Scottish referendum results
-
విభజన వద్దు.. సమైక్యమే ముద్దు!
స్వాతంత్ర్యం కావాలా.. యూకేలోనే కలిసుంటారా అని అడిగితే స్కాట్లండ్ వాసులు సమైక్యానికే మొగ్గు చూపారు. దేశమంతా ఒక్కటిగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని తీర్పునిచ్చారు. దేశ స్వాతంత్ర్యానికి స్కాట్లండ్ మొత్తమ్మీద 55.30 శాతం మంది వ్యతిరేకంగాను, 44.70 శాతం మంది అనుకూలంగాను స్పందించారు. అయితే.. స్కాట్లండ్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించాలా, వద్దా అన్న విషయంలో రెఫరెండం నిర్వహించడం ఇది తొలిసారి ఏమీ కాదు. 1707 నుంచి యునైటెడ్ కింగ్డమ్లో భాగంగా ఉన్న స్కాట్లండ్‌లో ఇంతకుముందు కూడా రెండుసార్లు ఇదే అంశం గురించి రెఫరెండంలు జరిగాయి. అప్పుడు కూడా తాము సమైక్యంగానే ఉంటామని అక్కడి ప్రజలు స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు కూడా మళ్లీ అదే తీర్పు వచ్చింది. ఆండీ ముర్రే లాంటి టెన్నిస్ స్టార్లు, చివరకు బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కూడా ఓటింగ్ జరగడానికి ముందు ప్రజలకు విజ్ఞప్తులు చేశారు. ముర్రే అయితే నేరుగా సమైక్యానికే ఓటేయాలని పిలుపునిచ్చాడు. ఎలిజబెత్ రాణి మాత్రం మీకు మంచి చేసే నిర్ణయానికి ఓటేయండి అంటూ నర్మగర్భంగా చెప్పారు. అది కూడా స్కాట్లండ్ వాసుల మీద కొంతవరకు పనిచేసింది. మొత్తం 84.48 శాతం ఓట్లు పోలయ్యాయి. బ్రిటన్ ఎన్నికల కమిషన్ ఈ రెఫరెండంను పర్యవేక్షించింది. ఇకవేళ ఈ రెఫరెండంలోనే విభజనకు అనుకూలంగా తీర్పు వస్తే.. 2016 మార్చి 24వ తేదీన స్కాట్లండ్ ప్రత్యేక దేశంగా అవతరించేది. ఈ నిర్ణయాన్ని బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తదితరులు ప్రశంసించారు. నాలుగు జాతులతో కూడిన ఒక్క దేశంగానే ఉండటానికి స్కాట్లండ్ వాసుల తీర్పు ఎంతో మేలు చేసిందని ఆయన అన్నారు. We have heard the voice of Scotland and now the millions of voices of England must also be heard. #IndyRef — David Cameron (@David_Cameron) September 19, 2014 -
ఏడు చోట్ల వ్యతిరేకం, ఒకచోట ఓకే....
