నాన్నే నా పాటశాల
హిందూస్థానీ బాణీల్లోని కమ్మదనం దక్కన్ వాసులకు వీనులవిందు చేసింది. తండ్రి నుంచి వారసత్వంగా అందిన గమకాలను తన స్వరంలో పలికించాడు శౌనక్ అభిషేకీ. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, సూరమండల్ సంయుక్త ఆధ్వర్యంలో లకిడీకాపూల్‌లోని విద్యారణ్య స్కూల్‌లో జరిగిన దివంగత హిందూస్థానీ సంగీత విద్వాంసుడు పండిట్ జితేంద్ర అభిషేకీ నివాళి కార్యక్రమం ఆయన కుమారుడు శౌనక్ రాగరంజనికి వేదికైంది. ఐదేళ్ల తర్వాత హైదరాబాద్‌కు వచ్చి ‘మార్నింగ్ రాగా కన్సర్ట్’ మెలోడీని వినిపించిన శౌనక్‌ను సిటీప్లస్ పలకరించింది.
- వాంకె శ్రీనివాస్
మా స్వస్థలం గోవా. నేను పుట్టి పెరిగింది మాత్రం పుణేలో. పాతికేళ్లుగా అక్కడే ఉంటున్నాను. సింబియాసిస్ యూనివర్సిటీలో లా చదివాను. హిందూస్థానీ క్లాసిక్ అంటే ప్రాణం. అందులో ఆగ్రా, జైపూర్ స్టయిల్ మిక్స్ చేసి పాడుతుంటే ఆ ఆనందం వర్ణించలేను. నాన్న పండిట్ జితేంద్ర అభిషేకీ హిందూస్థానీ సంగీతంలో ఓ శకం. ఆయనకు దేశవిదేశాల్లో అభిమానులు ఉన్నారు. కచేరీల కోసం ఎక్కడికి వెళ్లినా ఘన స్వాగతం లభించేది. నాన్న స్ఫూర్తితో నా అడుగులు సంగీతం వైపు పడ్డాయి. నేను సంగీతంలో ఏ కోర్స్ చేయలేదు. నాన్నే నాకు స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ. ఆయన నీడలోనే రాగాలను ఉపాసించాను. ఆయన ఆశీస్సులే నన్ను ఇంతవాణ్ని చేశాయి.
నాలో నాన్నను చూడాలని..
నాన్న అంత గొప్పవాడిని కాకపోయినా, స్వయం ప్రతిభతో నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాను. ఇందులో విజయం సాధిస్తాననే నమ్మకం ఉంది. ఇండియాతో పాటు అమెరికా, జర్మనీ, గల్ఫ్, థాయ్‌లాండ్‌లో కూడా కచేరీలు చేశాను. నేను ఎక్కడికి వెళ్లినా చాలా మంది నాన్న గొప్పదనం గురించి ప్రస్తావిస్తుంటారు. ‘మీ నాన్నను నీలో చూడాలని ఉంది’ అని అడిగేవారు. ఆయనకు సంగీతంతోనే నివాళి అర్పించాలని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నా స్వర ప్రస్థానం కొనసాగుతూనే ఉంది.
స్వరాభిషేక్, తులసీ కీ రామ్, కబీర్, మరాఠీ అభాంగ్ వాణి ప్రదర్శనలు ఇచ్చాను. అవి నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నా కుటుంబ సభ్యుల సహకారం తోడవడంతో మ్యూజిక్‌ను ఆస్వాదిస్తున్నా.
మై మదర్ సిటీ..
హైదరాబాద్‌కు రావడం ఇది ఐదోసారి. ఈ సిటీతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అంతటా ఉన్నట్టే ఇక్కడ కూడా నాన్నకు అభిమానులు ఉన్నారు. మా అమ్మ విద్యా అభిషేకీ పుట్టింది, పెరిగింది ఈ సిటీలోనే. అందుకే హైదరాబాద్‌లో ప్రోగ్రామ్ అనగానే ఓకే చెప్పేశాను. గతంతో పోల్చుకుంటే శాస్త్రీయ సంగీతానికి సిటీలో ఆదరణ పెరుగుతోంది. చాలా మంది సంగీతం చేర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో హైదరాబాద్ క్లాసికల్ మ్యూజిక్‌కు కేరాఫ్‌గా నిలుస్తుంది.