జన్మ జన్మకీ ఇలాగే.. | The birth of the same birth .. | Sakshi
Sakshi News home page

జన్మ జన్మకీ ఇలాగే..

Published Sun, Jan 11 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 7:30 PM

The birth of the same birth ..

బ్రిజ్‌మోహన్ మిశ్రా.. అందరూ గౌరవంగా పిలిచుకునే బిర్జూ మహారాజ్! కథక్‌కు కదులుతున్న రూపం!  ఈ శాస్త్రీయ నృత్యాన్ని సరికొత్త ప్రయోగాలతో సామాన్యులకూ దగ్గర చేశాడు.. కళ.. వసుధైక కుటుంబ భావనకు ఓ వారధి అని రుజువు చేశాడు.. ఆ దిగ్గురువు కళాకృతి నిర్వహిస్తున్న కృష్ణకృతి ఆర్ట్ ఫెస్టివల్‌లో తన అందెల సవ్వడి వినిపించడానికి హైదరాబాద్ విచ్చేశాడు. ఆ ములాఖాత్ ముచ్చట్లు...                  
..:: సరస్వతి రమ
 
మా మామయ్య రామ్‌కిషన్ శుక్లా (సవతి తల్లి తమ్ముడు) ఇక్కడి మ్యూజిక్ అకాడమీలో కథక్ టీచర్. అలా హైదరాబాద్‌తో నాకు అనుబంధం ఉంది. అదీగాక నా స్వస్థలమైన లక్నోకి, హైదరాబాద్‌కి చాలా పోలికలున్నాయి. ఇక్కడా ఉర్దూ ప్రధానం.. మాకూ ఉర్దూ ప్రధాన భాషే. నా చిన్నప్పుడు మా ఇంట్లో ఉర్దూనే మాట్లాడే వాళ్లం. మా అమ్మ పెళ్లయి నానమ్మ వాళ్లింటికొచ్చాక.. వాళ్లంతా ఉర్దూ మాట్లాడుతుంటే.. నేను ముస్లిం ఇంట్లో పడ్డానా ఏంటీ అనుకుందట. దానికితోడు మా నాన్న నానమ్మను ‘అమ్మీజాన్’, తాతయ్యను ‘అబ్బా’ అని పిలిచేసరికి (నాన్న నానమ్మను చివరి వరకు అలాగే పిలిచేవారు) ఆమె అనుమానం బలపడింది.

దాంతో  ఆ రాత్రి నానమ్మ వాళ్లు వండిన వంటలను తినక బయటి నుంచి తెప్పించుకొని తిని నిద్రపోయిందట. తెల్లవారే దేవుడి హారతులు, శంకు నాదం,  ఘనఘన గంటల మోతతో మెలకువ వచ్చిందట అమ్మకి. ఈ చప్పుళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని పనమ్మాయిని అడిగిందట. ‘ఎక్కడి నుంచి ఏంటమ్మా.. మనింట్లోవే.. పైన పెద్దయ్యగారు పూజ చేస్తున్నారు’ అని చెప్పేసరికి అప్పుడు నమ్మకం కుదిరిందట ఇది హిందువుల ఇల్లే.. మా అత్తగారు హిందువులే అని. ఒక్క భాషే కాదు.. తెహ్‌జీబ్ (సంస్కృతి) కూడా అలాంటిదే. హిందూముస్లిం ఐక్యతే హైదరాబాద్ సంస్కృతి.

అదే తెహ్‌జీబ్ లక్నోలోనూ కనిపిస్తుంది. మొహర్రం పదిహేను రోజులు  కాళ్లకు గజ్జెలు కట్టనివ్వకుండా ప్రాక్టీస్ చేయించేవారు నాన్నగారు (అచ్చన్ మహారాజ్). అలాగే హోలీ రోజు ముస్లింలూ మాతో కలిసి రంగులాడేవారు. ఏ పండుగలైనా కలిసే చేసుకునేవాళ్లం. ఇవన్నీ లక్నో, హైదరాబాద్‌కున్న పోలికలు. అందుకే హైదరాబాద్‌కి రావడమంటే నాకు మా ఇంటికొచ్చినట్టే. ముంబై, కోల్‌కతా వెళ్తే ప్రోగ్రామ్ అయిపోగానే అక్కడ ఉండాలనిపించదు. కానీ ఇక్కడికొస్తే.. వెళ్లాలనిపించదు. వెళ్లినా పదేపదే రావాలనిపిస్తుంది.

ఈ నేల అలాంటిది. అద్భుతమైన శక్తి ఉంది దీనికి. సాధారణంగా సౌత్ ఇండియాలో భరతనాట్యం, కూచిపూడి, కథాకళి,  మోహినీ ఆట్టం లాంటి వాటికున్నంత ఆదరణ కథక్‌కు లేదు. కానీ హైదరాబాద్.. మొదటి నుంచీ ఈ నాట్యాన్ని పోషిస్తోంది. అందుకే హైదరాబాద్‌లోనూ నా శిష్యులు (రాఘవరాజ్ భట్, మంగళాభట్) కథక్ పరంపరను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఇవన్నీ ఈ ఊరుతో నాకున్న అనుబంధాన్ని బలపరుస్తున్నాయి.
 