గ్లాస్గో : స్కాంట్లాండ్లో రెఫరెండం కౌంటింగ్ కొనసాగుతోంది. యూకే నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడే అంశంపై 32 జిల్లాల్లో ఈ రిఫరెండం జరుగుతోంది. ఇప్పటివరకూ ఏడు జిల్లాల్లో తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఫలితాలు రాగా, ఒక్క జిల్లాలో మాత్రం అనుకూలంగా ఫలితం వెలువడింది. ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపిన స్కాట్లాండ్ రెఫరెండంపై ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. కాగా కలిసుండేందుకే మొగ్గు: అతి స్వల్ప మెజారిటీతో బ్రిటన్‌తో కలిసుండాలనే వాదనే విజయం సాధిస్తుందని తాజా సర్వేలో తేలింది. 'యుగవ్' చేసిన ప్రీ ఎలక్షన్ సర్వేలో 52% మంది యూకేలో భాగంగానే ఉండాలని, 48% మంది స్వతంత్రదేశంగా ఉండాలని స్పష్టం చేశారు. విడిపోవడం ఎందుకు? బ్రిటన్, స్కాట్లాండ్ దేశాల మధ్య అసమానతలు, స్కాట్లాండ్లో 4 దశాబ్దాల కిత్రం భారీగా బయటపడిన ఆయిల్ నిల్వలు.. ఇవి స్వతంత్రత వైపు స్కాట్ ప్రజలు ఆలోచించేలా చేశాయి. ఆర్థిక, ఆరోగ్య, సంక్షేమ రంగాల్లో బ్రిటన్ ప్రభుత్వం చూపిన వివక్ష, ప్రబలిన నిరుద్యోగం.. స్కాట్ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత పెంచాయి. ఇరాక్, అఫ్గానిస్తాన్లల్లో బ్రిటన్ యుద్ధాల్లో పాల్గొనడం కూడా స్కాట్ వాసులకు ఇష్టంలేదు. అణ్వాయుధ రేసులో యూకే ఉండటాన్ని వారు వ్యతిరేకించారు. యూకే చమురు ఉత్పత్తుల్లో దాదాపు 90% స్కాట్లాండ్ నుంచే వస్తున్నప్పటికీ.. ఆ స్థాయిలో తమకు వనరుల కేటాయింపు లేకపోవడం స్కాట్ ప్రజలను ఆలోచింపజేసింది. చమురు నిల్వలు, ఇతర సహజ వనరులతో స్వతంత్రదేశంగా మరింత అభివృద్ధిని సాధించగలమని సాల్మండ్ వంటి నేతలు వివరిస్తుండటంతో వారిలో ఆశలు చిగురించాయి. కలసి సాగడం ఎందుకు? విడిపోతే ఎదురుకానున్న కష్టనష్టాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బ్రిటన్ అనుకూల వర్గాలు ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలవుతుందని, అది మొత్తంగా యూరోప్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని వారు వివరిస్తున్నారు. కొత్త దేశంగా ఏర్పడితే స్కాట్లాండ్ కొత్త కరెన్సీకి ఎదురయ్యే కష్టాలనూ ప్రస్తావిస్తున్నారు. చమురు నిల్వల విషయం మినహాయిస్తే.. మిగతా రంగాల్లో బ్రిటన్ సహకారం స్కాట్లాండ్కు అవసరమని వాదిస్తున్నారు. -
మాకు స్వాతంత్ర్యం వద్దు: స్కాట్లండ్ తొలి ఫలితం
యూకే నుంచి విడిపోయి స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలా వద్దా అని నిర్వహించిన రిఫరెండంలో తొలి ఫలితం వచ్చింది. మూడు రాష్ట్రాలు దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. క్లాక్ మన్నన్ షైర్ అనే రాష్ట్రం తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఓటు వేసింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 89% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటేసిన వాళ్లలో 53.8% మంది స్వాతంత్ర్యం వద్దని, 46.2% మంది కావాలని కోరుకున్నారు. దాంతో ఆ రాష్ట్రం స్వాతంత్ర్యం వద్దనే చెప్పినట్లయింది. అలాగే ఆర్క్‌నీ అనే మరో రాష్ట్రం కూడా స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించకూడదనే చెప్పింది. ఇక్కడ మెజారిటీ మరింత ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం వద్దని 67% మంది చెప్పగా, కావాలని కేవలం 33% మందే చెప్పారు. షెట్లాండ్ రాష్ట్రం కూడా స్వాతంత్ర్యం వద్దని తేల్చింది. ఇక్కడ 63.7% మంది వద్దనగా 36.3% మంది స్వాతంత్ర్యం కావాలన్నారు. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే రెఫరెండం నిర్వహించడం గమనార్హం. స్కాట్లండ్ లో మొత్తం 32 రాష్ట్రాలున్నాయి. వీటన్నింటి ఫలితాలు ఇలా విడివిడిగా వస్తాయి. వాటిలో మెజారిటీ ఫలితం ఏదైతే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు అత్యధిక సంఖ్యలో రిఫరెండంలో పాల్గొని తమ ఓట్లు వేయడం గమనార్హం. డూండీ అనే రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైంది. మొత్తానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటూ ప్రదర్శనలు చేస్తున్న వారికి మాత్రం తొలి రెండు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.