గోవిందుడు అందరివాడిలే
ప్రముఖ నర్తకి వాణీగణపతి.. ఆత్మగౌరవానికి అభినయం నేర్పిన కళాకారిణి. తనకొచ్చిన నాట్యంతో నలుగురికి తెలిసే కన్నా తనతో నాట్యం తెలిసేలా చేసిన సెల్ఫ్‌ప్రైడ్ ఉమన్. ఖాదర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్ నిర్వహించిన ‘విమెన్ ఇన్ పెర్‌ఫార్మింగ్ ఆర్ట్స్’ కార్యక్రమంలో పాల్గొనడానికి హైదరాబాద్‌కి శనివారం వచ్చారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ‘సిటీ ప్లస్’కి స్పెషల్ అతిథి అయ్యారు. నాట్యకృష్ణుడితో, హైదరాబాద్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు.
అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు! నా వరకు నాకైతే కృష్ణుడు భగవంతుడిగా కాక ఓ హ్యూమన్ బీయింగ్‌గానే కనిపిస్తాడు. గోవిందుడు అందరివాడు. కొడుకుగా.. మంచి స్నేహితుడిగా.. రొమాంటిక్ లవర్‌గా.. ఇన్ని రూపాల్లో కనిపిస్తాడు. ద్రౌపది వస్త్రాపహరణం, కురుక్షేత్రయుద్ధం లాంటి సమయాల్లోనే.. ఆపద్బాంధవుడిగా, లోకరక్షకుడిగా దర్శనమిస్తాడు..కానీ మిగిలిన అన్ని సమయాల్లో సామాన్యుడిలా, ఆత్మీయుడిలా ఉంటాడు. కాబట్టి ఆయన దేవుడి కన్నా మనలాంటి మనిషిగానే అనిపిస్తాడు. నాకు తెలిసినంత వరకు చాలామంది తల్లులు తమ కొడుకులను చిన్నప్పుడు కన్నా, కృష్ణా అనే పిలుచుకుంటారు. డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్‌లో కృష్ణుడితో నాదీ అదే అనుబంధం. నా పూజగదిలో సాయిబాబాతో పాటు కృష్ణుడి ప్రతిమా ఉంటుంది. ఆ విగ్రహంతో ఓ స్నేహితుడితో మాట్లాడినట్లు అన్నీ షేర్ చేసుకుంటాను.
ఎందుకిలా చేశావ్? నా ప్రాబ్లం సాల్వ్‌చేయడానికి ఎందుకింత ఆలస్యం చేస్తున్నావ్.. అంటూ నిలదీస్తాను. ఇదే క్లోజ్‌నెస్ నా డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లోనూ ఉంటుంది. కృష్ణుడి రోల్‌తో చాలా కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతాను. ‘జగదోద్ధారణ’లో నేను యశోదగా వేస్తే నట్‌కట్ నంద్‌లాల్ నిజంగా నా కొడుకుగానే కనిపిస్తాడు. జయదేవుడి అష్టపదిలో రాధగా అభినయించినప్పుడు అద్భుతమైన ప్రేమికుడి చెంతనున్నట్టు ఫీలవుతాను. ఇవన్నీ కాక నేనే కృష్ణుడిగా అభినయించినప్పుడు ఆ సమయంలో నిజంగానే కృష్ణుడిగా మారిపోతాను. అదో అలౌకిక ఆనందం! ఒకసారి నా ఫ్రెండ్ ‘ఇలా ప్రతి ప్రోగ్రామ్‌లో కృష్ణుడికి సంబంధించి ఒక్క డ్యాన్స్ చేసే బదులు కృష్ణుడి డిఫరెంట్ యాస్పెక్ట్స్, డిఫరెంట్ రోల్స్ అన్నిటినీ ఒక్కచోట కూర్చి ఓ బాలే చేయొచ్చు కదా’ అంది. అప్పుడు ‘కలర్స్ ఆఫ్ కృష్ణ’ అని ఓ నృత్యరూపకం చేశాను.
హైదరాబాద్‌తో కళాత్మకబంధం
హైదరాబాద్‌తో నాది కళాత్మకబంధం. నా పెళ్లయిన కొత్తలో షూటింగ్స్, ఫిల్మ్ ఫెస్టివల్స్ కోసమే ఎక్కువగా ఇక్కడికి వస్తుండేదాన్ని. ఎప్పుడైతే నాకు ఖాదిర్ అలీబేగ్ థియేటర్ ఫౌండేషన్‌తో పరిచయం ఏర్పడిందో, అప్పటినుంచి పెర్‌ఫార్మెన్సెస్ కోసం రావడం మొదలుపెట్టాను. ఈ ఊళ్లో నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడి భోజనం ఇష్టపడని వాళ్లుండరేమో! షాపింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. చార్మినార్ వెళ్లి రకరకాల గాజులు, ముత్యాలు కొనుక్కోవడం.. ఓహ్..బ్యూటిఫుల్! ఉస్మానియా యూనివర్శిటీ.. హైకోర్ట్, సాలార్జంగ్ మ్యూజియంలాంటి కట్టాడాలు.. చౌమొహల్లా , ఫలక్‌నుమా లాంటి ప్యాలెస్‌లు..హైదరాబాద్ గొప్పతనమేమంటే.. ఇది ఇప్పటికీ ఆ పాత ఆర్కిటెక్చర్.. యాంటిక్విటీని కాపాడుకుంటుండటం. ఐ ఆల్వేస్ ఎంజాయ్ హైదరాబాద్. ఐ లవ్ వెరీమచ్ దిస్ సిటీ!
.:: శరాది