స్కేటింగ్ సిటీ
పరుగులు తీసే మనసును.. పగ్గాల్లేకుండా దూసుకుపోయేలా చేస్తుంది. ఉరకలు తీసే పిల్లలకు స్కేటింగ్ మరింత ఉత్సాహాన్నిస్తోంది. సిటీలో ఎప్పట్నుంచో ఉన్న ఈ ట్రెండ్ ఈ మధ్య వేగం పెంచింది. స్కేటింగ్ అంటేనే హైదరాబాద్ అని గుర్తొచ్చేలా ఈవెంట్లు జరుగుతున్నాయి. లోకల్ బాలబాలికలెందరో ఈ ఆటలో అదరగొడుతున్నారు. దూలపల్లిలోని డీఆర్‌ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో రెండు రోజుల పాటు సాగిన సీబీఎస్‌ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ ఉత్సాహభరితంగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల నుంచి వందలాది మంది విద్యార్థులు స్కేటింగ్ బాట పట్టారు. తల్లిదండ్రుల సంపూర్ణ మద్దతుతో తమకిష్టమైన స్కేటింగ్‌లో సత్తా చాటుతున్నారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్ ఇన్‌లైన్ ఈవెంట్, క్వాడ్ ఇన్‌లైన్ ఈవెంట్‌లలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో ‘సిటీప్లస్’ ముచ్చటించింది.
- వాంకె శ్రీనివాస్
ఆనందంగా ఉంది
హోం టౌన్‌లో రాణించడం ఆనందంగా ఉంది నేను పుట్టి పెరిగిన సిటీలోనే స్కేటింగ్‌లో గోల్డ్‌మెడల్ సాధించడం గొప్ప అనుభూతి. రోడ్ టూ ఈవెంట్ అండర్ 16 గర్ల్స్ డిస్టెన్స్ ఐదువేల మీటర్లలో, టైమ్ టైమర్ 300 మీటర్లలో బంగారు, రజత పతకాలు వచ్చాయి. చిన్నప్పటి నుంచే స్కేటింగ్ అంటే ఇష్టం. 2005 నుంచే ఇందిరాపార్క్‌లోని రింగ్, బేగంపేటలో రోడ్ ఈవెంట్ స్కేటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నా. గత నెలలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఎక్సలెన్సీ సర్టిఫికెట్ అందుకున్నా. అంతర్జాతీయ స్కేటర్‌గా ఎదగాలనేది నా లక్ష్యం.
- అమ్రీన్‌ఖాన్, డీఆర్‌ఎస్ స్కూల్ విద్యార్థిని
తల్లిదండ్రుల ప్రోత్సాహం..
మా నాన్న ఫ్రెండ్ వల్లనే నాకు స్కేటింగ్‌పై ఇష్టం ఏర్పడింది. 2011 నుంచి ఇందిరాపార్క్‌లో ప్రాక్టీసు చేస్తున్నా. గతేడాది అమృత్‌సర్, విరార్‌లో జరిగిన నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో రజత, కాంస్య పతకాలు సాధించా. ఈ ఈవెంట్ రింగ్ 3లో స్వర్ణం, రోడ్ స్కేటింగ్‌లో రజతం వచ్చాయి. ఆరు రాష్ట్రాల విద్యార్థులతో పోటీపడి ఈ పతకాలు సాధించడం ఆనందంగా ఉంది. నాలాగా అనేక మంది సిటీ విద్యార్థులు స్కేటింగ్‌లో ప్రతిభ కనబర్చడం
శుభపరిణామం.
- శ్రేయ, సికింద్రాబాద్ ఢిల్లీ పబ్లిక్‌స్కూల్
్చసిటీ ‘పతకాన్ని’చ్చింది
మాది చెన్నై. మా అమ్మాయి కార్తీకను ఇక్కడ స్కేటింగ్ పోటీలకు తీసుకొచ్చా. తొలిసారిగా పాల్గొన్న సీబీఎస్‌ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్ కాంపిటీషన్ అండర్-6 విభాగంలో తను బంగారు పతకం సాధించడం సంతోషాన్నిచ్చింది. మా అమ్మాయికి ప్రారంభ పతకాన్ని ఇచ్చిన ఈ సిటీని ఎప్పటికీ మరవలేము.
- కార్తీక తండ్రి జగదీశ్వర్, చెన్నై
మంచి ఆదరణ
సిటీలో స్కేటింగ్‌కు మంచి ఆదరణ ఉంది. 2010లో ఇక్కడ జరిగిన సీబీఎస్‌ఈ సౌత్‌జోన్ రోలర్ స్కేటింగ్‌లోనూ పాల్గొన్నా. ఈసారి అండర్-19 విభాగంలో రోడ్ ఈవెంట్‌లో బంగారం, రింగ్‌లో రజతం సాధించా. మళ్లీ నగరానికి రావాలని కోరుకొంటున్నా.
- సిలియా స్మిత,
మంగళూరు