
ఉద్ధవ్ ఠాక్రే
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి సీటుపై కన్నేశారు. దాంతో మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయే పరిస్థితి ఏర్పడింది. సిఎం పదవి ఇస్తే ఎవరితోనైనా ఆయన పొత్తుకు సిద్ధమవుతారా? కాంగ్రెస్, ఎన్సీపిలను ఉద్ధవ్ ఏకం చేస్తారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపి అతి పెద్దపార్టీగా అవతరించినప్పటికీ మరో పార్టీ సహకారంలేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఉద్ధవ్ ఠాక్రేకు మొదటి నుంచి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి, చాయ్‌వాలా ప్రధానికాగా లేంది, తాను ముఖ్యమంత్రి కావటంలో తప్పేమిటని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత పరిస్థితిని అదునుగా చేసుకొని ముఖ్యమంత్రి కాగలిగే అవకాశాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో ఉద్ధవ్ ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్సీపిలతో శివసేన కలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. అలా కాకపోతే సీఎం పదవి ఇస్తేనే బీజేపీతో పొత్తుకు అంగీకరించే అవకాశం ఉంటుంది. మెజార్టీ స్థానాలు బీజేపికి ఉన్నందున ఆ పార్టీ సీఎం స్థానాన్ని వదులుకోదు. మరీ పట్టుబడితే చెరో రెండున్నర ఏళ్లు సీఎం పదవిని పంచుకునే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే శివసేన దివంగత ముండే కుమార్తె పంకజకు సీఎం పదవిఇస్తే తమకు అభ్యంతరంలేదన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు తాము ఎటువంటి పరిస్థితులలోనూ ఎన్సీపితో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని బీజేపీ మహారాష్ట్ర రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితులలో పాత మిత్రులు బీజేపీ, శివసేనలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే సీఎం పదవిని కూడా అడిగే అవకాశం ఉంది.
**