండంలోనే విభజనకు అనుకూలంగా తీర్పు వస్తే.. 2016 మార్చి 24వ తేదీన స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా అవతరించేది. ఈ నిర్ణయాన్ని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు ప్రశంసించారు. నాలుగు జాతులతో కూడిన ఒక్క దేశంగానే ఉండటానికి స్కాట్లండ్ వాసుల తీర్పు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు.
We have heard the voice of Scotland and now the millions of voices of England must also be heard. #IndyRef
— David Cameron (@David_Cameron) September 19, 2014