నృత్య నీరాజనం
శ్రీశైలం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల ఆలయప్రాంగణంలో ప్రఖ్యాత కథక్ నృత్యకారణి రచనాయాదవ్(హర్యానా) బృందం వారు ప్రదర్శించిన కథక్ నృత్యం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కళానీరాజనంలో భాగంగా దేవస్థానం ఈ నెల 28 నుంచి వారం రోజులపాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఆలయ ఆవరణలోని నాగులకట్ట కళావేదికపై గురువారం రాత్రి 8.30 గంటలకు ప్రదర్శించిన దేవతా మూర్తులు వారి లీలా విశేషాలను స్తూతిస్తూ కథక్ నృత్యం ఆద్యంతం మైమర్పించింది. ఆమెతో పాటు శ్లేతామిశ్రా, అవినాష్ ముఖర్జీ, త్రిపాటిశల్హాన్, నీలాక్షి ఖండేకర్, ముఖేష్ గంగాని, వైదేహి ఒబేరాయ్ తదితరులు కథక్ నృత్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి కిషోర్‌గంగాని, మహానీల్ గంగావి, కమల్, రవీందర్‌గాత్ర వాయిద్య సహకారాన్ని అందించారు. కాగా ఉత్తర భారతదేశంలో కథక్ సాంప్రదాయక నృత్యానికి ఎంతో ప్రత్యేకత ఉందని, ముఖ్యంగా మధ్య యుగంలో ఈ సాంప్రదాయ నృత్యానికి రాజుల ఆదరణ ఎంతగానో ఉందని ఈఓ భరత్ గుప్త తెలిపారు. పూర్వపు రోజుల్లో స్వామివార్ల నిత్య కైంకర్యాలలో భాగంగా నృత్యప్రదర్శన ఇచ్చే వారని పేర్కొన్నారు. శుక్రవారం ముంబాయ్ సంజయ్ విద్యార్థి చే భక్తి సంగీతం ఏర్పాటు చేసినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ ధనుంజయ, శ్రీశైల ప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది, వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో గణేశ్ స్తుతి, దుర్గావతరణ, దుర్గాస్తుతి, ఆరాధన,ఆరాధ్య, మొదలైన అంశాలకు నృత్యాలు చేశారు.