మాకు స్వాతంత్ర్యం వద్దు: స్కాట్లండ్ తొలి ఫలితం
మాకు స్వాతంత్ర్యం వద్దు: స్కాట్లండ్ తొలి ఫలితం
Published Fri, Sep 19 2014 7:02 AM | Last Updated on Sat, Sep 2 2017 1:39 PM
యూకే నుంచి విడిపోయి స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించాలా వద్దా అని నిర్వహించిన రిఫరెండంలో తొలి ఫలితం వచ్చింది. మూడు రాష్ట్రాలు దేశ స్వాతంత్ర్యానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. క్లాక్ మన్నన్ షైర్ అనే రాష్ట్రం తమకు స్వాతంత్ర్యం వద్దంటూ ఓటు వేసింది. ఇక్కడ రికార్డు స్థాయిలో 89% ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటేసిన వాళ్లలో 53.8% మంది స్వాతంత్ర్యం వద్దని, 46.2% మంది కావాలని కోరుకున్నారు. దాంతో ఆ రాష్ట్రం స్వాతంత్ర్యం వద్దనే చెప్పినట్లయింది. అలాగే ఆర్క్నీ అనే మరో రాష్ట్రం కూడా స్కాట్లండ్ స్వతంత్ర దేశంగా అవతరించకూడదనే చెప్పింది. ఇక్కడ మెజారిటీ మరింత ఎక్కువగా ఉంది. స్వాతంత్ర్యం వద్దని 67% మంది చెప్పగా, కావాలని కేవలం 33% మందే చెప్పారు. షెట్లాండ్ రాష్ట్రం కూడా స్వాతంత్ర్యం వద్దని తేల్చింది. ఇక్కడ 63.7% మంది వద్దనగా 36.3% మంది స్వాతంత్ర్యం కావాలన్నారు. ఇక్కడ బ్యాలెట్ పద్ధతిలోనే రెఫరెండం నిర్వహించడం గమనార్హం.
స్కాట్లండ్ లో మొత్తం 32 రాష్ట్రాలున్నాయి. వీటన్నింటి ఫలితాలు ఇలా విడివిడిగా వస్తాయి. వాటిలో మెజారిటీ ఫలితం ఏదైతే దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటారు. అయితే దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ప్రజలు అత్యధిక సంఖ్యలో రిఫరెండంలో పాల్గొని తమ ఓట్లు వేయడం గమనార్హం. డూండీ అనే రాష్ట్రంలో 90% పోలింగ్ నమోదైంది. మొత్తానికి స్వాతంత్ర్యం కావాలని కోరుకుంటూ ప్రదర్శనలు చేస్తున్న వారికి మాత్రం తొలి రెండు ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి.
Advertisement
Advertisement