కథక్.. కామన్ మ్యాన్

నాట్యమైనా, సంగీతమైనా.. ఏ కళ అయినా సామాన్యుడిని చేరితేనే సాఫల్యం అయినట్టు. అప్పుడే ఆ కళ కలకాలం వర్ధిల్లుతుంది. అందుకే నేను శాస్త్రీయ కథక్‌తో ప్రయోగాలు చేశాను. డ్యాన్స్ డ్రామా రూపంలో ఆవిష్కరించాను. అపూర్వ ఆదరణ పొందింది. ఈ రోజు నా శిష్యగణం  చైనా, జపాన్ మొదలు అమెరికా, ఆస్ట్రేలియా దాకా అంతటా ఉన్నారు. కళ.. ప్రపంచంలోని మనుషుల మధ్య దూరాలను చెరిపి వసుధైక కుటుంబంగా మారుస్తుందని చెప్పడానికి ఇంతకన్నా రుజువేం కావాలి!

అన్నీ ఇష్టమే కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, ఒడిస్సీ.. లాంటి అన్ని నృత్యరీతులూ ఇష్టమే. అసలైన జానపద  నాట్యమంటే కూడా.. అంటే ఫిల్మీవాలా జానపదం కాదు అసలైన జానపద నాట్యం.. చాలా ఇష్టం. అన్నిటినీ ఆస్వాదిస్తా. కళాకారులందరితో మంచి అనుబంధం ఉంది.  వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో  తన డ్యాన్స్ స్కూల్‌ను నాచేతే ప్రారంభం చేయించారు. ఇక ఒడిస్సీ నాట్యాచారుడు కేళూ బాబా (కేళూ చరణ్ మహాపాత్రా) నాకు అత్యంత ఆప్తుడు. ‘బిర్జూ మనిద్దరం కలిసి రాధాకృష్ణులుగా అభినయించాలి. నేను రాధగా.. నువ్వు కృష్ణుడిగా’ అన్నాడు. అభినయించాం. మేం చేసిన ఆ ఫ్యూజన్  (ఒడిస్సీ, కథక్) చూసిన ప్రేక్షకులు మైమరిచిపోయారు. ఆత్మానందంతో వాళ్ల కళ్లల్లో నీళ్లు తిరిగాయి.
 
సినిమాకు కొంచెం దూరమే..

మా ఇంట్లో మా చిన్నాన్న (లచ్చు మహారాజ్) ఒక్కరే సినిమా వైపు వెళ్లారు. అయినా సినిమాల కోసం ఎక్కడా తన నాట్యాన్ని పలుచన చేయలేదు. మొఘల్ ఏ ఆజం, పాకీజా, తీస్రీ కసమ్‌లాంటి ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫి అందించారు. అదీ క్లాసికల్‌వేలోనే. నేనూ కొరియోగ్రఫి చేశాను దిల్‌తో పాగల్ హై, దేవదాసు, విశ్వరూపం లాంటి కొన్ని సినిమాలకు. విశ్వరూపం సినిమాకు నాకు జాతీయ అవార్డూ వచ్చింది. అయినా సినిమా డ్యాన్స్‌కు నేను కొంచెం దూరమే. ఇప్పుడు సంజయ్‌లీలా భన్సాలీ ‘భాజీరావ్ మస్తాన్’ సినిమాలోనూ దీపికా పదుకొనే నటించే ఓ పాటకు కొరియోగ్రఫి చేయమని అడుగుతున్నారు. చూడాలి. ఏమైనా నా కథక్‌ను సినిమా ఫ్రేమ్‌లో ఇమిడ్చే కన్నా విశాలమైన వేదిక మీద ప్రదర్శించడమే ఎక్కువిష్టం. కథక్ కోమలత్వాన్ని అంతే లాలిత్యంగా బోధించడమే నాకు ఆసక్తి.
 
ఆత్మస్నానం

నాట్యమే నా జీవితం.. నా జీవితమే నాట్యం. ఇది నాకో తపస్సు. ఇంతకు మించి నాకు మరో లోకం లేదు. ఈ జన్మకి.. మరుజన్మకి.. జన్మజన్మకి! వచ్చే జన్మలో కూడా కథక్ కళాకారుడిగానే పుట్టాలని కోరుకుంటున్నా. ఆ మాటకొస్తే ప్రతి వ్యక్తీ ఏదో ఒక కళను నేర్చుకోవాలి. అది ఆ వ్యక్తిని పరిపూర్ణుడిగా  తీర్చిదిద్దుతుంది. ఒక ఉదాహరణ చెప్తాను.. పట్నాలో శివనారాయణసింగ్ అని ఓ మిత్రుడుండేవాడు. ఆయన డాక్టర్. సితార్ బాగా వాయిస్తాడు. పేషంట్లనూ చూస్తూ స్ట్రెస్ ఫీలయినప్పుడల్లా కన్సల్టెంట్ గది పక్కనే ఉన్న ఇంకో గదిలోకి వెళ్లి కాసేపు సితార్ వాయించి రిలాక్స్ అయి మళ్లీ పేషంట్లను చూడ్డానికి వచ్చేవాడు. కళ.. రోజూవారి ఒత్తిళ్ల నుంచి ఎంత విశ్రాంతినిస్తుందంటే.. ఆత్మస్నానం చేసినంత! జీవన పరమార్థం కూడా అదేకదా!
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement